Wednesday 22 February 2012

మాలికా పదచంద్రిక - 5 ఫలితాలు




మాలికా పదచంద్రిక - 5ను నింపిన వారు సౌమ్య ఆలమూరు, మాచర్ల హనుమంతరావు, భమిడిపాటి సూర్యలక్ష్మి, సుభద్ర వేదుల, మానస చామర్తిగార్లు.


నిలువు 17ను కొందరు షడ్రకుడు అని నింపారు. కొన్ని ప్రాంతాలలో షడ్డకుడును షడ్రకుడు అనికూడా పిలుస్తారనే కొత్త విషయం తెలుసుకున్నాను :-) కాబట్టి షడ్రకుడు లేదా షడ్డకుడు రెండూ సరియైనవిగానే పరిగణించాము.


ఇక పొతే మాచర్ల హనుమంతరారావుగారు ఒక తప్పు(నిలువు 5)తోను, సుభద్ర వేదుల గారు రెండు తప్పుల(అడ్డం 3, నిలువు 5)తోనూ, మానస చామర్తి గారు ఒక తప్పుతోనూ (నిలువు 2) పూరించి పంపారు.


ఇక ఈ పదచంద్రిక విజేతలు సౌమ్య ఆలమూరు మరియు భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లు. ఇద్దరికీ అభినందనలు!

విజేతలు తమ చిరునామా లేదా బాంక్ అకౌంట్ నంబర్ మెయిల్ చేయగలరు. మీ బహుమతి పంపించబడుతుంది..
editor@maalika.org

Saturday 18 February 2012

బ్లాగ్ పుస్తక పరిచయ సభకు స్వాగతం

ఆఫీసుల్లో ఉండే కంప్యూటర్ ఇంటర్నెట్ ఈనాడు దాదాపు ప్రతీ ఇంటిలోకి వచ్చేసింది. సాంకేతిక నిపుణులే కాక ఉద్యోగాలు చేయని, కంప్యూటర్స్ గురించి తెలియనివారు, విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు అందరూ ఉపయోగిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉపయోగానికే కాక కంప్యూటర్ , నెట్ ని తమకు తెలిసిన ఆలోచనలనన్నింటికి అవలీలగా వాడుకుంటున్నారు. అందులో ఒక ప్రముఖమైన భాగం బ్లాగులు. అసలు రాయడానికి ఏముంటాయిలే. మాట్లాడమంటే మాట్లాడటం కాని రాయమంటే మావల్ల కాదు. మేమేమన్నా రచయితలమా.. అబ్బే..


సభాస్థలికి చేరు మార్గ వివరాలు...



ఇలా అనుకునేవారికి అసలు బ్లాగులంటే ఏంటి? ఎలా రాయాలి. ఎందుకు రాయాలి. దానివల్ల ఉపయోగాలేంటి? బ్లాగుకు హంగులు ఆర్భాటాలు ఎలా జత చేయాలి వగైరా విషయాలన్నింటిని సవివరంగా రాసి పుస్తకంలా అందిస్తున్నారు . "బ్లాగు పుస్తకం" ... ఈ పుస్తకాన్ని రాసినవారు సుజాత , రహ్మాన్.. రేపు ఆదివారం ఈ బ్లాగు పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ పుస్తకావిష్కరణకు తప్పకుండా విచ్చేయవలసిందిగా అంతర్జాలంలో తెలుగు, తెలుగు బ్లాగులను చదివేవారందరికీ ఆహ్వానం పలుకుతున్నారు నిర్వాహకులు..

Tuesday 14 February 2012

ఐ లవ్ యూ




ప్యార్ కియా నహి జాతా హో జాతా హై

ప్రేమ.. అసలు ఈ పదానికి ఇదే సరైన అర్ధం అని ఎవరూ చెప్పలేరేమో. ఒక వస్తువు, పుస్తకం, దృశ్యం మీద అమితమైన ఇష్టం కలగడం సామాన్యమైన విషయం. అలాగే వాటిని ప్రేమించడం కూడా తప్పేమి కాదు. కాని స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అంటే నొసలు చిట్లిస్తారు అందరూ.. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటే అందరికి ఎన్నో సందేహాలు వస్తాయి. చాలా మంది అది ఆకర్షణ, వ్యామోహం తప్ప ఇంకేమీ కాదంటారు. అందుకేనేమో తొమ్మిదో తరగతి చదివే పిల్లలు కూడా ప్రేమించుకుంటున్నారు. పెళ్ళి చేసుకుంటామంటున్నారు. టెంత్ క్లాసు పిల్లల ప్రేమ గురించి సినిమాలు కూడా తీసేస్తున్నారు. యవ్వనంలో ఉన్నవారి మధ్య ఆకర్షణ ఉండడం సహజం. నచ్చినవారిని ప్రేమిస్తున్నాం అంటారు. కొందరు మాత్రమే తమ ప్రేమను పెద్దలతో పోరాడైనా పెళ్ళి వరకు తెచ్చుకుని కలిసి ఉంటారు. కాని పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఒకరినొకరు తెలుసుకున్నది లేదు, కలుసుకున్నదీ లేదు. పేరు, చదువు తప్ప అభిరుచులు వగైరా ఏమీ తెలీకుండానే పెళ్లిల్లు జరిగిపోతాయి. జీవితాంతం కలిసి ఉండాలి కనుక వారిద్దరి మధ్య ప్రేమ ఉంటుందో లేదో ప్రేమ అని చెప్పుకునే వైవాహిక బంధం ఏర్పడుతుంది. ఇందులో ఎంతమంది దంపతులు ఒకరి అభిరుచులు, ఆలోచనలు ఒకరు అర్ధం చేసుకుని వాళ్లని ప్రోత్సహిస్తూ, ఉత్తేజపరుస్తూ ఉంటారో లేదో సందేహమే. ఇక ఇందులో ప్రేమకు చోటెక్కడిది?. అలా ఉద్యోగం, ఇల్లు, చుట్టాలు, పిల్లలు అంటూ జీవితం సాగిపోతుంటుంది. ఇదే అన్యోన్య దాంపత్యం. అలాంటి సమయంలో ఏర్పడిన ఓ పరిచయం, క్రమేణా పెరిగి ఇష్టమై చివరికి ప్రేమగా మారుతుంది. అదే " తన్హాయి "

ఐనా మొగుడు మంచివాడే , బాగా చూసుకుంటాడు.. ఒక కూతురు, మంచి ఉద్యోగం, ఇల్లు అన్నీ ఉన్న తర్వాత కూడా ఈ కల్హరకు రోగమా? ఈ వయసులో ప్రేమలో పడడానికి ???


ఈ పుస్తకం మొదలుపెట్టాక సాధారణమైన కధలా అనిపించినా ముందుకు సాగుతున్న కొద్దీ అందులోని ప్రతీ సంఘటన మన కళ్లముందు జరుగుతుంది అన్నంత సహజంగా రాసారు రచయిత్రి. ఈ కథ అమెరికాలో జరిగింది కాబట్టి ఇలాంటి ఆలోచనలు అమెరికా వాళ్లకు, అక్కడ ఉన్నవాళ్ళకు మాత్రమే వస్తాయి అని అనుకోవడం తప్పు. ఈ ప్రేమ విశ్వవ్యాపితం. పెళ్లైనవాళ్లు వేరే వ్యక్తిని ప్రేమించడం దారుణం, చాలా తప్పు అనుకునేవారికి ఈ కథ అసహజంగానే ఉంటుంది. కాని ఇది మన చుట్టూ జరిగే సహజమైన కథ. అలా అని ప్రతీ వ్యక్తి పెళ్ళయ్యాక కూడా మరో వ్యక్తిని ప్రేమిస్తాడు అని కాదు. ఈ నవల చదువుతుంటే ఒక మామూలు ప్రేమ కథలా కాకుండా ఆ వ్యక్తులే మనతో మనసు విప్పి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ప్రతీ ఆలోచనా నిజమే కదా అనిపిస్తుంది. ఇందులో హీరో విలన్ అంటూ లేరు.. ప్రతీ క్యారెక్టర్ కల్హర, కౌశిక్, చైతన్య, మృదుల.. ఎవరిదీ తప్పు లేదు అందరూ రైటే అనిపిస్తుంది. అసలు చదువుకునే సమయంలో కులాలు కలవవు, అమ్మా నాన్న ఒప్పుకోరని తెలిసిన కల్హర తనను ప్రేమించిన వ్యక్తిని కాదనుకుని, పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంటుంది. భర్త చెప్పినట్టుగా అతనికిష్టమైనట్టుగా సంసారం చేసూ ఉంటుంది. అతను చెప్పేవి నచ్చకున్నా, వాదించినా చివరికి ఒప్పుకుంటుంది కాని ఎదిరించదు. కాని అనుకోకుండా కౌశిక్‌తో పరిచయం కలిగి, ఇష్టంగా మారి ప్రేమలో పడడం అనేది చాలా సహజంగా జరిగిపోతుంది. ఒకవైపు కౌశిక్‌ని ప్రేమిస్తున్నా, తను తప్పు చేస్తున్నానేమో అన్న భావన ఆమెను అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది.


కల్హర కౌశిక్‌ని అమితంగా ప్రేమించినా మనసుతోపాటు శరీరాన్ని పంచుకోవాలని అనుకున్నా అలా చేయదు, భర్తను వదులుకోవడానికి ఇష్టపడదు. ఎంత చదువుకున్న, అమెరికాలో ఉన్నా కల్హర ఒక సాధారణ , మధ్యతరగతి యువతిలాగే తనకంటే ముందు తనవారి గురించి ఆలోచించింది. పెద్దలొద్దంటారని పెళ్లికి ముందు ప్రేమను వద్దనుకుంది. కాని స్వంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ, ఆ నిర్ణయం వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కునే శక్తి సామర్ధ్యాలు ఉన్నా కూడా తెగించలేదు. కుటుంబాన్ని దాటి నిర్ణయం తీసుకోలేదు. అతనితో సన్నిహితంగా ఉండాలని కోరిక ఉన్నా ఉండలేక ప్రేమ, త్యాగం, కుటుంబం, కర్తవ్యం, మలినం, తప్పు ఒప్పుల గురించి అనుక్షణం తనని తాను ప్రశ్నించుకుంటూ ఉంటుంది. చర్చించుకుంటూ ఉంటుంది. కౌశిక్ కంటే కల్హర ఎక్కువగా మధనపడుతుంది. సగటు ఇల్లాలిగానే ఆలోచిస్తుంది ఎందుకంటే స్త్రీగా ఆమెకు సమాజం కొన్ని కాదు ఎన్నో హద్దులు, ఆంక్షలు విధించింది. సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఈ సంకెళ్లు వదులు అయ్యాయేమో కాని ఇంకా వీడిపోలేదు. అందుకే పిరికిదనంతో ఈ విషయాన్ని దాచిపెట్టకుండా, అపరాధభావనతో ఉండలేక భర్త చైతన్యతో తాను కౌశిక్‌ని ప్రేమిస్తున్నా అని చెప్తుంది. అతను ఆమెను అర్ధం చేసుకోవాలనే ప్రయత్నం చేయకుండా, తన భార్య తనను కాక వేరొక వ్యక్తిని ప్రేమించింది అంటే తనలో లోపమేంటో అని ఆలోచిస్తాడు. నలుగురికి తెలిస్తే ఏమవుతుందో అని గాభరా పడతాడు . తన భార్య తనను గాక మరో పురుషుడిని ప్రేమిస్తుంది అనగానే అతని మనసులొ వచ్చిన ఆలోచన " Did u sleep with him?" అంటే అతని దృష్టిలో " to love, to make love" కి తేడా తెలిదు. ప్రేమ అనగానే శారీరక సంబంధం అనుకుని అది లేదని తెలిసాక స్తిమిత పడతాడు. ఒక మామూలు మధ్యతరగతి భర్తలా ప్రవర్తించాడు చైతన్య. అసలు ఆమెకు తాను సంపూర్ణమైన ప్రేమను ఇచ్చాడా అని అస్సలు ఆలోచించకుండా తన సంసారాన్ని చిందరవందర చేసుకుని అందరి దృష్టిలో తక్కువ కావడం భరించలేక ఇండియా వెళ్ళిపోదామంటాడు.


కౌశిక్ భార్య మృదుల కూడా అతన్ని చాలా ప్రేమిస్తుంది . అతని మనసులో తనొక్కదానికే స్థానం ఉండాలి అనుకుంటుంది. కల్హర, కౌశిక్ ల మధ్య సాన్నిహిత్యాన్ని అనుమానించి అది నిజమని తెలిసాక కృంగిపోతుంది. భార్య ప్రేమ విషయం తెలిసిన చైతన్య భారతదేశం వెళ్లిపోయి కొత్తగా మొదలుపెట్టి ఆమె జ్ఞాపకాలను చెరిపేయాలని అనుకుంటాడు. మృదుల మాత్రం కౌశిక్ భావాలను అర్ధం చేసుకోవాలని అనుకుంటుంది.. ఇష్టపడడం, ప్రేమించడం వంటి అనుభవాలు లేకుండా ఒకరికొకరు పూర్తిగా తెలుసుకుని అర్ధం చేసుకోకుండానే సంసారం బంధంలో ఉన్న కల్హర, కౌశిక్‌ల జీవితంలోకి ప్రేమ వచ్చి వారిని , వారి భాగస్వాముల జీవితాలను కూడా అల్లకల్లోలం చేస్తుంది. భాగస్వామికి దూరం కాలేరు, ప్రేమించినవారితో కలిసి ఉండలేరు. అందుకే చివరికి కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చి తమ ప్రేమను మర్చిపోవాలని నిర్ణయించుకుని వీడ్కోలు చెప్పుకుంటారు. కాని ఆ ప్రేమను నిజంగా మర్చిపోగలరా? మనుష్యులు దూరమైనంత మాత్రానా మనసు దూరమవుతుందా? ఈ ప్రేమ గురించి వారి జీవితంలో మళ్లీ ప్రస్తావన రాకుండా ఉంటుందా? నిజంగా వారు ప్రేమని మర్చిపోగలరా?? ప్రేమ , స్త్రీ పురుష సంబంధాలు, పవిత్రత, ఒకరి మనసులో ఒకరికే స్థానం ఉండాలి. ఎవరెలా ఉన్నా జీవితాంతం ప్రేమిస్తూనే ఉండాలి అనే భావాలూ ఉన్నంత కాలం ఈ సంఘర్షణలు తప్పవు.


“తన్హాయి” నవల ఇతివృత్తం తెలిసినవారు మొదట్లో అసలు పెళ్లైనవాళ్ల మద్య ప్రేమేంటి? తప్పుకదా అనిపించొచ్చు కాని రచయిత్రి కల్పన రెంటాల ఆ కధను చాలా సమర్ధవంతంగా నడిపించారు. ఇది అక్రమసంబంధాన్ని ప్రోత్సహించేట్టు కాక తమ జీవితంలో అనుకోకుండా ప్రేమలో పడిపోయిన ఇద్దరు వ్యక్తుల మానసిక స్థితి , సంఘర్షణ ఎలా ఉంటుందనేది ఎంతో హృద్యంగా చిత్రీకరించారు రచయిత్రి. కధలా చదవడం మొదలుపెట్టినా రాన్రాను అందులోని పాత్రల మనస్సుల్లోకి దూరిపోయి చదివినట్టు ఉంటుంది. భార్యా, భర్తల మధ్య సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని, పిల్లల పెంపకంలో వారి పాత్ర, ఉద్యోగం చేసే చోట ఎదుర్కునే సంఘటనలు అన్నీ కళ్లకు కట్టినట్టుగా చిత్రించారు రచయిత్రి. కల్హర, కౌశిక్ ల మధ్య ప్రేమ భావాలను వ్యక్తీకరిస్తున్నప్పుడు అబ్బా! ఎంత అందంగా ఉంది అభిపిస్తుంది. అలాగే వాళ్లు తమ ప్రేమని దాచుకోలేక , భాగస్వాములముందు బయటపడకుండా ఉండడానికి పడే తాపత్రయం, వారు కలవాలని ఉన్నా కలవలేని పరిస్ధితులతో క్షణక్షణం అనుభవించిన మనోవ్యదని చదువుతుంటే బాధగా ఉంటుంది. ఇలా ప్రేమలో పడడం మగవాడికి పర్వాలేదని అనుకున్నా ఒక పెళ్లైన స్త్రీ భర్త ఎలాటివాడైనా సర్దుకుపోవాలి తప్ప మరో పురుషుడి గురించి ఆలోచించ కూడదు అంటుంది సమాజం మన వివాహ వ్యవస్ధ. ఆడవాళ్లు ఇంట్లోనే ఉన్నా, పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాల్లో ఉన్నా ఈ ఛట్రాలు ఆమెను ఎప్పటికి బంధించి ఉంటాయి.. చివరికి తమ ప్రేమను చంపుకుని సంసారాన్ని నిలుపుకుంటారు. ఇది అందరికి మంచిదేమో ఆ ఇద్దరికి తప్ప... కాని తప్పదు. ప్రేమ ఏ వయసులో కలిగినా తిప్పలు తప్పవు. కొన్ని మాత్రమే ఫలిస్తాయి.


ఈ నవలలో నాకు బాగా నచ్చిన వన్స్ మోర్ అనుకునే మాటలు..


కొన్ని ఫీలింగ్స్ అర్ధమయ్యేవి కావు. అనుభవంలోకి రావాలి. అనుక్షణికమై నిలవాలి. ఆ ఫీలింగ్ నామ, రూపరహితంగా ఉంటుంది. కొందరు దాన్ని ప్రేమ అంటే మరికొందరు మోహం అంటారు.


చెట్టు మొత్తం పూలతో నిండి చూడడానికి ఓ పెద్ద canopy లాగా అనిపిస్తుంది. ఆ పూలపందిరి కింద నుంచి నడిచి వెళ్లేటప్పుడు రాత్రి ఎవరో వచ్చి ప్రేమగా ఆ పూలచెట్టుని గట్టిగా హత్తుకొని ఒక ఊపు ఊపి వెళ్లిపోయినట్టు దానితో ఆ పూలరెక్కలన్నీ విషాదంగా నేలమీద వాలి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది.


ఒక పని చేయాలని మనసుకి తీవ్రంగా అనిపించినప్పుడు ఆ చేస్తున్న పని ఒప్పే అనిపించేలా మన మనస్సు చాలా కన్వీనియంట్ గా, తెలివిగా మనకు నచ్చ చెపుతుంది. అది మనసు వేసే ట్రాప్. చాలామంది తెలిసో తెలియకో ఆ ట్రాప్ లో పడిపోతుంటారు. కొద్దిసేపటికో, కొద్ది కాలానికో కొందరు పైకి లేచి నిలబడతారు. కొందరు ఎప్పటికోగాని కళ్లు తెరవరు.


ప్రేమ ఎప్పుడూ ఒక బలమయిన, తీవ్రమయిన సునామి. నెమ్మదిగా, నదిలా పారుతూ మన దగ్గరికి రాదు. పెద్ద ఉప్పెనలా వస్తుంది. మనలని చుట్టేస్తుంది. పెనుగాలి ప్రళయంలా కమ్మేస్తుంది. ఆ గాలి ఉధృతిలో, అ ఉప్పెనలో కొట్టుకుపోతాము. అలా జరుగుతోందని కూడా మనకు తెలియని ఒకానొక మైకం అది.


కొన్ని కొన్ని భావాలకు, కొన్ని కొన్ని అనుభూతులకు కారణాలుండవు, దొరకవు.


ప్రేమ జీవితంలో ఒక భాగం.. ప్రేమే జీవితం అయ్యే అవకాశం, అదృష్టం అందరికి దక్కదు. నాకు దొరికిన దానితో తృప్తిపడి ఊరుకుంటాను. అందని దానికోసం నేను ఉన్నదాన్ని పోగొట్టుకోలేను..


స్నేహం, ప్రేమ, ఆప్యాయత అందరితో ఒకేలా ఉండదు. ఒకరితో పంచుకున్న విషయాలు ఇంకో ఫ్రెండ్ దగ్గర కనీసం ప్రస్తావించలేము కూడా. ప్రతీ స్నేహం భిన్న. ప్రతీ ప్రేమ విభిన్నం.


అందమైన సంపెంగపూలను అరిటాకులో పొట్లం కట్టినట్టుగా ప్రేమభావనలను, సంఘటనలను, సంఘర్షణలను “ తన్హాయి” గా అందించినందుకు ... కల్పన .. ధాంక్ యూ...

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008