Tuesday 31 May 2011

మరో షడ్రుచుల సాహిత్యం - రుచుల్ రుచుల్ గా

అంతర్జాలానికి వచ్చిన కొత్తలో పొద్దు పత్రిక కోసం చేసిన మొదటి ప్రయోగం షడ్రుచుల సాహిత్యం. కొత్తపాళి గారి సహకారంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. దాన్ని కొంచం మెరుగులు దిద్ది మరి కొన్ని పద్యాలు చేర్చి రాసిందే షడ్రుచోపేతమైన సాహితీ విందు. అలా మొదలైంది నా సాహితీ ప్రస్థానం.. భోజనం మరియు పద్యాలు ఎందుకో నన్ను వెంటనే ఆకర్షిస్తాయి. అందుకే ఈ రెండింటిని కలిపి రాసిందే మరో షడ్రుచుల సాహిత్యం.. ఈ రుచుల్ రుచుల్ గా .. జూన్ నెల చిత్ర మాసపత్రికలో ప్రచురించబడింది.





అన్నదాతా సుఖీభవః..

కడుపునిండుగా , రుచికరమైన భోజనం తిన్నతర్వాత ప్రతీ ఒక్కరు అనుకునే మాట ఇది. ఈ భోజనం షడ్రుచోపేతమైనదే కానక్కరలేదు. అందుకేనెమో భోజనం దేహి రాజేంద్ర ! ఘృత సూప సమన్వితమ్ ( ఓ రాజా! నెయ్యి,పప్పుతో కూడిన భోజనం ఇవ్వు ) అన్న కవి మాటకు మహాకవి కాళిదాసు మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం ధధి: ( పండువెన్నెల వంటి తెల్లని పెరుగుతో అన్నం పెట్టవయ్యా) అని పూరించాడు.



మనుష్యులందరికీ కూడు, గూడు, బట్ట తప్పకుండా కావలసినవి. అందులో తిండి చాలా ముఖ్యం. కోటి విద్యలు కూటికొఱకే అని ఊరకే అనలేదు. ఆకలిగొన్నవాడికి భైరవి రాగం కంటే , రవివర్మ చిత్రం కంటే పప్పన్నమే మేలు. కన్నులనిండు కంటే కడుపు నిండే ఘనమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు ఒప్పుకోవలసిందే.



వృత్తులన్నింటిలోనూ వంట వృత్తి మొదటిది అని మహాకవి గంగాదాసు గారి సూత్రము. ఈ పాక కళకి ఆరు రసములు (షడ్రుచులు) ఉండగా కవితకు తొమ్మిదిరసాలు (నవరసాలు) ఉన్నాయి. షడ్రుచులు వంటకు తప్పనిసరిగా అవసరమైనవి. కాని నవరసాలలో అన్నీ ప్రాణమని చెప్పలేము. ఏది ఉంచినా,తీసివేసైనా జరిగే నష్టమేమి లేదు. కాని షడ్రుచులలో ఏ ఒక్కటి తగ్గినా,తీసివేసినా వండినదంతా పెంటలో పడేయక తప్పదు అని సాక్షిలో కామకవిగారు వాపోయారు.



భోజనం అనగానే ముందుగా గుర్తొచ్చేది అమ్మ చేతి వంటె. ప్రతీ అమ్మ అన్నపూర్ణే కదా. భర్త కోసం ఇష్టమైన వంటకాలు చేసిపెట్టు అతనికి ప్రేమతో వడ్డిస్తుంది ఇల్లాలు. అతను ప్రీతికరంగా తింటే తాను తృప్తి పడుతుంది ఆ ఇంతి. దానికి ఆ శ్రీనివాసుడు కూడా అతీతుడు కాడు అని అన్నమయ్య స్తుతిస్తున్నాడు.


ఇందిర వడ్డించ నింపుగను


చిందక యిట్లే భుజించవో స్వామి


అక్కాళపాశాలు అప్పాలు వడలు


పెక్కైన సయిదంపు పేణులును



సక్కెరరాసులు సద్యోఘృతములు


కిక్కిరియ నారగించవో స్వామి


మీరిన కెళంగు మిరియపు దాళింపు


గూరలు కమ్మనికూరలును


సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే


కూరిమితో జేకొనవో స్వామీ


పిండివంటలును పెరుగులు

మెండైన పాశాలు మెచ్చి మెచ్చి


కొండలపొడవు కోరి దివ్యాన్నాలు


వెండియు మెచ్చవే వేంకటస్వామీ



ఇందిరాదేవి ప్రేమగా ఆ స్వామికి వడ్డించిన వంటకాలు ఏంటయ్యా అంటే నేతి పాయసాలు, అప్పాలు, వడలు, చక్కెర రాసులు, మిరియపు తాళింపు పెట్టిన కమ్మని కూరలు, పచ్చళ్లు, పిండివంటలు, పాలు , పెరుగు మొదలైనవి. అంటే ఆ కాలంలో స్వామివారికి ఈ వంటకాలు నిత్యం నివేదించేవారేమో. శ్రీవారి సేవల ఇలా ఉంటే కృష్ణాతీరంలోని అప్పన్న వాళ్లావిడకు చుట్టాలొచ్చారని ఎక్కువ హైరానాపడకు అంటూ ఇదిగో ఇలా కానిచ్చేయమన్నాడంట.



"పెందలాడే కాస్త పప్పూ అన్నం బెడుదూ. చుట్టాలొచ్చారని, నవకాయ పిండివంటలు జేసేవ్. వంకాయ నాలుగు పచ్చళ్లు చేసి పోపులో వేసి, ఆనపకాయ మీద యింత నువ్వుపప్పు చల్లి, అరటిదూట మొఖాన యింత ఆవెట్టి, తోటకూర కాడల్లో యింత పిండిబెల్లం పారేయ్. కొబ్బరీ, మామిడీ, అల్లం యీ పచ్చళ్లు చాల్లే...పెరుగులో తిరగమోతపెట్టి దాన్లో పది గారె ముక్కలు పడేయ్. రవంత శెనగపిండి కలిపి మిరపకాయలు ముంచి చమురులో వెయ్. సరే క్షీరాన్నమంటావా?అదో వంటా? ములక్కాయలు మరి కాసిని వేసి పులుసో పొయ్యి మీద పడేయ్. యీపూటకు యిల్లా లఘువుగా పోనీయ్. ఇదిగో నేను స్నానం చేసి వస్తున్నాగాని,ఈలోగా, ఓ అరతవ్వేడు గోధుంపిండి తడిప్పెట్టూ, రత్తమ్మొస్తే నాలుగు వత్తి అలా పడేస్తుంది. మధ్యాహ్నం పంటికిందకు వుంటాయ్.."



మరి ఆవిడ అలాగే చేసిపెట్టిందో, అట్లకాడ తిరగేసిందో మల్లాది రామకృష్ణశాస్త్రిగారే చెప్పాలి.



సాహిత్యంలో కూడా కవులు పండితులు భోజనానికి పెద్ద పీటే వేశారు.అందుకే బమ్మెరపోతన అప్పడుపుకూడు భుజించుటకంటే సత్కవులు హాలీకులైననేమి? అని కవితాకన్యకను విక్రయించగా వచ్చే సొమ్మును నిరసిస్తే , శ్రీ శ్రీ సత్కవుల్ హాలీకులైననేమి? ఆల్కహాలీకులైననేమి? అని తనకోసం, తనలాంటి వారికోసం మార్పు చేసుకున్నారు.



శ్రీనాధుడు తన 'సిరియాళ చరిత్ర" లో..బ్రహ్మణుడైనా..బహుశా పెద కోమటి వేమా రెడ్డి గారింట్లో చూసాడో ఇంకెక్కడ చూసాడో మరి.. మాంసాహారాన్ని ఎలా వర్ణించాడో చూడండి. వినే వారికి నోరు వూరడం తధ్యం.



మిరియము నుల్లియున్ బసుపు మెంతియు నింగువ జీరకంబు శ
ర్కరయును జింతపండును గరాంబువు గమ్మని నేయి తైలమున్
బెరుగును మేళవించి కడు పెక్కు విధంబుల బాక శుద్ధి వం
డిరి శిరియాలునిం గటికి డెందమునం దరళాక్షు లిద్దరున్.



మరికొన్ని రుచులను కూడా అందించాడు శ్రీనాధుడు..



కమ్మగాగాచిన కట్టు నంజుళ్ళను నీరు వెళ్ళగ నొత్తి నేత వేచి
చక్కగా దరిగిన నన్న మాంసంబులు పరిపాటిమైజుర్రుబదనువండి
మూల్గు టెంకులతోద ముదక గాకుండగ జాదు చేసిన నల్ల చారు గాచి
వలయు సంబరాలు వడియాలు బలియించి దళమైన క్రొవ్వు తో దాలబోసి



షడ్రసోపేతములు గాక జతుర భంగి
నమృత పాకంబులుగ జేసి రాక్షణంబ
సెట్టి శిరియాలు వంశాబ్ధి శీతకరుని
సతులు తిరువెంగనాచియు జందకనియు.



అంతేనా! కొందరు భక్తవరేణ్యులకు ఆ పరమాత్మ నామమే ఎంతోరుచిగా ఉండేదంట..



ఓ రామ నీనామ ఏమి రుచిరా .. శ్రీరామ నీనామ ఎంత రుచిరా


మధరసములకంటే దధిఘృతములకంటే...అతిరసమగు నామమేమి రుచిరా


నవరస పరమాన్న నవనీతములకంటే... నధికమౌనినామ మేమి రుచిరా


ద్రాక్షఫలముకన్న ఇక్షురసముకన్న....పక్షివాహన నామమేమి రుచిరా..



అని రాందాసు పాడగా, త్యాగరాజ స్వామి ఇంకో మెట్టు పైకెక్కి "స్వరరాగలయ సుధారసమందు వరరామ నామమనే ఖండ శర్కర మిశ్రము చేసి భుజియిం"చమన్నారు. భక్తాగ్రేసరులకు ఆ దేవదేవుని నామమే అత్యంత రుచికరంగా ఉంటుందంట. అందుకేనేమో



ఉ. చిక్కని పాలఁపై మిసిమి చెందిన మీగడ పంచదారతో


మెక్కిన భంగి నీ విమల మేచక రూప సుధారసంబు నా


మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్


దక్కెనటంచు జుర్రెదను, దాశరధి కరుణా పయోనిధి..



చిక్కని పాలమీద కట్టిన మీగడలో పంచదార కలుపుకుని తింటే ఎంత రుచిగా ఉంటుంది. ఈ మాట వింటుంటేనే నోరూరుతుంది మరి ఆ రుచి,తియ్యదనం భద్రాచల రామదాసుకు శ్రీరాముడి నిర్మలమైన, నీలమేఘ రూపం అనే అమృతాన్ని జుర్రుకున్నట్టుగా ఉంటుందంట. పైగా ఆ మధురర్సాన్ని తన భక్తి అనే పళ్లెంలో సేవావృత్తి అనే దోసిటిలో పోసుకుని జుర్రుకుంటాడంట. అటువంటివాడికి ఏ పరమాన్నము, పాయసము రుచిగా ఉంటుంది.



స్వామిభక్తి, ప్రభుభక్తి గురించి మాట్లాడుతుంటే ఓ మహాకవి మాటలు గుర్తొచ్చాయి.



సీ. అధిపాన్న రాయలే ఆస్థాన పండితుల్


ఘనుడగు పెద్దన్న కందిపప్పు


అష్టదిగ్గజములే అష్టావకాయలు


ఆ రామలింగంబు చారు పులుసు


అప్పడాలు వడియాలు ఆ చోపుదారులు


రమ్య పచ్చళ్లు పారా జవాన్లు


పరమాన్న పాత్రంబు భట్టు మూరితి కవి


ఆతిమ్మకవిరాజు నేతిదొన్నె.



గీ. పప్పుకూరలు సంగీత పాటగాళ్లు


మెంతిపెరుగులు భోగము మేళములును


ఊరుబిందులు చిల్లర వారలెల్ల


మేలు అప్పాజి ఊరిన మిరపకాయ.




అంటూ రాయలవారి ఆస్థానాన్ని షడ్రుచోపేతంగా చేసారు. అష్టదిగ్గజాలు ఎనిమిద రకాల ఆవకాయలు కాగా, అల్లసాని పెద్దన్న కందిపప్పు, రామలింగడు చారు, భట్టుమూర్తి పరమాన్న పాత్ర, తిమ్మరాజు నేతిగిన్నె, పారాజవాన్లు రమ్యమైన పచ్చళ్లు, చోపుదారులేమో అప్పడాలు, వడియాలు అయ్యారు. ఇక సంగీత పాటగాళ్ల సంగతి వస్తే వాళ్లేమో పప్పుకూరలు, భోగం మేళగాళ్లు మెంతిపెరుగులు, చిల్లర వాళ్లు ఊరుబిందెలవలె నుండగా అప్పాజీ ఐతే ఊరిన మిరపకాయ అని పోల్చారు. ఆహా ఏమి ఘుమఘుమలో కదా. ఇది వింటేనే నోరూరిపోతుంది. కాదంటారా? రాయలవారి సంగతి తర్వాత ముందు ఈ పదార్థాలన్నీ ఎవరైన వడ్డిస్తే బావుండు అని అనిపించక మానదు.



రాయలవారి మాట వచ్చినందుకు ఆయన రచించిన ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుని ఆతిధ్యం ఎలా మరువగలం? ఆయా కాలాలకు అనుగుణంగా ఆహారాన్ని తయారుచేసి వడ్డించేవాడు ఆ మహాత్ముడు.



చ. గగనము నీరుబుగ్గ కెనగా జడివట్టిననాళ్లు భార్య కన్
బొగ సొరకుండ నారికెడంపుంబొఱియ ల్దవిలించి వండ న
య్యగపల ముంచిపెట్టుఁ గలమాన్నము నొల్చినప్రప్పు నాలు గే
న్పొగపినకూరలున్ వడియముల్ వరుగుల్ పెరుగున్ ఘృతప్లుతిన్




వానాకాలంలో నీరు తీసేసి ఎండబెట్టిన కొబ్బరికాయల టెంకలతో పొయ్యి వెలిగించగా అతని భార్య వివిధ రకములైన శాకములు తయారు చేస్తుంది. ఆ టెంకాయ చిప్పలనే గరిటలుగా వరి అన్నము, పొట్టు తీసిన పప్పు బద్దలతో వండిన పప్పు, నాలుగైదు తాళింపుకూరలు, వడియాలు, వరుగులు, పెరుగు, నెయ్యితో కలిపి అతిథులకు వడ్డించేవాడు విష్ణుచిత్తుడు.



చ . తెలినులివెచ్చ యోగిరముఁ దియ్యని చారులుఁ దిమ్మనంబులున్
బలుచనియంబళు ల్చెఱకుపా లెడనీళ్లు రసావళు ల్ఫలం
బులును సుగంధిశీతజలము ల్వడపిందెలు నీరుఁజల్లయు
న్వెలయఁగఁ బెట్టు భోజనము వేసవిఁ జందనచర్చ మున్నుగన్



ఎండాకాలంలో ఐతే అతిథులకు ముందుగా చల్లబడడానికి చందనం ఇచ్చి,తర్వాత తెల్లని, గోరువెచ్చగా ఉన్న అన్నము, తియ్యని చారులు, మజ్జిగపులుసులు, పలుచని అంబలి, చెఱకు పాలు, లేత కొబ్బరికాయ నీళ్ళు, భక్ష్యములు, వివిధ రకములైన ఫలాలు, వట్టివేళ్ళు మొదలైనవాటితో చల్లబరిచి, సుగంధభరితం చేసిన మంచి నీరు, శరీరానికి వేడి చేయకుండా ఉండడానికి






ఊరవేసిన మామిడిపిందెలు, మజ్జిగ మొదలగు పదార్థములతో సుష్టుగా భోజనము పెట్టేవాడు.


మ.పునుఁగుం దావి నవౌదనంబు మిరియంపుం బొళ్లతోఁ జట్టి చు
య్యను నా దాఱని కూరగుంపు, ముకుమం దై యేర్చునావం జిగు
ర్కొనువచ్చళ్లును, బాయస్నానములు, నూరుంగాయలున్, జేసుఱు
క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారం బిడున్ శీతునన్.



ఇక గజగజ వణికించే చలికాలంలోకూడా ఎటువంటి లోటు చేయకుండా కమ్మని రాజనాల బియ్యంతో వండిన వేడి వేడి అన్నము, మిరియాల పొడితో తిరగమోత పెట్టగా చుయ్యిమనుచు ఘుమ ఘుమలాడే కూరలు, ముక్కులోని జలుబును కూడా తక్షణమే వదలగొట్టగల ఆవపిండి వేసి గుచ్చెత్తిన ఊరగాయలు, చేతి మీద పడగానే చుర్రుమనే వేడి నెయ్యి, గోరువెచ్చని పాలతో సుష్టిగా భోజనం పెట్టేవాడు.



ఇలా తన సౌలభ్యం గురించి ఆలోచించకుండా ఆతిధుల సౌఖ్యము, ఆరోగ్యము కూడా దృష్టిలో పెట్టుకుని పలురకములైన వంటకాలను వినయవిధేయతలతో వడ్డించి వారిని సంతృప్తి పరచేవాడు విష్ణుచిత్తుడు.

భోజనం సంగతి సరే మరి చల్లని సాయంకాలవేళ అందరికి గుర్తొచ్చేది, నోరూరించేది, అందరికి తెలిసినదే పకోడీలు. మరి పకోడీలు అనగానే అశువుగా పద్యాలల్లేసారు చిలకమర్తివారు.. అంత గొప్ప రుచి కదా..


వనితల పలుకుల యందున
ననిమిషలోకమున నున్నదమృతమటంచున్
జనులనుటెగాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!



ఓ పకోడీ! స్త్రీల మాటల్లోనే అమృతం ఉందని ఈ లోకంలోని జనులంటారేగాని తెలుసుకుంటే నీలోనే అమృతం వుంది.



ఆకమ్మదనము నారుచి
యాకరకర యాఘుమఘుమ మాపొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు నిజము పకోడీ!



ఓ పకోడీ! ఆ కమ్మదనము, ఆ రుచి, ఆ కరకర ధ్వనులు, ఆ ఘుమఘుమలు, ఆ చక్కదనము, వడుపు, నీకే తగును గానీ మరెందులోనూ లేవు ఇది నిజము.



నీకరకర నాదముబు
మాకర్ణామృతము నీదు మహితాకృతియే
మాకనుల చందమామగ
నేకొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!



నీ కరకర శబ్దాలే మా వీనులకు విందులు. నె సుందరమైన రూపమే మా కనులకు చందమామ. నిన్ను గురించి నేను గొప్పగా చెపుతుంటాను పకోడీ.


ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలుపిండివంటలెల్లను హా! నీ
ముందర దిగదుడుపునకవి
యందును సందియము కలుగదరయ పకోడీ!



పరమాన్నము, రకరకాల పిండివంటలు ఎందుకు? నీ ముందు అవన్నీ నిస్సందేహంగా దిగదుడుపే. వాటికన్నా నీవే గొప్ప పకోడీ.


ఆరామానుజు డాగతి
పోరునమూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడుగాక య
య్యారే నిను గొనిన బ్రతుకడటనె పకోడీ!



లక్ష్మణుడు మూర్చపోయినపుడు హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తెచ్చాడు గానీ నిన్ను తీసుకపోయి వుంటే బ్రతుకడంటావా పకోడీ!




పురహరుడు నిన్ను దినునెడ
కరుగదె యొక నన్నెనలుపు గళమున మరిచం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్లు యుండగలదె పకోడీ!



పరమేశ్వరుడు నిన్ను తినివుంటే ఆయన కంఠంలోని నలుపు పోయేది కదా! అలాగె చందురుడు నిన్ను తిని వుంటే ఆయనపై వున్న మచ్చలు ఇన్నాళ్లు వుండేవా పకోడీ!


కోడిని దినుటకు సెలవున్
వేడిరుమును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడివల దాబదులు గప
కోడిందిను మనుచు జెప్పెకూర్మి పకోడీ!!



పూర్వము బ్రాహ్మణులు కోడిని తినేటందుకు అనుమతించమని బ్రహ్మను వేడుకోగా మీకు కోడి వద్దుగాని దాని బదులు పకోడీ తినమని చెప్పాడట. ఆ విధంగా వచ్చిందే " పకోడీ" మనకు అంటున్నారు చిలకమర్తివారు హాస్యానికి..


పకోడీలకు జతగా మిరపకాయ బజ్జీలు మరచిపోతే ఎలా??



"ఐదు గంటల వేళ ఆదారి వ్రెక్కగా చుయ్యుమనును, గూబ గుయ్యుమనును
పచ్చి మిరప కాయ, కచ్చి రేపెడియట్లు గుచ్చి చూచుచునుండు గుండెవైపు
శనగ కవచనూనె సలసలా వేగుచో, కడుపులో రసనాడి కదలసాగు
ముక్కకొరికినంత ముల్లోకములయాత్ర చేతకాసులు లేక చేయగలడు
ధనము వెచ్చించి కన్నీళ్ళు కొనగజేయు మిరప బజ్జీల రుచిని నే మరువలేను
ఒక్కటో, రెండు మంచిది, ఎక్కువైనా సచినుటెండూల్కరుడు మాకు సాటిరాడు"



చల్లనివేళ వేడి వేడి పకోడీలు, మిరపకాయ బజ్జీలు తింటే చాలా బావుంటుంది కాని వీటికోసం తప్పకుండా అవసరమైనది ఉల్లిపాయ.



" ఓ ఉల్లిపాయా! నమో యుల్లిపాయా! నినుం బూజగావింతు నీ వాసనల్లేక నే కూరయుం గూడ నేదో మరో మట్తి దిన్నట్టుగా దోచు ... మా కాంక్షలందీరచవే, పూర్వకాలంబులో రీతిగా కూరలన్నింటికిన్ కొత్త టేస్టుల్ ప్రసాదించు మా జిహ్వకుం దృప్తి చేయంగదమ్మా! నమస్తే నమస్తే నమస్తే నమః "



ఇప్పటికే భుక్తాయాసమైనట్టుంది.



పూగీ ఫలసమాయుక్తం


నాగవల్లీ దళైరుత్యమ్


కర్పూరచూర్ణ సంయుక్తం


తాంబూలమ్ ప్రతి గృహత్యామ్..



అంటూ చివరిగా తాంబూలం అందుకోండి...

Friday 13 May 2011

చిన్నారి పెళ్లికూతురాయెనే ....




బుడి బుడి అడుగులతో, చిరుమువ్వల సవ్వడితో ఇల్లంతా తిరుగుతూ, అందరిని తన ముద్దు మురిపాలతో కట్టిపడేసిన మా అమ్మాయి దీప్తి ఈరోజు మరో ఇంటికి మహారాణిగా తనకంటూ ఒక కొత్త బంగారు లోకాన్నినిర్మించుకోవడానికి అజయ్ తో వివాహబంధంలో ఒకటవుతుంది. మమ్మల్ని వదిలి వెళ్తుంది అన్న బాధ ఉన్నా తప్పదుగా ఆడపిల్ల ఏనాటికైనా ఆడపిల్లే.. ఇద్దరూ స్నేహితుల్లా కలకాలం కలిసి మెలసి ఉండాలని మీరందరూ కూడా ఈ జంటను దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను.




అలాగే ఈ పెళ్లి పాటలు వినేయండి మరి..











Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008