ఎదుగుదాం.. నిజాయితీతో! (ఫిబ్రవరి 2010 "కంప్యూటర్ ఎరా" ఎడిటోరియల్)
మన లక్ష్యాలు ఉన్నతమైనవి. కానీ వాటిని సాధించడానికి అనుసరించే మార్గాల్లోనే లోపమంతా! ఎంత గొప్ప లక్ష్యమైనా నిజాయితీ, స్వచ్ఛత లేకుండా సాకారమైతే అపరాధభావానికి గురిచేస్తుంది. ఆ లక్ష్యం సాధించబడిన ఆనందం లేశమాత్రమైనా మిగలదు. ఏదో తెలీని వెలితి వెంటాడుతూనే ఉన్నా దాన్ని దిగమింగుకుంటూ ప్రపంచం ముందు సంతోషం ప్రదర్శిస్తుంటాం. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడే మన ఆలోచనలు పైపై స్థాయిల్లో సాగుతుంటాయి తప్ప ఆ లక్ష్యం మన నుండి ఏపాటి వనరులను ఆశిస్తోందీ, అంత శ్రమపడగల సామర్థ్యం మనకుందా లేదా వంటి కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోం. గొప్ప స్థానానికి ఎదగాలని, ఎదిగిపోయినట్లు మదిలో మెరిసే ఊహ సజీవరూపం దాల్చాలంటే కావలసింది మొక్కుబడి చిత్తశుద్ధి కాదు, దొడ్డి దారులూ కాదు. ఒక లక్ష్యం నిర్దేశించుకుని రెండో ఆలోచన అనేదే లేకుండా నమ్మినది ఆచరిస్తూ ప్రాపంచిక విషయాలపై వీలైనంత తక్కువ శ్రద్ధ కనబరుస్తూ శ్రమిస్తూ పోతే నిజాయితీతో కూడిన విజయం వరిస్తుంది. అందరి లక్ష్యం జీవితంలో ఎదగడమే! ఎదగడానికి తగిన అర్హతలు లేకపోయినా, కర్కశంగా ఎదుటివారిని కూలదోసైనా ప్రపంచం ముందు విజయం సాధించినట్లు ప్రదర్శించుకోవడమే గొప్పదనంగా చలామణి అయిపోతోంది ప్రస్తుతం! ప్రతీ విజయానికీ, అపజయానికీ కొన్ని విలువలు ఉంటాయని ఎప్పుడో మర్చిపోయాం. విలువలు లేని విజయమైనా విలువలతో కూడిన అపజయం ముందు తీసిపోతుందన్న సత్యం గ్రహించగలిగే పరిణతితో కూడిన ఆలోచనా విధానం మనకంటూ ఉంటేగా ఈ వ్యత్యాసాలన్నది తెలిసేది! ఎదగాలంటే ఎదగండి..
ఇతరులను శత్రువులుగా చూస్తూ, ద్వేషిస్తూ ఎదగడం సరైనది కాదు. ఎవరి స్థాయి, ఎవరి వనరులు, ఎవరి ఆలోచనా విధానం, వ్యక్తిత్వం వారికి ఉంటుంటాయి. వాటిని బట్టి మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. మనం సరిగ్గా ఎదగలేకపోతున్నామంటే అది మన తప్పు తప్ప ఎదుటి వ్యక్తి మనపై ఏదో కుట్ర చేస్తున్నారని ద్వేషం పెంచుకోవడం అర్థరహితం. అస్సలు మన ప్రయత్నాలకు సరైన ఫలితాలు వచ్చినా, రాకపోయినా పూర్తిగా మనల్ని మనం బాధ్యులుగా ఒప్పుకునే ధైర్యం కావాలి. ఏమాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా జీవితం వెళ్లబుచ్చినా నష్టం లేదు గానీ ఇతరులను ద్వేషిస్తూ మనసుని కుళ్లబెట్టుకుంటూ ఎదగాలనుకోవడం దారుణమైన విషయం. ఇటువంటి నిజాయితీ లోపించడం వల్లనే మన విజయాలకు మనమూ సంతోషించలేక పోతున్నాం. మన విజయాల్ని సంతోషంగా స్వీకరించి ఆనందించడానికి మనకంటూ ఎవరూ మిగలకుండా పోతున్నారు. లక్ష్యసాధన అనేది ఎలాగైనా పూర్తి చేయొచ్చు.. కానీ వినమ్రంతో కూడిన విజయం, ఎవరినీ గాయపరచకుండా, నొప్పించకుండా సాకారమైన లక్ష్యం మన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది.. మన మానసిక శక్తులను ద్విగుణీకృత ఉత్సాహంలో ముంచెత్తుతుంది. ద్వేషాల తో, కుట్రలతో, మనసు నిండా ఈర్ష్యాసూయలను నింపుకుని విజయం సాధించినా ఆ విజయం విర్రవీగేలా చేస్తుంది.. మనలో మానవత్వాన్ని హరించి పశువుల్లా మార్చేస్తుంది.
మీ
నల్లమోతు శ్రీధర్
5 వ్యాఖ్యలు:
బాగా చెప్పారు .
a2zdreams గారు మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.
అద్బుతం శీధర్ గారు. చాలా బాగా చెప్పేరు. గెలవటం అంటే విజయం. విజయం అంటే ఎలాగో ఒకలా అనుకున్నది సాధించటం అనేది విశ్వ వ్యాప్తం గా గెలుపు కు నిర్వచనమైపోయిన ఇప్పటికి, ఆ ఇప్పట్లో బతుకుతున్న మన అందరికి ఒక సారి ఆగి ఆలోచించుకునే శీర్షిక.
I could say only Excellent!!
@ భావన గారు, నిజంగా విజయానికి అర్థాలు మారిపోయాయి. మీ స్పందనకు ధన్యవాదాలండీ.
@ వెంకట గణేష్ గారు, థాంక్యూ వెరీ మచ్ అండీ!
Post a Comment