Saturday 30 August 2008

పుట్టినరోజు శుభాకాంక్షలు..

 

సరిగమల సిరిసిరిమువ్వ శ్రీమతి వరూధినిగారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు..

Friday 29 August 2008

చారానా కోడికి బారానా మసాలా..

నాలుగు లైన్ల కథకు రెండున్నర గంటల సినిమా చేస్తే దాన్ని ఏమంటారు?? పైగా ఆ సినిమా చూసి భయపడితే ఐదులక్షల బహుమతి.. అది కూడా థియేటర్లోని టికెట్లన్నీ కొని, ఒక్కరే కూర్చుని, కళ్ళు మూసుకోకుండా చూడాలి. మధ్యలో పారిపోకూడదు. ఎవరైనా ప్రయత్నిస్తారా? ఐతే ముందు ఆ సినిమా కథ చదవండి. తర్వాత మీ ఇష్టం.

Monday 25 August 2008

నీ నవ్వే చాలు...



కమ్ముకున్నమబ్బుల మాటు నుండి చందమామ కొంటెగా తొంగి చూడడం మొదలెట్టాడు.. ఆ అద్భుతదృశ్యం మనోఫలకంలోకి చేరడం ఆలస్యం ముడుచుకుపోయిన మనసుపైన ఆహ్లాదం పరుచుకుని మోముపై ముగ్ధమనోహరంగా దరహాసం వెల్లివిరవడం మొదలైంది. ఒక్క చిరుదరహాసం మన మోముకి ఎంత అందం ఆపాదించిందీ..! మన దరహాసపు సమ్మోహనశక్తి ముందు చందమామ కాంతూలూ, కళలూ వెలవెలబోవట్లేదూ..? ఆనందంతో వచ్చిన అందం చూపరుల్ని ఎంత సమ్మోహితం చేస్తోంది! "మైమరిపింపజేసే మరొక్క నవ్వు కోసం " మన మోము వైపు ఎన్ని కళ్ళు తనువెక్కడ ఉన్నా దృష్టిని మనవైపు నిలిపి వేచి చూస్తున్నాయీ..? స్వచ్చంగా చిన్నపిల్లల్లా మనం నవ్వుతుంటే శత్రువులు సైతం ఒక్క లిప్తపాటు తాదాత్మ్యంలో మునిగిపోవట్లేదూ! కళ్ళల్లొ వెలుగు నిండుతూ మొహం విచ్చుకుంటుంటే కమలం కూడా మన అందం ఓర్వలేక కుంచించుకుపోదూ! పడుచుపిల్ల కొంటె నవ్వుని చాటుగా మనసులో పదిలపరుచుకోవడానికి ఎన్ని యువ హృదయాలు దొంగచాటుగా చూస్తుంటాయి.


బుడిబుడి అడుగుల బుడ్డోడు మొహమంతా నవ్వు నింపుకుని పలకరిస్తుంటే పట్టనట్లు సాగిపోవడం ఎంతటి కఠినాత్ములకైనా సాధ్యమా...? " నీ భవిష్యత్‌కి మేమున్నాం కన్నా" అంటూ కన్నవారు నిశ్చింతగా నవ్వుతుంటే భరోసా నింపుకోని పిల్లలెవరుంటారు? కొంటె చేష్టలతో కవ్విస్తూ జీవిత భాగస్వామి నవ్వుల పూవులు పూయిస్తుంటే తన్మయత్వం తన్నుకురాదూ..! ఇవాళా రేపా అన్నట్లు వెళ్లదీస్తున్న నానమ్మ మొహంలో అరక్షణం పాటైనా వెలుగురేఖలు పరుచుకుంటే సంతృప్తిగా సంతోషించని వారెవరుంటారు? ఎవరైనా తనివితీరా నవ్వుతుంటే, ఎంతసేపైనా మంత్రముగ్దులమై అలానే చూడాలనిపించదూ. అలా ఐస్ చేసే అదృష్టాన్ని మిస్ అవుతున్నట్లు అనిపించడం లేదూ! మరెందుకు ఆలస్యం. ఎప్పుడూ ఉండే కష్టాల్ని, నష్టాల్ని, విచారాల్ని,ఈతి బాధల్ని కొంతసేపైనా జ్ఞాపకాల్లోకి నెట్టేసి మనసారా నవ్వుకుంటే ఎంత బాగుంటుంది? ఒక్క సంతృప్తికరమైన నవ్వు మన జీవితం పట్ల మనకుఎంత నమ్మకాన్ని పెంచిందో చూడండి. అంతకు మించి ఇన్నాళ్ళూ ముడుచుకుపోయిన మన మొహాల్లో ఆనందం తాండవిస్తుంటే మన ఆత్మీయులు ఎంత సంతోషాన్ని మూటగట్టుకుంటున్నారో గమనించండి. భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన వరాన్ని ఫోటో ఫ్రేమ్‍ లకే పరిమితం చెయ్యకుండా జీవితపు ప్రతీ ఫ్రేమ్‍ లోనూ సద్వినియోగం చేసుకుంటే జీవితం ఎంత మనోహరంగా ఉందో కదా! మన దరహాసం కోసం ఎందరో అభిమానులు క్యూలు కట్టి ఎదురుచూస్తుంటే బాక్సులు రాని థియేటర్‌లా నిరాశపరచడం ఏమైనా భావ్యమా చెప్పండి! ఇకనైనా పలకరింపు నవ్వులకు చిట్లించుకుని చూడడం మానేసి మనమూ ఓ నవ్వు విసిరేసి అవతలి వారిని ఫ్లాట్ చేసేద్దామా.. ఎవరి నవ్వులోని సమ్మోహనశక్తి ఎంతో పోటీలు పెట్టుకుని మరీ అరమరికలు లేకుండా జీవితాంతం ఆనందంగా నవ్వుకుందామా!

మీ నల్లమోతు శ్రీధర్.

Sunday 24 August 2008

కలగూర గంప , చేట భారతం

కలగూర గంప 

కలవేసిన అంటే రకరకాల కూరగాయల గంపను కలగూరగంప అంటారు. కొందరు ఒకే కూరాకునో, ఒకే రకం కాయలనో, పళ్ళనో అమ్ముతారు.మరికొందరు రకరకాల ఆకులూ, కూరలూ, కాయలూ, పళ్ళూ అమ్ముతారు. భిన్న జాతులకు చెందిన కాయగూరలున్న గంప కలగూరగంప. గంప లేకపోయినా కాయకూరల్లేకపోయినా, రకరకాల వస్తువులుంటే కలగూరగంప అనే అంటారు. పదబంధంలో మొదట ఉన్న కల అనేది కలిసేట్లు, కలగాపులగంగా ఉన్న అనే అర్ధం గల విశేషణ పదం ఇది. కలనేత చీరెలో ఒకటికి మించిన రంగుల దారాలు కలిసి ఉంటాయి. కలగాపులగంలో తెల్ల, పచ్చ ఖాద్య, ద్రవ్యాలు కలిసి ఉంటాయి. అలాగే కలగూరగంపలో భిన్నభావాలు, వస్తువులు ఏవైనా కలిసి ఉండవచ్చు. కాయలూ గంపా మాత్రం ఖండితంగా ఉండనక్కరలేదు. 

చేట భారతం

ఈ మాటకు చాటు భారతమనే రూపాంతరం ఉందంటారు కొందరు. కానీ ఆ రెంటికి అర్ధాలు వేరు . చేట తెలుగు మాట. చాటు సంస్కృత పదం. అప్పటికప్పుడు చెప్పిన, నోటిమాటగా చెప్పిన అనే అర్ధాలున్న మాట చాటు(వు).  చెరగటానికి వాడే చేట తెలుగు వస్తువు. గ్రంధ ప్రమాణాల వంటివి చూపకుండా భారత కథను చెప్తే అది చాటు భారతం.నిజానికది జాతీయమే కాదు. చేట భారతం వేరు.నాలుగు మాటల్లో సరిపొయ్యే విషయాన్ని తెగ సాగదీసి విపులంగా చెపినా, రాసినా దాన్ని చేట భారతమనే అంటారు. అయితే ఈ మాట ఇటీవల పుట్టిందనటానికి నిదర్శనం ఉంది. దాదాపు డెబ్భై ఎనభై సంవత్సరాల కిందట, అచ్చు యంత్రాలు అందుబాటులోకి వచ్చిన కాలంలో ఇప్పటి దినపత్రికల కన్నా కొంచెం చిన్నవైన కాగితాల్లో భారతం ముద్రించారు. అంటే చేటంత పెద్ద కాగితాల మీద అచ్చు వేసారన్నమాట. ఆ గ్రంధాలు ఇప్పటికీ కొన్ని పాతకాలపు గ్రంధాలయాల్లో భద్రంగా ఉన్నాయి. సీస పద్యాన్ని అయిదు పంక్తుల్లో, వృత్తాలను రెండు పంక్తుల్లో, కందం, తేటగీతి, ఆటవెలది వంటి పదాలను ఒకే ఒక పంక్తిలో ముద్రించేవాళ్ళు. ఆ గ్రంధాలను కూర్చుని చదవాల్సిందే. అందువల్ల వాటిని చాలా పెద్దవి అనే అర్ధంలో చేట భారతమన్నారు. విస్తరించి చెప్తే చేట భారతం చెప్పినట్టు అవుతుంది

రచన : బూదరాజు రాధాకృష్ణ

Friday 22 August 2008

మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు???

 

ఈ ప్రపంచంలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?? ఒక్కసారి ఆలొచించి చెప్పండి. మీ భార్యా/భర్త, స్నేహితుడు/రాలు, పిల్లలు,గురువు .. కాని మీకు చాలా క్లోజ్‍గా ఉండే స్నేహితులతో మీ ఆలోచనలు, అనుభూతులు,సందేహాలు, సమస్యలు అన్నీ చర్చిస్తారా? మీ జీవితంలోని ప్రతి అంశం వారితో పంచుకుంటారా? ఇది సాధ్యం కాదేమో???.

మన జీవన ప్రయాణంలో ఎంతోమంది కలుస్తూ ఉండొచ్చు. అందులో కొందరు స్నేహితులైనా, జీవితభాగస్వాములైనా, ఎవరైనా కొందరితో మీరు చాలా క్లోజ్‍గా ఉండి, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కాని ఆ వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మి, మీకు సంబంధించిన అన్ని విషయాలు, ఆలోచనలు చెప్తారా? ఆ వ్యక్తి ఎల్లవేళలా మీ తోడుగా ఉంటాడా?? లేదా మనుష్యులకంటే మిన్నగా మీరు ఆ భగవంతుని నమ్ముతున్నారా? ఆ సర్వాంతర్యామి అన్నీ తెలుసుకుని మీ తోడుగా ఉంటాడా? అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మీకున్నాడా? ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించండి. అందరికంటే ఎక్కువగా మిమల్ని ప్రేమించే, మీకు తోడుగా ఉండే మీ స్నేహితుడు ఎవరో కాదు అది మీరే.. అవును. మీకు మీరే గొప్ప స్నేహితులు. మిమ్మల్ని మీరు అభిమానించండి. గౌరవించుకోండి. మీ విలువ తెలుసుకోండి. ఎవరో కోన్ కిస్కాగాళ్ళు మిమ్మల్ని గౌరవించాల్సిన పనిలేదు. అవసరం కూడా లేదు.

ఎప్పుడు కూడా మనను మనం తక్కువ చేసుకోవద్దు. మనలో ఉన్న టాలెంట్‍ని గుర్తించాలి. మనకు ఏది ఇష్టం. ఏది మనకు సంతృప్తినిస్తుంది. అది ఖరీదైనదే కానక్కరలేదు. ఒక మధురమైన సంగీతమో, ఒక మంచిపుస్తకమో, లేదా ప్రకృతి సౌందర్యమో, లేదా ఆర్తులకు సహాయం చేయడమో. మన దైనందిన కార్యక్రమాలలో పడి , మన గురించి మర్చిపోతాము. చదువు, ఉద్యోగం, సంసారం, పిల్లలు, వాళ్ల అవసరాలు. ఇలా ఎన్నో పనులు చేయడంలో మనకేం కావాలో అస్సలు గుర్తుండదు. క్రమంగా ఒక మరమనిషిలా మారిపోతుంటాము. కొన్నాళ్లకు మనలో ఆనందించే గుణమే కనపడకుండా పోతుందేమో. అప్పుడు జీవితం కూడా భారమవుతుంది.

అందుకే మీ కార్యక్రమాలతో పాటు మీకోసంకూడా ఆలోచించండి. మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకుంటు ఇతరులను ఆనందపరచండి. అప్పుడు జీవితం ఎంతో ఉల్లాసంగా కనిపిస్తుంది.ఆ ప్రయాణంలో అలసట అన్నదే అనిపించదు. పైగా ఉత్సాహం పెరుగుతుంది..


ఇది నేను స్వానుభవంగా తెలుసుకున్న నిజం.

Thursday 21 August 2008

పుణుకులు

రామారావు పేపర్ చదువుతూ కూర్చున్నాడు. అంతలో అతని బామ్మర్ది వచ్చి " బావా! బోర్ కొడుతుంది ఒక జోక్ చెప్పవా "

"సరే! సన్నగా , పొడుగ్గా, ఎర్రగా ఉంది . ఏందది?"
" ఏమో . నువ్వే చెప్పు"
"ఎర్రదారం"
"సన్నగా, నల్లగా ఉంది అదేమిటి?"
"ఏమో. నాకేం తెలుసు?"
" దాని నీడ."
" సరే .ఇంకోటి.. సన్నగా, పొడుగ్గా , తెల్లగా ఉంది .ఏమై ఉంటుంది. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. అందాక నేను ఈ పేపర్ చదివేస్తాను"
" సరే . నేను ప్రయత్నిస్తాను."
గంటతర్వాత...
"బావా! నాకు రావట్లేదు కాని . నువ్వే చెప్పు."
" ఏం లేదోయ్! అది దాని ఆత్మ." అంటు లేచి వెళ్ళిపోయాడు బుర్ర గోక్కుంటున్న బామ్మర్దిని వదిలేసి.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

మనం పళ్ళ రసాలను గ్లాసుతో కాని స్ట్రాతో కాని తాగుతాం . అది అందరికీ తెలుసు. కాని గుడ్డును కూడా స్ట్రాతో తాగితే ఏమవుతుంది??

ఈ రోజుల్లో అందరి ఇంట్లో cd లు ఉంటాయి. కాని ఒక ప్రత్యేకమైన cd  ఉంది. చాలా విలువైనది. కాని దాదాపు అందరి దగ్గరా ఉండే చాన్స్ ఉంది. ఏంటా స్పెషల్  cd ???

Tuesday 19 August 2008

అంతులేని వింతకథ...

ఈ రోజుల్లో వస్తున్న అన్ని టీవీ సీరియళ్ళతో విసిగి వేసారి రాసిన ఈ వింతకథ.. మిమ్మల్ని విసిగిస్తున్న మీ స్నేహితులకైనా, బాస్‍కైనా పంపండి. చాలా కాలం క్రింద పొద్దులో ప్రచురితమైంది. మరొకసారి పునర్ముద్రితం కొత్త మిత్రుల కోసం.. నాకోసం కూడా...:)


ఈ కథ మొత్తం చదివి చివరలో అడిగిన ప్రశ్నకు జవాబివ్వగలరేమో ప్రయత్నించండి….

1975 జనవరి 1

ఉదయం ఐదు గంటలైంది. ఇంకా సూర్యుడు నిద్ర లేవలేదు. చీకటిగానే ఉంది.అది బాపూ అనాథాశ్రమం. దాని నిర్వాహకుడు ప్రకాశం అప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ అనాథాశ్రమాన్ని ప్రారంభించి చాలా ఏళ్ళయింది. దానికి ప్రకాశమే వ్యవస్థాపక నిర్వాహకుడు. ఇంతలో బయటనుండి కలకలం వినిపించింది. ప్రకాశం ఏంటా అని బయటకెళ్ళి చూసాడు.

అనాథాశ్రమం మెట్లపైన చీరలో చుట్టిన ఒక పసిపాప. ఆడపిల్ల. అంతటి చలిలో రోజుల పాపను అలా వదిలేసి వెళ్ళిన వాళ్ళపై ప్రకాశంకు చాలా కోపం వచ్చింది. ముద్దులొలికే ఆ పసిపాపను తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

17 ఏళ్ళ తరవాత..

ఆ పసిపాప (పద్మ) పెరిగి పెద్దదై ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. పద్మ వాళ్ళ క్లాస్‍మేట్ ఒకతనిని ప్రేమించింది. ఇద్దరొకటై గర్భవతైంది. అది తెలిసి హాస్టల్ నుండి గెంటేసారు. ప్రకాశం అది తెలుసుకుని వచ్చి పద్మను తిరిగి అనాథాశ్రమానికి తీసికెళ్తాడు. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది, కాని ఆ పాపను ఎవరో ఎత్తుకెళ్తారు. అది విని తట్టుకోలేక ప్రకాశం ఆత్మహత్య చేసుకుంటాడు.

ప్రసవ సమయంలో కలిగిన కొన్ని ఆరోగ్య సమస్యలవల్ల పద్మ డాక్టరును కలిసింది. అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ డాక్టరు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు: ఆమెకు Adrenalo Sytosis అని, ఇది ఒక సీరియస్ జబ్బు .. దీనివల్ల శరీరంలో హార్మోనుల అవకతవకలు జరుగుతాయి. ఆపరేషన్ చేయాలి అని. కొద్ది రోజుల తర్వాత పద్మకు ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ ఫలితంగా ఆమె మగవాడిగా (ప్రభు) మారిపోయింది.

ప్రభు చాలా బాధపడుతూ ఉండేవాడు, తన కన్నబిడ్డను పోగొట్టుకున్నందుకు, తనను పెంచిన ప్రకాశంగారు చనిపోయినందుకు, తన ప్రేమికుడు మోసగించినందుకు, మగవాడిగా మారవలసి వచ్చినందుకు… ఇది తలుచుకుంటూ తాగుడుకు అలవాటు పడ్డాడు.

ఒకరోజు ప్రభు తమ కాలనీలో ఒక కొత్త బార్ తెరవడం చూసాడు. దాని పేరు “అమృతా బార్”. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మనిషి కనపడ్డాడు. ఆ వ్యక్తి ప్రభును పిలిచి తాను కనుగొన్న “టైం మెషీన్” చూపించాడు. ప్రభు ఆ వ్యక్తిని బ్రతిమిలాడి అది ఇంటికి తెచ్చుకుని తాను గతం లోకి వెళ్ళాడు. 1992 సంవత్సరంలోకి….

1992 సంవత్సరం…

ప్రభు తన టైం మెషీన్తో పాటు 1992 సంవత్సరంలోకి అడుగెడతాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు( అదే మగవాడిగా మారక ముందు ఉన్న అమ్మాయి). ఆమెని ప్రేమించి, కలిసి తిరిగి, ఒకానొక గడియలో ఒకటవుతారు. ఆ అమ్మాయి గర్భవతైంది. ప్రభు ఆమెను పెళ్ళాడటానికి నిరాకరించి, ఆ ఊరినే వదిలి వెళ్ళి పోతాడు. అలా ఇంకో ఊరికెళ్ళి కొంత డబ్బు సంపాదించి తిరిగి తను ప్రేమించిన అమ్మాయి ఉన్న ఊరికొస్తాడు.

కాని తనను గుర్తుపట్టకుండా ఉండాలని బారెడు గడ్డం పెంచుకుంటాడు.ఒక బార్ మొదలెడతాడు. “అమృతా బార్ “అని. ఒక రోజు అతను బార్లో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వస్తాడు( అదే వ్యక్తి ఇంతకు ముందు అమ్మాయిగా ఉన్నవాడు). గడ్డపు వ్యక్తి తన దగ్గరున్న టైమ్ మెషిన్ను ఆ వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తి దాని సాయంతో గతంలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక ముసుగు దొంగ వచ్చి కత్తి చూపించి ఆ టైమ్ మెషిన్ తన దగ్గర్నుంచి లాక్కుని ఆ గడ్డపు వ్యక్తిని తీసుకుని గతంలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళాక ఆ ముసుగు దొంగ ఆ మెషిన్ తిరిగిచ్చేసి గడ్డపు వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతాడు.


గడ్డపు వ్యక్తి అలా అలా తిరుగుతూ బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. లోపలికెళ్ళి చూస్తే అక్కడొక అమ్మాయి (తర్వాత అబ్బాయిగా మారిన అమ్మాయే), పక్కన అప్పుడే పుట్టిన ఆడపిల్లను చూస్తాడు. ఆ పసిగుడ్డును తీసుకుని టైమ్ మెషిన్ మొదలెట్టి ఆ పాపతో సహా గతం (1975) లోకి వెళతాడు.

1975 జనవరి 1

ఉదయం సుమారు నాలుగున్నర అయింది. గడ్డపు వ్యక్తి ఆడపిల్లతో బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. ఆ పాపను ఆశ్రమ గుమ్మంలో వదిలి వెళ్ళిపోతాడు. కాలేజీలో చేరి బాగా కష్టపడి చదివి డాక్టరవుతాడు. ఒక రోజు ఒక స్త్రీ అతని ఆసుపత్రికి వస్తుంది. ఆమెను పరీక్షించి, ఆమెకు Adrenalo Sytosis అనే ప్రమాదకరమైన జబ్బు ఉన్నట్టు కనుగొని ఆపరేషన్ చేసి ఆ స్త్రీని మగవాడుగా మారుస్తాడు. ఆ తర్వాత టైమ్ మెషిన్ సహాయంతో గతంలోకి వెళతాడు. ఆప్పుడు అతను జనాలు పడుతున్న కష్టాలు చూసి మనసు ద్రవించి ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభిస్తాడు. దానికి బాపూ అనాథాశ్రమం అనే పేరు పెట్టి అనాథ పిల్లలకు ఆసరా ఇస్తాడు.

ఒక రోజు అతని ఆశ్రమం ముందు ఎవరో ఒక పసికందును వదిలి వెళతారు. అతను ఆ బిడ్డను తన కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు. ఆ పాప పెరిగి పెద్దదై చదువుకుంటూ ఒక హాస్టల్లో ఉంటుంది. ఒకరోజు అతనికి ఒక విషయం తెలుస్తుంది: ఆ ఆడపిల్ల ఒక వ్యక్తి వల్ల మోసపోయి గర్భవతైందని, హాస్టల్ వాళ్ళు గెంటేసారని. జాలితో ఆ అమ్మాయిని తమ ఆశ్రమానికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి ఒక ఆడపిల్లని కంటుంది.

ఆ వ్యక్తి…అదే ప్రకాశం భవిష్యత్తులోకి వెళ్ళాలని అనుకుంటాడు. ముసుగు ధరించి, ఒక తుపాకి తీసుకుని టైమ్ మెషిన్ తీసుకుని అమృతా బార్ కి వెళతాడు. బార్ లోపలికి వెళ్ళి ఆ గడ్డపు వ్యక్తిని బెదిరించి తనతో పాటూ గతంలోకి తీసికెళ్తాడు. కాని గతంలోకి వెళ్ళాక పశ్చాత్తాప పడి ఆ గడ్డపు వ్యక్తికి టైమ్ మెషిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలా తిరిగి మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చాక తెలిసిందేమంటే పుట్టిన పసిబిడ్డను ఎవరో ఎత్తుకెళ్ళారని. అది విని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు.

ఇంతకూ ఆ పసిబిడ్డను ఎత్తుకెళ్ళింది ఎవరూ????

Monday 18 August 2008

అమ్మ . సాక్షిలో తొలి అడుగు




సాక్షిలో అమ్మకు ప్రేమతో వ్యాసం..


అమ్మ సంకలనం ఇక్కడి నుండి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు...
డౌన్‍లోడ్ - అమ్మ సంకలనం



Read this document on Scribd: అమ్మ

Sunday 17 August 2008

హుర్రే !!! నేను గెలిచానోచ్...









ImageChef.com Poetry Blender

అందరికి మనఃపూర్వక ధన్యవాదములు. మీ అందరి ప్రోత్సాహముతో హైదరాబాదీ బెస్ట్ బ్లాగుగా నా "షడ్రుచులు" ఎంపిక చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైదరాబాదీయుల బ్లాగులలో షడ్రుచులు 276 ఓట్లతో (46%) , అగ్రస్థానంలో నిలిచింది. మిగతావన్నీ ఇంగ్లీషు బ్లాగులే .అందులో మన తెలుగు బ్లాగు అత్యున్నతంలో నిలవడం నాకెంతో గర్వంగా ఉంది. ఈ విజయానికి హైదరాబాద్ మస్తీ సభ్యులు, తెలుగు బ్లాగు మిత్రులు, కంఫ్యూటర్ ఎరా సభ్యులు ఇచ్చిన సహకారమే ముఖ్య కారణం. ఇది నా వ్యక్తిగత విజయం కాదు.అందరు తెలుగువారిది అని భావిస్తున్నాను.
East or West తెలుగు is best

Saturday 16 August 2008

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు


అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు.

Thursday 14 August 2008

రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి... మనకి ఎంత దేశభక్తి..

మరో ఆగస్ట్ 15 వచ్చింది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినరోజేమో తెలియదు కానీ పని నుండి మరో సెలవు రోజు జమైనందుకు ఊపిరి పీల్చుకుంటున్నాం. మనలోనూ చాలా దేశభక్తి ఉంది, కానీ ఏం చేస్తాం పొట్టకూటి కోసం పడే తిప్పల్లో ఎక్కడో అడుగుకి చేరుకుపోయింది. ప్రతీ ఏటా ఈ పండుగ వస్తూనే ఉంది.. టెలివిజన్ సెట్లలో, రేడియోల్లో ఉద్వేగభరితమైన సంగీతాన్నీ, జాతీయ గీతాలను ఆస్వాదిస్తూ మన రోమాలు నిక్కబొడుచుకుంటూనే ఉంటున్నాయి. వందేమాతరం అంటూ రెహ్మాన్ గీతంలో ఆసేతు హిమాచలాన్ని వీక్షిస్తూ ఎంత గొప్పదేశమో అని పులకించిపోతున్నాం. కాలం ఆగదు కదా.. కాలెండర్ లో తేదీ మారింది. తేదీతో పాటు ఉత్సాహమూ చప్పబడిపోయింది. మళ్లీ రొటీన్ లైఫ్ మొదలైంది.
రొటీన్ లైఫ్ లీడ్ చేస్తున్నా మనలో చేవ తగ్గలేదు, ఇప్పటికీ దేశం పేరెత్తితే ఉప్పొంగిపోతున్నాం.. ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణం గెలిస్తే పట్టలేని ఆనందం. భారతజట్టు క్రికెట్ లో దారుణంగా ఓడిపోతే శాపనార్థాలు. రాజకీయల నాయకుల్ని చూసి అసహ్యించుకుంటున్నాం, సోమరిపోతు అధికారుల్నితిట్టుకుంటున్నాం.. పేపర్ బాయ్ నుండి టీవీ సీరియల్ లో క్యారెక్టర్ వరకూ ఎవరినీ వదలకుండా వారు వారు పోషిస్తున్న పాత్రలు, ఉద్యోగ ధర్మాన్నిచీల్చి చెండాడుతున్నాం. ప్రపంచంలో మనంత గొప్ప విమర్శకులు ఉండరు. వ్యవస్థ పాడైపోయినందుకు గంటల తరబడి విశ్లేషణలు చేసి కొండని తవ్వి ఎలుకను పట్టినట్లు "ఈ దేశాన్ని మనం బాగుచెయ్యలేమండీ" అని పెదవి విరిచి పడకేస్తాం.

దేశమంటే, సమాజమంటే అదో బ్రహ్మపదార్థం.. మన చేతిలో ఏదీ ఉండదు అన్నంత నిర్లిప్తత. "నీకు చేతనైంది ఏదైనా ఒక్క మంచి పని చెయ్యరా బాబూ" అంటే.. "మనమొక్కళ్లం మంచిగా ఉంటే అంతా బాగవుతుందా" అన్న బోడి లాజిక్ లు. ఏం ఎందుకు బాగు కాదు? అసలు చేతనైనంత, మనకు వీలుపడినంత సమాజానికో, దేశానికో, పక్కవాడికో మంచి చెయ్యడానికి అంత బద్ధకం ఎందుకు? "ఈ దేశం ఎప్పుడు బాగుపడాలండీ" అంటూ వ్యంగ్యాలు సంధించే బదులు కనీసం దేశాన్ని బాగు చెయ్యకపోయారు మనల్ని మనమైనా బాగుచేసుకోలేమా? ఆఫీస్ కి వెళతాం, "పనిపూర్తయిందా", "ఈ జాబ్ లో ఉంటే వచ్చే ఏడాదికి ఎంత పే వస్తుంది, మరో జాబ్ మారితే బాగుంటుందేమో? వద్దులే అక్కడ వర్క్ ఎక్కువుంటుందేమో".. ఇవే పనికిమాలిన పని తప్పించుకునే ఆలోచనలు. జపాన్ చాలా గొప్పదేశమండీ, చైనా ఎంత డెవలప్ అయ్యిందో చూశారా.. టీవీలో స్టాటిస్టిక్స్ చూసి తామేదే రీసెర్చ్ చేసి కనిపెట్టినట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు. అవి డెవలప్ అయ్యాయి అంటే అక్కడి పౌరులు తమ పని తాము శ్రద్ధగా చేసుకుపోతున్నారు. వారేమీ ఓవర్ టైమ్ చెయ్యడం లేదు. తమకు వచ్చే జీతానికి సరిపడా తాము కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రొడక్టివిటీ వల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అని, తాము కష్టపడితే దేశానికి సముద్రంలో నీటి బొట్టంత అయినా లాభం చేకూరుతుందన్న కనీస స్పృహ వారికుంది. ప్చ్.. మనం మాత్రం ఎప్పుడు సెలవు వస్తుందా అని చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటాం. స్వంత పనే, కూడు పెడుతున్న పనే శ్రద్ధగా చేయనంత బద్ధకస్తులమైతే మనం దేశం గురించి బాధ్యత ఎక్కడ ఫీల్ కాగలం?

"దేశాన్ని ఉద్దరించాలంటే ఏం చేయాలండీ" అంటూ ప్రశ్నిస్తారు కొంతమంది? ఎంత కన్ ఫ్యూజన్ లో ఇరుక్కున్నాం. చేయాలన్న తపన ఉండాలే కానీ మనం చేసే ప్రతీ పనీ చిత్తశుద్ధితో చేస్తే అది దేశానికి సేవ చేసినట్లు కాదా? ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవడం దగ్గర్నుండి అనాధలకు సేవ చెయ్యడం వరకూ ఎన్ని రకాల సేవలు ఉన్నాయి. అవన్నీ మనమెక్కడ చేస్తాం అంటూ భేషజం అడ్డు వస్తుంది. ఇంకేం దేశాన్ని, నాయకుల్ని, పక్కింటి వాడిని సణుక్కుంటూ దుప్పటి ముసుగేద్దాం. మనకు చేతనైంది అదే కదా! ఒక్క మంచి పనిని చెయ్యకపోగా మంచి పనులకు మాటలతోనైనా మోరల్ సపోర్ట్ ఇచ్చే ఓపెన్ మైండ్ ఉండదే.. ఇంకా సమాజాన్ని విమర్శించే హక్కు మనకెక్కడిది? ఎవరైనా మంచి పని చేస్తే కాళ్లు పట్టి మరీ వెనక్కి లాగి శాడిజం ప్రదర్శించుకుంటాం. నిర్లక్ష్యంగానే పెరిగాం, నిర్లక్ష్యంగానే జీవితం సాగిద్దాం.. ఎవరెట్లా పోతే మనకెందుకు! ఇలాంటి పండుగలొచ్చినప్పుడు నాలుగు స్వీట్లు తిని, Orkutలోనో, మెయిల్ లోనో ఆవేశపూరితమైన కొటేషన్లని, వాల్ పేపర్లని పంపించుకుని అలా చేయడం వల్ల మనకేదో దేశభక్తి వంటబట్టినట్లు భ్రమపడుతూ, టైమ్ ఉంటే బ్లాక్ లో టిక్కెట్ కొని సినిమాకెళ్లి, రాత్రికి వీలైతే గ్లాసులు గల్లుమనిపించి తొంగుందాం...

మేరా భారత్ మహాన్! స్వాతంత్ర్యభారతం వర్థిల్లాలి...!!

ఇలాంటి మొక్కుబడి దేశభక్తిని చూసి విసిగిపోయి..

- నల్లమోతు శ్రీధర్

పుణ్యభూమి నాదేశం నమోనమామిః


మేరె వతన్ కే లోగో ...




జన గణ మన అధినాయక జయహే ...

Wednesday 13 August 2008

విజ్ణానవంతమైన విల్లు రాద్దాము రండి...




అందరికీ నమస్సుమాంజలి. సుస్వాగతం


ఇటీవలి కాలంలో అంతర్జాలంలో తెలుగు వాడకం బాగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు బ్లాగులలో. కానీ మనమందరం చేయాల్సిన పన్లు ఇంకా చాలా ఉన్నాయి. అదీ మన మాతృభాష తెలుగులోనే. చాల సులువుగా చేయదగినవే. ఈ పని ఒక్కరి వల్ల అయ్యేది కాదు. సమిష్టిగా పని చేస్తే సాధించగలిగిన ఒక అద్భుతం. వీవెన్ చెప్పినట్టు ఇది శ్రమదానం కాదు. ఇది మనకోసం మన తర్వాతి తరం కోసం వారసత్వంగా ఇవ్వగలిగే జ్ఞాన సంపద. బ్లాగులు రాయడం మన సంతోషం కోసం.కాని వికీపీడియాలో రాయండి వేలాది తెలుగు వారికోసం. ఈ రోజుల్లో తెలుగు కన్నా ఇంగ్లీషు బాష ఎక్కువగా వాడుకలో ఉంది. మన పిల్లలకు బలవంతంగా తెలుగు నేర్పించాల్సి వస్తుంది. అది మన దురదృష్టం. కాని అరవై దశకంలో ఫ్యాషన్లు మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ఐనట్టు చాల కొద్ది కాలంలో మళ్ళీ అందరూ తెలుగును ఉపయోగిస్తారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాని అప్పుడు వారికి కావాల్సిన సమాచారం , విజ్ఞానం తెలుగులో దొరకాలి కదా. ఇప్పుడు మనం శ్రమ అనుకోకుండా మనకు తెలిసిన సేకరించిన, తెలుసుకున్న విలువైన సమాచారాన్ని మనవరకే దాచుకోకుండా అది పదిమందికి, రాబోయే తరానికి అందుబాటులో ఉండేలా తయారు చేసి పెడదాము. ఎక్కడ అంటారా? వికీపీడియాలో. ఇందుకోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. వారాంతం లో కనీసం ఆదివారం రోజు ఒక్క గంట అయినా వికీపీడియా కోసం కేటాయించండి. మీకు తెలిసిన సమాచారం రాయండి. లేదా అనువాదాలు చేయండి. ఇప్పుడు అది మీకు ఎటువంటి లాభం ఇవ్వలేకపోవచ్చు కాని ఎందరికో ఉపయోగపడే విషయాలు వికీలో పొందుపరిచామన్న సంతృప్తి లభిస్తుంది. వికీలో ఎం రాయాలి అనుకుంటున్నారా ? సినిమాలు, మీ ఊరి విశేషాలు, లేదా వంటకాల గురించి, సాంకేతిక సమాచారం, ఆటలు, పాటలు ఇలా ఎన్నో ఎన్నెన్నో. వికీలో మీ అడుగులకు ఎల్లవేళలా సాయం చేయడానికి ఎందఱో ఉన్నారు. రండి మరి.

తెలుగు వికీపీడియా

వికీపీడియా :ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు,
ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.

వికీ వ్యాఖ్య

వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు,
వాటి అనువాదాలు కూడా లభిస్తాయి. అంతేకాదు వ్యాఖ్యలను చేసినవారి గురించి తెలుసుకోవడానికి,
తెలుగు వికీపీడియాకు లింకులు కూడా ఉంటాయి! తెలుగు వికీవ్యాఖ్యలో ఇప్పటివరకూ 84 పేజీలు తయారయాయి.
ఒక్కో పేజీలో ఒకటి కంటే ఎక్కువ వ్యాఖ్యలు సామెతలు ఉంటాయి. సహాయ పేజీని
సందర్శించో ఇక్కడ ఎలా మార్పులు చేర్పులు చేయాలో నేర్చుకోండి. అంతేకాదండోయ్ ఇక్కడున్న ఏ పేజీనయినా
మీరు ఇప్పటికిప్పుడు మార్చేయవచ్చు.

విక్షనరీ

తెలుగు పదాలకు అద్భుతమైన నిఘంటువు.

తెలుగు పదం

కొత్త పదాల సృష్టి, అందుకు కావలసిన సముదాయిక చర్చా వాతావరణాన్ని కల్పించడం తెలుగుపదం.ఆర్గ్ సైటు ప్రధాన లక్ష్యం. ఔత్సాహికులు కొందరు (తమతమ బ్లాగులలో, సందేశాల్లో) వివిధ ఆంగ్ల భాషా పదాలకు తెలుగు పదాలను సృష్టిస్తున్నారు. వీటన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించడం కూడా ఒక అనుబంధ లక్ష్యం.

ఇది నిఘంటువు కాకపోయినా, ఇక్కడున్న తెలుగు పదాల్ని వాడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడ పోగయ్యే పదసంపద అంతా అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయత్నంలో మిమ్మల్నికూడా పాలుపంచుకోమని ఆహ్వానిస్తున్నాం. కొత్త తెలుగుపదాల కొరకు అభ్యర్ధనలు, సందేహాలు, మీ ప్రతిపాదనలు తెలుగుపదం గూగుల్ గుంపులో చర్చించవచ్చు.

బీటావికీ

మీలో చాలా మందికి తెలుగు వికీపీడియా, మరియు ఇతర అన్ని వికీపీడియాలకు మీడియావికీ అనే సాఫ్టువేరును వాడతారని తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ మీడియావికీ సాఫ్టువేరు User Interfaceను ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోకి అనువదిద్దామనే ఒక ప్రాజెక్టును మొదలుపెట్టారు. అందుకోసం, అనువదించటాన్ని సులభతరం చేయటానికి బేటావికీ అనే సాఫ్టువేరును కూడా తయారు చేసారు. ఈ సాఫ్టువేరును మీడియావికీ డెవలపర్లు తయారు చేసారు ఇతర వివరాలు ఇక్కడ చదవండి.


పైవాటిలో మీకు నచ్చిన, సులభమైన అంశాలలో రాయడం ప్రారంభించండి. రేపటి తరానికి ఎప్పటికీ తరిగిపోని ఆస్థినిస్తు విల్లు రాయండి.

Monday 11 August 2008

ఒక్క స్మైల్ ప్లీజ్....



నా పేరు జ్యోతి. అంటే వెలుగు. వెలుగు కావాలంటే కరెంట్ ఉండాలి. వానలొచ్చినా, రాకున్నా కరెంట్ కట్. హైదరాబాదులో వానలు పడి హుస్సేన్ సాగర్ నిండింది. హుస్సేనీ అలంలో ఇల్లు కూలింది. హైదరాబాదులో బిరియానీ ఫేమస్. బిరియానీ అంటే బావర్చి లేదా ప్యారడైస్. ప్యారడైస్ అంటే టాంక్ బండు అవతల ఉన్న సికిందరాబాదులో ఉన్న హోటల్. స్వర్గం కాదు. చచ్చాక స్వర్గానికెళతారు. స్వర్గంలో అందమైన అప్సరసలు ఉంటారు. మనకూ అప్సరసలు ఉన్నారు. ముమైత్ ఖాన్. నమితా. ఖాన్ అంటే షారూక్ ఖాన్. షారూఖ్ అంటే హిందీ నటుడు. హిందీ మన రాష్ట్రీయ బాష. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం.


గోవా ఒక సుందరమైన ప్రదేశం. అక్కడ అందమైన అమ్మాయిలు, బీచిలు ఉంటాయి. అందమైన అమ్మాయిలంటే కాలేజీలలోనే ఉంటారు. కాలేజీలలో ర్యాగింగ్ చెస్తే పోలీసులు శ్రీకృష్ణజన్మస్థానానికి పంపిస్తారు. కృష్ణుడు ద్వారకలో ఉంటాడు. ద్వారక నీళ్ళలో మునిగిపొయింది. అది గుజరాతులో ఉందంటారు. గుజరాతులో బాంబులు పేలాయి. పేలినవి బాంబులు , దీపావళి టపాసులు కాదు, కుళ్ళు జోకులు కాదు. టపాసులు పేలిస్తే ఆనందం. కుళ్ళిపోయిన పండ్లు , కూరగాయలు తింటే ఆరోగ్యం పాడవుతుంది. లేదా డాక్టరు బిల్లు పేలిపోతుంది. పండ్లు అనగా రాఘవేంద్రరావు సినిమాలలోనే చూడాలి. ఘరానా దొంగ ఐనా పాండురంగడైనా. ఈ మధ్య దొంగలు దేవుళ్ళను కూడా దోచుకుంటున్నారు. అందరి దేవుడు ఒక్కడే . పాండురంగడు మహారాష్ట్రలో ఉన్నాడు. అక్కడ పావు బాజీ ఫేమస్. పావు కిలో బీన్స్ ఎనిమిది రూపాయలు. మొన్నెప్పుడొ అన్నీ ఎనిమిదులే వచ్చాయి. మనకు రూపాయలు ఎలాగో అమెరికాలో డాలర్లు. అమెరికావాళ్ళు తెల్లగా ఉంటారు, అక్కడి రాష్ట్రపతి ఇల్లు కూడా తెల్లని తెలుపే. బట్టలు తెల్లగా అవ్వాలంటే సర్ఫ్ ఎక్సెల్ వాడాలి. రాజకీయనాయకులు తెల్లని బట్టలే వేస్కుంటారు. స్త్రీ నాయకులు మాత్రం రోజుకో చీర. శ్రావణమాసం వచ్చిందంటే ఆడవాళ్ళకు, చీరల దుకాణాల వాళ్ళకు సందడే సందడి. మొగుళ్ళకేమో గోవిందం భజ మూఢమతే. దుకాణాలన్నీ ఒకే చోట ఉంటే మాల్ అంటారు. ఇది మనకు కావల్సినవన్నీ ఒకే చోట కొనుక్కునే సంత. సంతలో పిల్లాడు మాయమై సత్రంలో తేలాడంట. పిల్లాడేమో చదివేది L.K.G, వీపుపై పదికిలోల లగేజీ, ఒక చేతిలో లంచ్ బాక్స్ బ్యాగేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. చివర్లో తల్లితంద్రుల జేబులు, బుర్రలు క్లియరేజీ.

అదేంటో నేను ఏం రాస్తున్నానో, రాసానో నాకే తెలియకుండా ఉంది . ఎందుకిలా జరిగింది.??? కాస్త చెప్పరూ. హల్లో బావున్నారా??

Wednesday 6 August 2008

పూజలా?? పాల వరదలా??

ఈరోజు నాగుల పంచమి. అన్ని గుళ్ళలో కోలాహలం. మంచిదే. కాని ఈ పండగ ముఖ్య ఉద్దేశ్యమేమిటి ? పుట్టలో పాలు పోస్తారు. కొన్నేళ్ళ క్రింద పుట్టలలో పాములుండేవి అవి తాగేవో. లేక స్నానం చేసేవో ఎవరు చూసారు గనక?  గిన్నెలో పెడితే వచ్చి తాగుతుంది కాని పుట్టలో పోస్తే అభిషేకమే కదా? అలా వందలమంది లీటర్ల కొద్ది పాలు పోస్తే పాము సంగతి దేవుడెరుగు ఆ పుట్ట మన్ను తడిసి కరిగిపోదా.  ఇక సిటీలో ఐతే పాము పుట్టలే ఉండవు. కొన్ని చోట్ల పుట్టలాంటి ఆకారం తయారు చేస్తారు. అందులో పోసే పాలు వృధాగా డ్రైనేజీలోకి వెళతాయి. ఇదేనా భక్తి. అలా అందరూ వెళ్ళి డ్రైనేజీలో పాలు పోసే బదులు గుడి బయట బిచ్చగాళ్ళకు పోస్తే కనీసం వాళ్ళకన్నా, వాళ్ళ పిల్లలకన్నా కొంచెం ఆకలి తీరుతుంది కదా?

పుట్ట దగ్గర పెట్టిన పూజా ద్రవ్యాలు మళ్ళీ శుభ్రం చేసి అమ్మేసుకుంటారు అక్కడున్న పనివాళ్ళు. మరి ఈ ఫూజా ఫలం ఎవరికి దక్కినట్టు. అసలే పాల ధర రోజు రోజుకు పెరిగిపోతుంటే ఇంట్లో ఖర్చు తగ్గించాలని పాలు తగ్గిస్తున్నారు ఎంతో మంది. కాని పండగల పేరుతో ఇలా పాలు అనవసరంగా పారబోయడం, అందునా డ్రైనేజీలో పోయడం సమంజసమా??  ఇలా పాముపుట్ట దగ్గర పాలు తూములోకి పోయే ఏర్పాటు చేయడం నా కళ్ళారా చూసాను.అందుకే ఈ బాధ.   ఇక ఇంటికొచ్చే పాములవాళ్ళు ఏదో వాళ్ళ పొట్టగడవడానికి పాములను తట్టలో పెట్టుకుని ఇలిల్లు తిరిగి డబ్బో, బట్టలో అడుక్కుంటారు. వాళ్ళను పట్టుకుపోతారు. అసలు ఇవి పూజలా?? ఇలా చేయమని దేవుడు అడిగాడా? 

Tuesday 5 August 2008

ప్రమదావనం ప్రత్యేక సమావేశం

  


శ్రావణమాసం అంటేనే ఆడవాళ్ళకు ప్రత్యేకమైనది. అందుకే సుజాతగారు మహిళాబ్లాగర్లకు ఆహ్వానం పలికారు.





అంతర్జాలం అంటేనే ఒక మాయాప్రపంచం. కాని ఈ తెలుగు బ్లాగ్లోకంలో అందరు కాకున్నా కొందరైనా ఒక ఆత్మీయబంధం ఏర్పరచుకున్నారు. అలాగే ప్రమదావనం సభ్యులు కూడా. ప్రతి సమావేశంలో ఎవరెక్కడ ఉన్నా అందరిని కలవాలని ఆత్రుత ఉంటుంది. అప్పుడప్పుడు వీలుకాదులెండి. అలా కలుసుకుని ముచ్చట్లేసుకుని స్నేహితులయ్యారు అందరు. ఇక్కడ ఎవరు కూడా వయసు, తమ గొప్పలు చెప్పుకుని కాని దగ్గర కాలేదు. ఎవరికి వారు తమ భాద్యతలలో బిజీగా ఉన్నారు. అందరు కలిసింది ఒక్క బ్లాగు రచనల ద్వారానే. అలా అని ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఎప్పుడూ  అనుకోలేదు,అనుకోరు కూడా. ఇలా ఉన్నప్పుడు ఒకరినొకరు కలవాలని ఉంటుంది కదా. ఒకరో ఇద్దరో కలిసే బదులు అందరం ఒకే చోట కలిస్తే బావుంటుంది కదా అన్న చిన్ని కోరికతో నేను సత్యవతిగారు మాట్లాడుకుని మా ఇంట్లో కాని వాళ్ళింట్లో కాని లంచ్‍కి కలుద్దాము అని నిర్ణయించుకున్నాను. ఈ సారికి సత్యవతిగారి ఇంట్లో కలవాలని ఫైనల్ ఐంది. వచ్చేసారి మా ఇంట్లో.  ఆదివారం ఆడవాళ్ళకు ఎలాగూ సెలవు దొరికే సమస్యే లేదు. కనీసం ఇలా ఐనా ఓ మూడూ నాలుగు గంటలు భర్తను, పిల్లలను వదిలేసి స్నేహితులతో గడపొచ్చు అనే ఆలోచన. అసలు ఇప్పుడు కామన్ కల్చర్ ఐన కిట్టీ పార్టీలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందులో ముఖ్యంగా గొప్పలు చెప్పుకోవడం, స్టేటస్ గట్రా అనే ఫిట్టింగ్స్ ఉంటాయి. కాని ఇక్కడ మనమందరం కలిసేది ఒక మంచి వాతావరణంలో అదీ తెలుగు బ్లాగులలోని వ్యాసాలతో పరిచయం పెరిగి స్నెహితులమయ్యాము అందుకే ఇలా కలవాలనే ఆలోచన కలిగింది. అమెరికాలో ఉన్న మిత్రులు హై కి వచ్చినప్పుడు తప్పక కలుద్దాం .



జ్ఞానప్రసూనగారు ప్రమదావనంలో గార్లు వండపోతే , వాళ్ళింట్లో బూర్లు వండిపెడతామన్నారు. వచ్చే నెలలో ఆవిడ హైదరాబాదు వస్తున్నారుగా. అప్పుడు వాళ్ళింటి మీద దాడి చేద్దాం. తప్పకుండా బూర్లు చేసి పెడతామన్నారు. తర్వాతి సమావేశం మా ఇంట్లో , ఎప్పుడు అంటే ... త్వరలో..



మొన్నటి ఆదివారం నాటి సమావేశానికి వచ్చిన కొత్త సభ్యురాలు శ్రీమతి నిర్మల కొండేపూడి. రచయిత్రి.. ఆవిడ బ్లాగు ఆకాశంలో సగం.. 



ఈ స్పెషల్ సమావేశానికి వచ్చే మిత్రులకు నా తరఫున ఆవకాయ, సున్నుండలు తెస్తున్నాను. తినడానికి, ఇంటికి తీసికెళ్ళడానికి కూడా. ...
 

Sunday 3 August 2008

వ్యక్తిత్వమా ?… సమాజమా ?...

సమాజాన్ని చూస్తే చాలామందికి భయం. ఏ పని చేసినా అది సమాజం హర్షిస్తుందా.. లేదా అని క్రిందా మీదా పడి బుర్రబద్ధలుకొట్టుకుని విశ్లేషించిన మీదట ఇప్పటికన్నా మరింత ఉన్నతమైన సామాజిక హోదాని, సాఫ్ట్ కార్నర్‌ని కట్టబెట్టే పనులను మాత్రమే చెయ్యడానికి సుముఖత చూపుతాం. ఒక మంచి పని చెయ్యాలన్నా అది మనం అనుకున్న పదిమందితో కూడిన పరిమిత సమాజం దృష్టిలో ఆమోదయోగ్యమైతేనే ఆచరణకు నోచుకుంటుంది. ఇలా మన దృష్టిని మర్చిపోయి సమాజం దృష్టిలో భూతద్ధం వేసుకుని చూడడం వల్ల మన వ్యక్తిత్వాన్ని, మనకు మనమే ప్రత్యేకమైన శైలిని, నిర్ణయాత్మక అసక్తిని కోల్పోతున్నాం. సమాజాన్ని సంతృప్తి పరిచేలా నడుచుకోవడం ఎన్ని జన్మలెత్తినా సాధ్యపడని పని. కొన్ని విషయాల్లో సమాజాన్ని సంతృప్తిపరచడం కోసం వ్యక్తిత్వాన్ని చంపుకుని నిర్ణయాలు తీసుకోవడం కన్నా సమాజాన్ని ఎదిరించైనా మన మనసుకి మనం మనతోనే ఉన్నామన్న భరోసాని మిగల్చకపోతే.. సిరివెన్నెల అన్నట్లు "జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది" అని పాడుకోక తప్పదు.


ప్రపంచం కోసం మనకుమనం ఏకాకులమవడం ఎంత దురదృష్టం? ప్రతీ మనిషిలోనూ జన్మతః ఎన్నో అద్భుతమైన పార్ఘ్యాలు ఇమిడి ఉంటాయి. ఇరుకు ప్రపంచాన్ని ఈదడమే జీవితం అన్నట్లు.. ఆ ఇరుకు మనుషుల్లో, మనసుల్తో పోరాడుతూ అలసిపోతూ... జీవితంపై కురిపించగలిగేలా సృష్టికర్త మనలో ఇమిడ్చిన అద్భుతమైన వర్ణాలను మనలోనే సమాధి చేసుకుంటూ నిస్సారమైన జీవితాన్ని సాగించడంలో మనం సిద్ధహస్తులమయ్యాం. మన లక్ష్యం సమాజాన్ని గెలవడమే, సమాజంలోనిలదొక్కుకోవడమే అయినపుడు పోరాటం తప్ప ఏం మిగులుతుంది? ఉన్నత స్థానం కోసం పోరాడాలన్న కసితో డబ్బు, పలుకుబడిని సాధించడానికి కష్టపడి పోరాటం సాగించడానికి.. మన సహజసిద్ధ ప్రతిభతో మనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని సృష్టించుకుంటూ..మన శైలినే ప్రపంచం ముందు మోడల్‌గా పెట్టడానికి ఎంత వృత్యాసముంటుందో ఒక్కసారి ఆలోచించండి...? కాని పదిమంది నడిచే మూసదారిని విడిచి ఒక్కడుగు విభిన్నంగా వేయడానికి మనకు ధైర్యం చాలదు. కారణం మనల్ని మనం కూడా నమ్మనంతగా ప్రపంచాన్ని నమ్ముతున్నాం. ప్రపంచంలో పదిమంది పది రకాలుగా మాట్లాడినా ఆ పదిమందినీ ఒప్పించడానికి శ్రమిస్తాం తప్ప.. మనకు మాత్రం మనం తోడు ఉండడానికి ఇష్టపడం ! దీనికి కారణం మనమనుకుంటున్న ప్రపంచంలో సూటిపోటి మాటలతో , పనికిరాని ఆరాలతో ఇతరులను బాధిస్తున్నదీ మనమే కాబట్టి! రేపు ఏమైనా తేడాలు వస్తే ఆ బాధలు మనల్ని చుట్టుకుంటాయన్న అభద్రతాభావం. అందుకే గిరిగీసుకు బ్రతుకుతున్నాం. వ్యక్తిత్వానికి లక్ష్మణరేఖని అడ్డుపెట్టి మరీ! మనం ప్రపంచాన్ని ఎప్పుడైతే నొప్పించడం మానేస్తామో అప్పుడే ఈ భయపు జాఢ్యం మనల్ని వదులుతుంది. మన స్వంత వ్యక్తిత్వంతో బ్రతకగలుగుతాం.


మీ
నల్లమోతు శ్రీధర్

Saturday 2 August 2008

లేడీ ముళ్ళపూడికి జన్మదిన శుభాకాంక్షలు!!

శ్రీవిద్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు



"నవ్వటం ఒక భోగం.. నవ్వించటం ఒక యోగం" .. ఎన్ని సార్లు వినలేదనీ ఈ మాట.. అక్షర లక్షలు అవి. "నవ్వలేని వారు" ఎంత అరుదుగా ఉంటారో తెలీదు కానీ.. "నొప్పింపక.. తానొవ్వక" హాస్యం పండించే వారు చాలా అరుదు!! అలా మన బ్లాగ్లోకంలో మనకోసం బ్లాగువనాన్ని సృష్టించి.. నవ్వుల పువ్వలను పూయిస్తున్న హాస్య తోటమాలి... శ్రీ విద్య ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటుంది. భాషలో అందాన్ని, హాస్యాన్ని ఏక కాలంలో పలికించే ఈనవ్వుల రాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు..ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ..

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008