Saturday 27 February 2010

మీ తెలుగు వినియోగం ఎంత?






తెలుగు వాళ్లమై ఉండి , తెలుగు దేశంలో ఉండి, తెలుగు బ్లాగులు రాస్తూ తెలుగు వినియోగం అంటున్నానేంటి అనుకుంటున్నారా?? ఏం చేస్తాం మరి. తప్పదుగా. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీషు మాత్రమే మాట్లాడే భాష, తెలుగు అంటే ఏంటి? అంటున్నారు. తెలుగు మాట్లాడితే శిక్షలు తప్పడంలేదు పిల్లలకు. తల్లితండ్రులకు కూడా తమ పిల్లలు వాస్ పీస్ అంటూ ఇంగ్లీషులో మాట్లాడేయాలి అని చిన్నారుల తొలిపలుకులు కూడా ఇంగ్లీషుతోనే మొదలుపెడుతున్నారు. ఐతే గీతే ఇప్పటి పిల్లలకు తెలుగు మాట్లాడ్డం వస్తుంది కాని రాయడం , చడవడం మాత్రం సున్నా. ఏమంటే స్కూల్లో చెప్పరు, ఇంట్లో చెప్పడానికి మాకూ టైం లేదు, పిల్లలకూ టైం లేదు అంటున్నారు. కాదంటారా?? అందుకే తెలుగు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన దరిద్రం పట్టింది.


పిల్లల సంగతి వదిలేద్దాం. ఈనాడు కంప్యూటర్, అంతర్జాలం వాడకం గణనీయంగా పెరుగుతుంది. స్కూలు పిల్లాడికి కూడా కంప్యూటర్ పాఠాలు, ప్రాజెక్టులు తప్పడంలేదు. దానికోసం తల్లితండ్రులు ఇంట్లో కంప్యూటర్, జాల అనుసంధానం ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు సరే తమ అవసరాల కోసం కంప్యూటర్ వాడుకుంటున్నారు. అదంతా ఇంగ్లీషులోనే అని వేరే చెప్పనక్కరలేదు. మరి అంతర్జాలం అంటే మొత్తం ఇంగ్లీషేనా. ఆ భాష రానివారి గతేంటి? కంప్యూటర్లో తెలుగు రాయడం ఎలా? దానికోసం ఏదైనా సాఫ్ట్ వేర్ కొనాలా? అది నేర్పేవాళ్లెవరు. ఇలా సవాలక్ష సందేహాలు. మూడేళ్ల క్రిందవరకు కంప్యూటర్లో తెలుగు వాడకం అనేది చాలా తక్కువగా ఉండేది. కాని లేఖిని మొదలైన పనిముట్ల సాయంతో ఇంగ్లీషు రాసినంత సులువుగా తెలుగు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా రాయగలుగుతున్నాము. క్రమ క్రమంగా ఈ భాషావ్యాప్తి ఒక ఉద్యమంలా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. బ్లాగులు, వెబ్సైట్లు ఎన్నో తెలుగులో దర్శనిమివ్వసాగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఇప్పుడు తాము మాట్లాడుకున్నంత సులువుగా తెలుగురాయగలుగుతున్నారు. సమాచార , విషయ పరిజ్ఞానాన్ని అతివేగంగా విస్తరింపచేస్తున్నారు.

తెలుగు వినియోగం ఒక వెల్లువలా ఎగసి నలుదిసలా వ్యాపించింది. వంటలైనా, పాటలైనా, పురాణాలైనా, ప్రబంధాలైనా , మన చిన్నప్పుడు చదువుకున్న చందమామలు శతకాలైనా, సంబరాలైనా .. మనకు కావలసిన సమాచారం తెలుగులో లభ్యమవుతుంది. అది మీకు తెలుసు .. చివరకు జిమెయిల్, ఆర్కుట్ , ఫేస్ బుక్ , బ్లాగులు కూడా తెలుగు ఇంటర్‌ఫేస్ తో చూసుకోవచ్చు.

నేను మూడేళ్ల క్రింద తెలుగు బ్లాగుల్లోకి వచ్చినప్పుడు బ్లాగులు పదుల సంఖ్యలో ఉండేవి. చాలా మంది మంటనక్కలో పద్మ జతచేర్చి తెలుగు రాసేవారు. తర్వాత లేఖిని వచ్చింది. లేఖినితో మొదలైన నా రాత బరహ తో కొనసాగించి ఇప్పుడు అను వరకు మారుతూ వచ్చింది. జాలానికి వచ్చిన కొత్తలో ఎక్కువగా ఇంగ్లీషు వాడేదాన్ని. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. ఇంగ్లీషు పట్ల అనాసక్తి పెరిగి తెలుగు పట్ల మక్కువ పెరిగింది. ప్రతీది తెలుగులోనే చూడాలనుకుంటున్నాను. అందుకే వంటల సైట్ కూడా తెలుగులో మొదలుపెట్టాను. కాని కొందరు మిత్రులు మరీ తెలుగువారి మీదే మీ అభిమానమా? తెలుగు రానివారి సంగతేంటి? అంటే ఇంగ్లీషులో కూడా బ్లాగు రాస్తున్నాను. నా డాక్యుమెంట్లు , ఫైళ్లు కూడా తెలుగులోనే దాచుకుంటున్నాను. కంప్యూటర్ తెరవగానే నా తెలుగు వినియోగం దాదాపు 80% ఉంటుంది.

ఈ విషయంపై మీ అభిప్రాయం , అనుభవాలు పంచుకుంటారా? అలాగే సందేహాలు, సమస్యలు కూడా నిరభ్యంతరంగా , నిస్సంకోచంగా ప్రస్తావించండి. పరిష్కారం కోసం ప్రయత్నించవచ్చు.

మరి మీ సంగతేంటి? కంప్యూటర్లో మీ తెలుగు వినియోగం ఎంతవరకు ఉంది? వీవెన్ బ్లాగులో జరుగుతున్న అభిప్రాయ సేకరణలో మీ ఓటు వేసేయండి మరి..

Wednesday 24 February 2010

మౌనం




మనిషి పుట్టినప్పటినుండి కన్నుమూసేవరకు తన చుట్టూ సందడి కోరుకుంటాడు. నిశ్శబ్ధంగా ఉంటే భరించలేదు. తన మాట వినడానికి, తనతో మాట్లాడటానికి ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటాడు. తల్లి గర్భం నుండి బాహ్య ప్రపంచంలోకి వస్తూనే తన శక్తినంతా కూడగట్టుకుని కేరుమనే ఏడుపుతో జీవితాన్ని మొదలుపెట్టి చివరకు తాను శాశ్వతంగా మూగపోయి అందరిని ఏడిపిస్తాడు. సంతోషమైనా, బాధైనా ఏటువంటి విషయమైనా అందరితో పంచుకోవాలనే ఆరాటం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మరి ఈ మౌనం ఎందుకు?



మాటకు భాష , యాస ఉంది. కాని మౌనానికి ??అసలు మౌనంగా ఉండవలసిన అవసరమేంటి? దానివలన సమస్యలు పరిష్కారమవుతాయా? ఎక్కువవుతాయా? మాటాడకుండా ఉంటే ఆ వ్యక్తి అంతరంగం ఎలా తెలుస్తుంది? ఇలా ఎంతో మంది భావిస్తారు. కాని మౌనానికి కూడా భాష ఉంటుంది. భావన ఉంటుంది. అది అందరికి అర్ధం కాదు. అర్ధం చేసుకోలేరు. ఒక్కోసారి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మౌనానికి మించిన ఆయుధం లేదు. అందుకేనేమో " Silence is the great art of conversation" అన్నారు మహానుభావులు.



ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో సమస్యను ఎదుర్కొనక తప్పదు. కొన్ని సమస్యలు ఇతరులకు చెప్పినా అర్ధం కాదు. అవి ఆ వ్యక్తిని బాధపెడతాయి. ఆ బాధ అతనిలో ఒక అలజడిని సృష్టిస్తుంది. అల్లకల్లోలంగా ఉన్న మనసు ఆలోచనాశక్తిని కోల్పోతుంది. కోపం, బాధ, అవమానం, ఆక్రోశం ఇలా విభిన్న భావాలు అతడిని చుట్టుముడతాయి. ఈ ఆందోళన అతనిని కృంగదీస్తుంది. తనని తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. అటువంటి సమయంలో మౌనమే శరణ్యం అనక తప్పదు. ఒక్కసారిగా తన మనస్సుకు, ఆలోచనకు అడ్డుకట్ట వేసి మౌనంగా ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మౌనం మనని శాంతపరుస్తుంది. మనని మనం వెనుతిరిగి విశ్లేషించుకునేలా చేస్తుంది. సమస్యకు గల కారణాలు, దాని ఫలితాలను కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మనసుకు కలిగిన గాయాలన్నీ మౌనంలో రోదిస్తాయి. మెల్లిగా మాయమవుతాయి. ఈ ఏకాంత భావన ఒక్కోసారి మనస్సులో ఆనంద తరంగాలు రేపవచ్చు. మరికొన్నిసార్లు మరింత బాధలోకి ప్రయాణించవచ్చు.




మౌనం మన బాధను, కోపాన్ని, నిరసనను,ఆవేదనను చల్లపరుస్తుంది లేదా మరింత ప్రజ్వలింప చేస్తుంది. అందుకే ఎక్కువ కాలం మౌనం కూడా మంచిది కాదు. అది మనిషిని మరింత కృంగదీస్తుంది. బాధలో ఉన్నప్పుడు మౌనం చల్లని మంచులా ఆవరించి మనసును మెల్లి మెల్లిగా జోకొడుతుంది. ప్రశాంతంగా తిరిగి దైనందినీ జీవితంలో పయనించేలా తయారు చేస్తుంది. సునామీలా ఎగసిపడే భావాలు, ఆలోచనలు, బాధలను మౌనంతో అణచిపెట్టడం కష్టమే సుమా.. కాని అసాధ్యం మాత్రం కాదు.

Sunday 21 February 2010

బ్లాగు - పత్రిక




బ్లాగు అంటే ఈరోజు చాలా మందికి తెలుసు. ప్రముఖులెందరో బ్లాగులు రాస్తున్నారు. తెలుగు బ్లాగులు కూడ విస్తృత ప్రచారం పొందాయి. ఇంతకాలం అంతర్జాలం అంటే ఇంగ్లీషు మాత్రమే చదవడం, రాయడానికి మాత్రమే పనికి వస్తుంది అనే అభిప్రాయంతో ఉండేవారు. కాని ఎంతోమంది ఔత్సాహికుల అవిశ్రాంత కృషి ఫలితంగా నేడు తెలుగు కూడా ఇంగ్లీషంత ఈజీగా టైపొచ్చు (రాసుకోవచ్చు). దీనికి ఎటువంటి ఖర్చూ ఉండదు. అదేకాక అంతర్జాల వినియోగం కూడా గణనీయంగా పెరగడంతో జాల ధరలు, కంప్యూటర్ల ధరలు కూడా అదే వేగంతో తగ్గుతూ వస్తున్నాయి. ఇంతకు ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, పెద్ద ఉద్యోగాలు చేసేవారే కంప్యూటర్ వాడేవారు. వారికి తప్పనిసరిగా అవసరముండేది. కాని నేడు కాలేజీ చదువులనుండే కాక స్కూలు పిల్లలకు కూడా కంప్యూటర్ పాఠాలు, పరీక్షలు మొదలయ్యాయి. దీనివలన దాదాపు ప్రతీ ఇంట కాకున్నా చాలా మందికి నేడు అంతర్జాలం తప్పనిసరిగా అవసరమై పోయింది.

అంతర్జాల వాడకం వల్ల లాభం ఉంది, నష్టం కూడా ఉంది. కాని దాన్ని సద్వినియోగపరుచుకోవడం మన చేతిలో ఉంది. మన ముందు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతవరకు మనకు అనువుగా మార్చుకుని , ఉపయోగించుకుని, ఎక్కువ లాభాలు పొందగలమో మనమే నిర్ణయించుకుని ఆ దిశలో పయనించాలి. నేడు జాలం ఒక్క చదువుకునే , ఉద్యోగం చేసుకునేవారికే కాక రిటైరైన వారికి, ఇంట్లో ఉండే వారికి కూడా ఉపయోగపడే ఎన్నో విషయాలు లభ్యమవుతున్నాయి. అది కూడా ఉచితంగానే. బస్ టికెట్లు , సినిమా టికెట్లు, టెలిఫోన్, కరెంట్ బిల్లులు కట్టడం, బ్యాంకు పనులు చేసుకోవడం దగ్గరనుండి విదేశాల్లో ఉన్నవారితో సులువుగా అనుకున్న వెంటనే ముచ్చటించుకునే వీలు ఉంది. ఈ అంతర్జాలం మూలంగా వేళ మైళ్ల దూరం కూడా మన చేతికందే దూరంలోకి వచ్చింది. కాదంటారా??

బ్లాగులు అనేది భావవ్యక్తీకరణకు ఒక వేదికవంటిది అని బ్లాగర్లందరూ ఒప్పుకుంటారుగా. కాని మనకు లభించిన ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము. బ్లాగు అంటే మనకు తోచిన విషయాలు రాసుకోవడం, ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలు, చూస్తున్న సంఘటనలు మనదైన రీతిలో స్పందించి రాసుకుంటున్నాము. ఇంతకంటే ఎక్కువగా బ్లాగును ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచించారా? ఎంతమంది తమ బ్లాగును తాము అనుకున్న రీతిలో మలుచుకున్నారు? ఎంతవరకు తాము అనుకున్న ఫలితాలు పొందారు? ఇంతకంటె ఎక్కువగా ఉపయోగపడగలదా మన బ్లాగు. మన బ్లాగులో రాసే విషయాలు మనకే ఉపయోగపడుతున్నాయా? వేరేవారికి కూడా ఉపయోగపడే సమాచారం మన బ్లాగు ద్వారా ఇవ్వగలమా ? ఇప్పుడు ఉన్న వికీ కాని, జాల పత్రికలు , తెలుగు వెబ్ సైట్లు కాక మన బ్లాగును కూడా మరింత ఉపయుక్తంగా మార్చుకోగలమా అని ఒక్కసారి ఆలోచించండి.

మన బ్లాగును ఇంకా మెరుగు పరుచుకోగలము. దాన్ని ఒక పత్రికలా వాడుకోవచ్చు. మన రాతలు పంపిస్తే పత్రికలు వేసుకుంటాయన్న నమ్మకం లేదు. కాని అదే వ్యాసాన్ని మన బ్లాగులో పెట్టుకుని చర్చిస్తే ఎలా ఉంటుంది? .. దీనివలన మన రాత శైలి, పరిశీలనాసక్తి పెరుగుతుంది. మనకు ఎదురైన సంఘటన గురించి మనలో చెలరేగే ఆలొచనలు నిస్సంకోచంగా బ్లాగులో పెట్టుకోవచ్చు. అది మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు దినపత్రికలు, న్యూస్ చానెల్స్ లాగానే తెలుగు బ్లాగులు కూడా శరవేగంగా సమాచారాన్ని అందచేస్తున్నాయి. సంచలనాత్మక సంఘటనలు జరిగినప్పుడు బ్లాగర్లు విశేష రీతిలో స్పందిస్తున్నారు. చర్చిస్తున్నారు. ఇది ఎందవరకు నిజమో మీరు చూస్తూనే ఉన్నారు.

మన బ్లాగులను వ్యక్తిగత ద్వేషాలు, అసూయలకు నిలయాలుగా మారనివ్వకుండా చూసుకోవడం మన బాధ్యత. బ్లాగులో ఏం రాయాలి? ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఏం రాయగలం? ఏది రాస్తే ఏం గొడవవుతుందో? అని చాలా మంది అనుకుంటారు. కాని తలుచుకోవాలే కాని బ్లాగుల ద్వారా కూడా ఇంకా ఎంతో సమాచారాన్ని అందించగలం. అది సాంకేతికమైనా, సాహిత్యమైనా, క్రీడలైనా, పుస్తకాలైనా, పద్యాలైనా ...... ఇప్పటికే కొన్ని బ్లాగులు ఇటువంటి అమూల్యమైన సంపదని మనకు అందిస్తున్నాయి. మీరు చూసిన సినిమాల గురించి రాయండి. అవి మీకు ఎందుకు చ్చాయి, నచ్చలేదు రాయండి. మీరు చదివిన పుస్తకాల గురించి రాయండి. వాటిని ప్రచురించడానికి నవతరంగం, పుస్తకం లాంటి వెబ్ సైట్ల అవసరం లేదు. మీ బ్లాగులోనే ప్రచురించండి. తప్పులుంటే చదువరులు ఎత్తి చూపిస్తారు. ఆ తప్పులను దిద్దుకుని , సందేహాలను తీర్చుకుని , తర్వాతి రాతల్లో మెరుగుపరుచుకోండి. బ్లాగింగును సీరియస్సుగా కూడా చేయొచ్చు. గూగులమ్మ ప్రకటనలు బ్లాగుల్లో కూడా ప్రయత్నించండి. ఇప్పుడు తెలుగు బ్లాగులు ఒక విశేషమైన స్థానాన్ని , గుర్తింపును సంపాదించుకున్నాయి. రాసేవారు, చదివేవారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నారు కాబట్టి ముందు ముందు బ్లాగుల ద్వారా ఆదాయం కూడా రావొచ్చు.

బ్లాగును కూడా ఒక పత్రికలా నిర్వహించవచ్చు. ప్రయత్నించి చూడండి. అది మీరు ఇచ్చే సమాచారం, మీ రాతల వల్ల తప్పకుండా సాధ్యం అవుతుంది.

Saturday 13 February 2010

ఓ దిక్కుమాలిన కధ..





జీవితమొక తోటలాంటిది.


ఆ తోటలో మనం తోటకూరలాంటివాళ్లం


తోటకూరతో కూర చేయొచ్చు కాని


చారు చెయ్యలేం, సాంబార్ చెయ్యలేం!


షాకింగ్ గా ఉన్నా ఇది జెవిత సత్యం


ఇలాంటి విషయాలలోనే గుండె గులాబ్ జామున్ చేసుకోవాలి.


లేకపోతే లైఫ్ లవంగమైపోతుంది.



ముమైత్ ఖాన్ మంగళగౌరీ వ్రతం చేస్తుందని తెలిసింది.. హాలీవుడ్ భామలందరినీ వాయనం తీసుకోవడానికి విమానం టిక్కెట్లు కూడా పంపిందంట. వాటిని స్పాన్సర్ చేసింది LTTE . ఇది ఇంటర పోల్ వారు ఇచ్చిన సమాచారం. దుబాయి లో ఉన్న ఆయిల్ బావులనుండి రిలయన్స్ వాళ్లు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఇళ్లకి పైప్ లైన్ వేస్తున్నారు. ఎంత వాడుకుంటే అంత డబ్బులు కట్టాలి. డిపాజిట్ లేదు. ఇది షాలిబండ సరూపక్క తన బస్తీలోని మహిళలతో కలిసి సాగించిన పోరాట ఫలితం. చెట్లను కాపాడ్డానికి పుస్తకాలు ప్రింట్ చేయడం లేదు. సిడిలు చేసి అందరూ చదువుకుని మేస్టారుకు చెప్తే అతనే అందరికి కలిపి పరీక్షలు రాసేస్తాడు. రాజకీయ నాయకులంతా జీవితకాలం అయ్యప దీక్ష చేపట్టి హిమాలయాలకు పయనమైపోయారు. విధ్యార్తులే నాయకులు అని కేంద్రం ప్రకటించింది. ప్రముఖ హందీ సినీనటుడిని తిరుమలలో ప్రధాన పూజారిగా నియమించడమైనది. ప్రముఖులందరినీ చూసుకోవలసిన భాద్యత అతనిదే. త్రీ ఇడియట్స్ సినిమాని సంస్కృతంలో తీయాలని ఒక సినిమాలు లేని సినిమా హీరో, కళంకితుడు కలిసి నిర్ణయించారు. తెలుగులో నిర్మించడానికి ప్రయత్నాలు మొదలైపోయాయి కదా.. అందుకే సంస్కృతంలో నిర్మిస్తారంట. అందులో హీరోలుగా మన మార్తాండ, మలక్, పవన్ సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే వీళ్లు ముగ్గురు జిగ్రి దోస్తులు కదా. ఈ విషయం నిర్మాతలకు ఎవరు చెప్పారో మరి నాకు తెలీదు. ఉండవల్లి పనా??



"మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా బక్కచిక్కిన కుక్కగొడుగు మొక్కలా చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా బిక్కమొహం వేసుకొని వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చెక్కిలాలు తింటూ అరిటి తొక్కలా ముంగిట్లో తుక్కులా చిక్కు జుట్టేసుకుని ముక్కుపొడి పీలుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కి నక్కి ఈ చెక్కబల్ల మీద పక్కచుట్టలా పడుకోకపోతే, ఏ పక్కకో ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్కశుద్దితో వాళ్ళను ఢక్కామొక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకొని ఒక్క చక్కటి ఉద్యోగం చేజిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసీ. అని కసబ్ ని రోజూ బ్రెయిన్ వాష్ చేస్తే దెబ్బకే గుండాగి చచ్చాడు. అదిగో సచిన్ టెండుల్కర్ పారిపోతున్నాడు. పట్టుకుని సుమతీ శతకం నేర్పించండి. జర్దారీని భోజనానికి పిలిచాను. వంట చేయబుద్ధి కావడంలేదు. భావనా! కాస్త క్యాబేజీ స్పెషల్స్ చేసి పంపు. వాడి దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయ్యి పాకిస్తాన్ ని ఇండియాలో కలిపేయాలి. తర్వాత నీకు రోజొక వెరయిటీ బిర్యాని చేసి పెడతాలే..


ఏమైంది?



పాప ఏడ్చింది.


ఒక్కటి పీకమని వాళ్లమ్మతో చెప్పు. చిన్నప్పుడు నువ్వు అస్తమానం ఏడుస్తుంటే నేను అలాగే చేసేదాన్ని.



ఇటీవలి వరదల్లో ఒబామా ఇంటి తోటమాలి హస్తముందని అంటున్నారు . ఇది ఎంతవరకు నిజం?? కమిటీ వేయాలని ఆర్డర్ వేసారు. ఎవరంటే? ఏమో? తిరుపతి లో బ్యూటిపార్లర్, విగ్గుల షాపు పెట్టి నష్టపోయిన అనుభవంతో శభరిమలై దగ్గర హెయిర్ కటింగ్, డ్రెస్స్సుల షాపు పెట్టాలని అనుకుంటున్నాను. పెట్టుబడి పెట్టడానికి ఎవరు దొరుకుతారబ్బా?? ఇవాళ పైనాపిల్ పులిహోర, టమాటాలతో పాయసం చేసా. ధైర్యమున్నవాళ్లు వచ్చి ఫ్రీగా తినొచ్చు. తర్వాతి పరిణామాలకూ నాకు ఎటువంటి సంబంధం లేదు . ముందే చెప్తున్నా..



ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు


చూడచూడ రుచుల జాడ వేరు


పురుషులందు పుణ్యపురుషులు వేరయా


విశ్వధామిరామ వినురవేమా..



నిన్న సాయంత్రం శివరాత్రి పూజ చేసుకుని భక్తి పారవశ్యంలో ఉన్న నేను ఖర్మ కాలి ఒక మహాపండితుడు రాసిన (బ్లాగుల్లోనే) దిక్కుమాలిన కధ చదవడం జరిగింది. అది సరిపోక ఒక మహానుభావుడు నటించి, నిర్మించిన సినిమా ప్రోమో చూడడం జరిగింది. లలిత ఐతే తట్టుకుందేమో నా పరిస్థితి మాత్రం ఇలా అయ్యింది. ఏం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో అర్ధం కావటంలేదు. ఈ కథను నాకు పంపిన దుర్మార్గుడికి జంధ్యాల తిట్ల దండకం బహుమతిగా ఇస్తున్నాను. హన్నా! నాతో పెట్టుకుంటారా?? ఇపుడు సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాల్సిన పని బడింది..

Wednesday 10 February 2010

మనమేం చేయగలం??




శ్రీనివాస్ గారి టపాకు నా సమాధానం.
వ్యాఖ్య ముదిరి టపా అవడమంటే ఇదే మరి.. శ్రీనివాస్ గారు మీరు చెప్పిన అంశాలలో మనం ఏం చేయగలం అన్నదానికి నాకు తోచిన, తప్పకుండా సాధ్యమయ్యే సమాధానాలు ఇవి. ఎప్పటికప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగిన వారం రోజుల వరకు హడావిడి ఉంటుంది. తర్వాత అందరూ మర్చిపోతారు. అంతా ఆ పోలీసులే చూసుకుంటారు. చట్టం, న్యాయం తన పని చేసుకుంటుంది. మనమేం చేయగలం అని చాలా మంది అనుకుంటారు. పూర్తి సమాజాన్ని మార్చడం ఎవరి తరమూ కాదు. అధికారం, డబ్బుతో ఎవరూ మారరు. కనీసం మన ఇంటినుండే మన పిల్లలతోనే ఈ మార్పులు మొదలుపెట్టవచ్చు.

ముందుగా ఈ విషయంలో తల్లి తండ్రులు తమ పిల్లలకు నేర్పించాలి.అబ్బాయిలు, అమ్మాయిలు అని వేరుగా చూడవద్దు. పిల్లలు అని కాకుండా ప్రతి విషయం చెప్తుండాలి. చర్చించాలి. వాళ్ళతో స్నేహితుల్లా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటివారు. వాళ్ల స్నేహితులతో బయట తిరగనివ్వకుండా ఇంటికే పిలవండి. ఇక్కడ కూడా అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడాలు చూపడం మంచిది కాదు. వాళ్లకు లేని అనుమానాలు పెద్దలే సృష్టిస్తున్నారు. స్నేహితులైనా, కొలీగ్స్ అయినా. వాళ్ళ ఫ్రెండ్స్, ఆఫీసు ముచ్చట్లు అడుగుతుండాలి. మరీ అన్ని కాకున్నా చాలా విషయాల్లో వాళ్ళ విషయాల్లో మనని, మన విషయాల్లో వాళ్ళని భాగస్వాములను చేయాలి. ఒకవేళ వాళ్ళు ప్రేమలో పడితే మనం భయం పెడితే చెప్పలేరు. అదే మనం మంచిగా, బుజ్జగించి అడగాలి. అసలు ప్రేమంటే ఏంటి?. వాళ్లకు అవతలి వ్యక్తి గురించి ఏం తెలుసు? , ఎందుకు ఇష్టపడుతున్నారు వంటి విషయాలు తెలుసుకోవాలి. తప్పేదో, ఒప్పేదో అర్ధం చేయించాలి. ఇలా ఉంటే పిల్లలు తల్లితండ్రులతో ఫ్రీగా ఉంటారు. వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోవడానికి వేరే దారి లేక వేరే వారి మీద ఆధారపడతారు. వారికి సరైన దారి చూపించేది వారి సమవయస్కులా? అనుభవమున్న పెద్దలా? ఈరోజు ప్రేమించడం అనేది సర్వసాధారణమైపోయింది. పిల్లలు ప్రేమించాం అన్నపుడు పెద్దలు కూడా ఆలోచించాలి. మొండికేయకుండా వారివైపు నుండి ఆలోచించాలి. లేదంటే ఆత్మహత్యలు.. అదే విధంగా ప్రేమ పేరుతో వేధించే అబ్బాయిల నుండి తల్లితండ్రులే తమ కూతురికి రక్షణ కల్పించాలి. ఒకవేళ తమ అబ్బాయి ఏ దారుణమైనా చేస్తే తల్లితండ్రులు అతడిని సమర్ధించకుండా చట్టానికి అప్పగించాలి. బయటకు తీసుకురావొద్దు. వచ్చినా అతడితో సంబంధాలు తెంచుకోవాలి. ఇక్కడ ఆ వ్యక్తి తమ కన్నకొడుకు, భర్త అనే దానికంటే అతడొక దుర్మార్గుడు. ఒక అమ్మాయిని గాయపరిచాడు. హత్య చేసాడు అని ఆలోచించాల్సింది పెద్దలే. నేరం చేసినవాడిని సంఘంలో హాయిగా తిరగనివ్వడం వల్లనే మరి కొందరు ఇటువంటి నేరాలు చేయడానికి ఆస్కారం అవుతుంది. అసలైతె ఇలాంటి దారుణానికి ఒడిగట్టినవాన్ని తల్లితండ్రులే కాల్చి చంపేయాలి. లేదా తగిన శిక్ష విధించాలి. ప్రతి రోజు తను చేసిన తప్పు గుర్తు చేసుకుని పశ్చాత్తప పడేలా చేయాలి. అది వారి చేతిలో ఉన్న పనే. అమ్మో నా కొడుకు అనుకుంటే .. ఎవరేం చేయలేరు.

ప్రతి ఆడపిల్ల ముందుగా తమని తాము గౌరవించడం నేర్పించాలి. అబ్బాయిలను కూడ అమ్మాయిలను గౌరవించేలా పెంచాలి. అది చిన్నప్పటినుండి జరిగితేనే మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. అమ్మాయిలు సుకుమారులు, సున్నిత మనస్కులైనా తమని తాము మానసికంగా శక్తివంతులుగా చేసుకోవాలి. ఎటువంటి వేధింపులు ఎదురైనా ఒంటరిగా ఎదుర్కునేలా ఉండాలి. భయపడితే లాభం లేదు. ఎవరో వస్తారని ఎదురు చూసే బదులు తామే ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. ఒంటరిగా ఎదుర్కోలేము అనుకుంటే తోటివారిని కలుపుకుని గుంపులా ఎదురుదాడి చేయండి. భయంతో వెనకకు వేసే బదులు ధైర్యంగా ఒక్కడుగు ముందుకు వేయండి. తోకముడుచుకుని పారిపోతారు. మీలోని ఆత్మవిశ్వాసమే మీకు కొండంత అండ.. ఈ స్వభావం చదువుకున్నప్పుడే కాదు. జీవితంలో ఎదురయ్యే అన్ని క్లిష్టపరిస్థితుల్లో కూడా ఉండాలి. ఆడది ఆప్యాయతనిచ్చే అమ్మగానే కాక అవసరమైతే ఆదిశక్తిలా కూడా మారగలదు అని నిరూపించాలి..

ఆడవారికి ప్రతీ చోట అవమానాలు తప్పడంలేదు. కాలేజీకెళ్లినా, ఉద్యోగానికి వెళ్లినా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఎంత విధ్యాధికులైనా ఆడవారిని హేళన చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం తమ జన్మహక్కు అనుకునే నీచులు ఎంతోమంది మన సమాజంలో కనిపిస్తూనే ఉంటారు. వారిని ఏమీ అనలేము. ఎందుకంటే వారు మానసిక వికలాంగులు కాబట్టి. మనమే దయచూడాలి. శృతి మించితే చెప్పు దెబ్బల రుచి చూపించాలి.

నేను చెప్పిన మాటలు సినిమా డైలాగులు, ఏదో స్త్రీవాద పుస్తకంలోని మాటలు కాదు. నేను నమ్మేవి, మా పిల్లలకు కూడా చేప్పేది.. ప్రతీ తల్లి ఇలా మారితే కొంతవరకైనా ఆడపిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మారతాయి. పిల్లల వ్యక్తిత్వం, సంస్కారం ఎటువంటిదో తల్లితండ్రులకే ఎక్కువ తెలుస్తుంది కదా. ప్రేమతో లాలించాలి, దారి తప్పితే దండించాలి.... ఆ పని చేయకుండా అవతలివాడిని నిందించడం అన్యాయం.

Friday 5 February 2010

అలక పానుపు

అలక ఎప్పటికైనా అందమే. శృతి మీరితేనే గొడవలైపోతాయి. కొత్తపెళ్ళికొడుకు అలక పానుపు ఎక్కితే పిల్ల నిచ్చిన మామకు గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఏం గొంతెమ్మ కోరికలు కోరతాడో అని. కాని భార్యాభర్తల మధ్య అలకలు వారిని మరింత దగ్గర చేస్తాయి. ప్రేమలో ఉన్నవారు అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరు అలుగుతారు. అలిగినవారిని బుజ్జగించడం. అలక తీర్చడం కూడా సరదానే వీరికి. వీరిని చూసి అలిగినవారు ప్రేమతో , ముద్దుగా మరింత అలక నటిస్తారు. అలాంటి ఒక అలక సీను శ్రీవారి శోభనం సినిమాలో చూస్తాము. నాయికా నాయకుల మధ్య వచ్చిన చిన్న గొడవ వల్ల (సినిమా కథ అంతగా గుర్తులేదు. చూసి చాలా రోజులైంది మరి) హీరో అలుగుతాడు. ఆ కాలంలో అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడ్డం నిషిద్ధం. అసలే పల్లెటూరు. అమాయకపు అమ్మాయి అలిగిన అబ్బాయిని ఎలా బుజ్జగించాలో తెలీదు. గడప దాటి వెళ్ళలేదు. పెద్దవాళ్ళు ఒప్పుకోరు. తప్పనిసరి ఇంట్లో పడుకున్న బామ్మను లేపి ఆరుబయట పడుకోమంటుంది. నిద్రలేపి మరే పడుకోమంటూ జోల పాడుతుంది. ఆ పాటలోనే నాయకుడిని అలకపానుపు దిగమని వేడుకుంటుంది. మనవరాలి పాట్లు బామ్మకు తెలియనివా?? అయినా ఇంతందంగా, అమాయకంగా బుజ్జగిస్తే ఏ మగాడు అలక మానకుండా ఉంటాడు.



అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక అలక చాలింక
శీతాకాలం సాయంకాలం
అటు అలిగి పోయేవేల చలి కొరికి చంపే వేళ

రామ రామ శబరి బామ్మ నిద్దరేపోదు
రాతిరంతా చందమామ నిదరపోనీదు
కంటి కబురా పంపలేను
ఇంటి గడప దాటలేను
ఆ దోరనవ్వు దాచకే నా నేరమింక ఎంచకే
ఆ దోరనవ్వు దాచకే ఈ నవ్వు నవ్వి చంపకే

రాసి ఉన్న నొసటి గీత చెరపనే లేరు
రాయని ఆ నుదుటి రాత రాయనూ లేరు
నచ్చిన మహరాజు నీవు
నచ్చితే మహరాణి నేను
ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా

నులక పానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా అల్లరాపమ్మా
శీతాకాలం సాయంకాలం
నను చంపకే తల్లి జోకొట్టకే గిల్లి

రమేష్ నాయుడు గారి సంగీతంలో వేటూరి గారి పాటను జానకి ముద్దుగా, గోముగా పాడింది. బామ్మగా, మనవరాలిగా కూడా ..

Tuesday 2 February 2010

బిడ్డ కోసం సహగమనం...


నాన్నా !!!

నన్ను ఇంతగా ప్రేమించకు
రేపు నేను వెళ్ళిపోతే ఉండలేవు
నా ముద్దు మోము చూసి మురిసేవు
మరి నే బాధతో విలవిలలాడితే చూడలేవు.


నేను ఎపుడు అలిగినా, ఏడ్చినా
కంట నీరు తుడిచేవు
నన్ను అంత దూరం పంపకు
ఏడిస్తే నువ్వు అందకుంటే ఎలా?


నన్ను ప్రేమతో లాలించేవు
గారాబంతో ఆడించేవు
చిన్ని కోరికలను చిరునవ్వుతో తీర్చేవు
కాలు కందకుండా అరచేతిపై నడిపించేవు.


ఈ మంట భరించలేను
ఈ బాధ తట్టుకోలేను
నాన్నా! ఎక్కడున్నావు?
నన్ను తీసికెళ్ళి దాచేయవా?



బంగారూ!!!

భయపడకు తల్లీ ,, నేనున్నాగా
ఏ తండ్రి తన కూతురిని వెళ్ళకుండా ఆపగలడు?
నీ తోడుగా నే వస్తున్నా ..
గుండెల్లో దాచుకుంటా ఎక్కడున్నా!!

నిజం చెప్పాలంటే తండ్రికే కూతురిపై ప్రేమ ఎక్కువ. అది బయటకు వ్యక్తపరచలేడు.. మౌనంగా తన చిట్టితల్లిని అనుక్షణం గమనిస్తూ, ఏ ఆపదా రాకుండా, బాధపడకుండా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నారి వైష్ణవిని పోగొట్టుకున్న ప్రభాకర్ పరిస్థితి మనమందరం అర్ధం చేసుకోగలం. తన బంగారు తల్లి అంత కిరాతకంగా చనిపోయిందని తెలియగానే ఆ గుండె ముక్కలైంది. ఈ లోకంలో తన కూతురిని కాపాడుకోలేకపోయినా అనంత లోకాలకు తరలిపోయిన బిడ్డను అనుక్షణం తన గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి వెళ్ళిపోయాడు ఆ తండ్రి.

అయినా డబ్బు ఇంత పాపిష్టిదా?... ఆస్తి కోసం ఆ చిన్నారిని చంపడానికి వారికి మనసెలా ఒప్పింది?. చంపిన తర్వాత కూడా ఎంత కసి ఉంటే ఆ బిడ్డను అంత దారుణంగా మంటల్లో పడేసారు. ఆ పసిదానిపై ఎందుకంత కక్ష? ఇది తలుచుకుంటేనే గుండె భారమవుతుంది. ఇదేనా జీవితం. మరుక్షణం మనది కాని ఈ జీవితం కోసం ఎన్ని ఆరాటాలు, ఆర్భాటాలు, కక్షలు, కార్పణ్యాలు ???

Monday 1 February 2010

ఎదుగుదాం.. నిజాయితీతో! (ఫిబ్రవరి 2010 "కంప్యూటర్ ఎరా" ఎడిటోరియల్)

మన లక్ష్యాలు ఉన్నతమైనవి. కానీ వాటిని సాధించడానికి అనుసరించే మార్గాల్లోనే లోపమంతా! ఎంత గొప్ప లక్ష్యమైనా నిజాయితీ, స్వచ్ఛత లేకుండా సాకారమైతే అపరాధభావానికి గురిచేస్తుంది. ఆ లక్ష్యం సాధించబడిన ఆనందం లేశమాత్రమైనా మిగలదు. ఏదో తెలీని వెలితి వెంటాడుతూనే ఉన్నా దాన్ని దిగమింగుకుంటూ ప్రపంచం ముందు సంతోషం ప్రదర్శిస్తుంటాం. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడే మన ఆలోచనలు పైపై స్థాయిల్లో సాగుతుంటాయి తప్ప ఆ లక్ష్యం మన నుండి ఏపాటి వనరులను ఆశిస్తోందీ, అంత శ్రమపడగల సామర్థ్యం మనకుందా లేదా వంటి కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోం. గొప్ప స్థానానికి ఎదగాలని, ఎదిగిపోయినట్లు మదిలో మెరిసే ఊహ సజీవరూపం దాల్చాలంటే కావలసింది మొక్కుబడి చిత్తశుద్ధి కాదు, దొడ్డి దారులూ కాదు. ఒక లక్ష్యం నిర్దేశించుకుని రెండో ఆలోచన అనేదే లేకుండా నమ్మినది ఆచరిస్తూ ప్రాపంచిక విషయాలపై వీలైనంత తక్కువ శ్రద్ధ కనబరుస్తూ శ్రమిస్తూ పోతే నిజాయితీతో కూడిన విజయం వరిస్తుంది. అందరి లక్ష్యం జీవితంలో ఎదగడమే! ఎదగడానికి తగిన అర్హతలు లేకపోయినా, కర్కశంగా ఎదుటివారిని కూలదోసైనా ప్రపంచం ముందు విజయం సాధించినట్లు ప్రదర్శించుకోవడమే గొప్పదనంగా చలామణి అయిపోతోంది ప్రస్తుతం! ప్రతీ విజయానికీ, అపజయానికీ కొన్ని విలువలు ఉంటాయని ఎప్పుడో మర్చిపోయాం. విలువలు లేని విజయమైనా విలువలతో కూడిన అపజయం ముందు తీసిపోతుందన్న సత్యం గ్రహించగలిగే పరిణతితో కూడిన ఆలోచనా విధానం మనకంటూ ఉంటేగా ఈ వ్యత్యాసాలన్నది తెలిసేది! ఎదగాలంటే ఎదగండి..


ఇతరులను శత్రువులుగా చూస్తూ, ద్వేషిస్తూ ఎదగడం సరైనది కాదు. ఎవరి స్థాయి, ఎవరి వనరులు, ఎవరి ఆలోచనా విధానం, వ్యక్తిత్వం వారికి ఉంటుంటాయి. వాటిని బట్టి మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. మనం సరిగ్గా ఎదగలేకపోతున్నామంటే అది మన తప్పు తప్ప ఎదుటి వ్యక్తి మనపై ఏదో కుట్ర చేస్తున్నారని ద్వేషం పెంచుకోవడం అర్థరహితం. అస్సలు మన ప్రయత్నాలకు సరైన ఫలితాలు వచ్చినా, రాకపోయినా పూర్తిగా మనల్ని మనం బాధ్యులుగా ఒప్పుకునే ధైర్యం కావాలి. ఏమాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా జీవితం వెళ్లబుచ్చినా నష్టం లేదు గానీ ఇతరులను ద్వేషిస్తూ మనసుని కుళ్లబెట్టుకుంటూ ఎదగాలనుకోవడం దారుణమైన విషయం. ఇటువంటి నిజాయితీ లోపించడం వల్లనే మన విజయాలకు మనమూ సంతోషించలేక పోతున్నాం. మన విజయాల్ని సంతోషంగా స్వీకరించి ఆనందించడానికి మనకంటూ ఎవరూ మిగలకుండా పోతున్నారు. లక్ష్యసాధన అనేది ఎలాగైనా పూర్తి చేయొచ్చు.. కానీ వినమ్రంతో కూడిన విజయం, ఎవరినీ గాయపరచకుండా, నొప్పించకుండా సాకారమైన లక్ష్యం మన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది.. మన మానసిక శక్తులను ద్విగుణీకృత ఉత్సాహంలో ముంచెత్తుతుంది. ద్వేషాల తో, కుట్రలతో, మనసు నిండా ఈర్ష్యాసూయలను నింపుకుని విజయం సాధించినా ఆ విజయం విర్రవీగేలా చేస్తుంది.. మనలో మానవత్వాన్ని హరించి పశువుల్లా మార్చేస్తుంది.



మీ
నల్లమోతు శ్రీధర్

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008