Thursday 30 October 2008

మనసులో మాట





మనసులో ఏదైనా విషయం మీద ఆలోచనలు మొదలయ్యాయంటే అవి అలా కొనసాగిపోతుంటాయి. వాటికి హద్దు, అదుపు ఉండదు. వాటిని అలా కాగితంపై అలవోకగా రాసేయొచ్చు. ఎందుకంటే అవి మనకు నచ్చినట్టుగా,మన స్వభావానికి తగ్గట్టుగా ఉంటాయి. కాని ఇతరుల గురించి రాయాలంటే కొంచం కష్టమే. నాకైతే మరీ కష్టం. కంప్యూటర్ ఎరా పత్రిక కోసం బ్లాగు రివ్యూ రాయించి పంపడం ప్రతినెల నా భాధ్యత. నవంబరు నెలకోసం రాయమని చెప్పినవాళ్లు పని ఒత్తిడిలో రాయలేకపోయారు. చివరి తేదీ దగ్గరకొచ్చింది. ఆ పేజీ వదిలేయడానికి మనసొప్పలేదు. సో తెగించి "ధైర్యే సాహసే మా ఆయనే" (భారతీయ నారి భర్త పేరు చెప్పొద్దు మరి) అనుకుని వేరే పని వత్తిడిలో ఉన్నా కూడా రమణి బ్లాగు గురించి రాయడం మొదలుపెట్టా. ఇంకేముంది. అలా రమణి బ్లాగుకెళ్లి మంచి మంచి టపాలు వెతుకుతూ, చదువుతుంటే సమీక్ష కొండెక్కుతుంది. మళ్లీ దానిని ముందుకు లాక్కుని రాయడం. ఎలాగైతేనేమి ఓ మూడు గంటలలో చెమట్లు గ్రక్కుతూ సమీక్ష పూర్తి చేసా. ఇలా ఎందుకన్నానంటే కనీసం మూడు పేజీల సమీక్ష ఇవ్వాలి మరి. అప్పుడే అది పత్రికలో పూర్తి పేజికి సరిపడుతుంది. ఆ సమీక్ష చదివి ఆ పత్రిక సంపాదకుడు శ్రీధర్ ఓకె అన్నాక నా తలపై పెద్ద భారం తగ్గినట్టైంది. ఎందుకంటే మొదటిసారి ప్రయత్నించా కదా. కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని రాయాలి. లేకపోతే మిగతా బ్లాగర్లు, చదువరులు నన్ను చీల్చి చెండాడరూ. "ఇంటర్నెట్‌లో తెలుగు వెలుగులు" తర్వాత కంప్యూటర్ ఎరా లో నా రెండవ వ్యాసం ఇది. "మనలోమాట .. నా మనసులో మాట" నేను రమణి బ్లాగు ఎంచుకోవడానికి మరో ప్రత్యేకమైన కారణం ఉంది. అది తర్వాత చెప్తాను.

మరో గమనిక.

నేను రాయాలనుకుని రాయలేకపోయిన టపా . నాకు తెలిసిన బ్లాగర్ల పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అలవాటుగా మారింది అని అందరికి తెలుసుకదా. కాని కొత్తపాళీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దామనుకునేటంతలో , మరో ఏకలవ్య శిష్యుడు నల్లమోతు శ్రీధర్ తన బ్లాగులో బ్రహ్మాండంగా చెప్పేసాడు. పండగ రోజునుండి కూడలి చతికిలబడింది. ఈ విషయం అందరికీ తెలియదని మళ్లీ గుర్తు చేస్తున్నాను. ఒకసారి కంప్యూటర్ ఎరా బ్లాగుకేసి లుక్కేసుకోండి మరి..

Wednesday 29 October 2008

హ్యాపీ బర్త్ డే ఫ్రెండ్ ....




ఒకానొక సమయంలో జీవితంలో పూర్తిగా కృంగిపోయి ఉన్న తరుణాన, ఏమి చేయాలొ తెలీని అయోమయంలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చకుండా, నా పరిస్థితిని విశ్లేషించి, నన్ను నా గురించి ఆలోచించుకునేలా చేసి, నా ఆత్మస్థైర్యాన్ని ఇంకా పెంచుకుని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ బాటలో పయనించేలా చేసిన ఒక మంచి ఫ్రెండ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..


Happy Birthday Friend..

may god bless you. always keep smiling ..and thanks for being my good friend..

Tuesday 28 October 2008

చీకటి వెలుగుల రంగేళి


అందరి జీవితంలో వెలుగులు నింపే దీపాల పండగ, చెడుపై మంచి విజయాన్ని గుర్తు చేసే దీపాల పండగ ... దీపావళి
తెలుగు బ్లాగర్లందరికీ ఈ దీపావళి శుభాకాంక్షలు..


Saturday 25 October 2008

హలో! బకరా అవుతారా?




హలో!!

హలో! ఎవరూ? ఎవరు కావాలి?

నమస్కారం. పద్మగారా? మేము తుస్ ఫుస్ మ్యూజిక్ కంపెనీ నుండి మాట్లాడుతున్నాము. మీరు బాగా పాడతారని తెలిసింది. మేము కొత్త గాయకులతో ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నాము మీరు ఒక్కసారి మీ పాట వినిపించగలరా? మాకు నచ్చితే మీతో ఒక పాటల సిడి విడుదల చేస్తాము. తర్వాత సినిమా మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా పరిచయం చేస్తాము.

అమ్మా! మ్యూజిక్ కంపెనీ నుండి కాల్ వచ్చింది. నా పాటలతో సిడి చేస్తారంట.

తొందరగా పాడండి మరి.

"మరుగేలరా ! రాఘవా! మరుగేలరా! రాఘవా!

చాలండి మీరు చాలా బాగా పాడుతున్నారు .సెలెక్ట్ చేసాము. మా ఆఫీసుకు వస్తె అగ్రిమెంట్ చేసుకుందాము.

సరేనండీ. ఎప్పుడు రమ్మంటారు?

హహహహా.. మేము ఫలానా FM చానెల్ నుండి మాట్లాడుతున్నాము. మిమ్మల్ని పొద్దున్నే బక్రా చేసాము . మిమ్మల్ని బక్రా చేయమని మీ స్నేహితులు మాకు చెప్పారు . ఉంటాము మరి. బై?
??????????????????





హలో!
హలో! ఎవరు కావాలి?

గుడ్ మార్నింగ్. మీ పేరు రమేష్ ..

అవునండి నేను రమేష్ నే. ఏంటి సంగతి.

నా పేరు రమ్య అండి. నాకు ఒక పర్సు దొరికింది.అందులో కార్డు చూసి మీకు కాల్ చేస్తున్నాను. మీదేనా?

కాదండి. నేను నా పర్సునెప్పుడూ పోగొట్టుకోలేదు.

ఇది మీదేనండి. మీ పేరు పులిపాటి రమేష్ కద. మీరు బ్యాంకులో పని చేస్తున్నారు. ఇది మీ నంబరే కదా.

అవునండి. ఇవన్నీ మీకెలా తెలుసు?

ఎలా తెలుసేంటి మీ పర్సులో డబ్బులు, కార్డులు, కొన్ని పేపర్స్ ఉన్నాయి.అవి చూసి మీకు అందచేద్దామని కాల్ చేసాను. చెప్పండి. ఎప్పుడొచ్చి తీసుకుంటారు.

నాది కాదంటుంటే తీసుకోమంటున్నారేంటి. అసలు మీరెవరు. నా నంబర్ మీకెలా తెలుసు.

నేను పంజగుట్ట దగ్గర ఉన్నాను. వచ్చి తీసుకోండి.

అసలు మీరెవరో చెప్పండి. అప్పుడు తీసుకుంటాను.

హహహహహ... నేను ఫలానా FN చానెల్ నుండి మాట్లాడుతున్నాము. ఇవాళ మిమ్మల్ని బక్రా చేయమని మీ కొలీగ్ మాకు SMS ఇచ్చారు. ఖంగారు పడ్డారా? ఉంటామండి. బై.



హలో! సరస్వతిగారు ఉన్నారా?

హలో! నేనే సరస్వతిని . ఎవరు మాట్లాడేది?

నమస్కారం. మీరు సరస్వతినే కదా.

ఔను. నేనే సరస్వతిని. ఏం గావాలె.

నా పేరు సుజాత అండి. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చెసాను. మీరు కోపం తెచ్చుకోవద్దు. అలా అని మాటిస్తే చెప్తాను మరి.

ఎందా విషయం. చెప్పకుండా కోపం తెచ్చుకోవద్దంటవేంది? చెప్పు ముందు.

అలా కోపం తెచ్చుకోవద్దు మరి.

సర్లేవమ్మ. చెప్పు ముందు.నాకు వంట పని ఉంది.

మరి. నేను మీ అబ్బాయి కిరణ్ ప్రేమించుకుంటున్నాము. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. కిరణ్ ఏమో నన్ను మీతో మాట్లాడమన్నాడు.

ఏంది. మల్ల చెప్పు.

కిరణ్, నేను రెండేళ్ల నుండి కలిసి తిరుగుతున్నాము. నేను సినిమా స్టారులా కాకున్నా అందంగానే ఉంటాను. ఉద్యోగం చేస్తున్నాను. మంచి అమ్మాయిని. కిరణ్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు కాదనకండి ప్లీజ్.

అసలు నువ్వెవరు. ఇదంతా ఏంది. అసలు నంబర్ ఎలా తెలిసింది. సరిగ్గా చెప్పు. నాకేమి సమజ్ ఐతలేదు.

మాది మధ్యతరగతి కుటుంబం అండి. కట్నం ఇచ్చుకోలేము. కాని పెళ్లయ్యాక నా జీతం మొత్తం మీకే ఇస్తాను. ఒప్పుకోండి. మా ప్రేమను గుర్తించండి.

అసలు ఎవరు నీవు. ఏంగావాలే. మావాడు ఎలా తెలుసు. అది చెప్పు ముందు. కట్నం , పెళ్లి సంగతి తర్వాత? పొద్దున్నే దిమాగ్ ఖరాబ్ చేస్తున్నవ్ ..

హహహహహా. నేను ఫలానా FM చానెల్ నుండి ఫోన్ చేస్తున్నామండి. మిమ్మల్ని బక్రా చేసాము. అసలు మీ కిరణెవరో నాకు తెలీదండి. ఉంటామరి. బై.



హలో!

హలో! ఎవరు?

నమస్తే అండి స్వాతి ఉందా.

పడుకుంది. ఎవరు మాట్లాడేది.

నేను స్వాతి కాలేజ్ నుండి కాల్ చేస్తున్నాను. ప్రిన్సిపాల్ గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నారు. కాస్త స్వాతిని నిద్ర లేపుతారా? తనకు చెప్పాలి.

సరే ..ఆగండి.. స్వాతి నీకు కాలేజ్ నుండీ ఫోన్..వచ్చి మాట్లాడు.


హలో! ఎవరు?

నేను మీ కాలేజ్ ఆఫీసునుండి ఫోన్ చేస్తున్నాను. ఇవాళ మీకు కాలేజ్ ఉంది అని చెప్పడానికి.

అదేంటి! ఇవాళ మాకు హాలిడే కదా.

అవును కాని. గంట క్రితమే మేడం విషయం డిసైడ్ చెసారు. అందరికి చెప్పమన్నారు. కాలేజ్ ఉంది. అలాగే సాయంత్రం టెస్ట్ కూడా ఉంది తప్పకుండా రావాలి అని చెపప్మన్నారు. మరి గంటలో నువ్వు కాలేజికి వచ్చేయాలి.

సరే వస్తాను. నిజంగా కాలేజ్ ఉందా. మీరు కాలేజ్ నుండే కాల్ చేస్తున్నారా?

హాహహహ.. మేము ఫలానా FM చానెల్ నుండి కాల్ చేస్తున్నాము . మిమ్మల్ని బక్రా చేయమని మీ తమ్ముడు మాకు కాల్ చేసి చెప్పాడు. పొద్దున్నే మిమ్మల్ని బక్రా చేసాము. ఇక వెళ్లి పడుకోండి. బై..



హలో!

హలో! . ఎవరు మీరు?

నమస్కారమండి. నా పేరు షర్మిల. నేను అమెరికాలో ఉంటాను. రెండు రోజుల క్రింద హైదరాబాదు వచ్చాను. ప్రవీణ్ తో మాట్లాడాలి. ఉన్నారా?

లేరు. ఆఫీసుకు వెళ్లారు. ఆయనతో ఏం పని? ఆయన మీకెలా తెలుసు?

మరే. నేను ప్రవీణ్ నెట్ ఫ్రెండ్స్ మి. చాలా క్లోజ్ . రోజూ చాట్ చేస్తుంటాము. హీ ఈజ్ లవ్లీ పర్సన్.నాకు అతను బాగా నచ్చాడు. ఇప్పుడు అతనిని పర్సనల్గా కలవాలని అనుకుంటున్నాను. నాంపల్లి బస్స్తాండ్ దగ్గర ఉన్నాను. అతనికి కాల్ చేస్తే నన్ను పికప్ చేసుకుంటాడని చేసాను. ఇండియాలో ఉన్న నెలరోజుల్లో అతనితో ఇంకా క్లోజ్ అయ్యి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడెలాగ. ఆయన ఆఫీసు నంబరు లేదా సెల్ నంబరు ఇస్తారా ప్లీజ్.

ఏంటి . ఇదంతా నిజమేనా. మీరిద్దరు అంత క్లోజా..రోజూ మాట్లాడుకుంటారా?

అవునండి. ఇంతకీ మీరెవరు?

నేను ఆయన భార్యను. మాకు ఇద్దరు పిల్లలు కూడా.


హహహహ్. పూర్ణిమగారు .. భయపడ్డారా? మేము ఫలానా FM చానెల్ నుండి కాల్ చేస్తున్నాము. మిమ్మల్ని బక్రా చేయమని మీ తమ్ముడు మాకు చెప్పాడు. ఉంటాము మరి.ఎంజాయ్ యువర్ డే. బై..

>>>>>>


ఫలానా FM స్తేషన్..

సార్! బక్రా ప్రోగ్రాం ని అభినందించడానికి పదిమంది వచ్చారు. టీమ్ ని పిలవమంటున్నారు.
సరే . లోపలికి పిలువు వాళ్లని.
"ఏరా తలకుమాసిన వెదవల్లారా? మీకు పనీపాట లేదురా? అన్నీ పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు చేస్తున్నారు. బక్రా ప్రోగ్రామ్ ఏంటి. అసలు ఐడియా ఇచ్చింది ఎవరు. ఇష్టమొచ్చినట్టు జనాలను వెదవలను చేసి నవ్వుకుంటార్రా దొంగసచ్చినోళ్లారా? ఎవడో చెప్పాడని మాకు కాల్ చేసి ఎదవ వాగుడు. అనవసరంగా అందరిని తెన్షన్లో పెడతారు. ఒకోసారి కాపురాలు కూల్చెసే మాటలు. అసలు మీరేమనుకుంటున్నారు. మీ చానెల్ నడవడానికి ఇంతకంటే మంచి ఐడియాలు దొరకట్లేదా. తిన్నదరగడంలేదా. రేపటినుండి ప్రోగ్రామ్ మళ్లీ వినిపించిందో, మళ్లీ ఎవరికైనా ఇలా కాల్ చేసి సతాయించారో. మీ స్టూడియో మొత్తం ద్వంసం చేస్తాం బిడ్డా. ఏమనుకుంటున్నారో. బుద్ధిగా పాటలేసుకుని బ్రతుకు. కాని ఇలాంటి చెత్త ఐడియాలతో జనాలని సతాయించాలని చూసారో బాగుండదు మరి. ఖబడ్దార్.

Thursday 23 October 2008

పుణుకులు

చాలా రోజులైంది. వాతావరణం కూడా చల్లచల్లగా ఉంది. కొన్ని పుణుకులు వే్సుకుందామా?


1. క్రిందివాటికి తెలుగు పదాలు చెప్పండి.
Tirumalesaa -

Hello -

Good afternoon -


2. మనవడు తాతకు ఫోన్ చేసి "తాత! నువ్వు జూనియర్, నేను సీనియర్ " అని అన్నాడు. తాతకూడా "సరేరా! .. ఏం చేస్తాం?"
ఇదెలా సాధ్యం? ఎవరెక్కడెక్కడున్నారు. ఇద్దరూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే..

3. ఇప్పుడు కూరగాయల రేట్లు సెన్సెక్స్ కి వ్యతిరేక దిశలో అకాశంలో ఉన్నాయి. కాని బ్రతకడానికి తినక తప్పదు కదా. అయితే కూరగాయల మార్కెట్టుక వెళ్లేముందు,వెళ్లిన తర్వాత, కొన్న తర్వాత కూడా గుర్తొచ్చే ఒక కూరగాయ ఏంటీ?

4. ఒక కూరగాయ అందరినీ చాలా మర్యాదగా తిడుతుందంట. ఏంటది???

Saturday 18 October 2008

ప్రమదావనంలో ప్రయాణాలు - కబుర్లు.



ప్రమదావనం చాట్ రూంలో సాంకేతిక సమస్యలవల్ల చిరాకేసి మహిళా బ్లాగర్లకు ఒక శాశ్వతమైన ఆంతరంగిక గుంపు మొదలుపెట్టడమైనది. అలాగే ప్రమదావనం కోసం వేరే చోట చాట్‌రూం ఏర్పాటు చేసుకోవడమైనది. కాని అందరికి ఒకేసారి కలిసి కబుర్లాడుకోవడం కుదరటంలేదు. దానికి పరిష్కారమే ఈ గుంపు. అందులో సరదా కబుర్లతో పాటు చర్చలు కూడా జరుగుతున్నాయి.

ఎలాగూ అందరూ ఏదో ఒక టపా రాస్తుంటారు కదా. అందరూ కలిసి అప్పుడప్పుడు ఒకే అంశంపై ఎందుకు టపాలు రాయకూడదు అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టడం జరిగింది కూడా. "బ్లాగు ప్రయాణంలో నేను" అంటూ దాదాపు పది మంది మహిళ బ్లాగర్‌లు తమదైన శైలిలో టపాలు రాసారు. అది మీకందరికి నచ్చిందని అనుకుంటున్నాము. కాని ఇది చేసింది ఎవ్వరినో మెప్పించడానికి కాదు. ఏదో సాధించడానికి మాత్రం కాదు. ఈ పరపంపర ప్రతినెలా నిర్వహించాలని అనుకుంటున్నాము. ఒకోసారి ఒకో విభిన్నమైన అంశం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.

బ్లాగు ప్రయాణంలో నేను అన్న శీర్షిక ఎంచుకోవడానికి కారణం.. బ్లాగు మొదలుపెట్టి నెలలు ఐనా, సంవత్సరాలు ఐనా , వందల సంఖ్యలో ఉన్న తెలుగు బ్లాగులలో మహిళా బ్లాగులు పదులలో ఉన్నా కూడా అందరూ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ప్రతి ఒక్క మహిళా బ్లాగర్‌ని బ్లాగ్ వయసుతో సంబంధం లేకుండా , అనుభవాలు అనేవి అందరికీ ఒక్కటే అని ఈ అంశంపై రాయమని ప్రోత్సహించడం జరిగింది.

మొదటి ప్రయత్నం దిగ్విజయంగా పూర్తయ్యింది. చదువరులు అందరూ ఓపికగా అన్ని బ్లాగులు తిరిగి, చదివి కామెంటారు. ధన్యవాదములు. ఆ రోజు బ్లాగ్లోకమంతా ఒక Exhibition లా అనిపించింది నాకైతే. రాసిన వారికంటే చదివేవారు తెగ బిజీగా ఉన్నారు. అంతా బిజీ బిజీ.. కాదంటారా?

తమ ప్రయాణవిశేషాలు పంచుకున్న ప్రమదలు..

1. సౌమ్య -

2. జ్ఞానప్రసూన -

3. పి.ఎస్.ఎం. లక్ష్మి -

4. రమణి -

5. జ్యోతి -

6. పూర్ణిమ -

7. వరూధిని -

8. లలిత -

9. లచ్చిమి -

10. క్రాంతి -


ప్రమదావనంలో చేరాలనుకునే కొత్త మహిలా బ్లాగర్లు నాకు మెయిల్ చేయండి.

jyothivalaboju@gmail.com

Thursday 16 October 2008

బ్లాగు ప్రయాణంలో నేను - జ్యోతి



గడచిన రెండు సంవత్సరాలు నా జీవితంలో పెద్ద మలుపు తెచ్చాయి అని చెప్పొచ్చు. పిల్లలకోసం నెట్ కి వచ్చిన నేను నాకిష్టమైన తెలుగులో నా ఆలోచనలు, అభిరుచులను బ్లాగులుగా చేసి పెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.  కాని మొదటినుండి సరదాగా ఉండడం అలవాటు. నవ్వుతూ నవ్విస్తూ ఉండడమంటే నాకు ఇష్టం.
   
ఇంటర్‌నెట్ అంటెనే ఒక మాయాలోకం. అందులో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలీదు. అందునా ఆడవాళ్లు నెట్‌లో కనిపిస్తే వాళ్లని గురించి చాలా నీచంగా ఊహిస్తారు. ఆడపేరు కనిపిస్తేనే చాలు  తింగరి వేషాలు. చాట్‌రూమ్స్ లో ఎక్కువ. చాలా గుంపులలో కూడా ఇదే తంతు. కాని నా అదృష్టవశాత్తు హైదరాబాద్ మస్తీ, తెలుగు బ్లాగ్ గుంపు దొరికాయి. బ్లాగు గుంపులో మాత్రం స్తీలంటే ఏంతో గౌరవం ఇచ్చారు, ఇస్తున్నారు కూడా.. నాకు మొదటినుండి సీరియస్సుగా ఉండడం చాతకాదు. గుంపులో తెగ అల్లరి చేస్తుంటే (అది కూడా తెలుగులోనే) సిబిరావుగారికి భలే కోపం వచ్చింది. నన్ను గుంపునుండి తీసేయమన్నారు కూడా కాని భోలాశంకరుడైన చావాకిరణ్ ఆపేసాడంట. చివరికి బ్లాగు గుంపుకు ఒక నియమావళి పెట్టేసారు (అది నా అల్లరి మహిమే అనుకుంటా). తప్పనిసరి గుంపులో తగ్గి బ్లాగు మొదలెట్టి అక్కడ రెచ్చిపోయాను. కాని మొదట్లో బ్లాగు గురించి ఏదీ తెలీదు. ఒక్కటొక్కటిగా నేర్చుకుంటూ వచ్చాను.  ఇప్పటివాళ్లకంటె అన్ని  సదుపాయాలు ఉన్నాయి.  విహారి, తాడేపల్లిగారు, సాలభంజికలు, ఇలా చాలామంది ప్రముఖులు అప్పుడే బ్లాగులు మొదలెట్టారు. అంటే మేమందరం సహాధ్యాయులమన్నమాట.  బ్లాగు మొదలెట్టిన ప్రారంభంలో రవి వైజాసత్య, శోధన సుధాకర్ , వీవెన్ సాంకేతికమైన విషయాలెన్నో ఓపికగా నేర్పించారు.  అందుకే మొదటినెలలో తెలుగులో వంటలబ్లాగు మొదలెట్టాను. అలాగే మెల్లిగా పాటలు, ఆధ్యాత్మిక విషయాలు , ఇంగ్లీషులో వంటల బ్లాగు మొదలెట్టాను.  నాకు నచ్చిన తెలుగులో నాకిష్టమైన విషయాలు రాసుకోవడమంటే తేలికే కదా.. మొదట్లో నాకు బ్లాగులో ఏమి రాయాలో, ఏమి రాయకూడదో భయంగా ఉండేది. ఏం గొడవలొస్తాయో అని. కాని రానారే చెప్పిన ఒక్కమాట " మీ బ్లాగుకు మీరు మహారాణి, మీ ఇష్టమున్నట్టు రాసుకోవచ్చు "  నన్ను కాస్త డేరింగ్ చేసింది అని చెప్పొచ్చు. మొదట్లో వంటల కోసం బొమ్మలు నెట్‌లోనే దొరుకుతాయని తెలీదు. సో ఇంట్లోనే చేసి , ఫోటోలు తీసి పెట్టేదాన్ని. తర్వాత చేసిన పిండివంటలు తింటూ బ్లాగులు రాసుకునేదాన్ని అన్నమాట. భలే ఉంది కదా... 


 మొదట్లో బ్లాగులు చాలా తక్కువగా ఉండేవి. చిన్న కుటుంబంలా ఉండేది. అందరు బ్లాగర్లు మన కనుసన్నలలోనే చేతికందేలా ..ఉన్నట్టు ఉండేది.  అప్పట్లో బ్లాగర్లందరూ సాంకేతికంగా నిపుణులే.. తమ తమ వృత్తులు, ప్రవృత్తులలో నిష్ణాతులే. నేనే  ఏమి తెలీని మొద్దులా నాకు మనసులో తోచింది రాసుకుంటూ పోయేదాన్ని. లక్కీగా ఆ సరదా రచనలే అందరినీ మెప్పించాయి. అందుకే పొద్దు పత్రికలో సరదా శీర్షికని నిర్వహించమని ఆహ్వానించారు సంపాదకులు. నా శక్తి కొలది ప్రయత్నాలు చేసాను. కాని ఇంకా ఏదో నేర్చుకోవాలి. చేయాలి అన్న తపన నన్ను నిలువనీయలేదు.  మావారు కూడా నన్ను ప్రోత్సహించేవారు. నాకు కావలసిన పుస్తకాలు , పాతల సిడీలు కొనిచ్చేవారు. నన్ను అందరు జ్యోతక్కా అంటారంటే  జ్యోతక్క కాదు జ్యోతి పహల్వాన్ అని ఉడికించేవారు.  ఎందుకంటే మన కథలన్నీ అలాగే ఉండేవి. నేను తప్పు కాదు అనుకున్నది చేసుకుంటూ పోవడమే. ఎవరేమనుకున్నా లెక్కచేయకుండా. అలాగే బ్లాగులో కూడా నా మీద అనవసరంగా ఆరోపణలు చేస్తే గొడవ పెట్టుకునేదన్ని. చీల్చి చెండాడేయడమే .. అందరేమో చాలా సున్నితంగా , మృదువుగా  మాట్లాడేవారు. మనమేమో ఇలా!!  ప్చ్..ఇప్పటికీ అంతే. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోగానీ పోవని ఊరకే అన్నారా పెద్దలు.   

తన పత్రికలో వ్యాసం కోసం బ్లాగు గుంపులో కొచ్చిన నల్లమోతు శ్రీధర్ ని బ్లాగు మొదలెట్టేలా చేయడానికి అతనిని ఎంత బ్రెయిన్ వాష్ చేసానో ఎవ్వరికీ తెలీదు.. పాపం మొదట్లో అను, యూనికోడ్ .. రెండింటితో భలే తిప్పలు పడ్డాడు. సరే అని నెను సాయం చెస్తాను అన్నా. మరి సాంకేతిక విషయాలు బ్లాగులలో కూడా ఉండాలి కదా. కాని మొదటికే మోసం వచ్చింది. హాయిగా నా బ్లాగులు రాసుకుంటూ ఉన్న నన్ను తన పత్రికకి బ్లాగులు , వికీ మీద కవర్ స్టోరీ రాయమన్నాడు. అది కూడా కనీసం 30- 40 పేజీలు ఉండాలి. మంచి అవకాశం. వదలకూడదు. కాని ధైర్యం చాలలేదు. అంత సమాచారం ఎక్కడినుండి సేకరించాలో తెలీదు. మరికొందరు బ్లాగర్లను అడిగాను. చరసాల ప్రసాద్, నాగరాజుగారు, త్రివిక్రం, వీవెన్,.. వీరంతా నన్ను ప్రోత్సహించారు. మీరు రాయగలరు మొదలెట్టండి. అని కావలసిన వివరాలు ఎలా సేకరించాలో తెలియజేసారు. ఎలాగైతేనేమి వ్యాసం దిగ్విజయంగా పూర్తిచేసాను. స్కూలులో, కాలేజీలో  తప్ప రాతలు అలవాటు లేని నేను బ్లాగు మొదలెట్టిన సంవత్సరంలోగా ఒక ప్రముఖ పత్రికలో కవర్ స్తోరి రాయగలిగాను అంటే నా తోటి బ్లాగర్లు, కుటుంబ సభ్యుల సహకారం ప్రోత్సాహమే కారణం. అదే నన్ను ఇప్పటిదాకా నడిపిస్తుంది.

వంద , ఐదువందలు, వెయ్యి, పదిహేనువందలు ఇలా అందరి ప్రోత్సాహముతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాను. కాని ఈ మధ్యే కాస్త బండి స్లో అయ్యింది. ఎందుకలా?? బ్లాగ్ వయసులో పెద్దరికం వచ్చిందా?? అదేమీ కాదేమో. కాస్త బద్ధకం ఎక్కువైంది. అప్పుడప్పుడు పత్రిక రచనలు కూడా ప్రయత్నిస్తున్నాను. ఇంతకు ముందు వంట, ఇల్లు సర్దుకోవడం, పిల్లలు, , టైం దొరికితే ఇరుగమ్మ పొరుగమ్మలతో సొల్లు కబుర్లు, ఫోన్లో ముచ్చట్లు, లేదా అర్ధరాత్రివరకు చెత్త సీరియళ్లు . ఇవీ నా దైనందిన కార్యక్రమాలు. అవన్నీ మానుకోవడానికి నేను బ్లాగింగ్ మొదలెట్టాను.నా ఖాళీ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాను అని సంతోషంగా ఉంది.  కాని ఈ బ్లాగుల వల్ల నా ఆలోచనా శక్తి పెరిగింది. ఏ విషయమైనా అప్పటికప్పుడే చూసి వదిలేయకుండా , దాని గురించి విశ్లేషించడం అలవాటుగా మారింది. దానిని రాతలో పెట్టి బ్లాగేయడం. ఇంతకుముందైతే ఏ విషయమైనా మాట్లాడటానికి ఎవరూ ఉండేవాళ్లు కాదు. కాని బ్లాగులలో ఐతే నాలా ఆలోచించే, నా రచనలు విశ్లేషించే వాళ్లు ఎంతో మంది.  తప్పులుంటే సరిదిద్దేవాళ్లు . దాని వలన నాకంటూ ఒక శైలి ఏర్పరుచుకోగలిగాను.  

నాకు స్నేహితులు అంటూ ఎవరూ లేరు అని ఎంతో బాధపడుతుండేదాన్ని. కాని ఈ బ్లాగులవల్ల ఎంతో మంది ప్రముఖులు నాకు ఆత్మీయ స్నేహితులు అయ్యారు. నాకంటూ ఒక గుర్తింపు, గౌరవం లభించాయి. ఈ బ్లాగులవల్ల నాకంటే ఎక్కువ ఉపయోగం పొందిన వాళ్లు ఎవరూ లేరేమో ఇప్పటిదాకా. కాని నాకు బ్లాగింగ్ ఒక వ్యాపకమే కాని ఎప్పటికీ వ్యసనం కానివ్వలేదు నా తీరిక సమయంలోనే బ్లాగులు రాస్తున్నాను. నిజానికి ఒక చిన్న కుటుంబంలా ఉన్న ఈ బ్లాగ్లోకం ఇప్పుడు ఒక విశాల ప్రపంచం అయ్యింది అనొచ్చు. కాని  నాకైతే ఒక కుటుంబంలా అనిపిస్తుంది. ఎందరో బ్లాగర్లతో నాకు ఆత్మీయ సంబంధం ఏర్పడింది. అంతా ఒక కుటుంబం లా ఉంటాం. ఈ విషయం చాలా మందికి తలకెక్కదు. పెడర్ధాలు తీస్తారు. అందుకే చాలా రోజులుగా కాస్త మౌనంగానే ఉంటున్నాను.  ఈ బ్లాగుల వల్ల నాకు ఎన్నో విషయాలు అవగతమైనాయి. ముఖ్యంగా మనుష్యుల ప్రవర్తన.


కాని ఈ రెండేళ్లు చాలా సరదాగా గడిచిపోయింది. ఎదో చదివేసాము అన్నట్టు కాకుండా ఎన్నో టపాల మూలంగా  నాకు తెలీని ఎన్నో విశేషాలు తెలిపాయి. కాదేదీ కవితకనర్హం అన్నట్టు కాదేదీ బ్లాగడానికి అనర్హం అన్నట్టుగా ఉంది. పాటలు, ఆటలు, సంగీతం, కవితలు, పద్యాలు, వంటలు, ఘాటైన చర్చలు, రాజకీయాలు, సినిమాలు, ఇలా ప్రతి విషయంలో నిత్యమూ చర్చలే.  బ్లాగడం వల్ల లాభం డబ్బు రూపేనా కాదుగాని అంతకంటే విలువైన అనుబంధం ఏర్పడింది తెలుగు బ్లాగర్లలో . ఇది నిజం అని ఎంతో మంది ఒప్పుకుంటారు. ఇక్కడున్నవాళ్లంతా ఒకే ఉమ్మడి కుటుంబంలా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అలకలు, కోపాలు, తాపాలు. బుజ్జగింపులు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్లని మిగతావారు ఉతికేయడం సర్వసాధారణమైపోయింది. అక్కడక్కడా ఈర్ష్యాసూయలు కనిపిస్తాయి కాని అంతగా పట్టించుకోరు ఎవ్వరూ. వేల మైళ్ల దూరంలో ఉన్నా కూడా చాలామంది చేతికందే దూరంలోనే ఒకరికొకరు అందుబాటులో ఉన్నారు. అందరూ ఉన్నది ఒకే తెలుగు బ్లాగ్‌లోకంలో అని భావిస్తున్నారు. కాదంటారా??   తమ తమ వృత్తులలో, ప్రవృత్తులలో ఎంత బిజీగా ఉన్నా ఈ చిన్ని ప్రపంచంలో అందరిని పలకరిస్తూనే ఉంటారు?? 


ఎవ్వరితో ఎక్కువగా కలవని నాకు  ఈ రోజు ,,, నన్ను ప్రేమించే, గౌరవించే , ప్రోత్సహించే ఆత్మీయ స్నేహితులు ఈ బ్లాగ్  ప్రపంచం ఇచ్చింది. ఈ అదృష్టం నాకు దక్కినందుకు  ఎంతో గర్వంగా ఉంది..   ఎప్పుడైనా దిగులుగా, దిగాలుగా, బోర్‍గా అనిపించినపుడు నా బ్లాగులోని పాత టపాలు, కామెంట్లు తీసి చదువుకుంటాను. అదో తుత్తి. కాని ఖచ్చితంగా అప్పటి జ్ఞాపకాలు మళ్లీ కళ్ల ముందు కదలాడుతాయి. కామెంటినవారందరు కనిపిస్తారు. ..


ఇదే నా బ్లాగ్ ప్రయాణం విశేషాలు. అనుభవాలు, మధురమైన అనుభూతులు.. మార్చుకోలేని అభిప్రాయాలు..


మరో ముఖ్య విషయం.. నేను మరో కొత్త బ్లాగు మొదలెట్టాను. ఫోటొబ్లాగు..  చైత్రరధం.. రాతలు అయ్యాయి.  ఇక చిత్రాల మీద దాడి. ( ఈ మధ్యే కెమెరా కొన్నాలెండి. అదీ బడాయి.)

Friday 3 October 2008

అనుబంధం - అనుమానం


నేను కవితలు, కావ్యాలు రాయలేను, అంతగా అర్ధం చేసుకోలేను.   పురాణగ్రంధాలు చదవలేదు. ఏదో అప్పుడప్పుడు  పౌరాణిక సినిమాలు చూడడం తప్పితే. మనదంతా దిన, వార పత్రికల చదువే. కొద్దిరోజులుగా బ్లాగ్లోకంలో జరుగుతున్నా ఒక చర్చ గురించి నా అభిప్రాయం. ఇది ఒక మామూలు గృహిణిగా నా ఆలోచనలు. తప్పైతే సరిదిద్దండి.
ఇద్దరు మనుష్యుల మధ్య మొదట్లో ఉండేది పరిచయం. కాస్త దగ్గరైతే అది బంధం అవుతుంది. అది స్నేహబంధం, వివాహ బంధం, వ్యాపార బంధం ఏదైనా కావొచ్చు. ప్రాణంలేని వస్తువుల మధ్య ఎటువంటి బంధం ఉండదు.అది అందరికీ తెలుసు. ఒక స్త్రీ, పురుషుడు వివాహంతో ఒక్కటవుతారు. అది ఎప్పటికి విడదీయలేని అనుబంధం అవుతుంది. అది ఒకరిమీద ఒకరికి ప్రేమ,నమ్మకం ఎల్లప్పుడు చెక్కుచెదరకుండా చేస్తుంది. అదే ప్రేమ, నమ్మకంతో వాళ్లిద్దరు  వంశాన్ని విస్తరింపజేస్తారు. ఇది అందరికీ తెలిసిందే..
కాని ఆలుమగల మధ్య  అనురాగం తప్ప అనుమానం అనేది చోటు చేసుకోకూడదు. నేను దేవుడిని మనస్పూర్తిగా నమ్ముతాను. కాని రామాయణంలో భార్యను అనుమానించడం అన్నది నాకు బాధ కలిగించె విషయం. రామాయణంలో రావణవధ అనంతరం రాముడు సీత శీలాన్ని శంకించాడు అని మన మిత్రులు పద్యాల ఉదాహరణలతో చూపించారు. సీతకు పెళ్లి అప్పుడు ఇరవై  ఏళ్లు కూడ ఉండవు. కాని భర్తదే లోకం అనుకుని అతనితో వనవాసానికేగింది. పదమూడేల్లు వనవాసం అనంతరం రావణుడు సీతను మాయోపాయముతో అపహరించాడు. సంవత్సరం తర్వాత రాముడు వానరమూకతో లంకపై దండెత్తి రావణాసురుడిని సంహరించి తన భార్యను చెరనుండి విడిపించాడు. చెరనుండి వచ్చిన సీతను రాముడు అనుమానించాడు. నిన్ను అయోధ్యకు కళంకితలా ఎలా తీసుకువెళ్లాలి అన్నాడు. అంత తల్లి అవమానభారంతో అగ్నిదేవుడిని ఆశ్రయించింది. కాని అగ్నిపునీత గా బయటకు వచ్చింది. దానితో ఆమె కళంకం తొలగి రాముని పత్నిగా అతనితో అయోధ్యకేగింది.
సంధర్భంలో రాముడు సీతావియోగంతో ఎంతో బాధపడ్డాడు, దుఃఖించాడు.  కాని ఆమె శీలాన్ని అనుమానించాడు. దానికి పలు కారణాలు కూడా చూపెట్టడం జరిగింది. ముఖ్యమైనది రాముడికి సీతపై కోపం వచ్చి అలా అన్నాడంటూ సమర్ధన. కాని సీత భర్తతో  బంగారు లేడిని తెచ్చిమ్మని కోరుకోవడం తప్పా? అలా కొరుకోవడం వల్లనే కథంతా జరిగి యుద్ధంలో ఎన్నో వేల మంది మరణించారని రాముడికి కోపం వచ్చిందంట. కాని అసలు ఎన్నడు కనని, వినని బంగారు లేడి ఎలా వచ్చింది ? ఎందుకు వచ్చింది? రావణుడి సోదరి శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఎవరు? దాని వర్యవసానమే కదా సీతాపహరణ. సీత తనంతట తానుగా రావణుడితో వెళ్లలేదు. మరి ఆయమ్మను అనుమానించడం ఎందుకు? అపహరించబడిన తన భార్యను కాపాడుకోవడం ప్రతి భర్త కర్తవ్యం కదా. ఇందులో సీత తప్పు ఎక్కడుంది. అది గాక హనుమంతుడు కూడా సీత ఎటువంటి దీనావస్థలొ ఉందో రాముడికి తెలియజేసాడు. అలాంటి సీతను రావణుడు  ఏమి చేయకుండా వదిలిపెట్టాడంటే రాముడు నమ్మలేదు. రాముడు నమ్మినా లోకం నమ్మదంట. అందువలన  రాముడు , తన భార్యను వేరే ఎవరినైనా వివాహము చేసుకోమని చెప్తాడు మాట విన్న సీత ఎంత బాధపడిందో కదా? ఇలా మాటలతో అవమానించడం  ఎంతవరకు సమంజసము. రాముడు కూడా ఏడాది కాలం సీతకు దూరంగా ఉన్నాడు అలా అని సీత అనుమానించలేదే అతని శీలాన్ని. ఆమె కూడా ఇదే మాట అనలేదే? రాముడు ఏకపత్నీవ్రతుడు అని కలకాలం నిలవాలి కాని సీత మాత్రం కళంకిత అని ముద్ర వేయించుకోవాలా?? సీత తన ఇష్టంతో రాముడిని వదిలి రావణుడితో వెళ్లలేదు. తనను కాపాడటానికి అంతమంది వీరులను చంపమనలేదే? మరి ఇలా ఎందుకు జరిగింది. అందరి ముందు తన శీలాన్ని తన భర్తే శంకిస్తే తల్లి ఎంత విలవిలలాడిందో  ఎవరికైనా ఆలొచన కలిగిందా? భర్తను ప్రేమించే ఒక ఇల్లాలిగా భర్తే శీలాన్ని శంకించడం అంటే ఆడదానికి అంతకంటే అవమానం ఉండదు. నీచమైన అభియోగానికి ఆమె తగలపడిపోవడమే మేలు. ఎవరో బయటివాళ్లు అంటే ఆమె ఎదురుతిరుగుతుంది. లేదా పట్టించుకోదు. కాని కలకాలం తోడుండాల్సిన భర్త అందునా ఇన్నేళ్లు కాపురం చేసిన వాడు తన ప్రవర్తన మంచిది కాదు చెడిపోయింది అంటే ఇల్లాలు భరిస్తుంది. దీని గురించి ఎక్కడైనా వివరించారా?? నాగరాజుగారు చెప్పిన పద్యాలు నేను మొత్తం చదవలేదు. ఇది శరీరానికి తగిలిన దెబ్బ కాదు. మనసుకు తగిలిన కోలుకోలేని గాయంఐనా ఆమె క్షమించి అయోధ్య కేగింది
అయోధ్యలో పట్టాభిషేకం తర్వాత అంతా సుఖంగా ఉన్నారు. సీత గర్భవతి ఐంది. మళ్లీ రాజ్యంలో ఎవడో ఒక చాకలోడు తాగి తన పెళ్లాన్ని కొడుతూ" రాముడు రాజు కాబట్టి పరాయి మొగుడి దగ్గర ఏడాది ఉన్న సీతను తెచ్చుకున్నాడు " అని వాగుతాడు. ఇది తెలిసిన రాముడు నిండు చూలాలు ఐన సీతను కారణం చెప్పకుండా అడవికి పంపాడు. రాముడు రాజ్య ప్రజలకందరికి మార్గదర్శి. అతనికి తనకంటూ వ్యక్తిగత జీవితం ఉండదు. ప్రజల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాలి. సరే మరి తన భార్య సంగతేంటి. ఆమె కూడా రాజ్యంలో ఒక వ్యక్తి కదా. అన్యాయం చేయొచ్చా మరి. ఆమె చేసిన తప్పేంటి? తప్పు చేయని భార్యను అడవులకు పంపొచ్చా. ప్రతి దానికి ఏదో కారణం  ఉంది. అన్నీ పురుషుడికి అనుకూలంగా ఉన్నాయి. మరి సీత బాధ సంగతి ఎవరైనా వివరించారా? తన భార్య సుగుణవతి అని రాముడికి తెలుసు. మరి అది చెప్పి ఆమెను కాపాడడం అతని కర్తవ్యం కాదా ?  ఎవడో ఏదో అన్నాడని ఆమెను వదిలేయడమేనా. మళ్ళీ బాధపడ్డమెందుకు?? రాముడు కూడా తన భార్యను అమితంగా ప్రేమించాడు. సరే. మధ్యలో అనుమానం ఎందుకు.
అలనాటి రాముడే కాదు ఈనాడు కూడా ఎంతో మంది భార్యాభర్తలు అనుమానంతో తమ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సినవాళ్లు ఇలా అనుమానంతో  మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు. దాంపత్యం అంటే ఒకరి మీద ఒకరికి అనురాగం, ప్రేమ , నమ్మకము ఉండాలి. తల్లితండ్రులు, పిల్లలు ఎప్పుడు తోడుండరు. చివరిదాకా తోడుండేది భార్యభర్తలే . అలాంటపుడు అనుమానం ఎంత నీచమైనదిమగాడు తప్పు చేస్తె ఊరందరికి తెలుస్తుంది.కాని ఆడది తన పక్కనున్న మొగుడికి కూడా తెలియకుండా తప్పు చెయగలదు తలుచుకుంటే అని అంటారు . కాని అలా చేయదు. ఒక అపరిచిత వ్యక్తిని పెళ్ళి చేసుకుని ఆతని జీవన సహచర్యం కోసం తన వారినందరిని వదిలి అతనితో ఉండాలని వస్తుంది ఆడది. భర్త ఆమె ప్రవర్తన మంచిది కాదు అంటే ఆమెకు ఎంత బాధ కలుగుతుందో అది మగవాళ్లకి అర్ధం కాదు. గాయం మానేది కాదు. ప్రతి క్షణం అనుమానించే మొగుడితో కాపురం నరకంగా ఉంటుంది ఇల్లాలికిఅదే భార్య అనుమానిస్తే భర్త కోపంతో చేయిచేసుకోవచ్చు. తిట్టొచ్చు, లేదా నిజంగానే అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. ఏమంటే మొగాడు ఏది చేసినా చెల్లుతుంది అంటారు. కాని ఆడది అలా చెయలేదే. పిల్లలు, కుటుంబం , బంధువులు ఇలా అందరి గురించి ఆలోచించి విషయంలో గొడవ చేయదు. ఐనా ఇది పదిమందితో చెప్పుకుని చర్చించే  విషయమా? కాని భర్త తన భార్యను అనుమానించడమంటే తనను తాను అనుమానించుకోవడమే. అంత కంటే పెద్ద అవమానం ఉండదు
నేను స్తీవాదిని కాను, పురుషవాదిని కాను. అన్యాయం జరుగుతుంటే సహించలేను అంతేనేను చెప్పిన విషయాలు వాస్తవంగా చూసిన సంఘటనలే. మొగుడిని అనుమానించి అతని జీవితం నరకం చేసి , పోలీసు కేసు కూడా పెట్టిన మహా ఇల్లాలు ఉంది. పెళ్లయిన ఎన్నో ఏళ్లకు భర్త అనుమానించిడంతో  మానసికంగా కృంగిపోయి చావును కోరుకుంటున్న ఇల్లాలు ఉందిపెళ్లాం అంటే అది నా ఆస్థిలాంటిది,  ఏమైనా చెయొచ్చు , ఏమైనా అనొచ్చు అనే మగాళ్లుంతవరకు రోగం తగ్గదేమో.
అలా అని అందరూ మగాళ్లు ఇలా లేరు

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008