Saturday 28 June 2014

సాక్షిలో తెలంగాణ రుచులు.




http://www.sakshi.com/news/vanta-panta/special-dishes-143416


కోటి రతనాల రాగాలు పలికించే వీణ పట్టే చేతులు... కోటి రుచులను వండలేవా? వడ్డించలేవా? ఉద్యమాల గడ్డ మీద... వండే వంటల్లోనూ పవరుంటుంది... పౌరుషముంటుంది... నాలుకనంటగానే రుచిస్తుంటుంది. అసలు సిసలు తెలంగాణాంగణ ప్రాంగణపు వంటలైన శేవల పాయసం కేవలం రుచి చూస్తే సరిపోదు... మసాలా పూరీ తింటే మనసు నిండదు... మరి కాస్త తప్పక కావాలనిపిస్తుంది... నడుములెత్తకుండా కూర్చుని తినాలనిపించే ఆనపగింజ కుడుములు వారేవా అనిపించే వాక్కాయ ఆవకాయ వడివడిగా తినిపించే చేమకూర బడీలు పూర్ణం కట్టు చారుతోనే సంపూర్ణమయ్యే భోజనాలు... కోటి రుచుల్లో కొన్ని శాంపిల్ రుచులివి...
రాష్ట్రాలుగా వేరైనంత మాత్రాన రుచులు వేరవుతాయా?
స్టేటులుగా విడిపోయినంతనే టేస్టులు విడివడతాయా?
ఒకటీ రెండు తింటేనే కోటి రుచుల పెట్టు
ఈ తెలగాణ్యపు వంటలు ముద్ద నోట పెట్టగానే...
నాలుక మాగాణ్యంపై రుచుల సిరుల పంటలు.


మసాలా పూరీ

కావలసినవి:
గోధుమపిండి - 3 కప్పులు; సెనగపిండి - కప్పు; కరివేపాకు - 3 రెమ్మలు; పచ్చి మిర్చి - 3; పసుపు - కొద్దిగా; మిరప్పొడి - టీ స్పూను; ధనియాల పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత

తయారీ:
గోధుమపిండి, సెనగపిండి కలిపి జల్లించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి .అల్లం వెల్లుల్లి ముద్దలో కొన్ని నీళ్లు పోసి పలుచగా చేసుకోవాలి .కరివేపాకు, పచ్చి మిర్చి సన్నగా తరిగి పిండిలో వేయాలి. పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలపాలి . తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి .పది నిమిషాల తర్వాత కొద్దిగా నూనె వేసి మృదువుగా అయ్యేలా కలిపి చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి. అన్నీ చేసుకుని, వేడి నూనెలో నిదానంగా రెండు వైపులా కరకరలాడేలా వేయించి తీసుకోవాలి. (పూరీలు మందంగా ఉంటే మెత్తబడిపోతాయి. నిల్వ ఉండవు)


శేవల పాయసం

కావలసినవి:
గోధుమపిండితో చేసిన శేవలు - 200 గ్రా.; బెల్లం తురుము - 250 గ్రా.; నెయ్యి - 4 టీ స్పూన్లు; గసగసాలు - టీ స్పూను; ఏలకుల పొడి - టీ స్పూను; పాలు - కప్పు; కొబ్బరి తురుము - కొద్దిగా

తయారీ:
ఒక గిన్నెలో బాగా ఎండిన శేవలు, తగినన్ని నీళ్లు పోసి శేవలను ఉడికించాలి బెల్లం తురుము, పాలు, నెయ్యి వేసి నెమ్మదిగా కలపాలి. బాగా ఉడికిన తర్వాత ఏలకుల పొడి, గసగసాలు వేయాలి. కొబ్బరితురుముతో గార్నిష్ చేసి దింపేయాలి. వేడివేడిగా అందించాలి. ఇష్టమైన వారు మరి కాస్త నెయ్యి వేసుకోవచ్చు

శేవల తయారీ...
గోధుమపిండికి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, చేతితో ఒత్తుతూ సన్నగా పొడవుగా సేమ్యా మాదిరిగా చేయాలి. రెండు మూడు రోజులు ఎండబెట్టాలి. డబ్బాలో నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. వీటిని తయారు చేసే మిషన్లు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి సేమ్యా లాంటివి.


చేమకూర బడీలు

కావలసినవి:
చేమకూర ఆకులు - 10 (వెడల్పుగా ఉండే ఆకులు); సెనగపిండి - కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; మిరప్పొడి - టీ స్పూను; పసుపు - చిటికెడు; గరం మసాలా - చిటికెడు; సన్నగా తరిగిన కొత్తిమీర - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత.

తయారీ:
చేమకూర ఆకులను కడిగి, తుడిచి పెట్టుకోవాలి. సెనగపిండిలో మిగతా వస్తువులు, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి ముద్దలా చేసుకోవాలి. చేమకూర ఆకుపై ఈ ముద్దను పలుచగా రాసి చాప చుట్టలా మడిచి ఉంచాలి. అదే విధంగా అన్ని ఆకులతో చేసుకోవాలి. ఈ మడతలను ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత అంగుళం వెడల్పులో ముక్కలుగా కట్ చేయాలి .నూనెలో వేసి ఎర్రగా కరకరలాడేలా వేయించాలి. వీటిని ఉల్లి చక్రాలతో నంచుకు తింటే రుచిగా ఉంటాయి.


పూర్ణం కట్టు చారు

కావలసినవి:
సెనగపప్పు ఉడకబెట్టిన నీళ్లు - 2 కప్పులు; చింతపండు - నిమ్మకాయంత; ఉల్లిపాయ - 1; పచ్చి మిర్చి - 2; ఎండు మిర్చి - 3; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; టొమాటో - 1; పసుపు - పావు టీ స్పూను; ఆవాలు + జీలకర్ర - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - 3 టీ స్పూన్లు; ఉడికించిన సెనగపప్పు ముద్ద (పూర్ణం) - పావు కప్పు

తయారీ:
చింతపండులో నీళ్లు పోసి, నానబెట్టి, పులుసు తీసుకుని పప్పు నీళ్లలో కలపాలి.సన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేగాక కలిపి పెట్టుకున్న కట్టు చారు వేయాలి. కొద్దిసేపు మరిగిన తర్వాత పూర్ణం వేసి కలపాలి. మరో రెండు నిమిషాలు మరిగించి దించేయాలి. చారు తియ్యతియ్యగా పుల్లపుల్లగా ఉంటుంది.


ఆనప గింజల కుడుములు

కావలసినవి:
బియ్యప్పిండి - కప్పు; ఆనప గింజలు - ఒకటిన్నర కప్పులు; ఉల్లికాడల తరుగు - కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; పచ్చి మిర్చి ముద్ద - టీ స్పూను; ఉప్పు - తగినంత

తయారీ:
ఆనప గింజలు మరీ లేతగా కాకుండా కొద్దిగా ముదురుగా ఉండేలా చూసుకోవాలి. (చిక్కుడు గింజలతో కూడా చేయవచ్చు). బియ్యప్పిండిలో ఆనప గింజలు, పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లికాడలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. గోరువెచ్చని నీళ్లతో తడిపి మూత పెట్టి గంటసేపు ఉంచాలి. నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసుకోవాలి. ఇడ్లీ రేకులలో ఒక్కో ఉండను ఉంచి ఆవిరి మీద ఉడికించాలి. ఆవకాయతో కాని, ఉల్లిపాయ పచ్చడితో కాని తింటే రుచిగా ఉంటాయి.


వాక్కాయఆవకాయ

కావలసినవి:
వాక్కాయలు - కేజీ; ఉప్పు - 250 గ్రా.; నువ్వుల నూనె - 250 గ్రా.; మిరప్పొడి - 125 గ్రా.; అల్లం ముద్ద - 125 గ్రా.; వెల్లుల్లి ముద్ద - 125 గ్రా.; జీలకర్ర పొడి - 25 గ్రా.; మెంతి పొడి - టీ స్పూను; పసుపు - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; జీలకర్ర + మెంతులు - టీ స్పూను

తయారీ:
వాక్కాయలను రెండు లేదా నాలుగు ముక్కలుగా తరిగి లోపలి జీడి వేరు చేయాలి ఒక గిన్నెలో పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేసి కరిగిన తర్వాత జీలకర్ర, మెంతులు వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్ద వేసి కలిపి పూర్తిగా చల్లారాక కలిపి పెట్టుకున్న పొడులు, వాక్కాయ ముక్కలు వేసి బాగా కలపాలి. జాడీలోకి తీసుకుని మూడు రోజుల తర్వాత ఆవకాయ మొత్తం ఇంకోసారి కలిపి వాడుకోవాలి.


చేమగడ్డ పప్పు

కావలసినవి:
కందిపప్పు - 200 గ్రా.; చేమగడ్డలు - 200 గ్రా.; ఉల్లిపాయ - 1; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; గరంమసాలా పొడి - పావు టీ స్పూను; పసుపు - అర టీ స్పూను; మిరప్పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; ఆవాలు + జీలకర్ర - అర టీ స్పూను; టొమాటో - 1 (ముక్కలుగా తరగాలి); చింతపండు పులుసు - పావు కప్పు; ఉప్పు - తగినంత; నూనె - 3 టీ స్పూన్లు

తయారీ:
కందిపప్పు కడిగి నీళ్లు పోసి సగం పసుపు, కొంచెం నూనె వేసి ఉడికించాలి. చేమగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తబడేవరకు ఉంచాలి. పసుపు, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి నిమిషం సేపు వేయించి చేమగడ్డలు, వాటికి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. చేమగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, పచ్చి మిర్చి తరుగు వేసి అందులో చింతపండు పులుసు, అర కప్పు నీళ్లు పోసి, బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. చేమగడ్డలు మెత్తబడ్డ తర్వాత ఉడికించిన కందిపప్పు, తగినంత ఉప్పు వేసి కలిపి మరి కొద్దిసేపు ఉడికించాలి. గరంమసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.

సేకరణ
డా. వైజయంతి

కర్టెసీ: జ్యోతి వలబోజు

Thursday 26 June 2014

“కథానికా మాలిక”




తరచూ వివిధ సాహిత్య ప్రయోగాలకు ఆలవాలమైన ‘మాలిక’ పత్రిక ఈసారి మరో కొత్త ప్రయోగానికి నాంది పలికింది.. ఒకే అంశం మీద గతంలో కవితలు, పద్యాలు రాయించాం కదా. ఈసారి కొందరు రచయిత్రులను ఒకే కథావస్తువు పై కథానికలు రాయమని కోరడమైంది. ఆ పదిమంది రచయిత్రులు వెనువెంటనే స్పందించారు.

ఆ అంశం ... “ నాన్నంటే... ఓ కూతురి మాట..”

తండ్రీ కూతుళ్ల అనుబంధం తరతరాలుగా అపురూపమయిందే! కానీ అనాదిగా ఆడవాళ్లని అబలలుగా, ఆటబొమ్మలుగా భావించే నేటి సమాజంలో ఒక తండ్రి కంచే చేనుమేసిన చందాన ఆమె జీవితాన్ని ఏదో విధంగా బాధిస్తుంటే.. మరొక తండ్రి అంతులేని ధైర్యాన్నిచ్చి కూతురు జీవితాన్ని కాపాడుతున్నాడు. కొందరు ఉదాత్తులు కణ్వమహర్షులే అవుతున్నారు. “నాన్నంటే .. ఓ కూతురి మాట ” అనే కథాంశంపై కథలల్లమని ఈ రచయిత్రులను కోరింది మాలిక. నిర్ణీత సమయంలో అందిన కథలను చూస్తుంటే నిజంగా ఇంతటి వైవిధ్యం సాధ్యమా అని ఆశ్చర్యం కలిగింది. ఈ కధలలోని వ్యక్తులు మనకు ఎక్కడో ఒక చోట కలిసి , తెలిసి, పరిచయమై ఉంటారు. లేదా ఎక్కడో చదివి ఉంటాము. మన చుట్టూ ఉండే సమాజంలోని వ్యక్తులు, సంఘటనలు, సందర్భాలే కదా రచయితలకు, రచయిత్రులకు స్ఫూర్తినిచ్చేది వాటిని తమదైన శైలిలో అక్షరబద్ధం చేయించేది.. మాకు అందిన ఏ కథలోని విషయం మరొక కథలో కనబడలేదు. ఇంత విభిన్నమైన కధలను అందించిన ఈ పదిమంది రచయిత్రులను అభినందిస్తూ ముందుకు సాగుదాం..

ఈ కధలన్నింటిని చదివి విశ్లేషించినవారు మంధా భానుమతి.

మరి ఆ రచయిత్రులు...
పి.ఎస్.ఎమ్.లక్ష్మి
నండూరి సుందరి నాగమణి
జి.సుబ్బలక్ష్మి
సి.ఉమాదేవి
వారణాసి నాగలక్ష్మి
వి.బాలామూర్తి
మణి వడ్లమాని
సుజల గంటి
ఆర్.దమయంతి
సమ్మెట ఉమాదేవి

ఇంతే కాక ఈ అంశానికి, ప్రయోగానికి అద్భుతమైన చిత్రాన్ని వేసి ఇచ్చిన వాసు చెన్నుపల్లిగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము..

Sunday 8 June 2014

ఊహల ఉయ్యాల - ఊసుల జంపాల ( సాక్షి కవర్ స్టోరీ) 8.6.2014

 వివరం: బ్లాగ్ : రాధికకు తన చిన్ననాటి అనుభవాలు, ఆటలు గుర్తుచేసుకుని ఆ పాత జ్ఞాపకాలను తవ్వుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ భావాలను అక్షర రూపంగా మార్చుకోవాలనుకుంటుంది. కవితలు రాసే అలవాటున్నా వాటిని పత్రికలవాళ్లు తిరిగి పంపిస్తున్నారు. తనలోని భావావేశాన్ని ప్రకటించుకోవడం ఎలా అని మధనపడుతూ ఉంటుంది.

రమణ మంచి రచయిత. ఎన్నో రాయాలని ఉంటుంది కాని తను రాసినవన్నీ పత్రికలవాళ్లు అచ్చేయరు. దానితో అతనికి నిరాశే మిగులుతుంది. అశోక్ కొత్తగా విడుదలైన సినిమా చూసి చాలా ప్రభావితుడయ్యాడు. ఆ సినిమా గురించి చాలా మాటలు చెప్పాలని, స్నేహితులతో పంచుకోవాలని అనుకున్నాడు. కాని ఎలా?

ఇలా రాయాలనే కోరిక ఉన్నవాళ్లకి, సాహిత్యం, భాష మీద అభిమానం ఉన్నవాళ్లకి తమ మనసులోని భావాలను, అభిరుచులను, ఆలోచనలను మరికొంతమందికి తెలియజేయాలనుకునేవారికి సరియైన వేదిక ‘బ్లాగు’.
నేడు కంప్యూటర్, అంతర్జాలం (ఇంటర్నెట్) దాదాపు ఒక నిత్యావసర వస్తువుగా మారాయి. వారూ వీరూ అని కాకుండా ఉద్యోగస్తులు, విద్యార్థులు, విశ్రాంత ఉపాధ్యాయులు, మహిళలు చాలా విరివిగా వాడుతున్న అంతర్జాలంలో తమ తమ మాతృభాషలోనే చదువుకుంటూ, రాసుకునే అవకాశం ఉంది. అది కూడా ఎటువంటి ఖర్చు లేకుండానే. అచ్చ తెలుగులో చెప్పాలంటే బ్లాగు ఒక అచ్చుపత్రిక, ఆవకాయ నుండి అంతరిక్షం దాకా అన్ని విషయాలు ఇంట్లో నుండే ముచ్చటించుకునే అద్భుతమైన సాధనం అని కూడా చెప్పవచ్చు. అసలు ఈ బ్లాగు అంటే ఏమిటి? ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది?

ప్రారంభం
ఇంటర్నెట్ ప్రారంభం కాకముందే ఎలక్ట్రానిక్ సొసైటీలు ఉన్నాయి. అందులో ఒకటి హ్యామ్ రేడియో. బ్లాగులు ప్రారంభం కంటే ముందే యూజ్ నెట్, ఈమెయిల్ లిస్టులు, బులిటెన్ బోర్డులు మొదలైనవి వాడకంలో ఉండేవి. 1990లలో



వెబ్‌ఎక్స్ లాంటి ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్లు నిరంతరంగా సాగుతూ ఉండే సంభాషణలకు అనువైన సాఫ్ట్‌వేర్‌ను సృష్టించాయి. 1994 లో కాలేజీ విద్యార్థి జస్టిస్ హాల్‌ని బ్లాగటం మొదలుపెట్టినవారిలో ఒకరిగా భావిస్తారు. తర్వాత 1997 సంవత్సరంలో జాన్ బార్జర్ మొదటిసారి వెబ్ లాగ్ (Weblog)అనే పదాన్ని ఉపయోగించాడు. కాలక్రమేణా ఆ పదం We blog అంటూ తర్వాత Blog గా క్రియాపదంగా స్థిరపడిపోయింది.

అదే సమయంలో ప్రారంభమైన బ్లాగర్.కామ్ (2004 లో గూగుల్ సంస్థ దీనిని కొనుగోలు చేసింది) బ్లాగుల విస్తరణ, వినియోగాన్ని మరింత వేగవంతం చేసింది. 2003లో ఈ బ్లాగు అనే పదం నిఘంటువులలో చేరింది. బ్లాగు అనేది పర్సనల్ వెబ్‌సైట్ లాంటిదే. ఈ బ్లాగులకు కొత్త హంగులు చేర్చిన వ్యక్తి డేవ్ వైనర్. దీనికోసం ఆయన ఒక సర్వర్ సృష్టించాడు. ఎవరైనా బ్లాగరు తన బ్లాగులో మార్పులు, చేర్పులు చేయగానే ఈ సర్వరుకు తెలిసేది. బ్లాగులో బ్లాగ్ రోల్/ లిస్ట్, వ్యాఖ్యలు, విభాగాలు మొదలైన ముఖ్యమైన లింకులను తేలిగ్గా అమర్చుకునే వీలు కలిగింది. ఒకరి ఆధిపత్యంలో రాసే అవసరం లేకుండా బ్లాగు సొంతదారు నియంత్రణలోనే ఎవరి బ్లాగు వారు స్వేచ్ఛగా నిర్వహించుకునే అవకాశం కలిగింది. దానితో ఆయా బ్లాగులు వారి వ్యక్తిత్వాలను ప్రతిబింబించేవిగా ఉండేవి. Ritual Entertainmentసంస్థవారు 1997లో స్టీవ్ గిబ్సన్‌ను తమకోసం బ్లాగటానికి నియమించుకున్నారు. బహుశా అతనే మొదటి బ్లాగుద్యోగి అనవచ్చు.

బ్లాగులను రాయడం వరకు బానే ఉంది కాని వాటిని వేరే వాళ్లతో పంచుకోవటానికి, చదవటానికి వాటిని ఇంటర్నెట్‌లో హోస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. 1997లో ash Dot, Live Journal, Pitas.comపేర్లతో పలు హోస్టింగ్ సైట్లు ప్రారంభమయ్యాయి. 1998లో ైఞ్ఛ ఈజ్చీటడ ప్రారంభమై వేలాది కొత్త బ్లాగులు లేదా ఓపన్ డైరీల సృష్టికి పునాది వేయడమే కాదు, బ్లాగులలో రాసిన రాతలు చదివినవారు తమ అభిప్రాయాలను కూడా చెప్పగలిగే వీలు కల్పించింది. ఇప్పుడు అధిక శాతం బ్లాగర్లు ఉపయోగిస్తున్న బ్లాగర్.కామ్‌ను Evan Williams, Meg Hourihanలు ఆగస్టు 1999లో ప్రారంభించారు. తర్వాత గూగుల్ సంస్థ దీనిని కొనుగోలు చేసింది. అలా బ్లాగులు మెల్లిగా విస్తరిస్తూ 1999 నుండి వేగం పుంజుకున్నాయి.

అభిప్రాయాలు మాత్రమేనా?!
బ్లాగులంటే కేవలం తమ అభిప్రాయాలను వెల్లడించడమే కాదు, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి దోషులను శిక్షపడేలా చేయడం కూడా అని మొదటి బ్లాగు వివాదం ‘ట్రెంట్ లాట్ పతనం’ నిరూపించింది. 1948లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీచేసిన సెనెటర్ Strom Thurmondగౌరవార్థం ఇచ్చిన ఓ విందులో మరో నాయకుడు Trent Lott థర్మండ్‌లోని నాయకత్వ లక్షణాల కారణంగా ఆయన అమెరికాకు ఒక ఉత్తమ అధ్యక్షుడు కాగలడని వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని పత్రికలవాళ్లు ప్రస్తావించకున్నా, ప్రజలు సహించలేకపోయారు. ఎందుకంటే థర్మండ్ తన రాజకీయ జీవితపు తొలినాళ్లలో తెల్ల జాత్యహంకారుల సానుభూతిపరుడుగా ఉండేవాడు.

అందుకే అతనిని తీవ్రంగా ఖండించారు. తమ వాదనలకు సాక్ష్యాలను కూడా బ్లాగుల ద్వారా బయటపెట్టారు. ఆయన వ్యాఖ్యలు ఏదో పొరపాటున నోరుజారి చేసినవి కావని, లాట్ స్వతహాగానే జాతి దురహంకారి అని వాదిస్తూ ఆయన చేసిన మరికొన్ని ప్రసంగాలను, డాక్యుమెంట్లను వెలికితీసి వాటి గురించి తమ బ్లాగుల్లో రాశారు. ఈ వివాదం ముదిరి తీవ్రంగా మారడంతో ఒత్తిడి పెరిగి చివరికి సెనేట్ మెజారిటీ నాయకుడిగా లాట్ రాజీనామా చెయ్యవలసి వచ్చింది. ఇది ఏ పత్రికా విలేఖరి, సంస్థలకు తక్కువకాని విధంగా సామాన్య ప్రజలు తమ రాతలను, వ్యతిరేకతను బ్లాగుల ద్వారా సాధించిన విజయం.

బ్లాగుల ద్వారా సాధించిన మరో విజయం Rather Gateకుంభకోణం. సీబీఎస్ వార్తాసంస్థలో 60 మినిట్స్ అనే టీవీ కార్యక్రమంలో Don Ratherఅనే జర్నలిస్టు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ మిలిటరీ రికార్డులకు సంబంధించిన పత్రాలను చూపించాడు. కాని అవి నకిలీవని వాదిస్తూ, కొందరు బ్లాగర్లు తమ బ్లాగులలో రాశారు. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా చూపించారు. దానితో వార్త ప్రసారమైన మూడు రోజుల్లోనే సీబీఎస్ సంస్థ బహిరంగంగా తమ తప్పును ఒప్పుకుని, క్షమాపణ చెప్పక తప్పలేదు. దీనితో బ్లాగు ఒక వ్యక్తిగత రచనలకు ఉపయోగించే పుస్తకంలా కాకుండా వార్తామాధ్యమంగా ఒక శక్తివంతమైన సాధనం అని కూడా అందరూ గుర్తించారు. వినియోగదారుల ఫిర్యాదులను వెలుగులోకి తీసుకువచ్చే పని కూడా బ్లాగుల ద్వారా చేయడం మొదలుపెట్టారు.

ఇలా బ్లాగులు నడక మాని పరుగులు మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మొదలైంది. ఈ బ్లాగులను
 
 


హోస్టింగ్ చేయడానికి ఉచితంగా ఎన్నో సైట్లు ఉన్నాయి. మనం తరచూ వాడే మెయిల్ ఐడితో ఈ బ్లాగులను ప్రారంభించవచ్చు. అలాగే వెబ్‌లో బ్లాగులను నిక్షిప్తం చేసి ఆవిష్కరించడానికి ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో Blogger, Wordpress. Live journal Tumblr, Posterious... పేర్లతో నడుపబడుతున్న ఈ సైట్ల ద్వారా ఎవరైనా ఎక్కడున్నా తమ మాతృభాషలోనే బ్లాగులు మొదలుపెట్టి ఇష్టమున్నవన్నీ రాసుకోవచ్చు. వీటికి పైసా కూడా చెల్లించనక్కరలేదు.

నిరాటంకంగా నడపాలి
బ్లాగును నిరాటంకంగా నడపడం ఒక సరదా మాత్రమే కాదు, ఒక బాధ్యత. ఈ బ్లాగు వల్ల బోల్డు డబ్బు సంపాదించలేం, చాలామంది మందీమార్బలాన్ని సంపాదించలేం, మన రాతల వల్ల అందరినీ మార్చలేం. కానీ మన బ్లాగు వల్ల మనలో కలిగిన చిన్న మార్పు చాలు, ఇది విజయవంతమైనదని చెప్పుకోవడానికి. ఎందుకంటే మనం రాసేది ముందు మనకు ఉపయోగపడాలి.

బ్లాగులు ప్రారంభమైనప్పటినుండి సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చినా; ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు వచ్చినా బ్లాగులు తమ శోభను కోల్పోలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రముఖ భాషల్లో బ్లాగులు ప్రజ్వరిల్లుతున్నాయి. వెబ్‌సైట్లు ఏర్పాటు చేసుకోవడం సులువైనా కూడా బ్లాగులకున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత అస్సలు తరగలేదు. ఆసక్తి ఉన్నవాళ్లు తమ ఇంటి అడ్రెస్సు, ఫోన్ నంబర్‌లా బ్లాగు కూడా ఒక చిరునామాగా పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు.

మన దేశంలో 2004 నుండి బ్లాగులు విస్తరించడం ప్రారంభమైంది. అదే సమయంలో యూనీకోడ్ ఆవిష్కరణతో భారతీయ భాషలలో కంప్యూటర్లో టైప్ చేయడం చాలా సులువుగా మారింది. అప్పటినుండి బ్లాగులు ఒక ప్రభంజనంలా విస్తరించాయి. 2004లో మొదలైన తెలుగు యూనీకోడ్ అంతర్జాల విప్లవం బ్లాగుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది తెలుగువారిని మరింత దగ్గరగా చేసింది. బ్లాగులు రాసేవాళ్లే బ్లాగులు, వికీపీడియా, తెలుగు టైపింగ్ మొదలైన అంశాల మీద ప్రింట్ పత్రికలలో వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. టీవీలలో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు.

దీనితో తెలుగు బ్లాగులు మరింత వేగంగా వ్యాపించాయి. వివిధ సాఫ్ట్‌వేర్ల ద్వారా తెలుగు చదవడం, రాయడం సులభతరమైన తర్వాత, ఈ పరుగుకు అడ్డుకట్ట వేయడం అసాధ్యమైపోయింది. ఉద్యోగాలు చేసేవారే కాక విశ్రాంత ఉపాధ్యాయులు, తెలుగు పండితులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, గృహిణులు... ఇలా అందరూ బ్లాగుల ద్వారా తమలోని తృష్ణను తీర్చుకున్నారు. బ్లాగు రచనలు పత్రికా రచనలకు దీటుగా ఉన్నాయి. పాటలు, పద్యాలు, కవితలు, కథలు, వంటలు, పుస్తకాలు, సినిమాలు, సరదా రాతలు, సాంకేతిక పాఠాలు, విద్యకు సంబంధించిన అంశాలు... ఇలా ఎన్నో బ్లాగులు తెలుగులో ప్రారంభమయ్యాయి. ఈ బ్లాగుల రచనలను గురించిన సమాచారం కోసం అగ్రిగేటర్/ సంకలనం తయారుచేసుకున్నారు.

కూడలి, మాలిక, జల్లెడ వంటివి ప్రింట్‌లో ఉన్న పత్రికలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉన్న బ్లాగు రచనలు వాటికి గట్టి పోటీనిస్తున్నాయని అందరూ ఒప్పుకునే మాటే. తమ రచనలను పత్రికలవాళ్లు అంగీకరించరేమో, ప్రచురించరేమో అన్న దిగులు లేకుండా ఎంచక్కా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో తమ సొంత పత్రిక లాంటి బ్లాగులో రాసుకుంటున్నారు. వీటిని సందర్శించి, చదివి స్పందించే చదువరులు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. తప్పులు, దిద్దుబాట్లు ఉన్నా నిర్మొహమాటంగా వ్యాఖ్యల రూపంలో తెలియజేస్తున్నారు. వీటివల్ల సదరు బ్లాగరుకు తమ రాతలను మరింత సానబెట్టే అవకాశం లభిస్తుంది. ఈ మాటలు నిజమని హిందీ, తమిళ బ్లాగర్లు కూడా ఒప్పుకుంటారు. బ్లాగులు రాసేవారిలో ప్రముఖులెందరో ఉన్నారు. రచయితలు, సినిమా తారలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు ఎందరో తమ మాటలను బ్లాగుల ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేకున్నా, బ్లాగు రాతలు, వ్యాఖ్యల ద్వారా ఒకరికొకరు పరిచయమవుతున్నారు.

తెలుగు బ్లాగు పదకోశం
అంతర్జాలం, బ్లాగరి, బ్లాగోతం, బ్లాగావరణం, బ్లహసనం, బ్లాస్యం, బ్లాక్కవిత, బ్లాక్కధ, బ్లాగుడు, బ్లాగుడుకాయ, బ్లాగుసందడి, బ్లాగ్శోధన, బ్లాగ్పటిమ, బ్లాగ్శూరుడు, బ్లాగ్ధానం, బ్లాగ్ధోరణి, బ్లాగ్మాయ, బ్లాజకీయాలు, బ్లాశ, బ్లూతు, బ్లోటో, బ్లాగ్మయం... ఇలా తెలుగులో బ్లాగు పదకోశం వృద్ధి చెందుతూ వచ్చింది. ఇంత ప్రాచుర్యం పొందిన బ్లాగుల ద్వారా ఆదాయం అనేది కష్టమే కాని అసాధ్యమేమీ కాదు. వాస్తవ ప్రపంచమైనా, మిధ్యా ప్రపంచమైనా బ్లాగు లోకమైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. కాని చెడుకు త్వరగా వ్యాపించే గుణముంది. ఉచితం, నియంత్రణ లేకపోవడంతో తమ బ్లాగును దుర్వినియోగపరిచే అవకాశం లేకపోలేదు. బ్లాగుల్లో కూడా కాలుష్యం పెరుగుతుంది.

జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లాగర్స్ డే. ఇంటర్నెట్ ద్వారా వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించేవారిని వెబ్ బ్లాగర్స్ అంటారు కదా. దాన్నుంచి పుట్టిందే బ్లాగింగ్ ప్రక్రియ. 1993 జూన్‌లో ఇది మొదలైంది. 2003లో మొదటిసారిగా జూన్ 9ని బ్లాగర్స్ దినోత్సవంగా జరుపుకున్నారు. తర్వాత ఏడాదికి ఆ రోజును జూన్ 14కు మార్చారు. ప్రస్తుతం ఇదే రోజును అంతర్జాతీయ బ్లాగర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుండి వందలు, వేల మంది బ్లాగర్లందరూ శక్తివంతమైన అక్షర, పదప్రయోగాలతో రచనలు చేస్తూ, తమలోని శక్తికి బ్లాగు ద్వారా గుర్తింపు లభించినందుకు పండగ జరుపుకునే రోజు ఇది. ఈ సంబరాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లాగర్లు పోటీలు, సమావేశాలు మొదలైన సామూహిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇవి బ్లాగుల ద్వారానే కాక ప్రత్యక్షంగా కూడా జరుగుతుండడం విశేషం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రెంట్ లాట్‌పై విరుచుకుపడుతూ సాక్షాధారాలతో సహా అతడి వ్యాఖ్యలు నిజం కాదని నిరూపించిన బ్లాగర్లు

కాని దాన్ని అడ్డుకట్ట వేయడం మిగతా బ్లాగర్ల బాధ్యత. కుల, మత, వర్ణాహంకార రాతలు, వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, అశ్లీల రాతలు, ఫొటోలు, ద్వేషాలు... కనిపిస్తున్నాయి. ఇతర వ్యక్తులను, మతాలను, దేశాలను దూషిస్తూ రాసిన బ్లాగర్లను అరెస్టు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తమ సంస్థలోని గుప్తంగా ఉన్న విషయాలను బ్లాగులో రాసినందుకు ఒక కంపెనీవారు ఆ బ్లాగరుపై పోలీస్ కంప్లయింట్ చేసి ఉద్యోగం నుండి తీసేశారు. అంతర్జాలం అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడవచ్చు. కూరగాయలు తరిగి భోజనం పెట్టవచ్చు. కుత్తుక కోసి ప్రాణాలు తీయవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉపయోగించుకుని లాభపడాలి. పదిమందికి స్ఫూర్తిగా నిలవాలి.

- జ్యోతి వలబోజు

Friday 6 June 2014

మాలిక పత్రిక జూన్ 2014 సంచిక విడుదల

Jyothivalaboju

Chief Editor and Content Head


మాలిక పత్రిక  జూన్ నెల సంచిక మరిన్ని హంగులతో, మీకు నచ్చిన కధలు, సమీక్షలు, సీరియల్స్ తో మీ ముందుకు వచ్చింది..
వచ్చే నెల మాలిక పత్రికలో ఒక విశేషముంది.. కాస్త ఓపిక పట్టండి...

మీ రచనలను పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ జూన్  2014 సంచికలోని విశేషాలు..

01. తెలుగులో సుదీర్ఘమైన సమాసం ఏది?
02. మాలిక పదచంద్రిక - జూన్ 2014
03. చంపకమాలనుండి మత్తేభవిక్రీడితము
04. అనగనగా బ్నిం కథలు - 10
05. అండమాన్ డైరీ - 5
06.  సరిగమలు గలగలలు - 6
07. మాయానగరం - 4
08. మౌనరాగం - 7
09.  వాళ్లు - సమీక్ష
10.  అమ్మకథలు - సమీక్ష
11.  ఇద్దరు మిత్రులు - 1
12.  భార్యాభర్తలు - 3
13. సీతా స్వయంవరం - గౌసిప్స్
14.  హ్యూమరథం - 5

Monday 2 June 2014

మాలిక పదచంద్రిక - మే 2014 ఫలితాలు





మే నెల పదచంద్రిక కి 4 పూరణలు వచ్చాయి ...  వాటిలో శుభావల్లభ, భమిడిపాటి సూర్యలక్ష్మి, కోడిహళ్ళి మురళీమోహన్ గార్లు ఒక తప్పు (నీళ్ళులేకుండా మందుని 'రా' గా తాగాలి) తో పూరించారు. విజయజ్యోతి గారు అన్నీ సరిగా రాసారు. మే నెల విజేతలు వారే.  రెండు ఆధారాల్లో వాస్తవాలు తప్పుగా వ్రాసా. తలకోన చిత్తూరు లో ఉంది, కడప కాదు.  మాలాలా పాకిస్తాన్ అమ్మాయి.  సరిచూపిన విజయజ్యోతి గారికి, మోహన్ గారికి కృతజ్ఞతలు.

                                                                                                                                            డా.సత్యసాయి కొవ్వలి..

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008