Showing posts with label ప్రచురణలు. Show all posts
Showing posts with label ప్రచురణలు. Show all posts

Tuesday, 30 August 2016

జె.వి.పబ్లికేషన్స్ - వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా...





 మన జీవితంలో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఎవరు, ఎప్పుడు, ఎందుకు పరిచయమవుతారో, నమ్మకమైన, ఆత్మీయమైన స్నేహం ఎందుకు కలుగుతుందో అర్ధం కాదు. తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది..



2010 లో హైదరాబాదులో రెంఢవ మహిళా రచయితల సమావేశాలు జరిగాయి. నాకు తెలిసిన చాలామంది రచయిత్రులు పాల్గొంటున్నారు. వాళ్లతో పరిచయం లేకున్నా కనీసం చూడొచ్చు వాళ్లు మాట్లాడేది వినొచ్చు అన్న కుతూహలం ఉన్నా కూడా పాల్గొనలేదు.. అలాగే వంగూరి చిట్టెన్ రాజుగారు చాలా గొప్ప వ్యక్తి, తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు అమెరికాలో, మన దేశంలో కూడా నిర్వహిస్తున్నారని తెలుసు. కాని ఆయన నిర్వహించే సభలకు వెళ్లడానికి, వెళ్లి కూర్చోనే అర్హత నాకు లేదు. ఎందుకంటే అప్పటికి మాలిక పత్రిక మొదలెట్టలేదు, పబ్లిషింగ్ లేదు.. ఏదో మామూలు బ్లాగర్ ని మాత్రమే.. అని అనుకునేదాన్ని. కాని అదే చిట్టెన్ రాజుగారితో కలిసి వంగూరి ఫౌండేషన్ వారి పుస్తకాల ప్రచురణ చేయడం, మొన్నటి సభలో రాజుగారితో కలిసి మొదటి వరసలో కూర్చోవడం. ఒక పబ్లిషర్ గా స్టేజ్ మీద కూర్చోవడం... అంతా ఒక కలగా ఉండింది. ...



 ఎందరో మహా మహానుభావులు..... వారి సరసన చిన్ని పబ్లిషర్..






ఎడంపక్కనుంచి...గాయని సుచిత్ర, గాయకుడు రామకృష్ణ, భగీరధ్, ఖదీర్ బాబు, వంశీరామరాజు, వంగూరి, రావి కొండల రావు గారు, తనికెళ్ళ భరణి, ద్వానా శాస్త్రి, జ్యోతి వలబోజు, ఆవుల మంజులత గారు, తెన్నేటిసుధాదేవి గారు.

చిట్టెన్ రాజుగారి అమెరి'కలకలం' పుస్తకావిష్కరణ ..

కొసమెరుపు: ఆవిష్కరణ కాగానే ముగ్గురు వంద చొప్పున మూడు వందల పుస్తకాలు కొనేసారు. రేపు సెకండ్ ప్రింట్ కి ఇవ్వాలి.
పుస్తకం రిలీజ్ అయిన మరుసటిరోజే సెకండ్ ప్రింట్ అంటే హిట్ టాక్ అన్నట్టే కదా..

నిజంగా ఈ బుజ్జి పుస్తకం (కొన్ని మొబైల్ ఫోన్లకంటే చిన్నగా) భలే ముద్దుగా ఉంది. చేతిలో పట్టుకోవడానికి, జేబులో పెట్టుకోవడానికి, పర్సులో పడేసుకోవడానికి, ప్రయాణాలప్పుడు ఈజీగా ఓ ఐదారు నవళ్లు లేదా కథల పుస్తకాలు బాగులో వేసుకోవచ్చు. రిటర్న్ గిఫ్టులుగా కాని , ఇంటికి వచ్చినవాళ్లకు ఊరికే అలా ఇవ్వడానికి బావుంది.. ఇది నా మాట కాదు. అతిధుల మాట.. మరి ఇంత మంచి క్వాలిటీతో అందంగా ఉన్న ఈ పుస్తకం వెల యాభై రూపాయిలే కదా. మంచి హోటల్ కి వెళితే కప్పు కాఫీ రాదు ఈ ధరలో....

కొనండి. కొనిపించండి.. కొని బహుమతిగా ఇవ్వండి. అందరికీ సంతోషంగా ఉంటుంది.

ఇదే స్ఫూర్తితో వందకంటే తక్కువ ఉంటే పుస్తకాలను ఇదే సైజులో వేయాలని నా ఆలోచన..

Friday, 6 February 2015

e క్రేజీ రైటర్స్ ... ఆంధ్రజ్యోతి నవ్య


 
 
అంతర్జాలం పుణ్యమా అంటూ పలువురు సామాన్య మహిళలు రచయిత్రులయ్యారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, అంకితభావం ఉంటే చాలు అయిదు పదుల వయసుదాటినా కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని నేర్చుకొని బ్లాగులు నిర్వహిస్తూ రచయిత్రులుగా ఎదిగి పలు పుస్తకాలు రాశారు. అలా రచయిత్రులుగా మారిన బ్లాగర్‌ల విశేషాలు...

జ్యోతి వలబోజు... 2006వ సంవత్సరం వరకు సాధారణ గృహిణి. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగానే పెళ్లి కావటంతో చదువుకు అర్ధాంతరంగా బ్రేక్‌ పడింది. ఆపై ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనపాలనతో పాటు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ పనులతో ఇంటికే పరిమితమయ్యారు. తీరికవేళల్లో టీవీ సీరియళ్లకు అతుక్కుపోయేవారు. పిల్లల చదువులు అయిపోయి వారికి పెళ్లిళ్లు అయి బాధ్యతలు తీరాక, భర్త సలహాపై ఆమె కంప్యూటర్‌ నేర్చుకున్నారు. ఆపై ఆమెకిష్టమైన అంశాలపై తెలుగులో పలు బ్లాగులు ఏర్పాటు చేసుకొని, నెటిజన్లతో భావాలను పంచుకునే వారు. అలా బ్లాగులు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లతో జత కలిసిన జ్యోతి తనకిష్టమైన తెలంగాణ ఇంటి వంటలపై రెండు పుస్తకాలను రాసి రచయిత్రిగా మారారు. ‘‘మా అమ్మమ్మ ఇంట్లో చిన్ననాటి నుంచి నేర్చుకున్న వివిధ వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ వంటకాలతో ‘తెలంగాణ ఇంటివంటలు’ పేరిట రెండు పుస్తకాలు రాసి, విడుదల చేశాను. అయిదు నెలల్లోనే నా పుస్తకాలు రెండోసారి ముద్రణకు నోచుకోవటం నాకెంతో సంతోషాన్నిచ్చింది. నా పుస్తకాలకు నేను డీటీపీ చేసుకోవటంతోపాటు ఫ్రూఫ్‌, కవర్‌పేజి డిజైన్‌లను కూడా నే నే చేసుకున్నా. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయటంతోపాటు ఇతర రచయిత్రుల పుస్తకాలను ముద్రించేందుకు జేవీ పబ్లిషర్స్‌ పేరిట పబ్లికేషన్‌ను ఆరంభించా’’నంటారు జ్యోతి.

ఎన్నెన్నో బ్లాగులు

జ్యోతి వలభోజు ‘జ్యోతి’ పేరిట మొదట బ్లాగును ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకోవటం ఆరంభించారు. అలా తన కిష్టమైన వంటలు, పాటలు, ఆధ్యాత్మికం, ఫోటోలు, పజిల్స్‌, ఇలా ఒకటేమిటి? పలు అంశాలపై పలు బ్లాగులకు శ్రీకారం చుట్టారు. ‘పొద్దుగడి’, ‘జగన్నాటకం’, ‘అన్నపూర్ణ కుకరీ బ్లాగ్‌’, ‘హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌’, ‘విజయవిలాపం’, ‘నైమిశారణ్యం’, ‘జడ శతకం’, ‘షడ్రుచులు’,  ‘గురవాయణం’, ‘చైత్రరథం’,  ‘అముక్తమాల్యద’ వంటి బ్లాగులతో తనకంటూ స్నేహితులను ఏర్పరచుకున్నారామె. బ్లాగులే కాదు వివిధ కథలతో ‘మాలిక’ పేరిట ఆన్‌లైన్‌ మాసపత్రికను ఏర్పాటు చేశారు. రేపటి గురించి చింత లేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపేయడం అంటే నాకెంతో ఇష్టమంటున్న జ్యోతి మధురమైన ఆ పాత హిందీ, తెలుగు పాటలు వినడం, స్నేహం చేయడం, మనసులోని ఆలోచనలను రాతలుగా నిక్షిప్తం చేయడం అంటే ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

జ్యోతిలాగే మరెందరో..

జ్యోతిలాగే మరికొంతమంది రచయిత్రులు బ్లాగులు నిర్వహిస్తూ పుస్తక రచనలకు శ్రీకారం చుట్టారు. జ్ఞాన ప్రసూన ఎనిమిది పదుల వయసులో ఉండి ‘సురిచి’ పేరిట బ్లాగు నిర్వహిస్తూ పుస్తకరచనలు చేశారు. ఇలా మాలాకుమార్‌ సైతం బ్లాగర్‌ నుంచి రచయిత్రిగా ఎదిగారు. బ్లాగులు, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల ద్వారా ఇలా నిత్యం తమ భావాలను పంచుకోవటమే కాదు... బ్లాగర్లు మరికొందరు ప్రముఖ రచయిత్రులతో కలిసి ‘ప్రమదాక్షరి’ పేరిట ఓ ఫేస్‌బుక్‌ గ్రూపుగా ఏర్పడటం విశేషం. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న పుస్తకప్రదర ్శనలో పాఠకులను కలిసేందుకు వారిలో కొందరు.. మహిళా రచయిత్రులు కదిలివచ్చారు. ఈ పుస్తకప్రదర్శనలో 24 మంది ర చయిత్రులు తాము రాసిన పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ స్టాల్‌ను పుస్తకాల అమ్మకాల కంటే పాఠకులతో ముఖాముఖి, పరిచయాలు, ఇతర రచయిత్రులతో పరిచయాలు, పలకరింపులతో సందడి నెలకొంది. మహిళా రచయిత్రులే నిర్వహిస్తున్న ఈ స్టాల్‌లో పుస్తకాలు విక్రయించటమే కాదు నచ్చిన రచయిత్రితో ఓ పలకరింపు, ఓ ఫోటోగ్రాఫ్‌, ఓ ఆటోగ్రాఫ్‌ ఇస్తూ పాఠకులను ఆకట్టుకుంటున్నారు.
నవ్య డెస్క్‌


ఎనిమిది పదుల వయసులో...

‘‘నా పేరు జ్ఞాన ప్రసూన. మాది హైదరాబాద్‌. నా ఇద్దరు కుమారులు కెనడాలో స్థిరపడటంతో ఓసారి వారిని చూసేందుకు అక్కడకు వెళ్లి ఆరునెలలున్నాను. అక్కడ ఇంట్లో అందరూ ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లడంతో నేనొక్కదాన్నే ఇంట్లో ఉండాలంటే బోర్‌గా ఉండేది. అప్పుడు నా మనవళ్ల సాయంతో పాత ల్యాప్‌టాప్‌ తీసుకొని నేర్చుకోవటం ఆరంభించాను. అలా 80 ఏళ్ల వయసులో కంప్యూటర్‌ నేర్చుకొని.. తెలుగులో బ్లాగు ఏర్పాటు చేసుకొని నా భావాలను వ్యక్తికరించేదాన్ని. దీంతోపాటు ఫేస్‌బుక్‌లో మహిళా రచయిత్రులతో ఛాటింగ్‌ చేస్తున్నాను. ‘గుడిగంటలు’ పేరిట పుస్తకం రాశాను. నాకు హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్నందువల్ల హిందీ భాష నుంచి తెలుగులో అనువాద రచనలు చేస్తున్నాను. ఎంత వయసు వచ్చినా ఖాళీగా ఉండకుండా నచ్చిన రచనలు చేస్తుండటం నాకెంతో ఆనందాన్నిస్తుంది. లలిత కళల వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది..’’

Saturday, 12 January 2013

సంప్రదాయ ముగ్గులు - కినిగె ebook

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.

ఇక సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ, నెలరోజులు గజగజ వణికించే చలిని కూడా లెక్క చేయక స్త్రీలు తమ ఇంటిముందు కల్లాపి చల్లి రోజకో రకమైన ముగ్గు వేసి, రంగులు, గొబ్బెమ్మలు, పూలతో అలంకరిస్తారు. మరి అందరికి ముగ్గులు రావు కదా అంటారా?? కినిగె వారి సహకారంతో ఐతే నాకు వచ్చిన, తెలిసిన, తెలుసుకున్న ముగ్గులతో ఓ ముగ్గుల పుస్తకం తయారు చేసాను. ఇది eబుక్. ఈ పుస్తకం కొనుక్కుని కాని, అద్దెకు తీసుకుని కాని ప్రపంచంలో ఎక్కడున్నా మీ కంప్యూటర్ లోకి దింపుకుని ముగ్గులు నేర్చుకోండి.. మీకు ముగ్గులు వేసే ఆసక్తి లేదు అనుకుంటే మీవాళ్లకు, మీ ఇంట్లోవాళ్లకు, స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వొచ్చు.. ఎలాగంటే ఈ లింకులో చూడండి..






సంప్రదాయ ముగ్గులు
సంప్రదాయ ముగ్గులు On Kinige

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008