Tuesday 31 January 2012

తండ్రి లాలన - పిల్లలకు వరం

ప్రేమ అనగానే ఆడవాళ్ళూ, అమ్మలే గుర్తొస్తారు. కాని కూతురు మీద నాన్నకి అమితమైన ప్రేమ ఉంటుంది కాని అది పైకి కనపడనివ్వడు అని గతంలో కూడా చెప్పాను కదా.. మరి కొన్ని భావాలు. నాలో తనని తాను చూసుకుంటూ నా అభివృద్దిని చూసి ఆశ్చర్యపోతూ, ఆనందపడుతూ గర్విస్తున్న మా నాన్నకు, పెళ్ళయ్యాక కూడా కూతురు మీద బెంగ పెట్టుకుని ఎలా ఉందో అని రోజూ గుర్తు చేసుకునే మావారికి ఈ వ్యాసం అంకితం. పది రోజుల్లో ౭౦ ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న మా నాన్నకు ఇంతకంటే మంచి బహుమతి ఇవ్వలేనేమో..

హాపీ బర్త్ డే నాన్న..

నాలోని పట్టుదల,మొండితనం. క్రమశిక్షణ, పాత పాటల మీద అభిమానం అన్నీ నాన్న నుండి వచ్చినవే..




తండ్రి లాలన పిల్లలకు వరం


ప్రేమ
.. ఒక మంత్రం. ఒక అద్భుతం. వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పెంచి దృఢపరిచేదే ప్రేమే. అది లేనివాడు రాక్షసుడు, శూన్యం లాంటివాడు. ప్రేమ అనేది ఒక వ్యక్తి మీద కావొచ్చు, ఒక వస్తువు మీద కావొచ్చు. ఒక పనిమీద కావొచ్చు.. తనను తాను ప్రేమించేవాడు అందరినీ ప్రేమిస్తాడు అని నానుడి. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తీకరించడం కూడా ఒక కళే. తల్లిదండ్రులను, భార్యాభర్తలను, స్నేహితులను ఒక్కటిగా చేసేది, కలిపి ఉంచేది ప్రేమే. వివాహ బంధంతో ఒక్కటైన స్ర్తిపురుషులు ప్రేమతో తమదైన లోకాన్ని సృష్టించుకుంటారు. వారి ప్రేమకు ప్రతిఫలమే పిల్లలు.



పిల్లలను తల్లి మాత్రమే ఎక్కువ ప్రేమిస్తుంది. తండ్రికి ప్రేమించడం తెలీదు అనుకుంటారు.. కాని తండ్రి కూడా తన పిల్లలను అమితంగా ప్రేమిస్తాడు. కాని అతను బయటకు చెప్పలేడు.. పిల్లల మీద తల్లిదండ్రులకు ఒకేవిధమైన ప్రేముంటుంది కాని వ్యక్తీకరణలోనే కాస్త తేడా ఉంటుంది. కుటుంబంలో తండ్రి బాధ్యత బయటకు వెళ్లి సంపాదించి, తన కుటుంబాన్ని పోషిస్తే తల్లి ఇల్లు, పిల్లల బాధ్యత తీసుకుంటుంది. అందుకే పిల్లలకు తల్లి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. తల్లితండ్రులు, పిల్లల గురించి చెప్పుకుంటే.. సాధారణంగా అందరూ అనుకునే మాటే కొడుకు తల్లి పోలిక, కూతురు తండ్రి పోలిక అని. అలాగే తండ్రికి కొడుకు కంటే కూతురి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది అంటారు.. ఇది నిజమే.. కొడుకు అనగానే వాడు చదువుకుని, సంపాదించి కుటుంబాన్ని చూసుకోవాల్సిన వంశోద్ధారకుడు.. మగాడు వాడి గురించి దిగులు పడాల్సిన పనిలేదు అనుకుంటాడు తండ్రి. కాని కూతురు అనగానే ఎన్నో భయాలు, జాగ్రత్తలు. తన కన్నబిడ్డలో తన కన్న తల్లిని, ఆ జగన్మాతను చూసుకుంటాడు. అల్లారుముద్దుగా అడిగినవన్నీ కొనిస్తాడు. ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళే ఆ చిన్నారిని అపురూపంగా పెంచుకుంటాడు. పిల్లలందరినీ సమానంగా ప్రేమించినా తండ్రికి కూతురిమీద ప్రేమ రవ్వంత ఎక్కువే. అల్లారుముద్దుగా పెంచి, పెద్ద చేసి చదువుచెప్పించడంతోపాటు ఆమెకు తగిన వరుడిని వెతికి పెళ్లిచేయడం అనేది తండ్రి బాధ్యతే కదా.



తన కూతురికి దొరికే అబ్బాయి ఎలాంటివాడో, ఆమెకు ఎటువంటి కష్టం కలగకుండా ప్రేమగా చూసుకుంటాడో లేదో, అడిగినవన్నీ ఇస్తాడో లేదో అనే బెంగ నిరంతరమూ వేధిస్తుంది. కూతురు చిన్నగా ఉన్నప్పటికనుండే ఆమె పెళ్ళి గురించి డబ్బులు వెనకేస్తాడు. అత్తవారింట్లో తన కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాని ఈ ఆలోచనలన్నీ అతని మనసులోనే నిక్షిప్తమై ఉంటాయి. బయటకు చెప్పుకోడు, చర్చించడు. అప్పుడప్పుడు భార్యతో మాత్రం తన భావాలను పంచుకుంటాడు. తన కూతురిని ఎప్పటికీ కంటికిరెప్పలా చూసుకోలేడు కాబట్టి తనలా ప్రేమించి, కాపాడుకునే భర్తను ఆమె కోసం వెతికి తీసుకొస్తాడు. ఒకవేళ కూతురు ఎవరినైనా ప్రేమించానని చెప్పినా ఇవే అనుమానాలు. ఆ అనుమానాలు తీర్చుకునేదాకా పెళ్లికి ఒప్పుకోడు.



ప్రతి తండ్రి తన కూతురిని తన కంటే ఎక్కువ హోదాలో ఉండి తన బిడ్డకు ఎటువంటి లోటురాకుండా, ప్రేమగా చూసుకునేవాడు భర్తగా రావాలని కోరుకుంటాడు. ఈనాడు చాలామంది ఆస్తి, అంతస్థులకంటే కుటుంబ మర్యాద, చదువు, ఈడుజోడు ఉంటే చాలు తమ పిల్లనివ్వడానికి సరేనం టున్నారు. దీనికోసం తమ తాహతుకు మించిన కట్నం ఇవ్వడానికి కూడా వెనుకాడడంలేదు.



తండ్రీ కూతుళ్ళమధ్య అనుబంధం చెప్పాలంటే ఆ భావాలు భాషకు అతీతం. ముఖ్యంగా తన కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టి కాపురానికి పంపుతున్నపుడు ఆ బాధ అనిర్వచనీయం. శకుంతలను అత్తవారింటికి పంపిస్తున్నపుడు కణ్వమహర్షి ఒక మాట అంటాడు. 34కేవలం పెంచిన తండ్రిని నాకే అమ్మాయి బయటకు వెళుతోందంటే ఇంత బాధగా వుందే.. మరింక కన్న తండ్రి బాధను ఎవరు చెప్పగలరు?-అని. ఆ అత్తవారిల్లు ఎలాంటిదో తెలుసుకుందుకు ఆ తండ్రి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాడో విక్రమ్‌సేథ్ రాసిన 3‘ద సూటబుల్ బాయ్’2కథ2 చదివితే తెలుస్తుంది. మనవాళ్ళు లోకరీతిలో ఒక మాట చెపుతూంటారు. 34్భర్యాభర్తలిద్దరూ ఒకరిమాట ఒకరు ఎప్పుడైనా వింటారా?2అనడిగితే... ఎందుకు వినరు? ఇల్లు కట్టేటపుడు భార్య మాట భర్త, పిల్లకి పెళ్లిచేసేటపుడు భర్త మాట భార్య వింటుంది2అని. అంటే దీని అర్థమేమిటంటే ఇల్లు ఎలా ఉండాలో ఇల్లాలికి తెలుస్తుంది, రాబోయే అల్లుడు ఎలా ఉండాలో తండ్రికి తెలుస్తుంది.. అని. అందుకని ప్రేమైకమూర్తి అయిన తండ్రికి కూతురి పెళ్లి బాధ్యత నిస్సంకోచంగా అప్పచెప్పెయ్యవచ్చు. ఎంత అభివృద్ధి చెందినా అత్తవారింట జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలు మాత్రం తగ్గలేదు. ఇంకా కట్నం చావులు ఆగలేదు. అందుకే తన శక్తికి మించినదైనా అడిగినంత కట్నం ఇచ్చి పెళ్ళిచేయాలని ప్రతీ తండ్రీ కోరుకుంటున్నాడు. తర్వాత తను ఎన్ని కష్టాలు పడ్డా తన బిడ్డ సుఖంగా ఉంటే చాలనుకుంటాడు. కానీ కొందరు తండ్రులు మాత్రమే తమ కూతుళ్ళను సున్నిత మనస్కులుగా కాకుండా ధైర్యంగా, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేలా ఉండాలని, ఎప్పుడుకూడా బేల కాకూడని చెబుతుంటారు.
కాలంతో పాటు ఈనాడు తండ్రులు కూడా మారుతున్నారు అని చెప్పవచ్చు. కుటుంబ నిర్వహణకు తనకు తోడుగా భార్య కూడా సాయపడుతున్నపుడు తానెందుకు ఆమెకు సాయపడకూడదు అని పిల్లల బాధ్యత, పెంపకం గురించి చిన్నప్పటినుంచే తండ్రి తెలుసుకుంటున్నాడు. వాళ్ళకు తినిపించడం నుండి చదివించడం, ఆడించడం అన్నీ చేస్తున్నాడు. పిల్లల పొరపాట్లను సరిదిద్దటంలో కూడా తల్లి గారాబం, మెతకతనం చూపిస్తుంది. అదే, తండ్రి విషయానికి వస్తేవారి మాటలు, చర్యలు దృఢంగా ఉంటాయి. తండ్రి మాటలు, చేతలలో స్థిరత్వం, మందలింపులో కఠినత్వంతోపాటు అనురాగం కూడా ఉంటాయి. తండ్రి పిల్లలకు మమతతో పాటు, క్రమశిక్షణనూ నేర్పిస్తాడు. పిల్లలు స్కూలుకు వెళ్లకుండా ఎగ్గొట్టటానికి అనేక కారణాలు చెప్తున్నపుడు తల్లి మెత్తబడవచ్చు కానీ, తండ్రి నిర్ణయంలో మార్పు రాదు. తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లల బాగుకోరేవారే అయినప్పటికీ తండ్రి పిల్లలతో వ్యవహరించే తీరు, తల్లి పెంపకానికి భిన్నంగా ఉంటుంది. పిల్లల విషయంలో తండ్రి మెత్తపడడు, రాజీ ధోరణిని అవలంభించడు. అందుకే చాలామంది పిల్లలు తండ్రితో మాట్లాడటానికి జంకుతారు. అమ్మకు చెప్పి అడిగిస్తారు. ఇది భయంతో కూడిన గౌరవం. తండ్రి గారాబం చేసినా, తప్పు చేస్తే మన్నించడని పిల్లలు జాగ్రత్త వహిస్తారు. తండ్రితో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ, తండ్రి మాటలకు ప్రభావితులై తమ ప్రవర్తనను తామే సరిదిద్దుకోగలుగుతారు.



పూర్వకాలంలో ఆడపిల్లకు చాకలి పద్దులు రాసేంత చదువు వస్తే చాలు, ఎంత చదివినా ఆడపిల్ల వంటింట్లోనే మగ్గిపోవాల్సిందే కదా అని పెద్ద చదువులు చదివించలేదు. కాని నేడు కూతురు, కొడుకు అనే తేడా లేకుండా చదివిస్తున్నారు. తన కూతురు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగస్థురాలు కావాలి, అందరిలో పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నారు తల్లితండ్రులు. కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేయడం కంటే అదే డబ్బుతో ఆమెను పెద్ద చదువులు చదివించి ప్రయోజకురాలిని చేసి ఉన్నత స్థానంలో ఉండేలా చేయాలనుకుంటున్నాడు తండ్రి. అమ్మాయిలు కూడా ఎందులోనూ తక్కువ కారు. ఎవరి మీదా ఆధారపడకూడదు, తన కాళ్ళమీద తాను నిలబడి ఒక మంచి పదవిలో ఉండాలని కోరుకుంటున్నాడు తండ్రి. కొడుకు ప్రయోజకుడై తమను ఆదుకుంటాడు అని అనుకోవడంతోపాటు కూతురు ప్రయోజకురాలై తనను, తన కుటుంబాన్ని చూసుకుంటుంది అని అనుకుంటున్నారు. ప్రతి తండ్రికి తన కొడుకులు, కూతుళ్లు ఇద్దరిపై సమానమైన ప్రేమ ఉంటుంది. కాని కూతురిమీద మమకారం ఎక్కువే.



తన ఆడబిడ్డ తన ఇంటి మహాలక్ష్మి నా తల్లి అని చెప్పుకుంటాడు తండ్రి. బంగారం, అమ్మ... అనే చెప్పుకుంటాడు. అనుక్షణం ఆమెకు తోడుగా ఉండాలని కోరుకుంటాడు. ఈ మధ్యే విజయవాడలో నాగవైష్ణవి అనే చిన్నారి దారుణంగా హత్యకు గురైనపుడు అంతులేని విషాదానికి లోనై ఆమె తండ్రి ప్రభాకర్ గుండె పగిలి కూతురితో పాటు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఇక, పెళ్ళై మరో ఇంటికి వెళ్లిపోయినా కూతురిమీద బెంగగానే ఉంటుంది తండ్రికి. ఎలా ఉందో, అత్తవారింట ఆమె అడిగినవన్నీ ఇస్తున్నారో లేదో, ఆమెను ఏ కష్టమూ రాకుండా చూసుకుంటారో లేదో అన్న బెంగ అతడ్ని సతాయిస్తూనే ఉంటుంది. అంతా బావుంటే ఫర్లేదు కానీ అత్తారింట కష్టాలు పడుతున్న కూతురి గురించి తెలిస్తే ఆ తండ్రి గుండె పగిలిపోతుంది. ఎటువంటి బాధలైనా మహిళ బయటకు చెప్పుకుని బిగ్గరగా ఏడ్చి తన భారాన్ని దింపుకుంటుంది కాని మగవాడు ఏడ్వకూడదు అంటారు కదా. ఆ మనోవేదన తన గుండెల్లో రగులుతుండగా దుఃఖాన్ని దాచుకుని కుమిలిపోతాడు తండ్రి.. అలా అని తండ్రులందరూ మంచివారే అనలేము. కుమార్తెల పట్ల అసహజంగా ప్రవర్తించే తండ్రులూ అక్కడక్కడ ఉన్నారు. వేరే కులంవాడిని ప్రేమించిందని సొంత కూతురిని అంతం చేసిన తండ్రులూ ఉన్నారు. కట్నం ఇవ్వాలి, ఖర్చుపెట్టాలి గనుక ఆడపిల్లల్నే వద్దనుకునేవారు ఇంకా మన సమాజంలో ఉన్నారు. వంశోద్ధారకుడిని చదివించి తన కష్టార్జితాన్ని రాసిచ్చినా జీవితపు చరమాంకంలో వృద్ధాశ్రమంలో పడేసి, లేదా ఇంటినుండి తన్ని తగలేసే కొడుకులు కోకొల్లలు మన దేశంలో. అత్తారింట తనకు అధికారం లేకున్నా తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉండేది కూతురే కదా. అందుకే అన్నారు కంటే కూతుర్నే కను అని.



కవులు కూడా తమ రచనలను కన్నకూతురిలా భావించి, కాసులకు ఆశించి మహరాజులకు అంకితమీయకుండా సాక్షాత్తూ ఆ దేవదేవుడికే అంకితమిచ్చారు. పోతన తన భాగవత మహాకావ్యాన్ని శ్రీ మహావిష్ణువుకు అంకితమిస్తూ ఇలా అన్నాడు.



ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుః గొన్ని పుచ్చుకుని చొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరాజొకఃడు భాగవతంబు జగద్దితంబుగన్



అధములైన రాజులకు అంకితమిచ్చి వారిచే పురములు, వాహనములు, సొమ్ములు పుచ్చుకుని తదనంతరం కష్టాలు పడడం ఇష్టంలేక నా భాగవతాన్ని మనస్ఫూర్తిగా ఆ శ్రీహరికే అంకితమిస్తున్నాను. అంతకంటే గొప్పవాడైన కృతికర్త ఉండునా? - అని పోతన తన భావాన్ని తెలిపాడు.



Thursday 19 January 2012

అల్లసాని వారి అద్భుత వృత్తమాలిక


శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాధీశుడు. ఈయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండడమే కాక సాహిత్యానికి కూడా పెద్ద పీట వేయబడింది.ఈయన ఆంధ్రభోజుని గా మరియు కన్నడరాజ్య రమారమణగా కీర్తించబడ్డాడు. రాయలు స్వయంగా కవి, పండితుడు కూడా. అతను స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయలుకు సాహితీ సమరాంగన సార్వభౌముడు అనే బిరుదు కలిగినవాడు కూడా. రాయల ఆస్థానానికి భువన విజయం అనే పేరుంది. ఈ భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది కవులు ఉన్నారు. వారు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధి పొందారు. వీరందరిలో రాయలు ఆస్థానకవి, ఆంతరంగికుడుగా మసలిన అల్లసాని పెద్దన ఆంధ్రకవితా పితామహునిగా పేరు పొందాడు. భువన విజయంలో ఇతనికి జరిగినన్ని మర్యాదలు, సత్కారాలు మరే కవికి దక్కలేదన్నది సత్యం.

ఒకనాడు రాయలు భువనవిజయంలో బంగారు పళ్లెంలో పెట్టిన గండపెండేరాన్ని తెప్పించి సంస్కృతాంధ్రాలలో సమానంగా కవిత్వం చెప్పగలిగే వారు ఉంటే వచ్చి అందుకోమని చెప్పాడు. సభలో కవులందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు రాయలు ఆశ్చర్యంగా

ఉ. ముద్దుగ గండపెండెరమున్ గొనుడంచు బహూకరింపగ
నొద్దిక "నాకొసంగు"మని యొక్కరుఁ గోరగలేరు లేరొకో?"

నేను సంతోషంగా ఈ గండపెండేరాన్ని బహుమతిగా ఇస్తాను అంటే ఒక్కరు కూడా నాకివ్వమని అని కోరడం లేదు ఎందుకో?

అప్పుడు పెద్దన లేచి

పెద్దన బోలు పండితులు పృధ్విని లేరని నెవెఱుంగవే?
పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా!

రాజా! ఈ భూమండలంలో ఈ పెద్దన కంటే గొప్ప పండితుడు లేరని నీకు తెలీదా? నాకు ఇవ్వదలచిన వెంటనే ఇవ్వు అని అన్నాడు పెద్దన. తన పాండిత్యం మీద ఆయనకంత నమ్మకం మరి..

వెంటనే తన పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి సంస్కృత, ఆంధ్రములో ఆశువుగా పెద్దన యీ ఉత్పలమాలిక చెప్పాడు. ఇది మామూలుగా నాలుగు పాదాలతో ఉండే వృత్తం కాదు. వృత్త మాలిక. అంటే అదే వృత్తం ప్రాసని భావాన్ని విడకుండా నిరాఘాటంగా అది వృత్తమాలిక అనబడుతుంది. కవికి భావావేశంలో అతడు చెప్పే వృత్తం ఆగకుండా నిరర్గళంగా సాగిపోతుందన్నమాట. అసలు, కవిత్వమంటే ఎలా ఉండాలో కవితాత్మకంగా శబ్దార్థాల మేలికలయికతో యిందులో చెప్పబడింది. ఈ పద్యానికి అర్థం చెప్పుకోవాలంటే కొంత శ్రమపడాలి. దీనికి వేల్చేరు నారాయణరావుగారు చేసిన ఆంగ్ల అనువాదం ఇక్కడ చూడవచ్చు: ఈ అద్భుత పద్యం యొక్క శ్రవ్యకాన్ని ఇక్కడ వినొచ్చు.. ఒళ్ళు గగుర్పొడించే ఈ వృత్తమాలిక వినగానే శ్రీకృష్ణదేవరాయలు లేచి వచ్చి స్వయంగా తానే పెద్దన కాలికి గండపెండేరం తొడిగాడు.





పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా


కైతలు? జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్


రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని


ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్


బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ


కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్


జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే


ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్


డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ


వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్


గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు


న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం


బూఁతల నున్న కాయ సరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం


గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా


సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటు బల్


మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ


రీతిగ సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ


టీ తపనీయగర్భనికటీ భవ దాననపర్వసాహితీ


భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా


శీతనగాత్మజా గిరిశశేఖర శీత మయూఖరేఖికా


పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ


జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదం


గాతత తేహితత్తహిత హాధితధంధణుధాణుధింధిమి


వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ


నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీ మరందసం


ఘాతవియద్ధునీ చకచక ద్వికచోత్పలసారసంగ్రహా


యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై


చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర


ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా


రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారె సారెకున్।



ఈ వృత్త మాలిక అర్ధం ఆంగ్లంలో..

Is poetry a surface sheen,
the green delusion of unfolded buds?
It must be real inside
and out, exploding fragrance,
an aching touch your body can't forget
by day or night, like of your woman,
whenever you think about it.
It should come over you, it should murmur
deep in the throat, as your lover in her dove-like moaning,
and as you listen, yearning comes in all its beauty.
If you take hold of it, your fingers tingle
as if you were tracing the still-hidden breasts
of a young girl, wholly embraced.
If you sink your teeth into it, it should be succulent
as the full lips of a ripe woman from another world,
sitting on your knees. It should ring
as when godly Sound strokes with her fingernails
the strings of her veeNa, with its golden bulbs resting
on her proud, white, pointed breasts,
so that the rAga-notes resound.
That is the pure Telugu mode.


If you use Sanskrit, then a rushing, gushing
overflow of moonlight waves, luminous and cool,
from Siva's crest, the mountain-born goddess beside him,
enveloping actors and their works, the dramas
spoken by Speech herself in the presence of the golden seed,
pounding out the powerful rhythms, the beat
of being, through drums and strings
and chiming bells and thousands of ringing anklets
dancing, drawing out the words, the fragrant and subtle
winds wafting essence of unfolding lotus
from the Ganges steaming in the sky should
comfort your mind. You should shiver
in pleasure again and again, each time
you hear it, as rivulets of honeyed juices and butter
and sweet milk flow together
and mix their goodness more and more
and more.


ఈ టపా విషయంలో సందేహాలు తీర్చిన చింతా రామక్రిష్ణగారికి, భైరవభట్ల కామేశ్వరరావుగారికి ధన్యవాదాలు.



Wednesday 18 January 2012

ఇంతలోనే ఎంత వారయ్యారు??


బుడి బుడి అడుగులతో ఇల్లంతా తిరుగుతూ


ఏడుపులు, అల్లరితో కేరింతలు కొడుతూ


అన్నం తిందురా అంటే నాకొద్దు పో అని విసిగిస్తూ


స్కూలు కెళ్లాలి లేమ్మా అంటే నేను పోను అని మారాం చేసే పిల్లలు


అమ్మ మాటలతో, నాన్న లాలనతో ఎదుగుతూ


ఆటపాటలతోపాటు జీవిత పాఠాలు కూడా నేర్చుకుంటూ


ఇంతలా ఉన్నవారు అప్పుడే ఎంతలా ఎదిగిపోయారు


గువ్వలా పొదుముకుని కాపాడుకున్న చిన్నారులు


పెద్దలనే పిల్లలను చేసి మేమున్నాం కదా అంటున్నారు.


ఎంత అల్లరి చేసినా అమ్మ కంట కన్నీరు చూడలేని ఆ చిన్ని మనసులు


కన్నీటికర్ధం తెలీకున్నాతమ బుజ్జి బుజ్జి చేతులతో తుడిచేసారానాడు

చెప్పకనే అమ్మ మనసు తెలుసుకుని చేతులతో ఆమెను బంధించి అదిలిస్తారీనాడు..

ఈ బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండేనా??


ఈ అనుభూతిని పదిలపరుచుకున్న ఈ క్షణం ఇలా స్తంభించిపోదా....

Sunday 15 January 2012

మాలిక సంక్రాంతి సంచికకు స్వాగతం


అందరికీ నూతన సంవత్సర , మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


మాలిక పత్రిక సంక్రాంతి సంచిక విడుదల అయింది. ఈ సంక్రాంతి సంచికను ప్రత్యేక హాస్య సంచికగా తయారు చేయడమైనది. ఈ సంచికలోని కబుర్లు, కథలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాము. ఈ హాస్య సంచిక నిర్వహణ బాధ్యత మాలిక టీమ్ సభ్యురాలు సుజాత గారిదే.


మరో ముఖ్య సమాచారం. ఈ సంచికతో మాలిక పత్రిక తన మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మాలిక సంపాదక బృందానికి, తమ అమూల్యమైన రచనలను అందిస్తున్న రచయితలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పడండి మరి ఈ ప్రత్యేక హాస్య సంచికలో ఏమేమి ఉన్నాయో చూద్దాం..


URL: http://magazine.maalika.org


మీ రచనలు పంపడానికి చిరునామా: editor@maalika.org

0. సంపాదకీయం: సంక్రాంతి పండుగ

1. తెలుగు సినిమాలో హాస్యం

2. సహస్ర స్క్వైర్ అవధానం …..

3. తెలుగు పండితుడి మసాలా పాట!

4. ఇదేమైనా బాగుందా??

5. డూప్లెక్స్ భోగం

6. రేడియో చమత్కారాలు

7. అల్లరి కార్టూన్ల శ్రీవల్లి!

8. చింతామణి -సినిమా గోల

9. తెలివైన దొంగ

10. సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్!

11. నేను నా పాట్లు (పాటలు)

12. ఒక ప్రయాణం – ఒక పరిచయం

13. ద బెస్ట్ ఆఫ్ బాపు కార్టూన్స్ !

14. రాముని మిత్రధర్మము

15. మాలికా పదచంద్రిక – 5: రూ. 1000 బహుమతి: ఆఖరు తేదీ ఫిబ్రవరి 20

16. బ్లాగ్గడి – తెలుగు బ్లాగర్లకు ప్రత్యేకం – రూ 200 విలువగల బహుమానం: ఆఖరు తేదీ ఫిబ్రవరి 20

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008