Tuesday, 2 February 2010

బిడ్డ కోసం సహగమనం...


నాన్నా !!!

నన్ను ఇంతగా ప్రేమించకు
రేపు నేను వెళ్ళిపోతే ఉండలేవు
నా ముద్దు మోము చూసి మురిసేవు
మరి నే బాధతో విలవిలలాడితే చూడలేవు.


నేను ఎపుడు అలిగినా, ఏడ్చినా
కంట నీరు తుడిచేవు
నన్ను అంత దూరం పంపకు
ఏడిస్తే నువ్వు అందకుంటే ఎలా?


నన్ను ప్రేమతో లాలించేవు
గారాబంతో ఆడించేవు
చిన్ని కోరికలను చిరునవ్వుతో తీర్చేవు
కాలు కందకుండా అరచేతిపై నడిపించేవు.


ఈ మంట భరించలేను
ఈ బాధ తట్టుకోలేను
నాన్నా! ఎక్కడున్నావు?
నన్ను తీసికెళ్ళి దాచేయవా?



బంగారూ!!!

భయపడకు తల్లీ ,, నేనున్నాగా
ఏ తండ్రి తన కూతురిని వెళ్ళకుండా ఆపగలడు?
నీ తోడుగా నే వస్తున్నా ..
గుండెల్లో దాచుకుంటా ఎక్కడున్నా!!

నిజం చెప్పాలంటే తండ్రికే కూతురిపై ప్రేమ ఎక్కువ. అది బయటకు వ్యక్తపరచలేడు.. మౌనంగా తన చిట్టితల్లిని అనుక్షణం గమనిస్తూ, ఏ ఆపదా రాకుండా, బాధపడకుండా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నారి వైష్ణవిని పోగొట్టుకున్న ప్రభాకర్ పరిస్థితి మనమందరం అర్ధం చేసుకోగలం. తన బంగారు తల్లి అంత కిరాతకంగా చనిపోయిందని తెలియగానే ఆ గుండె ముక్కలైంది. ఈ లోకంలో తన కూతురిని కాపాడుకోలేకపోయినా అనంత లోకాలకు తరలిపోయిన బిడ్డను అనుక్షణం తన గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి వెళ్ళిపోయాడు ఆ తండ్రి.

అయినా డబ్బు ఇంత పాపిష్టిదా?... ఆస్తి కోసం ఆ చిన్నారిని చంపడానికి వారికి మనసెలా ఒప్పింది?. చంపిన తర్వాత కూడా ఎంత కసి ఉంటే ఆ బిడ్డను అంత దారుణంగా మంటల్లో పడేసారు. ఆ పసిదానిపై ఎందుకంత కక్ష? ఇది తలుచుకుంటేనే గుండె భారమవుతుంది. ఇదేనా జీవితం. మరుక్షణం మనది కాని ఈ జీవితం కోసం ఎన్ని ఆరాటాలు, ఆర్భాటాలు, కక్షలు, కార్పణ్యాలు ???

12 వ్యాఖ్యలు:

మధురవాణి

కళ్ళు చెమర్చాయి జ్యోతి గారూ :( :(

పరిమళం

అతి హేయమైన మానవ మృగాలకు ఎటువంటి శిక్ష విధించినా అది తక్కువే !

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు

ఈ దారుణాన్ని వర్ణించాడానికి మాటలు చాలవు.ఆ కిరాతకులని పట్టుకొని అత్యంత కటినమైన శిక్స్క విధింఛాలి.దీనికన్నా చావే మేలని వాళ్ళు వేడుకొనేలా ఆ శిక్ష వుండాలి.

Padmarpita

మానవుడు ఇంత కఠినాత్ముడిగా మారి జీవిస్తున్నాడా ఇంకా???

సృజన

ప్చ్....ఎటువైపు వెళుతుందో లోకం??

చిలమకూరు విజయమోహన్

నన్ను అమితంగా బాధపెట్టిన సంఘటన ఇది.

Anonymous

పోలీసులకు దొరకకుండా వుండడానికే చిన్నారి మృతదేహాన్ని కాల్చివేశారు. కానీ, ఆదేవుడికి కూడా వారి కృరత్వాన్ని క్షణకాలం కూడా భరించే శక్తి లేనట్టుంది. పూర్తిగా సాక్షాలు మాయమవ్వకముందే వారు దొరికి పోయారు.

ఇలాంటి వాల్లకు కఠిన శిక్షలు వేయాలని అందరి మనస్సు కోరుకోవడం సహజం, కానీ మనం ఒక సమాజంలో బతుకుతున్నాం, ఆటవిక న్యాయాలు మనం అమలు జరపలేం. ఇలాంటి వారికి చట్ట పరిధిలోనే శిక్ష పడేలా చేయాలి.

నిజానికి ఒక మనిషికి, ఇంట్లో, సమాజములో వున్న పేరు ప్రటిష్టలు పోవడం కన్నా పెద్ద శిక్ష వుండదు. వాడికి ఎలాగూ యావజ్జీవిత శిక్ష పడుతుంది కానీ ఇలాంటి వెధవలకి, శిక్షలో ఎలాంటి వెలుసుబాటూ వుండకూడదు, జైలులో కూడా కొంత మంది VIP సేవలు అందుకుంటుంటారని మనం పేపర్లలో చదువుతున్నాం, అలాంటివి వీడికి దొరక్కుండా చేయాలి, సమాజంలో వాడికి సానుభూతి అనేది ఏకోశానా లేకుండా చూడడాలి. అది న్యూసు ఛానలువాల్లు బాగా చేయగలరు, వాడి ఫోటోని పదే పదే చూపిస్తూ...

Ravi

ఆ పాప పుట్టిన తర్వాత ఆయనకు బాగా కలిసి వచ్చింది. అందుకనే ప్రారంభించిన ప్రతి వ్యాపారానికి ఆమె పేరే పెట్టేవాడు. నిందితులకు ఈ పాపపై కక్ష పెరగడానికి కొంతవరకు ఇది కూడా కారణం.

శ్రీలలిత

ఈ వార్త తెలిసినప్పట్నించీ మనసంతా మొద్దుబారిపోయింది. వివరాలు విని భరించలేక మళ్ళీ టీ.వీ.పెట్టే ధైర్యం చెయ్యలేకపోయాను. పేపర్ కూడా చదవడం మానేసాను. ఆ పాప ఫొటో చూస్తుంటే కడుపులోంచి దుఃఖం పొర్లుకుంటూ వచ్చేస్తోంది. మనుషులే అఖ్ఖర్లేదు వాడిని ఆదేవుడే శిక్షిస్తాడు కాని ఆ చిట్టితల్లి , ఆమె తండ్రి మళ్ళీ బ్రతికి రాలేరుకదా..

Rajendra Devarapalli

ఇవ్వాళ పత్రికల్లో వైష్ణవి అస్తికల కలశం మీద ఉంచిన పాప ఫొటో చూసాక కన్నీరాపుకోవటం నాకు చాలాకష్టయ్యింది.
మిత్రులారా,విశాఖపట్నం జిల్లా తాండవలో పుట్టి బోల్తాపడిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో ఎనిమిది మంది పిల్లలే.వారికోసం కూడా ఒక్క కన్నీటి చుక్క విడవగలరా?

జ్యోతి

పోయినోళ్లు అందరూ మంచోళ్లే. కాని ఇప్పుడు వైష్టవి తల్లి పరిస్ధితి ఏంటి? భర్త, కూతురుని పోగొట్టుకుని, ఇద్దరు కొడుకులతో, రాబందువుల్లాంటి బంధువుల నడుమ బ్రతుకు వెళ్లదీయాలి..

దీనికి కారణం పోలీసులని, మీడియావాళ్లని, ఆ దుండగులను చంపేయాలని అంటున్నారు, కాని నిమిషంలో వచ్చే చావు వాళ్లకు సుఖమే కదా. దానివల్ల ఆ వ్యక్తుల కుటుంబసభ్యులు ఎంత బాధపడతారు. చావు ఒక్కటే పరిష్కారం కాదు. తప్పు చేసినవాడు అనుక్షణం నరకం అనుభవించాలి. అది చూసినవాళ్లు అలాటి తప్పు చేయకుండా భయపడాలి. ఈ మధ్య అనూష అనే అమ్మాయిపై దాడి చేసి ఆమె తల్లితండ్రులను పొట్టనపెట్టుకున్న వ్యక్తిని బెయిల్ మీద వదిలేసారంట. ఇలాటివాటికి ఏదో ఒక తప్పు వెతకకుండా మనమేం చేయగలం. పదిరోజులు ఈ సంఘటన గురించి అందరూ బాధపడతారు, మాట్లాడతారు. తర్వాత మరో కొత్తవిషయం కనిపిస్తుంది. మనం ఇది మర్చిపోతాం. ముందు మనం మారాలి. మనం ఏదైనా చేయగలం. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడున్న ఆవేశం చల్లారనివ్వకుండా ఉండాలి. లేదంటే వారానికొక్కటి ఇలాటి మరెన్నో చూడాల్సి వస్తుంది.

శ్రీనివాస్

ఆవేశం చల్లారకుండా చూసుకున్నా మనం ఏమీ చేయలేము ........ మన వల్ల ఏం కాదు .....


కానీ ఒక పని చేస్తే అవుతుంది

ఒక్క సారి ఉప్పెనలా ప్రజల్లో ప్రస్తుత వ్యవస్థ పట్ల వ్యతిరేకత రావాలి .... తాతల కలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ మార్చాలి ..... నాటి దేశకాల పరిస్థితుల దృష్ట్యా అంబేద్కర్ మనకి అందించిన అమూల్యమైన రాజ్యాంగం నేడు అభాసుపలవుతుంది .. రాజ్యాంగం లో కూడా మార్పులు చేయాలి. ఇది జరిగే పనైతే ...అన్నీచక్కబడతాయి

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008