Saturday, October 31, 2009

మనసు + ఆప్యాయత = వంట - వడ్డన






భర్త పిల్లలు ఆఫీసులకు వెళ్లిపోయారు. పక్కింటి రజని వచ్చింది. "అక్కయ్యా!! వంట అయ్యిందా?" బామ్మగారు కూడా పలకరించారు. "అమ్మాయ్! భోజనం అయిందా?ఇవాళేం చేసావు??ఇలాంటి సంభాషణలు మామూలే కదా. ఎవరినైన పలకరించినప్పుడు ఆయా సమయాలను బట్టి ముందుగా అడిగేది తిన్నారా? ఇవాళేంటి స్పెషల్? అని. "ఆడవాళ్లకు వంట తప్ప వేరే ముచ్చట్లే ఉండవా??"

వంట చేయడమనేది మన సంస్కృతి స్త్రీకి లభించిన ఒక గొప్ప వరం. అగ్నిముందే నిలబడి వంట చేయడం ఒక యజ్ఞం లాంటిది.. ఇంట్లోవాళ్లందరి ఆరోగ్యం, అభిరుచి తెలుసుకుని వాటిని దృష్టిలో ఉంచుకొని వంట చేసి వడ్డించి ఆకలి తీర్చడమే కాక సంతృప్తిగా కడుపు నింపడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకే తృప్తిగా భోజనం చేసిన తర్వాత అనుకోకుండా మనసులో వచ్చే మాట "అన్నదాతా సుఖీభవ"

కాని నిజం చెప్పాలంటే వంట చేయడం ఒక గొప్ప కళ. ఏదో బ్రతకడానికి తినక తప్పదు కాబట్టి వండుకోక తప్పదు అన్నట్టు ఆదరాబాదరా కుక్కర్ పెట్టి, కూరలు తరిగి పోపులో పడేసి వంటింట్లో శతసహస్రావధానం చేసినట్టుగా మారిపోయింది నేటి జీవితం. ఏమంటే అందరూ సమయానికి సమానంగా చదువులు,ఉద్యోగాలకు పరిగెత్తక తప్పడంలేదు. ఒకోసారి రెండురోజుల కొకసారి, వారంకోసారి కూరలు వండి ఫ్రిజ్ లో పెట్టుకుని రోజుకొకటి వేడిచేసుకుని తినేవాళ్లు కూడా ఉన్నారు. సాంకేతిక, మర యంత్రాలతో పాటు పనిచేస్తూ మనిషి జీవితం కూడా యాంత్రికంగా మారిపోతుంది. పూర్వం అంటే మా అమ్మమ్మ,నానమ్మ, అమ్మ చెప్పిన మాటలు, చూసిన సంఘతనలు మనసులో కదిలి ఈ వ్యాసానికి ప్రేరణ కలిగించాయి.

ఆ రోజుల్లో గ్యాసు పొయ్యిలు, కరెంట్ పొయ్యిలు ఎక్కడివి. కట్టెలు, బొగ్గులు లేదా ఊకతో చేసే పొయ్యిల మీద వంట చేసేవారు. కళాయి పూసిన ఇత్తడి పాత్రలు.(ఇపుడు ఇత్తడి అంటే ఇరవై ఆమడలు పారిపోతున్నారు అతివలు). వంటిల్లు మట్టి గోడలతో ఉండేది. రోజు రాత్రి పడుకునే ముందు వంటిల్లు శుభ్రం చేసి పొయ్యిలో బూడిద అంతా తీసేసి పడుకునేవాళ్లు . ప్రతి గురువారం రాత్రి పేడతో గోడలు అలికి ముగ్గులుపెట్టి శుక్రవారం ప్రత్యేకంగా వంట ప్రారంభించేవాళ్లు. ( మా అమ్మమ్మ ఇంట్లో ఇది చూస్తుంటే ఎప్పుడు వింతగానే ఉండేది) ఇప్పట్లా భోజనాలు బెడ్ రూముల్లో, టీవీ చూస్తూనో తినేవాళ్లు కాదు. వంటింట్లో కాని మరో గదిలొ కాని విస్తరాకులు లేదా అరిటాకులు వేసి నేలమీదే వరుసలో కూర్చుని తినేవాళ్లు మగవాళ్లైనా, ఆడవాళ్లైనా. అప్పుడే కష్టసుఖాలు మాట్లాడుకునేది. అమ్మ పెద్ద పల్లెంలో అన్నం పెట్టి వేడి వేడి నెయ్యి వేస్తూ, పిల్లలందరినీ చుట్టూ కూర్చోబేట్టి పప్పన్నం, చారన్నం, కూరన్నం చివరలో పెరుగన్నం అంటూ ముద్దలు కలిపి పెట్టేది. చిన్నపిల్లలకైతే నోట్లో , పెద్దపిల్లలకైతే చేటిలో పెట్టేది. ఇలా తింటూనే కథలు కూడా చెప్పేది కదా.. గుర్తుందా ..పోటీ పడుతూ తినేసి పిల్లలు ఆటలకు పరిగెత్తేవాళ్లు . ఇప్పట్లా తినడానికి అస్సలు సతాయించలేదమ్మా పిల్లలు. ఫ్రిజ్ లేదు కాబట్టి రోజు రోజు వండుకోవాల్సిందే. తాజా, నిల్వ పచ్చళ్లు, ఊరగాయలు, అప్పడాలు. పండగలొస్తే తప్పనిసరిగా చేసే పులిహోర, పాయసం. ప్రతీ పండక్కీ వేర్వేరు రకాల పిండి వంటలు, ప్రసాదాలు.

తినేటప్పుడు కూడా కొన్ని నిబంధనలు ఉండేవి. ఏదైనా చెప్పగానే ఎందుకు అని ఎదురు మాట్లాడకుండా పాటించేవాళ్లు అందరూ. భోజనం చేసేటప్పుడు ఎడమచేతిని నేలపై ఉంచడం తప్పు. కంచాన్ని చేతిలో పట్టుకుని తినడం కూడా తప్పని చెప్పేవారు. ఎడమచేత్తో తినే పదార్థాలను తాకడం అనాచారమని చెప్పేవారు పెద్దలు. తినేటప్పుడు తుమ్మొద్దు. తుమ్ము వస్తే పళ్లెం క్రింద కొన్ని నీళ్లుపోయాలి అనేది ఒక నియమం. అలాగే విస్తరాకులో కాని అరిటాకులో కాని వడ్డించేటప్పుడు ప్రతి పదార్థాన్ని ఒక వరుస క్రమంలో వడ్డించాలి. పచ్చడి నుండి మొదలెట్టి చివరగా అన్నం, నెయ్యి వడ్డించేవారు. అన్ని పదార్థాలు వడ్డించేవరకు ఎవ్వరూ భోజనం మొదలెట్టకూడదు.అలాగే భోజనం ఐపోయాక కొంపలు మునిగిపోయినట్టు లేచి వెళ్లిపోకూడదు. మరి కొందరు తినేవరకు కూర్చోవాలి. ఇది ఒక క్రమశిక్షణ లాంటిది.

వంట చేయడం మాత్రమే కాదు వడ్డించడం కూడా చాలా ముఖ్యం. స్థిమితంగా కూర్చుని ఒకరు వడ్డిస్తే భోంచేయడంలో తేడా ఉంటుంది. వడ్డించేవారు ఆప్యాయతతో, ప్రేమతో కావలసినంత వడ్డించడం, మరి కొంచం వేసుకోండి పర్లేదు అని మారు వడ్డన చేయడం ఒక ప్రత్యేకమైన కళ, ఇంత ఆప్యాయంగా వడ్డిస్తే ఎంత మొహమాటస్తుడైన మరికొంచం వడ్డించుకోక తప్పదు. అలాగే వడ్డించేటప్పుడు అవతలి వ్యక్తి ఎవరు, ఏమిటి, అతని హోదా , దర్జా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వడ్డించడం మహాపాపం. ప్రతి వారికి సమానంగా వడ్డించడం అనేది చాలా ముఖ్యమైన విషయం.

సహజ సిద్ధంగా ఓర్పు, సున్నితత్వం, లాలన లాంటి లక్షణాలు కలిగిన స్త్రీయే ఇందుకు సమర్ధురాలని తలచే పెద్దలు ఈ మహత్తరమైన బాధ్యతని అప్పగించారేమో. అన్నం ప్రాణుల జీవాధారం. కోటి విద్యలు కూటి కొరకే. ఆనాటినుండి ఈనాటి వరకు ఏ మనిషైనా పొద్దుటినుండి రాత్రి వరకు గానుగెద్దులా కష్టపడేది పట్టెడన్నం కోసమే కదా. ..


ఇక అసలు విషయానికి వస్తే..కార్తీకమాస సందర్భంగా వనభోజనాలు నిర్వహించడం సాధారణం కదా.. అది మనం ఎందుకు చేయకూడదు. ఇక్కడే బ్లాగ్వనంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకుందామా.. వచ్చే సోమవారం పవిత్రమైన కార్తీక పౌర్ణమి. ఇక్కడే బ్లాగుల్లో వన భోజనాలు ఏర్పాటు చేయడమైనది. ఎవరి బ్లాగు వాళ్లకు ఇల్లులాంటిది కదా.సో మీకు వచ్చిన, నచ్చిన వంటకం (శాకాహారం మాత్రమె ) రాసి , ఫోటో పెట్టి ప్రచురించండి. ఫోటో మీదైనా సరే, గూగులమ్మని అడిగినా సరే .. మాకు వంట రాదు ఎలా అంటారా??తింటారు కదా. మీకు నచ్చిన వంటకం ఫోటోతో ప్రచురించండి. షడ్రుచులు ఉందిగా..

సోమవారం మర్చిపోవద్దు. ఇందులో పాల్గొనడానికి కొత్త, పాట, ఆడ, మగ అని తేడా లేదు.. అందరూ ఆహ్వానితులే.. రంగంలో దూకండి మరి..

13 వ్యాఖ్యలు:

శ్రీనివాస్

ఇందాక చానెల్ మారుస్తున్నప్పుడు ఏ.బి.యెన్ . ఆంధ్రజ్యోతి లో మీరు కనిపించారు. ఏదో మాంచి వంటకమే చేసినట్టున్నారు?నేను చూసేసరికి ప్రోగ్రాం చివరలో ఉంది మరి

సుభద్ర

ok sare nenu ready jyothi gaariki,jyothigaari blog ki vachchinavaari amdaki idE naa ahvanam maa blog imtiki somavaaram tappaka ramdi..

జ్యోతి

అవును శీను..రెండు వంటకాలు మాంసాహారమే.మాంసం పప్పు, చికెన్ నూడుల్స్. అవి ఎలా చేయాలంటే షడ్రుచులు సైట్ చూడాల్సిందే మరి. :)

సుభద్ర,, ఎంచక్కా తెలుగులో ఆహ్వానించొచ్చుగా...

సుభద్ర

సరే!!!మీరు చెపితే నేను కాద౦టానా!!!!
జ్యొతిగార్కి,
జ్యొతిగారి బ్లాగ్ చూడటానికి వచ్చే బ్లాగ్ మిత్రులకి,
ఇదే మా ఆహ్వనము.మీర౦తా సోమవార౦ అనగా రె౦డవ తేది బ౦దు,మిత్ర,కుటు౦బ సపరివార౦ గా మా బ్లాగి౦టికి విచ్చేయ౦డి.

సుజాత

బ్లాగులో రాసుకునేంత గొప్పగా వంట రాదండీ నాకు! ఏదో, రోజ్ కా ఖానా....ఓకే! అందుకే ఈ వన భోజనాలకు మీరంతా వెరైటీ వంటలు పట్టుకురండి, నేనొక ఇరవై లీటర్ల బిస్లరీ మినరల్ వాటర్ డబ్బా పట్టుకొస్తాను! వస్తున్నా....వడ్డించెయ్యండి!

జ్యోతి

ఇక్కడెవ్వరూ వంటల పోటీలు పెట్టడంలేదండి సుజాతగారు, రోజు చేసుకునే వంటకాలే. బ్లాగుల్లో పెట్టాలంటే గొప్పగా ఉండాలా??తినేట్టు ఉంటే చాలదూ. నీళ్ల డబ్బాతో పాటు తినడానికి ఏర్పాట్లు చేయండి..

Mauli

మనసు + ఆప్యాయత = వంట - వడ్డన
మనసు +ఆప్యాయత +వడ్డన= వంట

ante vaddana lekunda adi vanta anipinchukodu ani bhalega chepparu . nizame anipinchela undi :)



idi

sunita

అలాగే! కానీ మింగుడు తప్ప గొప్పగా వండటం రాదు నాకు, మరి వంటకం చూసి బెదిరిపోతారేమో?

జ్యోతి

sunita,,

మళ్లీ చెప్తున్నా. ఇది పోటీ కాదు.

జయ

జ్యొతి గారు, నేనైతే వనభోజనానికి వంటకంతో రెడీ...కాకాపోతే నేను చేసింది మీరందరు తినాలి, మీరు చేసింది నేను తింటానంట....సరేనా!

ఉష

మాకైతే ఏదైనా కవితగానే వినిపించటం అలవాటు మరి!!! ;)

జ్యోతి

జయ,
రెడీ...సంగీతం కూడా పెట్టండి

ఉష.

అంతకంటేనా.. కానీ మరి

రవి

ఈ టపా చదువుతుంటే మా అమ్మ గుర్తొచ్చింది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008