Thursday 30 January 2014

మాలిక పదచంద్రిక జనవరి 2014 - సమాధానాలు





నా పదచంద్రిక గళ్ళకిస్తున్న ఆదరాభిమానాలకు ముందుగా మీకూ, మాలిక పత్రికకీ కృతజ్ఞతలు.  

నూతన సంవవత్సరం మొదలై ఒక మాసం గడిచింది. పదచంద్రికకిచ్చిన కొత్త రూపువల్లనేమో 4 పూరణలొచ్చాయిపూరణలు పంపినవారు సర్వశ్రీ/శ్రీమతి శుభావల్లభ, కాత్యాయని, భీమవరపు రమాదేవి, భమిడిపాటి సూర్యలక్ష్మి, మాచర్ల హెచ్. రావు గార్లుఇచ్చిన ఆధారాలలో 5 నిలువు కి 7 అడ్డానికి కాలులేకపోతే అని ఉండాలి. 7 అడ్డం సాకు కాబట్టి 5 నిలువు కి పూరణ కుంటి అని ఉండాలి. కానీ ఇచ్చిన ఆధారాలలో పొరపాటున 7 నిలువు కి కాలులేకపోతే అని రాసా. క్షంతవ్యుడినిఅందువల్ల కుంటి, అని రాసినా, అంప అని రాసినా సరియైన సమాధానం గా పరిగణించమని నిర్వాహకులని కోరుతున్నాశుభావల్లభ గారు 24 అడ్డానికి తుష్టి అని పూరించారు. అది తుత్తి అని ఉండాలి. అది స్వర్గీయ ఏవీయస్ గారి ట్రేడ్మార్కు పదం.. మిష్టర్ పెళ్ళాం లోఅందుకని కాత్యాయని, భీమవరపు రమాదేవి, భమిడిపాటి సూర్యలక్ష్మి, మాచర్ల హెచ్. రావు గార్లని మాత్రమే విజేతలుగా భావించగలరు.



గతమాసంలోలాగానే ఈసారి కూడా పదచంద్రిక సులభ తరం చేసిపెట్టాంఇందులో 4 చిన్న మినీ గడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.  అతి పెద్దపదంలో కేవలం 5 అక్షరాలే 

ఇట్లు భవదీయుడు సత్యసాయి కొవ్వలి


విజేతలందరికీ అభినందనలు.. బహుమతి సొమ్ము సమానంగా  పంచబడుతుంది.. 

Tuesday 14 January 2014

షడ్రుచులు - తెలంగాణా వంటలు (వెజ్)






ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అలాగే కోటి విద్యలు కూటి కొరకే అని కూడా చెప్పారు. మనిషి సుఖశాంతులతో జీవించడానికి ఆరోగ్యం ఎంతో అవసరం. ఆరోగ్యానికి ప్రతిరోజూ పుష్టికరమైన ఆహారం తినడం ఎంతో అవసరం. పాకకళ కూడా అరువది నాలుగు సామాన్య కళలో ఒకటిగా పేరు పొందింది. ప్రజల ఆహారపు అలవాట్లు, భూగోళ పరిస్థితుల మీద, భూగర్భ పరిస్థితుల మీద వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. అంతే కాకుండా ఆయాప్రాంతాలలో నేల ఆధారంగా పండే పంటలమూలంగా వంటకాలు కూడా మారుతుంటాయి... మారుతున్న జీవనవిధానం, ఆధునిక పరిజ్ఞానం, అభివృద్ధి కారణంగా ఈ ఆహారపు అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా హడావిడి, వేగం పెరిగింది. అలాగే వంటింట్లో గడిపే సమయం కూడా తగ్గింది. కష్టపడేది తిండి కోసమే ఐనా ఆ భోజనం మీద శ్రద్ధ పెట్టడానికి కూడా టైం లేదంటున్నారు. 

ఎందుకో మరి మొదటినుండి నాకు వంటలమీద శ్రద్ధ ఎక్కువే. బ్లాగుల్లో కొచ్చాక అది పెరుగుతూనే వచ్చింది. షడ్రుచులు బ్లాగు ఆ తర్వాత వెబ్‌సైటు రాస్తూ రాస్తూ భూమిలో ఆదివారం "రుచి" కాలమ్  మరిన్ని విభిన్నమైన వంటలు నేర్చుకుని, చేసి రాయడానికి స్ఫూర్తినిచ్చింది. ఎంత కొత్త వంటకాలు రాసినా నేను పుట్టి పెరిగిన తెలంగాణా ప్రాంటపు వంటకాల మీద మక్కువ వీడలేదు. మల్లాది వెంకట కృష్ణమూర్తిగారితో మాటలలో తెలంగాణా ప్రాంతపు వంటకాల మీదే ఎందుకు పుస్తకం రాయకూడదు అనే ఆలోచన మొదలైంది. అది ముదిరి, ముదిరి చివరికి పుస్తకంలా రూపు దాల్చింది. గత ఏడాదిగా నేను చిన్నప్పటినుండి తెలిసిన, తిన్న తెలంగాణా ప్రాంతపు వంటకాలు, మా పుట్టింటి, అత్తింటివారు, వేర్వేరు ప్రాంతాలలో ఉన్న మిత్రులు, బంధువులతో చర్చించి మరిన్ని సేకరించి, ప్రయత్నించి ఈ పుస్తకంలో చేర్చడమైనది. ఇంకా మిగిలిపోయి ఉండవచ్చు. వీలైతే వాటిని మరో పుస్తకంలో వేయించొచ్చు. చూద్దాం..

ఈ పుస్తకం రాయాలనే ఆలోచన నిచ్చిన ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తిగారికి. నా పుస్తకానికి నాకు నచ్చినట్టుగా అందంగా డిజైన్ చేసిన సృష్టి అధినేత కృష్ణ అశోక్‌గారికి, పుస్తక ప్రచురణ విషయంలో ఎన్నో విధాల సహాయం చేసిన మురళిగారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాను.

పుస్తకంలో పేజీలు: 300
ధర : రూ. 150
ఆఫర్: పది పుస్తకాలు కొంటే ఒకటి ఫ్రీ
పబ్లిషర్స్: J.V. Publishers
పుస్తకాలు లభించు చోటు:
నవోదయ బుక్ స్టోర్స్ కాచిగుడా. ఫోన్:24652387 , 9247471361/62
తెలుగు బుక్ హౌస్ . కాచిగుడ ఫోన్: 9247446497
కొద్ది రోజుల్లో ఈ పుస్తకం మరిన్ని చోట్ల అందుబాటులో ఉంచబడుతుంది.
కినిగె నుండి కూడా ప్రింట్ పుస్తకాలు, eపుస్తకాలు అందుబాటులొ ఉంచబడతాయి.

ఎక్కువ కాపీలు కావాలంటే నన్ను సంప్రదించవచ్చు..
.

Saturday 11 January 2014

హ్యాపీ న్యూ ఇయర్ ?????????????????



మమ్మీ ! హ్యాపీ న్యూ ఇయర్!!

అత్తా! హ్యాపీ న్యూ ఇయర్!!

నేస్తం! హ్యాపీ న్యూ ఇయర్!!

జ్యోతక్కా! హ్యాపీ న్యూ ఇయర్!!  ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు న్యూ ఇయర్. ఏదైనా స్పెషల్ ఆ??

ఏంటి హ్యాపీ న్యూ ఇయరా?? మతుండే మాట్లాడుతున్నావా? నువ్వు కూడా నాలా మధ్యతరగతి ఇల్లాలివే కదా. కొత్త సంవత్సరం మొదలు కావడం నిజంగా నీకు సంతోషంగా ఉందా??

అదేంటక్కా అలా అంటావ్? నేనేమన్నానని?

నువ్వన్నావని కాదు వారం రోజులనుండి చూస్తున్నాను. కొత్త సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి. తర్వాత పార్టీలు, గుళ్లు. అందరికి ఓ వింతలా, సంతలా అయిపోయింది. జనాలందరికి పిచ్చి పట్టిందనిపిస్తుంది.

అయ్యో అలాంటవేంటక్కా?

లేకుంటే  నువ్వే చెప్పు...ఈ కరువు కాలంలో కొత్త సంవత్సరం జరుపుకునేట్టుగా ఉందా? అన్ని ఖర్చులూ పెరిగిపోతున్నాయి కాని దానికి తగ్గట్టుగా ఆదాయం పెరగదు. ఒకరికి ముగ్గురు పని చేసినా ప్రతీ నెలాఖరుకు వెతుకులాటే అవుతుంది. కనీసం రోజు తినే తిండి అన్నా  కడుపునిండా, ఇష్టపూర్వకంగా తిందామా అంటే అదీ కుదరదు. ఉల్లిపాయ నుండి చికెన్ వరకు అన్ని ధరలు పేలిపోతున్నాయి.  ఇప్పుడు కొంచం మేలు కాని ఉల్లిపాయ, టమాటాలు ఆకాశానికెక్కి కూర్చున్నాయా. ఉల్లిపాయలైతే కోయకుండానే, తలుచుకోగానె కంట నీరు తెప్పించాయా? మిగతా కూరగాయలైతే  కిలో యాభైకి  తక్కువ ఏవీ లేవు.  ఇంతకు ముందు డబ్బులు, సంచీ తీసుకుని వెళ్లి నచ్చిన కూరగాయలు ఏరుకుని తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు డబ్బులు  పట్టుకెళ్లినా  కూరగాయలు అన్నీ చూసి ధర అడిగే ధైర్యం కూడా చేయలేక తక్కువలో ఉన్న రెండు మూడు కూరగాయలు తెచ్చుకుంటున్నాం. బంగారం అంటే కొనడం మానేయొచ్చు కాని తిండి ఎలా తగ్గించేది? .. హోటళ్లకు తగలెట్టకున్నా కనీసం ఇంట్లో వండుకుని తిందామంటే కుదరదాయే.  చికెన్ కొందామంటే రెండొందలంట, గ్రుడ్లు ఐదు రూపాయలు.  కనీసం ఆమ్లెట్ వేసుకుందామని ఒక గుడ్డు పట్టుకుంటే అమ్మో ఇది ఐదురూపాయలు అనే హెచ్చరిక కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది. బియ్యం కూడ కిలోకి యాభై పెట్టాల్సిందే.

ఇవి సరే గ్యాస్ బండ కూడా తక్కువ తినలేదు కద. గవర్నమెంటుకు ఏం తిక్కో అర్ధం కాదు.. గ్యాస్ సిలిండర్‌ని ఆధార్ కార్డుకు జత చేసారు.  అసలు నాకు తెలీకడుగుతా ఇంటికి ఒకటే కనెక్షన్, రెండే సిలిండర్లు అని కోత పెట్టారు. పెద్ద కుటుంబం ఉంటే సిలిండర్ ఒక్కటి సరిపోదు. రెండు కనెషన్లు తీసుకుంటే ఏమవుతుంది. వాళ్ళేమీ ఉచితంగా వాడుకోవట్లేదు కద. డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారు. ఇవ్వడానికేం మాయరోగమంట ఆయిల్ కంపెనీలకు, ఈ ప్రభుత్వానికి. గ్యాస్ సప్లైలు మరీ అంత తక్కువగా ఐతే లేవుగా.  పైగా ఇంటింటికీ పైపులేసి మరీ గ్యాస్ అందిస్తాం అని ఎవరో అన్నట్టున్నారు కదా.. తుగ్లక్ పాలన కాకపోతే గ్యాస్ సిలిండర్‌కి, ఆధార్ కార్డుకు లింకెందుకు.. ముందేమో వెయ్యి పైన డబ్బులు తీసుకుంటారు. మళ్లీ నాలుగు రోజులకు ఆ డబ్బులు మన అకౌంట్‌లో వేస్తారు. తీసుకోవడమెందుకు, మళ్ళీ వేయడమెందుకు.  ఇచ్చేటప్పుడు ప్రాణాలు విలవిలలాడతాయి. వేరే ఏ ఖర్చును దాటవేద్దామా? తర్వాత చేద్దామా అని ఆలోచించాల్సి వస్తుంది. ఈ పనిలో ఏమైనా అరకాసు, తిరకాసులున్నాయేమో.... అసలు ఈ తిప్పలన్నీ బాగా డబ్బులు ఉన్నవాళ్లకి, అస్సలు లేనివాళ్లకి ఉండవు. మధ్యతరగతి అభాగ్యులకే కష్టాలు.

అదెలా??

ఎలాగేంటి? ఉన్నవాడికి ఎంత ధరలు పెరిగినా వాళ్లుకు ఎటువంటి కష్టం ఉండదు కనుక  అన్నీ కొంటూనే ఉంటారు కదా. లేనివాడు ఉంటే కొందాం లేకుంటే లేదు అని ఊరుకుంటాడు. కాని మధ్యతరగతివాళ్లు అటు వదిలేయలేరు, ఇటు చేయనూలేరు. ఇది బట్టలు, బంగారం లాంటివే అని కాకుండా కాకుండా అన్ని విషయాల్లోనూ .. ఇప్పుడు చూడు దీపావళి పండగొచ్చిందనుకో... ఉన్నవాడు ఇంచక్కా అన్నీ కొనేసుకుని గ్రాండ్‌గా పండగ చేసుకుంటాడు. పేదవారు ఒక దీపం పెట్టి ఉంటే ఏదో ఒకటి చేసుకుని తినేస్తారు. వాళ్లకు ఎలాంటి కంగారు, పటాటోపం ఉండదు. సో వీళ్లిద్దరూ హ్యాపీస్. అవునా? మరి మనకు అలా కుదరదే. పండగలు జరుపుకోవాలి. నోములు, వ్రతాలు, సినిమాలు, షికార్లు అన్నీ కావాలి. ఈ ధరలతో అన్నీ కుదరవు. తగ్గిద్దామంటే మనసు ఒప్పుకోదు, మనుషులు ఒప్పుకోరు. మరీ భారీగా కాకున్నా కొంచం బానే చేసుకోవాలి కదా పండగలు , పబ్బాలు. కష్టం మీద డబ్బులు సమకూర్చుకునో, అప్పు చేసో ఆ కార్యక్రమం అయిపోయిందనిపించుకుంటాం.... ఇలా చెయడంలో ఎంతమందిని బుజ్జగించాల్సి వస్తుందో, కోప్పడాల్సి వస్తుందో, విసుక్కోవాల్సి వస్తుందో నీకు తెలియంది కాదు. అలాంటప్పుడు 365 రోజులు ఐపోయి కొత్త సంవత్సరం, కొత్త కాలెండర్ ఒక్క నంబర్ మార్పుతో జరుగుతుంటే అది ఒక  పండగ చేసుకోవాలా? అది కూడా హ్యాపీగా..

ఇంకో విషయం చెప్పనా? అసలు ఈ న్యూ ఇయర్ మన పండగ, పబ్బము కానే కాదు... మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాదికే మొదలవుతుంది.  ఇంగ్లీషు కాలెండర్ ప్రకారం రాత్రి పన్నెండు గంటలకు తేదీ మారుతుంది కాని మన భారతీయులం మాత్రం సూర్యోదయ వేళ చీకట్లు తొలిగి వెలుగు రేఖలు ప్రసరించడం మొదలవ్వడమే కొత్త రోజుగా, కొత్త ప్రారంభంగా అనుకుంటాం కదా. డిసెంబర్ 31  కి కాని, జనవరి 1 ఇంత గ్రాండ్‌గా పండగ జరుపుకుంటారు అసలు ఆ తేదీ మారడానికి, మారే సమయంలో ఏదైనా ప్రత్యేకత కనిపిస్తుందా? చిమ్మ చీకటిలో తేదీ మారిపోతుంది. కాని మన కొత్త సంవత్సరాది ఉగాది నాడు ప్రకృతి కూడా ఎన్నో మార్పులు సంతరించుకుని కొత్త గ్రహగమనాలతో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. సంక్రాంతి కూడా అంటే కదా.. ఏదో ఊరికే పండగ అని జరుపుకుంటామా. మన పండగలన్నింటికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది కూడా ప్రకృతితో మమేకమైనది. గ్రహాలు, రుతువులకు అనుసంధాణమై జరిగే మార్పులు, విశేషాలను మనం పండగలుగా జరుపుకుంటాం. మరి ఏ మార్పు తీసుకువస్తుందని విదేశీయుల కొత్త సంవత్సరానికి మనం సంబరాలు చేసుకోవాలి. అలా అని అస్సలు చేసుకోవద్దు అనడం లేదు. మరీ అతి కూడదు అంటున్నా. 

ఎక్కడికెళ్లాలన్నా తిప్పలు. ఆటొలో వెళదామంటే వాళ్లు ఇష్టమొచ్చినట్టు ఇమ్మంటున్నారు. వందలో ఒక్కరు మీటర్ మీద వస్తున్నారు. ఏమంటే మీటర్ పాడైంది, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి అని చెప్తున్నారు. అవి మనకు పెరగలేదా. మనకు ఇబ్బందేగా. ఇలా వాళ్లతో గొడవెట్టుకోవడం తప్పడం లేదు. సొంతబండి కొనుక్కుని తిరుగుదామంటే మూడు నెళ్లకోసారి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. వాటికి తగ్గట్టు మన ఆదాయం పెరగడం లేదు కదా. ఇక పండగలైనా , హ్యాపీ న్యూ ఇయర్ ఐనా ఎలా జరుపుకునేది?  అందుకే నాకు హ్యాపీ న్యూ ఇయర్ అనగానే పెరిగిన ధరలు, ఇంటా బయట పెరుగుతూనే ఉన్న ఖర్చులు, కుదించుకుంటున్న అవసరాలు కళ్లముందు  నిలబడి వికటాట్టహాసం చేస్తున్నాయ్.. 

Wednesday 1 January 2014

కొత్త ఆలోచన - కొత్త ప్రయాణం





కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ఒక కొత్త ఆలోచనకు నాంది పలుకుదామని నిర్ణయించుకున్నాను. బ్లాగు రాతలనుండి పత్రికా రచనలు.. ఆ తర్వాత పుస్తకాల ప్రచురణ విషయంలో కలిగిన అనుభవంతో నాదైన ఒక పబ్లిషర్స్ ని ప్రారంభిస్తున్నాను. అదే JV Publishers. ఈ పబ్లిషర్స్ నుండి వచ్చిన మొదటి పుస్తకం నా "తెలంగాణా వంటల పుస్తకం". పబ్లిషర్స్ అనగానే పుస్తకాలు అచ్చువేయడమే కాదు. రచయితలకు తమ పుస్తకాల ప్రచురణకు సంబంధించిన సేవలు అందించడమే ముఖ్య ఉద్ధేశ్యం. రచయిత దగ్గర కంటెంట్, సొమ్ము ఉంటే చాలు. వారి రచనలు పుస్తక రూపంలో అచ్చు వేసి ఆ తర్వాత చేయవలసిన పనుల గురించిన సేవలు అందించడం మా వంతు. ఆ పుస్తక సేవలు ఏమేమిటి అంటే..

1. డిటిపి
2. ప్రూఫ్ రీడింగ్
3. కవర్ డిజైన్
4. ప్రింటింగ్
5. పుస్తకాల షాపులకు పంపడం
6. సమీక్ష కోసం వివిధ పత్రికలకు కాపీలు పంపడం
7. సెంట్రల్ లైబ్రరీకి అప్లై చేయడం
8. చివరిగా eబుక్ చేయడం

ఇందులో పుస్తకానికి సంబంధించిన కాపీరైట్లు రచయిత దగ్గరే ఉంటాయి. ప్రచురణ విషయంలోనే మా సేవలు అందుబాటులో ఉంటాయి. వాటికి తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక తమ పుస్తకాన్ని రచయితలు తమ అభిరుచికి తగినట్టుగా, తమకు పూర్తిగా నచ్చినట్టుగా చేసుకునేలా గైడ్ చేయడం జరుగుతుంది. రచయితకు పూర్తిగా నచ్చిన తర్వాతే పుస్తకం ప్రింటింగ్ కి వెళుతుంది. ఈ పనులన్నీ వీలైనంత తక్కువ ధరలో, నాణ్యంగా, అందుబాటులో ఉండే విధంగా చేయడం జరుగుతుంది. తమ పుస్తకానికి ప్రచారం, ఆవిష్కరణ , అమ్మకాల విషయం రచయిత మాత్రమే చూసుకోవాలి. అది మా బాధ్యత కాదు.

ఇంతవరకు ఈ పనులు ఏవైనా చేసారా అంటే. అమెరికాలో ఉంటున్న నా స్నేహితురాలు కోసం చేసాను. నా పుస్తకం కోసం కూడా మొదటి నుండి చివరి వరకు నేనే తిరిగి నా ఇష్టప్రకారం చేయించుకోవడం జరిగింది. అది కూడా నాకు అందుబాటైన ధరలో..

మాలిక పత్రిక జనవరి 2014 సంచిక విడుదల

 Jyothivalaboju

Chief Editor and Content Head


మాలిక పత్రిక తరఫున రచయితలకు, పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ...హాసం ప్రచురణలనుండి వెలువడిన కొన్ని అపురూపమైన రచనలను మాలిక పత్రికలో సీరియల్స్ గా మొదలవుతున్నాయి.  ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని మెప్పించే మరిన్ని మంచి రచనలు అందించగలమని హామీ ఇస్తూ ఈ జనవరి నెల సంచికలోని అంశాలు..

మీ రచనలు ఫంపవలసిన చిరునామా  editor@maalika.org


 1. స్తుతమతియైన ఆంధ్రకవి

 2.  విజయగీతాలు - 1

 3.  అండమాన్ డైరీ - 1

 4. హ్యూమరధం - 1

 5. పారశీక చందస్సు -7

 6.  మాలిక పదచంద్రిక

 7. సంభవం - 8

 8. అనగనగా బ్నిం కధలు - 6

 9. మౌనరాగం - 3

10. ఆలోచింపజేసే ప్రకటన

11.  ధనుర్మాసము - వైకుంఠ ఏకాదశి 

12.  Gausips - గర్భాశయపు సమస్యలు - 2

13. స్ధితి

14. అల్లసాని వారి అల్లిక

14. విరించి బాబా

15. యేదోకటి చేసెయ్యాలంతే

16. గాయంతాం త్రాయతే

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008