Monday 28 February 2011

హక్కులు పొందే హక్కుందా? - మార్చి 2011 కంప్యూటర్ ఎరా సంపాదకీయం

హక్కులూ, ఆత్మగౌరవాలపై పెరుగుతున్న శ్రద్ధ మనుషులకు బాధ్యతలపై మృగ్యమవుతోంది. ఎక్కడ చూసినా హక్కుల కోసం పోరాటాలే.. వాటిని తప్పుపట్టలేం, కానీ మనం నిర్వర్తించవలసిన బాధ్యతల్లో చిన్న లోపాన్ని ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేం! కూడుపెడుతున్న వృత్తి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉండదు.. ఆదాయంపై ధ్యాస తప్ప! మన పట్లా, మనం చేసే పని పట్లా, సమాజం పట్లా బాధ్యతని విస్మరిస్తూనే హక్కుల కోసం ఉద్యమిస్తుంటాం. మన ధర్మాన్ని గాలికొదిలేసి నిరంతరం మన క్షేమం పట్లే మమకారం పెంచుకోవడం ఎంత దౌర్భాగ్యస్థితో అర్థమయ్యేటంత సున్నితత్వం మనలో ఇంకా మిగిలి లేదు. చేసే పని పట్ల నిర్లక్ష్యం ఎంత ఉపేక్షించరానిదో అర్థం చేసుకునే పరిస్థితిలోనూ లేము. మన పొరబాట్ల పట్ల అపరాధభావం కూడా మచ్చుకైనా కన్పించకుండా పోతోంది. పరోక్షంగా మన మనఃసాక్షికే జవాబుదారీగా ఉండడం ఎప్పుడో మానేశాం. మన శరీరాలు మందమవుతున్నాయి, బుద్ధులు సంకుచితమవుతున్నాయి. వితండవాదం, తర్కంతో మూర్ఖంగా అన్నీ నెగ్గించుకునే రాక్షస ప్రవృతి మనల్ని స్వారీ చేస్తోంది. ఎవరు చెప్పినా, ఏది చెప్పినా విన్పించుకునే స్థితిని దాటిపోయాం. ఒకవేళ విన్పించుకునే హృదయం ఇంకా మిగిలి ఉన్నా ప్రతీ ఒక్కరూ హక్కులనూ దక్కించుకోమని ప్రబోధించేవారే.. బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించమని నిర్దేశించేవారేరీ? అందరూ మనలాంటి ప్రజల పక్షాన హక్కులకై పోరాడతారు.. హక్కులను సాధించుకోమని ప్రేరేపిస్తారు.. ఏదైనా తేడా వస్తే వ్యవస్థని దుమ్మెత్తిపోస్తారు. వ్యవస్థని పతనావస్థకు చేరుస్తున్నది చేతులారా మనకు మనం కాదా? హక్కుల గురించి పోరాడేవారు బాధ్యతలను ఎందుకు ఉద్భోధించరు? సరిగ్గా పనిచేయమంటే అసలుకే మోసం వస్తుందని.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యతని విస్మరించడం ఎంతవరకూ సబబు? అసలు ప్రతీ మనిషీ తాను చేయాల్సిన ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే వ్యవస్థలో లోపాలెందుకు ఉంటాయి?



బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి కూడా మనకు ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఏ ప్రయోజనం లేనిదే చివరకు బ్రతకడం కూడా వృధా అనేటంత వ్యాపారాత్మక ధోరణిని అలవర్చుకున్నాం. దాంతో ఎక్కడా తృప్తి మిగలట్లేదు. బేరసారాలు తలకెక్కక ముందు సమర్థవంతంగా ఏదైనా పనిచేస్తే ఎంతో సంతృప్తిని మూటగట్టుకునే వాళ్లం. ఇప్పుడా సంతృప్తులు ఎక్కడా లేవు. మనం చేసే ఏ పనిలోనూ పరిపూర్ణత గోచరించదు.. అతుకుల బొంతలా ఏదో చేయాలి కాబట్టి చేయడం తప్ప! ఇలాంటి పలాయనవాదంతో జీవిస్తూ మళ్లీ మనకు సమాజంలో దక్కాల్సిన అన్ని హక్కులూ దక్కాలి. ఇదో గొప్ప జీవనశైలీ.. దీన్ని మళ్లీ పద్ధతిగా గడుపుకొస్తున్న జీవితంగా అందరికీ చెప్పుకుని మురిసిపోవడం! ఫలానాది దక్కాలని పోరాడి.. అంతకన్నా పెద్దది మనం చేయాల్సి ఉండీ కూడా నిమ్మళంగా దాటేసి జీవితంలో ఎంతో సాధించామని మురిసిపోవడం ఎంతగా పాతాళానికి దిగజారిపోయామో తేటతెల్లం చేస్తుంది. హక్కులను వదులుకోమని ఎవరూ చెప్పరు.. కానీ హక్కుల కన్నా మన బాధ్యతలు చాలా శక్తివంతమైనవనీ.. హక్కులు ఒకరిస్తే తీసుకునే భిక్షం వంటివనీ, బాధ్యతలు మనకు మనం మన వంతు చేసే దానాల వంటివనీ గ్రహించగలిగిన రోజున మనవంతు ఏమీ దానం చేయకుండా ఉండిపోతూ, మరోవైపు మొండి చేతుల్ని చాచి అడుక్కోవడానికి మనసొప్పదు.



మీ

నల్లమోతు శ్రీధర్

Monday 14 February 2011

ప్రేమ జీవనరాగం



వేలంటైన్ డే సందర్భంగా భూమిలోని వ్యాసం .

ప్రేమ - రెండుక్షరాలు

ప్రేమ ఎంతో బలీయమయింది

ప్రేమ విలువ ప్రేమించిన వారికే తెలుస్తుంది

ప్రేమ ఎందరితోనో ఎన్నో రకాలుగా ఆడుకుంది

ప్రేమ సృష్టి వున్నంత వరకూ వుంటుంది

ప్రేమకు మరణం లేదు!


ఫిబ్రవరీ 14 న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఇది యవ్వనంలో ఉన్న ప్రేమికులు మాత్రమే జరుపుకునే వేడుక కాదు. భార్యాభర్తలు, స్నేహితులు, అన్నదమ్ములు., అక్కాచెళ్లెల్లు.. అందరి మధ్యా ఉండేది ప్రేమ తత్వమే. అందుకే ఈ రోజు ఆ ప్రేమను ప్రకటించుకునే పవిత్ర సందర్భంగా జరుపుకోవాలి. ప్రేమను అప్పుడప్పుడు వ్యక్తపరుచుకోవాలి. వాలెంటైన్స్ డే లేదా ప్రేమికులరోజు అనగానే ప్రేమ తత్వం, ఆనందం వెల్లి విరుస్తుంది.


ఈ రోజు కోసం అందమైన బహుమతులు, గులాబీ పువ్వులతో , అందమైన గ్రీటింగ్ కార్డులతో దుకాణాలు ఆకర్షణీయంగా ముస్తాబవుతాయి. ఈ రోజు ప్రకృతి మరింత అందంగా మారిపోతుంది . పువ్వులు, బహుమతులు, తమ అంతరంగాన్ని ఆవిష్కరించే పదాలతో ఉన్న గ్రీటింగ్ కార్డులను ప్రేమికులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలా చేయడం ఒక సంప్రదాయం కాకున్నా తమ ప్రేమను మరింత అందంగా ప్రకటించుకునే రోజిది. ప్రేమకి ఎవరెలాంటి పరిభాషలు చెప్పినా చివరికి అమరమైనది 'ప్రేమ' అనే విషయం అందరూ అంగీకరిస్తారు.



ప్రేమికుల రోజుగా పిలవబడే వాలంటైన్స్ డే నిజంగా స్త్రీ పురుషుల ప్రేమకు మాత్రమే సంబంధించినదా? కానే కాదు. ఇది తిరస్కారం, మృత్యువు, క్రూరత్వానికి ముడిపడి ఉన్న పండగ. క్రీ.శ.3వ శతాబ్దంలో రోమ్ చక్రవర్తి క్లాడియస్ కి ఉన్న రాజ్యకాంక్ష కారణంగా తరచూ యుద్ధాలు జరిగేవి. అతని క్రూరత్వానికి జడిసి ప్రజలు సైన్యంలో చేరడానికి సుముఖంగా ఉండేవారు కాదు. దానికి కారణం పురుషులంతా ప్రేమలో పడి తమ ప్రియురాళ్లు, భార్యలను వదిలి ఉండలేకపోతున్నారు అని భావించి క్లాడియస్ తన రాజ్యంలో పెళ్లిళ్ల్లనే రద్దు చేశాడు. ఆ రాజ్యంలో ఒక మతప్రచారకుడు సెయింట్ వాలంటైన్ మాత్రం చక్రవర్తికి తెలియకుండా రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవాడు. అది తెలుసుకున్న చక్రవర్తి అతడిని బంధించి ఉరిశిక్ష విధించాడు. జైలులో ఉన్నప్పుడు పరిచయమైన జైలర్ కూతురిని ప్రేమించాడు. క్రీ.శ.269 సంవత్సరం, ఫిబ్రవరీ 14 ఉరితీయబోయే ముందు తన ప్రేమసంకేతంగా గ్రీటింగ్ కార్డ్ తయారుచేసి "ప్రేమతో... నీ వాలెంటైన్" అని సంతకం చేశాడనీ ప్రతీతి. . ప్రేమను బ్రతికించడానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టిన వాలెంటైన్ కి నివాళిగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజును వాలెంటైన్ డేగా జరుపుకుంతున్నారు. ఈ రోజున ప్రేమికుల మధ్య చోటు చేసుకునే ప్రతి సంఘటన ఒక తీపి గుర్తుగా ,మధుర స్మృతిగా మిగిలిపోతుంది. మరపురాని బహుమతులతో ఈ అపురూప క్షణాలను మరింత అందంగా మార్చుకుంటారు. న్యూఇయ ర్స్‌డే, క్రిస్‌మస్‌ల తర్వాత ప్రపంచ మంతటా ప్రముఖంగా జరుపుకునే వేడుక వాలంటైన్స్‌డే.



ప్రేమ తత్వాన్ని అందరికి పంచే పవిత్రమైన ప్రేమికుల రోజును చిన్న బహుమతి గాని, గులాబీ కాని, ఆత్మీయమైన మాటలతో ఉన్న గ్రీటింగ్ కార్డ్ కాని ఇచ్చి ప్రేమను వ్యక్తపరుచుకోవడం ప్రేమను గెలిపించడమే అవుతుంది. నేటి యువతలో ఈ ప్రేమ వెర్రి తలలు వేస్తుంది. కొద్దిపాటి పరిచయంతోనే ప్రేమించుకుంటున్నాం అని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పబ్బులు, అశ్లీల నృత్యాలు, తాగుడు పార్టీలు అంటూ ఈ పండగ ఉద్ధేశ్యాన్ని మంటగలుపుతున్నారు. అందుకే కొన్ని మత తత్వ పార్తీలు ఈ ప్రేమికుల రోజు జరుపుకునే సంస్కృతి మనది కాదు అంటూ ఇలాంటి వేడుకలు జరుగే చోట ఆందోళనలు చేస్తున్నారు. ఈరోజు ఎవరైనా జంట బయట కనపడితే వాళ్లిద్దరికి పెళ్లి చేయడమో రాఖీ కట్టించడమో చేస్తామని బెదిరిస్తున్నారు.




వాలంటైన్ ఆత్మార్పణ సంకేతంగా ఆరంభమై వాలంటైన్ డే గా విశ్వవ్యాప్తంగా ప్రేమపరిమళాలు వెదజల్లే ప్రత్యేక రోజుగా నిలిచిపోయింది.

Friday 11 February 2011

జయదేవ్ గారు ఇచ్చిన కార్టూన్ ...


రెండు రోజుల క్రింద ఫేస్బుక్ లో పరిచయమైన ప్రముఖ చిత్రకారులు జయదేవ్ గారు నాకోసం ఇచ్చిన కార్టూన్ చిత్రరాజం. నిజం చెప్పొద్దూ. చూడగానే ఫక్కున నవ్వేసాను.. నాకు వంట చేయడం రాదు అని , వంట చేయడం మర్చిపోయా అని ఊరికే దెప్పుతూ, అప్పుడప్పుడూ (అంటే ఈ మధ్య తరచుగా అన్నమాట) వంటింట్లోకి ప్రవేశిస్తున్న మా వారికి చూపించాలి. :)

Saturday 5 February 2011

మహాన్ (మహమ్మద్) రఫీ


శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః

ఎంతటి క్రూరహృదయం ఉన్నవాడినైనా స్పందన కలగచేసి, మనసును చల్లబరిచి ఆహ్లాదాన్నిచ్చే గొప్ప శక్తి సంగీతానికి ఉంది. అది ఒక అద్భుతమైన మంత్రం. అల్లకల్లోలమైన మనసును తన సమ్మోహన శక్తితో శాంతింపచేసి ఉపశమనం కలిగిస్తుంది. అలాంటి సంగీతం అంటే అది ఆ పాటల సాహిత్యమా?, సంగీతమా?, గాయకుల స్వరమాధుర్యమా? ఏది మనను ఆకట్టుకుని తన మాయాజాలంలో బంధించేది అంటే నా మట్టుకైతే అది సాహిత్యంతో పాటు గాయకుడి స్వరమహిమ కూడా ముఖ్యమే అనిపిస్తుంది. కొన్నేళ్ళుగా మనతోనే ఉంటూ, మన సంతోషంలో కూనిరాగాలు తీస్తూ, అలసిన వేళ తన గానంతో మనలను మురిపించే మహాగాయకుడు మొహమ్మద్ రఫీ. నాటికి, నేటికి రఫీని మించినవాడులేడు. భవిష్యత్తులో రఫీనే పునర్జన్మ ఎత్తి తన గానాన్ని మళ్లీ వినిపిస్తాడేమో.

పంజాబ్ లోని కోట్ల సుల్తాన్ పూర్(ఇప్పుడు ఇది పాకిస్తాన్‌లో ఉంది) లో జన్మించాడు. తండ్రి హాజి అలి. మహమ్మద్. రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్, పండిత్ జీవన్ లాల్ మట్టూ మరియు ఫిరోజ్ నిజామిల వద్ద నేర్చుకున్నాడు. పదమూడేళ్ల వయసులో అనుకోకుండా ఒక కార్యక్రమంలొ సైగల్ బదులు రఫీ స్టేజీ ఎక్కి మైకు లేకుండా ఎన్నో పాటలు పాడి అందరిని మెప్పించాడు. 1944లో పంజాబి చిత్రం గుల్ బలోచ్ కోసం జీనత్ బేగంతో కలిసి "సోనీ మేరీ.. హారీ మేరీ" అంటూ సినీ రంగ ప్రవేశం చేశాడు రఫీ. అలా తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నౌషాద్, మదన్ మోహన్, ఎస్.డి.బర్మన్, హేమంత్ కుమార్, వసంత్ దేశాయ్, శంకర్ జైకిషన్ లాంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పని చేశాడు. అతని పాట ఎల్లెడలా వ్యాపించి అందరి హృదయాలను ఆకట్టుకుంది. హిందీ సినిమా గాన జగత్తులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ మరియు లతా మంగేష్కర్ ల గాయక జోడీ హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్రకుమార్ మరియు షమ్మీ కపూర్ రఫీ పాటలతోనే హిట్టయ్యారు అని అందరూ ఒప్పుకునే మాట. ఓపీ నయ్యర్ సంగీతంలో రఫీ గొంతు వెల్లువలా పొంగింది. అందుకే ఆయన సంగీతంలో రఫీ పాడిన 197 పాటలు మరపురానివి అయ్యాయి. దాదాపు అందరు సంగీత దర్శకులతో పనిచేసి ఎన్నో అద్భుతమైన, మధురమైన పాటలుమనకందించాడు రఫీ. 1944 - 1980 మధ్యకాలంలో రఫీ సుమారు 11 భారతీయ భాషల్లో 28,000 వేల పాటలు పాడాడు.



రఫీ కొన్ని తెలుగు సినిమాలలొ కూడా పాడాడు. ఎక్కువగా ఎన్.టి.ఆర్ సినిమాలే అని చెప్పవచ్చు. . ఎన్.టి.రామారావు సొంత సినిమాల్లో, అందునా రామారావు కుటుంబ సభ్యలతో (ఎన్.టి.ఆర్, బాలకృష్ణ, హరికృష్ణ) రఫీ ఎక్కువ పాడాడు .(భలే తమ్ముడు, తల్లా? పెళ్ళామా?, రామ్ రహీమ్, ఆరాధన, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అక్బర్ సలీం అనార్కలి.) . భక్త రామదాసు(నాగయ్య) చిత్రంలో కబీరు (గుమ్మడి?) పాత్రకు కూడా నేపధ్యగానం చేశాడు



రఫీ గురించి చెప్పాలంటే ఎంతొ ఉంది కాని అతని గురించి చెప్పడానికి మాటల కంటే అతని పాటలు వింటూ మైమరచిపోవడం తప్ప ఏమీ చేయలేము.. మరోసారి ఆనాటి (ఎప్పటికీ మేటి) రఫీ పాటలను గుర్తు చేసుకుందాం.. యె దునియా యె మెహ్‌ఫిల్ మెరె కాం కి నహి అంటూ జులై 31, 1980, లొ మనకు దూరమైనా అతని పాటలతో ఎప్పుడు మన చుట్టే తిరుగుతూ ఉంటాడు తుమ్ ముఝే భులా నా పావోగే అంటూ.

మరిన్ని విశేషాలు..

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008