Sunday 31 January 2010

పుస్తకాలు, సినిమాల ముచ్చట్లు...

పాత సినిమాలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. హిందీ అయినా తెలుగు అయినా మంచి కథా చిత్రాలు, హాస్య చిత్రాలు వచ్చేవి. అలాంటి ఒక అందమైన సినిమా "కోషిష్" .. మనసు పలికే మాటలను, భావాలను ఈ సినిమాలో చూడొచ్చు. మరిన్ని విశేషాలు ఇక్కడ B & G లో





మొన్నే కదా పుస్తకాల గురించి గొడవైంది.. కాని నేను చదివిన కొన్ని పుస్తకాల గురించి రాయకతప్పలేదు. ఎమెస్కో పుణ్యమా అని ప్రతి నెల రెండు పుస్తకాలు ఇంటికే వస్తున్నాయి. పుస్తక ప్రదర్శనలో , విశాలాంధ్ర లో కూడా కొన్ని పుస్తకాలు కొన్నాను. చదివినవి కొన్ని, చదవాల్సినవి ఎన్నో, కొనాల్సినవి ఇంకెన్నో ఉన్నాయి... గత సంవత్సరం నేను చదివిన పుస్తకాల కబుర్లు ఇక్కడ పుస్తకంలో ..

Saturday 30 January 2010

ఒక పేదరాలికి సాయం చేయండి...

ఈ మధ్యనే తల్లైన ఒక పేదరాలికి మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉంది. అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కాని ఆపరేషన్ , మందుల ఖర్చులు (సుమారు మూడు నుండి మూడున్నర లక్షలు ) తలకు మించిన భారం అయ్యాయి. మూడు రోజుల క్రింద ఆపరేషన్ జరిగింది. అక్కడా, ఇక్కడా సేకరించిన సొమ్ము 1.2 లక్షలు కట్టేశారు . ఇంకా 1.8 to 2.3 లక్షల రూపాయలు కట్టవలసి ఉంది. ఇపుడు ఆ ఇల్లాలు శ్రీమతి లక్ష్మి మల్కాజిగిరిలోని Gurunanak Care hospital లో ఉన్నారు. మీ వంతు సాయం అందించండి.

భద్రాచల నరసింహ బ్లాగులో చదివి పేషంట్ మరిదితో మాట్లాడి కనుక్కున్న వివరాలు ఇవి.

వారి ఇంటి అడ్రస్:

T. లక్ష్మి,
W/O T. నాగరాజు
హైదరాబాదు గోషామహల్ దాటాక మల్లేపల్లి పోలీస్ ఔట్ పోస్ట్ దగ్గర ఉన్న హనుమాన్ మందిర్ (ఇంతకుముందు రామ్ మందిర్ అనేవారంట) పక్క సందులో నాగరాజుగారి ఇల్లు ఉంటుంది.

ఫోన్ నంబర్ :

9347431437,

9397008241

వేలు , లక్షలు ఇవ్వకున్నా మనకు చేతనైనంత సాయం చేద్దాం.

Tuesday 26 January 2010

యాంటీ పుస్తక JAC


ఎప్పటినుండో ఈ విషయాలు నా మనసులో ఉన్నాయి. ఎదో నా మానాన నేను టైం దొరికినపుడు ఏవో పిచ్చిరాతలు బ్లాగులో రాసుకుంటున్నాను. అలాగే మిగతా బ్లాగులు , సైట్లు చదువుతున్నాను. ఈ మధ్య ఒక విషయంపై మాత్రం నాకు చాలా ఆరోపణలు ఉన్నాయి. అదేంటంటే.. పుస్తకాలు. సరేలే ఈ బాధ నాకొక్కదానికేనేమో. అందరూ హాయిగా ఉన్నారు. ఎన్నెన్ని పుస్తకాలు చదువుతున్నారో? వాళ్ళంతా గొప్పవాళ్ళు. మనకంత సీను లేదూ, సినిమా లేదు. అని ఊరుకున్నా.

పుస్తకాలంటే నాకు చిన్నప్పటినుండి ఇష్టమే. క్లాసు పుస్తకాలతో పాటు చందమామ, బొమ్మరిల్లు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, యువ మొదలైన పుస్తకాలు కూడా చదివేదాన్ని. దాదాపు ముప్పై ఏళ్ల నుండి దాచుకున్న పుస్తకాలు, కటింగ్స్ తో బైండింగ్ చేయించుకున్న సీరియల్లు, నవలలు ఎన్నో మావారి సాధింపులు భరించలేక ఇచ్చేసానా. మరి ఏంటి గొడవ అంటారా? ఈ మధ్య బ్లాగుల్లో ఎక్కడ చూసిన పుస్తకాల కబుర్లే కన్పిస్తున్నాయి. అయినా అతి కష్టం మీద వాటి వైపు వెళ్ళకుండా ఊరుకుంటున్నా. కాని ఇవాళ మాలతి గారి టపా చదివాక ఇక నా ఆవేశం, ఆక్రోశం, అసూయ అన్ని అలా బయటకు వచ్చేసాయి. మాలతిగారి లాగే నాకు ఎన్నో సందేహాలు. అసలు వీళ్ళు ఇన్నేసి పుస్తకాలు ఎలా చదువుతారు ? అంత టైం ఎక్కడుంటుంది అస్సలు. కట్టలు , కట్టలు పుస్తకాలు చదివేసాం అంటారు. వీళ్ళు రిటైరయి ఖాళీగా ఉన్నారా అంటే అదీ లేదు. ఎపుడూ బిజీ ...బిజీ.. నాకు పెద్ద సందేహం. వాళ్లకు కూడా ఇరవైనాలుగు గంటలే ఉంటాయి కదా. ఎలా చదువుతారబ్బా. ఊరికే చదవడం కాదు. ఆ పుస్తకం చేతిలో పట్టుకుని ఆ కథలో దూరిపోయి తర్వాత తీరిగ్గా విశ్లేషిస్తారు. అది పుస్తకం వాళ్ళు అచ్చేస్తారు. అమావాస్యకు పున్నానికి ఒకటి ఐతే పర్లేదు... ఇక ఈ మధ్య ఏడాది మొత్తంలో చదివిన పుస్తకాల గురించి రాయమంటున్నారు. అవిడియా బావుంది. ఎదో లే ఎవరైనా ఏడాదికి నాలుగైదు పుస్తకాలు చదివి ఉంటారు అనుకున్నా. అయ్యా బాబోయ్. జంపాల చౌదరిగారి లిస్టు చూసి కళ్ళు బైర్లు కమ్మాయి. గిర్రున తిరిగినట్టైంది. (సినిమాల్లో కొత్తగా పెళ్ళైన అమ్మాయికి తిరుగుతాయి చూడండి అలా. అందులో ఐతే డాక్టరు కాని ఇంట్లో పెద్దవాళ్ళు కాని అమ్మాయి నాడి పట్టుకుని కంగ్రాట్స్ .. తల్లి కాబోతుంది అంటారు. మరీ సూపర్ కదా).. ఆ లిస్టు లో ఉన్నవన్నీ ఎక్కువగా ఇంగ్లీష్ పుస్తకాలే. అసలు ఆ ఇంగ్లీషు పుస్తకాలంటేనే మనకు పడదు. ఇంతింత లావుగా ఉంటాయి.ఎలా చదువుతారబ్బా??క్లాసు పుస్తకాలకంటే సీరియస్సుగా చదివితేగాని కథ అర్ధం కాదు. అలా అని నేను చదివానని మోసపోకండి. అంత ఓపిక లేదు. నాకు ఇప్పటికీ ఇష్టమైనవి అమర్ చిత్ర కథ, టిన్ టిన్ , ఫాంటమ్, మెండ్రేక్ .. అదే తెలుగు నవల ఐతేనా .. అది పూర్తి చేసేవరకు నిద్ర పట్టదుగా. వంట చేస్తున్నపుడు కూడా పుస్తకం పట్టుకుని పూర్తి చేసిన రోజులున్నాయి. అవన్నీ యద్దనపూడి, మాదిరెడ్డి, కోడూరి కౌసల్య రాజ్యమేలిన రోజులు లెండి.

పుస్తకం వాళ్ళు మాత్రమే కాదు ఇలా పుస్తకాల ???? చాల మంది గురించి (ఎంత కుళ్ళు, అసూయ ఉన్నా వీళ్ళని రాక్షసులు, దుర్మార్గులు అంతే బాగోదు కదండీ. పొద్దున్న లేస్తే మొహాలు చూసుకునే వాళ్ళం) మీరు చదివారా? అంటూ వచ్చిన ఎన్నో ఇంటర్వ్యూలలో .. అమ్మో . ఎన్నెన్ని పుస్తకాలు ? అయినా వేలకొద్ది పుస్తకాలు ఏం చేసుకుంటారో ? ఏమో? ఇలా వేల కొద్ది పుస్తకాలు కొనేవాళ్ళ గురించి నాదో పెద్ద డౌటు? ఈ చుట్టుపక్కల ఆదాయం పన్ను శాఖ వాళ్ళు లేరు కదా? ఉంటే గింటే వాళ్ళని పక్కకి తోలండి.. నేను అనుకునేదేంటంటే... వీళ్ళందరికీ జీతం కంటే గీతం ఎక్కువని. అందుకే అన్ని పుస్తకాలు అలా కూరగాయలు కొన్నంత ఈజీగా కొనేస్తారు. ఈ బ్లాగులో , సైట్లలో వచ్చిన సమీక్షలు చూసి కొన్ని పుస్తకాలు కొందామనుకున్నా. మంచి చీర కొనుక్కుందామని కంది పప్పు (బ్యాంకు లాకర్ కంటే ఇదే సేఫ్, కాస్ట్లీ కదా) డబ్బాలో, బండి మీద కొన్న కూరగాయలను సూపర్ మార్కెట్ ధరలు చెప్పి మిగిల్చిన డబ్బులు, అలా ఇలా పోగేసిన డబ్బంతా పెట్టి పుస్తకాలు కొంటెే చిన్న క్యారీబ్యాగ్లో వచ్చాయి మరి. నేను అలా అనుకోవడంలో తప్పేంటి?

ఇదంతా కాదు కాని.. మాలతిగారు అన్నట్టు చెట్లను సంరక్షించడానికి పుస్తకాలు చదవడం , రాయడం నియంత్రిస్తే మంచిదే.. కాని దీనికి అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఎదోఒకటి చేయాలి తప్పదు. అందుకే ఈ JAC .. ఇపుడు ఎక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తుంది కదా. నేను అలాగే డిసైడ్ ఐపోయా. ఇందులో చేరి ఊరికే మాటలతో కాలయాపన చేయకుండా, తక్షణమే రంగంలోకి దిగాలి. నా అవిడియాలు ఏంటంటే.. ( బోల్డు పుస్తకాలు సేకరించి పెట్టుకున్నవాళ్ళు జాగ్రత్త ) అమాయకంగా మేము అది చదివాం, ఇది చదివాం. నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా అని చెప్తున్తారుగా. వాళ్ళ ఊర్లో ఉన్న సంఘ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇంటిపై దాడి చేసి పావు వంతు పుస్తకాలు వదలేసి మిగతావి ఎత్తుకొచ్చెేయాలి. వాటిని మిగతా సభ్యులకు పోస్ట్ చేయాలి. అలా అవి అందరు చదివాక రూపు రేఖలు బాగుంటే తిరిగిచ్చేస్తే సరి.. వేరే దారి లేదు. అన్ని పుస్తకాలు కొనాలంటే అందరివల్ల అవుతుందా. సమీక్షలు రాసి మిగతావారి బుర్రలు పాడు చేసేవారిని నెలకొకసారి రాసేలా నియంత్రిస్తే ఎలా ఉంటుంది. గుడ్డిలో మెల్ల మేలు కదా ?


అసలైతే ఈ టపాలు చదివి . ఎవరెవరంటారా?? కొత్తపాళీ, నాగరాజు పప్పు, మురళి, కస్తూరి మురళీకృష్ణ,,కల్పన, సుజాత, లలిత,,,, చావా కిరణ్ .. ఇంకా చాలా మంది ఉన్నారు. అలనాడు ప్రవరాఖ్యుడు కాళ్ళకు ఎదో క్రీమ్ పూసుకుని అలా ఎగిరిపోయాడు కదా. అలా వెళ్ళిపోయి నాకు కావలసిన పుస్తకం తెచ్చేసుకుని చదువుకుంటే ఎంత బాగుండు అనుకుంటా? అలా అని నేను పుస్తకాలన్నీ బేవార్సుగా చదవాలనుకుంటాను అనుకోవద్దు. నేను కొంటూనే ఉన్నా. అయినా రోజు ఎదో ఒక పుస్తకం బావుంది అని చెప్తుంటే దురాశ కలగదా?

సరే ఇక ఎవరెవరు JAC లో చేరతారో చెప్పండి....

Saturday 23 January 2010

జన్మనిచ్చే మాకు జీవించే హక్కు లేదా?




సృష్టికి మూలం ఆదిశక్తి అంటారు. కాని ఆ ఆడపిల్లకే జన్మించే , జీవించే హక్కు లేకుండా పోతుంది. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి.

ఆడపిల్ల పుట్టగానే అమ్మో! ఆడపిల్లా అని మూతి విరుస్తున్న పెద్దమనుష్యులు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకుని మరీ ఊపిరి పోసుకోకముందే పిండాన్ని నాశనం చెస్తున్నారు. అలా వీలుకాకపోతే పుట్టిన తర్వాత చెత్తకుండీలోనో , మురికి కాలువలోనో పనికిరాని వస్తువులా పడేస్తున్నారు. రక్తపు మరకలు ఆరని, కళ్లు కూడ తెరవని ఆ పసికందు ఊరకుక్కలకు, పందులకు ఆహారమవుతుంది. ఈ భ్రూణ హత్యలలో ఎక్కువగా ఆడశిశువులే ఉన్నారు. ప్రాణం ఉన్న పసికందును నోటకరుచుకుని ఎత్తుకుపోతున్న కుక్కను తరిమికొట్టిన జనాలు కన్నతల్లిని నోటికొచ్చినట్టు తిడుతున్నారు. అసలు అది కన్నతల్లేనా? మదమెక్కి కడుపు తెచ్చుకుని కని ఇలా పారేసింది? ఈ పసిగుడ్డును అలా పారేయడానికి దానికి మనసెలా వచ్చింది? అని అంటారు కాని ఒక్కరైనా ఆ తల్లి ఏ పరిస్థితిలో తన పేగు పంచుకుని పుట్టిన బిడ్డను బ్రతికుండగానే ఎందుకు వదిలించుకుంది. అల్లారు ముద్దుగా తన పొత్తిళ్లలో పెంచాల్సిన చిట్టితల్లిని నిర్దాక్షిణ్యంగా చెత్తకుండీ దగ్గర వదిలేసింది. అలా వదిలేసేటప్పుడు ఆ తల్లి ఒక్క క్షణమైనా తల్లడిల్లకుందా? ఇది ఎవరు ఆలోచిస్తారు?



ఆ బిడ్డను కని చెత్తకుండీ పాల్జేసినందుకు ఆడదాన్ని ఆక్షేపిస్తారు కాని ఆ బిడ్డ జన్మకు కారణమైన మగవాడు ఎక్కడ? అతని గురించి ఎవరూ ఒక్క మాట మాట్లాడరు ఎందుకు? ఒకవేళ జరిగింది తప్పైతే దానిలో ఇద్దరికీ సమానమైన పాత్ర ఉంది. కాని ఫలితం, పర్యవసానం ఆడదే భరించాలి. పెళ్లి అయ్యాక బిడ్డని కంటే గొడవ ఉండదు. కాని పెళ్లి కాకముందు జరిగిన తప్పుకు బాధ్యత ఆడదానిదే. మగవాడు అమ్మాయిని వాడుకుని, తన కోరికను తీర్చుకుని హాయిగా వెళ్లిపోతాడు. దానిని తప్పు అని నిలదీసేవాళ్లు కూడా ఉండరు. పైగా మగవాడు .. ఏది చేసిన చెల్లుతుంది. ఆడదే జాగ్రత్తగా ఉండాలి అని నీతులు చెప్తుంది ఈ గౌరవనీయ సమాజం. ప్రేమలో ఓడిపోయి గర్భవతి ఐన అమ్మాయిని ఈ సమాజం ఆదరిస్తుందా? లేదు. దానికి కారణమైన మగవాడు మాత్రం దర్జాగా తిరుగుతుంటాడు. మరో పెళ్లి కూడా చేసుకుంటాడు. నష్టపోయేది అమ్మాయే కదా. ఇటువంటి విపత్కర పరిస్థితిలో తన బ్రతుకే అగమ్యగోచరంగా ఉంటే తన కడుపున పుట్టిన నేరానికి ఆ పసికందును అందునా ఆడపిల్లను ఎలా పెంచగలను అని వదిలేస్తుంది గుండె భారం చేసుకుని. అలా కాకుండా ఆ బిడ్డను పట్టుకుని ఒంటరిగా కూడా బ్రతకగలదా?. బ్రతకనివ్వదు ఈ సమాజం. చెడిపోయిన ఆడది అని ముద్ర వేస్తారు. ఆమెతో తిరిగిన మగవాడు మాత్రం చెడిపోలేదు. ఎంతమందితో తిరిగినా అతను పుణ్యపురుషుడే. అందుకే తరచూ మనకు ఎంతో మంది ఆడపిల్లలు ప్రాణమున్నా, లేకున్నా మురికి కాలువలో, చెత్తకుండీల్లో చీమలకు ఆహారంగా, కుక్కలకు విందుభోజనంగా కనిపిస్తారు. ఆ చిట్టితల్లికి అదృష్టముంటే ప్రాణం పోకముందే ఎవరికంటైనా పడుతుంది. ఇలా ఆడశిశువని తెలియగానే తల్లేకాదు, భర్తా, పెద్దవాళ్లు కూడా చెత్తకాగితంలా విసిరేస్తున్నారు.

ఆడపిల్లలను పుట్టిన తర్వాత వదిలించుకోవడమే కాదు , పుట్టకముండే ఆడపిల్లని తెలుసుకుని పుట్టకుండా చంపేస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లంటే అదో పెద్ద దింపుకోలేనిభారం. నెత్తిమీద బండలాంటిది. చదివించాలి, కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ తర్వాత వరకట్న సమస్యలు. అదే మగవాడైతే గాలికి పెరుగుతాడు. ఏదో ఒక పని చేసి సంపాదిస్తాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. జీవిత చరమాంకంలో తల్లితండ్రులను , ఆస్థిని చూసుకునేది వాడే. అందుకే మగపిల్లాడే కావాలి. కాని తనను కన్నది ఆడదే , ఆ ఆడపిల్ల జన్మకు కారణం తానే అని తెలిసినా తెలియనట్టు ఆడపిల్లను వద్దు అంటాడు సదరు మొగుడు. ఇంతకుముందు లింగ నిర్ధారణ పరీక్షలు యదేచ్చగా జరిగేవి. జరుగుతున్నాయి కూడా.. ఆడపిల్ల అని తెలియగానే గర్భస్రావం చేయిస్తారు. అలా తన బిడ్డను చంపుకోవాల్సి వస్తున్నందుకు ఆ తల్లి ఎంత ఆక్రోశించిందో ఎవరికీ పట్టదు. జన్మనిచ్చే తల్లికి కూడా తను ఎప్పుడు, ఎవరికి జన్మనివ్వాలో కూడా నిర్ణయించుకునే అధికారం లేదు. నాకు ఆడపిల్ల పుట్టడానికి నువ్వే కారణం, చంపడానికి వీళ్లేదు అని అని భర్తను నిలదీసే ధైర్యం ఆ ఇల్లాలికి ఎప్పుడు వస్తుందో?

పుట్టి పెరిగి మరో ఇంటికి ఇల్లాలై వెళ్లినా కూడా ఆడపిల్లకు జీవితం క్షణక్షణం గండంగానే ఉంటుంది. ముఖ్యంగా వరకట్న బాధితులకు. ఈ సమస్య ఈ కాలంలో పట్టణవాసుల్లో, చదువుకున్నవారిలో లేకపోవచ్చు కాని పల్లెల్లో, చాలా కుటుంబాలలో జరుగుతుంది. ఇప్పటికీ పోరాడి అలసిన ఎందరో అమ్మాయిలు ఈ కట్నదాహానికి బలి అవుతున్నారు.

అందుకే సృష్టిలో జన్మనివ్వడం ఆడదానికే ఉన్న అద్భుతమైన వరం. కాని ఆ ఆడపిల్ల జీవితమే నిత్యాగ్నిహోత్రంలా మారుతుంది. పుట్టినప్పటి నుండి మట్టిలో కలిసిపోయేవరకు ప్రతి క్షణం గండమే. అన్నింటికి అణగిమణగి ఉండాలి. తప్పు చేసినా , చేయకున్నా బాధ్యత వహించాలి. అన్నింటికీ జవాబుదారీగా ఉండాలి. వీటన్నింటికి చావు మాత్రమే పరిష్కారం అవుతుంది.

పుట్టకముందు మమ్మల్ని చంపొద్దు. పుట్టాక చెత్తకుండీ పాలు చెయొద్దు. కట్నం కోసం మమ్మల్ని సమిధలా మార్చొద్దు. మమ్మల్ని బ్రతకనివ్వండి.

చిత్రాలు ఒక దినపత్రికలో ప్రచురించబడినవి.

ఇటీవల ఎవరో చెత్తకుండీ దగ్గర ఆడపిల్లను పడేసారంట అని విని కోపంతో రగిలిపోయా.ఇంత దారుణమా? అని.. అది మనసులో దాచుకోలేక ఇలా.......

Thursday 21 January 2010

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

ఈ పాట వినగానే అందరికీ గుర్తొచ్చేది టంగుటూరి సూర్యకుమారి. నటిగా, గాయనిగా, మొదటి మిస్ మద్రాసుగా .. ఇలా ఎన్నో రూపాలలోమనకు పరిచయం. ఆవిడ గురించి చెప్పడానికి చాలా ఉంది. కాని ఆవిడ పాడిన కొన్ని పాటలు ఇప్పటికీ నిత్యనూతనంగా మన మదిలో కదలాడుతూ ఉంటాయి. ఆ స్వర మాధుర్యం అద్భుతం.


కొన్ని పాటలు వినండి.



కొన్ని పాటలు చూడండి.

మా తెలుగు తల్లికి...



శతపత్ర సుందరి.....



సీతమ్మ మాయమ్మ..



నందగిరి బంగారు మావా....




మామిడి చెట్టు...




శివోహం....




ధీరసమీరే...



త్వరలో విడుదల కానున్న లీడర్ సినిమాలో సూర్యకుమారి పాట..

Saturday 16 January 2010

తెలుసుకొనవె చెల్లి (యువతి )

కొత్తగా పెళ్ళైనవాళ్ళు. చిరాకులు , పరాకులు, అలకలు సాధారణమే. ఆ సరస సల్లాపాలలో ఒకరి మీద ఒకరి ఆరోపణలు, చిరు కోపాలు. సీన్ అర్ధం కాలేదు కదా. అలనాటి ఆణిముత్యం మిస్సమ్మ లో ఎన్.టి.ఆర్ , సావిత్రి ఇద్దరూ జమునని మధ్యవర్తిగా చేసుకుని ఒకరి మీద ఒకరు ఆరోపణలు అంటే డైరెక్టుగా కాకుండా ఆడవాళ్ళు, మగవాళ్ళ మీద నెపం పెట్టి నీతులు చెప్తుంటారు. ఒకే పాట హీరో, హీరోయిన్ మీద చిత్రీకరించబడింది. సావిత్రి ఏమో మగవాళ్ళతో ఎలా మెలగాలో తెలుసుకో చెల్లి అని నీతులు చెప్తుంటే ఎన్టీవోడు ఆడవాళ్ళు ఎలా ఉండాలో తెలుసుకో యువతి అని చెప్తుంటారు.


జమున అమాయకపు మాటలు, అచ్చమైన తెలుగు వేషధారణ ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. మగవాళ్ళ గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని హీరోని చూస్తూ ఈ పాట పాడుతుంది సావిత్రి. మగవారికి దూరంగా ఉండాలి, ఎంత పని ఉన్నా మనకు మనమే వారి కడకు వెళ్ళరాదు అలుసైపోతాం, పది మాటలకు ఒక మాట బదులు చెప్పొద్దు .లేని పోని అర్ధాలు మన వెనక చాటుతారు జాగ్రత్త అని సావిత్రి చెప్పే ఒక్కో మాట వింటూ గతుక్కుమన్నా ఆనందిస్తూ ఉంటాడు ఎన్.టి.ఆర్. కాని నేను కూడా కొన్ని నీతులు చెప్పనా అంటాడు.


యువకులను సాధించుటకే యువతులు అవతరించారు, మూతి విరుపులు, అలకలు, బెదిరింపులు, సాధింపులు ఇక సాగవు , చిరునవ్వుతో మగవారిని సాధించుకో యువతి అని నవ్వుతూ ఎదురుదాడి చేస్తాడు ఎన్.టి.ఆర్. అసలే కోపంతో ఉన్న సావిత్రి ఇంకా ఉగ్రరూపం దాలుస్తుంది. అంతే కదా మరి.. ఉన్న మాటంటే ఉలుకే..

ఈ పాటలో నటీనటులు ఎంత సహజంగా నటించారు, వారి వస్త్రధారణ మాటలు... పింగళి వారి మాట, ఏ.ఏం.రాజా, లీల ల గాత్రం,ఎస్.రాజేశ్వరరావుగారి సంగీతం .. వెరసి ఒక అందమైన అనుభూతి..

Friday 15 January 2010

అంబరాన ఆదిత్యుని కేళీవిలాసం



ప్రచండ రూపంతో నిత్యసంచారియైన సూరీడు ఇవాళ చల్లబడ్డాడు. ఆ నీలాకాశంలో కదులుతున్నది సూరీడా సెందురూడా అన్న అనుమానం అందరికీ కలిగింది. గగనంలో చుట్టుముట్టిన కరిమబ్బుల మధ్య తరుగుతూ అలా కదలిపోయాడు. ఒకానొక సమయంలో మబ్బులను చెల్లా చెదురు చేస్తూ తన ప్రకాశాన్ని పెంచుకుంటూ వెలిగిపోయాడా రవి. నిత్యం నిప్పులు చిమ్ముకుంటూ చెలరేగే భానుడు గ్రహణ వేళ చల్లబడి వెన్న ముద్దలా మారాడు. ఒక్కసారిగా మిట్ట మద్యాహ్నం సంధ్యా సమయాన్ని తలపించింది. పిట్టలన్నీ కిలకిలారావాలు చేసాయి, ఇంటికెళ్ళే సమయమైంది అనుకున్నాయేమో. ఎల్లెడలా చిరు చలి వ్యాపించి ఒళ్ళు జలదరింప చేసింది. నేను వేసవి మంటలే కాదు శీతల పవనాలు కూడా అందించగలను సుమా అన్నట్టుగా నింగిన భాసిల్లాడు భాస్కరుడు....

ఈ రోజు మద్యాహ్నం అనుకోకుండా నింగిలోని అద్భుత దృశ్యకావ్యాన్ని పది నిమిషాలు బందించే అవకాశం దొరికింది. మబ్బుల మధ్య చకచకా కదిలిపోతున్న సూర్యుడిని చూస్తుంటే షర్ట్ వేసుకోకుండా , తల్లికి దొరక్కుండా ఇల్లంతా పరుగులు పెట్టె చిన్నపిల్లాడిలా అనిపించింది నాకైతే..

Thursday 14 January 2010

సంబరాల సంక్రాంతి శుభాకాంక్షలు..

బ్లాగ్ మిత్రులందరికి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు...




సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది, తప్పనిసరిగా ఉంఢవలసింది ముగ్గు.




ముగ్గు ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి తోడుగా గొబ్బెమ్మలు,చుట్టూ అలంకరించిన బంతిపూలు,పసుపు కుంకుమ,రేగుపళ్లు,శనక్కాయలు,చెరకు,నవధాన్యాలు..



చివరిగా పండగ పిండివంటలు. అన్నీ ఇవాళే చేయాల్సిరావడంతో టపా కట్టడం ఇదిగో ఇప్పుడైంది. నువ్వుల లడ్డూలు, మసాలాపూరీలు, కారప్పూస, రిబ్బన్ పకోడీ, అరిసెలు. గత సంక్రాంతికి అరిసెలు చేయలేదని ఎంత గోల చేసారు. అందుకే మర్చిపోకుండా ముందు అరిసెలు చేసాను. ఇవన్నీ ఇప్పుడు నేను తినాలి లేదా మా అబ్బాయి అఫీసుకు పంపాలి.

Monday 11 January 2010

సిరుల పొంగలి

అందరికీ సిరుల పండగ సంక్రాంతి శుభాకాంక్షలు..

అప్పుడేనా అంటారా.. పర్లేదు పండగ పనులు మొదలుపెట్టారు కదా. ఇదిగోండి నా వంతుగా రోజు సాక్షిలో ప్రచురించబడిన కొన్ని పొంగలి వంటకాలు మీకోసం..



Sunday 10 January 2010

మా సెడ్డ సిక్కొచ్చి పడ్డాది !!

నాకేంటి చిక్కేంటి అనుకుంటున్నారా? నిజమండి. మరీ అంత పెద్ద చిక్కా? టపాయించేటంత పెద్ద చిక్కా అంటారా? అవునండి. కాస్త సాయం చేద్దురూ! ఎంతో ప్రయత్నించినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. కొంత కాలంగా నన్ను తెగ తిప్పలు పెట్టేస్తుంది. ఇంతకీ ఆ చిక్కేంటి అంటే ...

ఆగండాగండి.. రింగులు తిప్పుకుంటూ వెనక్కి వెళ్ళిపోకండి. ఇక్కడే ఉండండి. చెప్తున్నాగా...

చిన్నప్పటినుండి అమ్మ చేస్తుండగా చూసి నేర్చుకున్న వంట నాకు ఇప్పుడు పెద్ద తంటా అయ్యింది. నేను వంట నేర్చుకుంది ఏ సైటులోనో, బ్లాగులోనో కాదు. ఏ స్కూలుకు వెళ్ళలేదు, కొలత ప్రకారం ఏయే దినుసు ఎలా వేయాలో ఎవరూ చెప్పలేదు. కూరగాయలు కోసినా, ఉప్పూ కారాలు (అమ్మో! కారంలో మాత్రం చెంచా వేస్తాను. దాంట్లో చేతులు ఎలా పెడతాను ) , మసాలాలు వేసినా అన్ని చేత్తోనే. దానికి లెక్కా కొలతా లేదు. కంటిముందు కూరను చూసి దాని ప్రకారం అంచనాలు వేసుకుంటూ ఒక్కోటి అలా వేసుకుంటూ పోవడం. ఒకసారి పాడైతే తర్వాతి సారి జాగ్రత్తగా ఉండడం. అపుడు కుదిరితే, అందరూ నోరు మూసుకుని తింటే (బావుంటే నోరు మూసుకునే తింటారు. కొంచం తేడాగా ఉంటేనే కదా అరిచేది) ఓహో మన కొలతలు కరెక్టుగా ఉన్నాయి. అని ఆ కొలతలపై ఫిక్స్ అయిపోవడం. ఇలా నా వంటల ప్రహాసం జరుగుతూ వచ్చింది. హిట్లూ ఫట్లు ఎలాగూ ఉంటాయనుకోండి. సరే ఆంతా బానే ఉంది. మరి ఇప్పుడేంటి చిక్కు అని అడగబోతున్నారా.. వస్తున్నా..

ఇంట్లో అంటే అలా గడిచిపోయింది.. పోతుంది కూడా. ఇపుడు బ్లాగులో, సైటులో , పత్రికలలో , టీవీ షూటింగుల కోసం వంటలు రాసేటపుడు చెప్పేటప్పుడు ఆయా వంటకం కొలత పక్కాగా ఇవ్వాలి. లేకుంటే గొడవలైపోతాయి. వంట బాగా వచ్చినవాళ్లైతే పర్లేదు అడ్జస్ట్ చేసుకుంటారు. నెట్ ఓపన్ చేసి వంటకం ముందు పెట్టుకుని వంట చేసేవాళ్ళు సరిగ్గా అదే కొలతల ప్రకారం చేస్తారు కదా. అది సరిగ్గా కుదిరితే వాళ్ళ గొప్ప. లేకుంటే నన్నే కదా తిట్టుకునేది. హమ్మయ్యా! మరి ఇపుడు అసలు సమస్య దరిదాపుల్లోకి వచ్చాము. నేను చేత్తో అలా ఆలవోకగా (సినిమా వీరోయిన్లా కాదులెండి) వేసే ఉప్పు కారాలు, మసాలాల గురించి కరెక్ట్ బరువు కొలతలు ఎలా ఇచ్చేది. ఓహో ఆ కూర చేసేటప్పుడు నా చేతి వేళ్ళ మధ్య ఉన్న ఉప్పు బరువు ఇంత ఉంటుంది. నేను వేసిన బెల్లం బరువు ఇంత ఉండి ఉండవచ్చు. ( ఎపుడూ నెలకోసారి సరుకులు తెచ్చుకుంటాం. అవసరమైనపుడు అలా తీసి వేసుకుంటాము కదా. ప్రతీ దాని బరువు ఎవరు చూడొచ్చారు. మరీ చోద్యం కాకపోతే ) ఇలా గాల్లో లెక్కలు వేస్తూ రాసుకుంటాను.

లేదా వంట చేసేటప్పుడే కొలత ప్రకారం చేస్తే పోలా ! అంటారా? అలా ఐతే గంటలో అయ్యే వంట నాలుగు గంటలు పడుతుంది. అలా కాదుగాని. ఏదైనా సులువైన ఉపాయం చెప్పండి. కిచన్ వేయింగ్ మెషీన్ కొనమని మాత్రం చెప్పొద్దూ. ఈ చెంచాల గోలేంటో, ఈ గ్రాముల గోలేంటో? మా కాలంలో ఈ లెక్కలు తెలీవమ్మా!!

ఇపుడు నానేటి సేసేది??

Friday 8 January 2010

రామరాజ - రామలింగ సంవాదం

ఖంగారు పడకండి. నేను చెప్పబోయేది సత్యం సోదరుల గురించి కాదు. అలనాడు రాయలవారి ఆస్ధానంలో కొలువుదీరిన అష్టదిగ్గజాలలో ఒకరైన రామరాజభూషణుడు, తెనాలి రామలింగడికి ఒకసారి చిన్న చిచ్చు రగిలింది.దాని వివరాలలోకి వెళితే....

శ్రీకృష్ణదేవరాయలవారికి (అదేంటో రాయలవారు అనగానే ఎన్.టి.ఆర్ మాత్రమే కనిపిస్తాడు)తెనాలి రామలింగడి మీద అవ్యాజమైన ప్రేమాతిశయమున్నదని భట్టుమూర్తిగా పిలవబడే రామరాజభూషణుడికి ఆసూయ కలిగింది. ఎలాగైనా అతడిని పరిహసించాలని నిశ్చయించుకున్నాడు.ఒకరోజు సభలో భట్టుమూర్తి "కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ " అనే పద్యం చివరిపాదం ఇచ్చి భటుడి ద్వారా రామలింగడిని మొదటి మూడు పాదములు పూరించమన్నాడు. తనను అవమానించడానికే ఇలా అడిగాడని గ్రహించిన వికటకవి ఊరుకుంటాడా? ఆ సమస్యను ఈ విధంగా పూర్తి చేసాడు.

గంజాయి త్రాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా?
లంజలకొడకా యెక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్.

గంజాయి త్రాగి, తక్కువజాతి వాళ్లలో కలిసి కల్లు త్రాగి ఉన్నావా? లంజలకొడకా! ఎక్కడ ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరింది అంటూ భటుడిని తిట్టినట్టు పద్యం పూరించాడు.

ఎంతైనా రామలింగడికి చాలా ధైర్యం. తనను అవమానించదలచిన భట్టుమూర్తిని తిట్టినా తిట్టనట్టు వాతలు పెట్టాడు కదా. తరవాత రాయలవారు ఈ గొడవేదో శ్రుతిమించుతున్నట్టుగా ఉందని గ్రహించి ఆ చివరి పాదాన్ని నేనే ఇచ్చాననుకుని పూరించమన్నాడు రామలింగ కవిని. అప్పుడు ఆ పద్యం ఎత్తుగడ, ఇతివృత్తం అన్నీ మారిపోయి అందంగా అవతరించింది

రంజనచెడి పాండవు లరి
భంజనులై విరటుగొల్వఁ బాల్పడి రకటా
సంజయ! విధి నేమందును
కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్.

మహావీరులైన పాండవులు నిస్సహాయులై విరాటరాజు కొలువులో ఊడిగం చేసిన ఇతివృత్తం ఏనుగుల సమూహం దోమ గొంతులో చొరబడినట్టుగా అగుపిస్తుంది అని రామకృష్ణుడు చక్కగా చెప్పాడు.

కవులు ఎంతకైనా సమర్ధులే కదా!!!

Friday 1 January 2010

పులిహోరోత్సవం - స్వాగతం


పులిహోర అంటే తెలీని పిల్లలు, అమ్మలు ఉండరేమో? స్కూలు కెళ్ళే పిల్లల బాక్సులలో ఎప్పుడో అపుడు పులిహోర తప్పక ఉండాల్సిందే. అలాగే గుడికి వెళ్తే పులిహోర తప్పక తీసుకోవాల్సిందే. అదేంటో గుడిలో ఇచ్చే పులిహోర రుచి ఇంట్లో చేస్తే రాదు. ప్చ్.. ఈ పులిహోర ని పిల్లలు సరదాగా పులి ఆహారము లేదా టైగర్ రైస్ అంటారు. అన్నం పప్పు కలిపి పెడితే మధ్యాహ్నం వరకు అది ఎండిపోతుందని రకరకాల పులిహోరలు చేసి పెట్టడం నా అలవాటు. అందులో కొన్ని నా సొంత సృష్టే ఉండేవి. ఇక పిల్లలు పెద్దయ్యాక పులిహోర అలవాటు తప్పినట్టైంది. ఎప్పుడో పండగలకు తప్ప చేయడం లేదు. కానీ హృదయ స్పందనల చిరుసవ్వడి బ్లాగర్ భాస్కర్ ని అమ్మాయిలు పులిహోర అని ఏడిపించడం చూసి సరే దాని సంగతేంటో చూద్దామని ఈ ఉత్సవానికి నాంది పలికాను. కొద్ది రోజులుగా ఎన్ని రకాల పులిహోరలు ఉన్నాయి అని తెలుసుకుంటూ అప్పుడప్పుడు ఇంట్లో తయారు చేస్తూ ఫోటోలు రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంతలో బ్లాగాడిస్తా రవి పులిహోర టపాతో బ్లాగులలో పులిహోర ఘుమఘుమలు మొదలయ్యాయి. ఎంతో మంది పులిహోర అనుభవాలు బయటకొచ్చాయి. సరే అని నేను రేపటినుండి షడ్రుచులు లో పులిహోర ఉత్సవం మొదలుపెడుతున్నాను. అందరికి ఇదే సాదర ఆహ్వానం.

భాస్కర్ నువ్వు ఇంట్లో ఎటువంటి పులిహోరలు కలుపుతావో నాకు తెలీదు కాని ఈ ఉత్సవం నీకోసమే.

రవి టపాలో భైరవభట్ల కామేశ్వరరావుగారు అడిగిన
చక్రపొంగలి (నేను ఇందులో పెసరపప్పు లేకుండా చేస్తాను మరి)
దద్దోజనం

ఇక మీ అందరిని ఊరించడానికి నేను ఇవ్వబోయే వివిధ రకాల పులిహోరలు ..
నిమ్మకాయ పులిహోర ( ఇది ఎపుడో ఇచ్చేశాను.)

మామిడి తురుము పులిహోర
కంచి పులిహోర
ఆవ పెట్టిన పులిహోర
నారింజ పులిహోర
దబ్బకాయ పులిహోర
సేమ్యా పులిహోర
నువ్వు పెట్టిన పులిహోర
చింతకాయ పులిహోర
ఉసిరికాయ పులిహోర
రవ్వ పులిహోర

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008