Showing posts with label ఆముక్తమాల్యద. Show all posts
Showing posts with label ఆముక్తమాల్యద. Show all posts

Friday, 7 May 2010

ఆముక్తమాల్యద

ఆముక్తమాల్యద గ్రంధం సామాన్య పాఠకులకు కొరుకుడు పడదు. అంత సులువుగా అర్ధం కావు అని ఒక భావన ఉంది. కాని కొద్దిగా కష్టపడితే అది నారికేళ పాకం లాంటిదే అని అర్ధమవుతుంది. ఇది నా స్వానుభవం మీద చెప్తున్న మాట. ఆముక్తమాల్యద మొదలుపెట్టినది మొదలు నా బ్లాగులో వివరణలతో ఇచ్చాను. కాని ఈ ఆముక్తమాల్యద కోసమే విడిగా ఒక బ్లాగు ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఊహ వచ్చిన వెంటనే కామేస్వరరావుగారితో సంప్రదించి ఆయన సహకారంతో బ్లాగు నిర్వహించవచ్చు అని ఆముక్తమాల్యద అనే బ్లాగును మొదలుపెట్టేసాను. ఈ రచనలోని పద్యాలకు తమ స్వరాన్ని అందించడానికి చదువరి, రాఘవ అంగీకరించారు. ఈ మహామహులతో కలిసి తలపెట్టిన ఈ మహా కార్యాన్ని మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఈ బ్లాగులోని రచనలకు మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియచేయగలరు.

ఈ ప్రభంధ కృతికర్త ఆంధ్రభోజుడు శ్రీ కృష్ణదేవరాయలను స్మరిస్తూ , ఆ ఏడుకొండలవాడు శ్రీనివాసుడి ఆశీర్వచనాలతో మొదలుపెడుతున్న ఈ బ్లాగు నిర్విఘ్నంగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ బ్లాగు నిర్వహణకు తోడ్పడడానికి వెంటనే అంగీకరించిన భైరవభట్ల కామేశ్వర రావుగారికి, పద్యాలను తమ స్వరంలో శ్రవ్యకాలుగా మార్చి ఇవ్వడానికి ముందుకొచ్చిన చదువరి, రాఘవ గారికీ ధన్యవాదాలు...


ఆముక్తమాల్యద.. http://amuktamalya.blogspot.com/

Thursday, 1 April 2010

పద్యచిత్రాలు

ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక పాట, వర్ణన, పద్యం చెప్తే అసలు దృశ్యం కళ్లముందు సాక్షాత్కరించాలి. కొందరు మహాకవులు అందమైన అలంకారాలతో, పదాలతో ఆ దృశ్యాన్ని లేదా సంఘటనను మనకు కళ్లకు కట్టినట్టుగా వర్ణిస్తారు. ఈ పదవిన్యాసం రాయలవారి పద్యాలలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.



ఉ. వేవిన, మేడఁపై వలభి వేణికఁ జంట వహించి విప్పఁగాఁ
బూవులు గోట మీటుతఱిఁ బోయెడు తేఁటుల మ్రోఁత కామి శం
కావహ మౌఁ గృతాభ్యసన లౌటను దంతపు మెట్ల వెంబడిం
జే వడి వీణ మీటుటయుఁ జిక్కెడలించుటయు న్సరింబడన్.


ప్రకృతికి ప్రతీక స్త్రీ. స్త్రీకి సంబంధించిన పనులన్నీ అందంగానే ఉంటాయి.. ఇక సరసులైన రాయలవారు మాత్రం తక్కువతిన్నారా?... మేడపై జడవిప్పుకుని పూలను తీసివేస్తున్న కాంతను ఎంత రమ్యమనోహరంగా వర్ణించాడో చూడండి... ప్రభాతవేళ మేడపై చూరుపక్కన నిలబడి తన జడను ముందుకువేసుకుని విప్పుకుంతుందంట ఓ వారకాంత. ఆ దృశ్యం చూడడానికి సర్వసాధారణంగానే ఉంటుంది. కాని కవికదా. సాధారణ విషయాన్ని మరింత అందంగా చెప్పాలిగా.. ఆ స్త్రీ తన జడవిప్పి అందులో చిక్కుకుని వాడిపోయిన పూలను గోటితో తీసివేస్తున్నది. పువ్వులున్నప్పుడు తుమ్మెదలు రాకుండా ఉంటాయా? ఆ ఇంతి పూవులు తీసేస్తుంటె తుమ్మెదలు చెదిరి ఝుమ్మని రొద చేస్తున్నాయంట. ఆ వీధిలో వెడుతున్నఒక కాముకుడు అది చూసి నిలబడిపోయాడు. అప్పటి కాంతలు వీణావిద్వాంసులు. తన జుట్టునుండి పూలను గోటీతో రాలుస్తుండగా ఆమె వీణవాయిస్తున్నట్టుగా అనిపించిందంట ఆ యువకుడికి. త్వరత్వరగా పూలను విదిలిస్తుంటే ఆమె నల్లని జుట్టు వీణియగాను, అందులో చిక్కుకున్న పూలు దంతపు మెట్లుగాను తోస్తున్నాయి మరి ఆ కాముకుడికి. అందునా తుమ్మెదల రొద కూడా వీణాగానంవలె నున్నది. ఎంత అందమైన భ్రాంతి కదా..




. తలఁ బక్షచ్చట గ్రుచ్చి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర
స్థలి నిద్రింపఁగఁ జూచి యూరెకు లుష స్స్నాతప్రయాతద్విజా
వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబుఁ జేర్పంగ రే
వుల డిగ్గ న్వెస బాఱువానిఁ నవ్వు న్శాలిగోప్యోఘముల్

విల్లిపుత్తూరులో వరిమళ్లకోసం తవ్విన పిల్ల కాలువలు ఉన్నాయి. ఆ పంటకాలువలలో బాతులు తమ స్వభావగుణముచేత తలలు రెక్కలలో దూర్చికొని నిద్రిస్తున్నాయి. అది చూసిన భటులు /కాపరులు ప్రాతఃకాలములో స్నానానికి వచ్చిన బ్రాహ్మణులు తమ ధోవతులను పిండి అక్కడే మరచిపోయినట్టున్నారు. వాటిని తీసికెళ్లి వారి ఇంటిలో అప్పగిద్దామని నీటిలోకి దిగారంట. ఆ అలికిడికి ఉలిక్కిపడ్డ బాతులు ఎగిరిపోయాయి. ఆ పక్కనే పొలాలను కాపలా కాసే యువతులు అది చూసి పక్కున నవ్విరంట. తెల్లని బాతులను చూసి బ్రాహ్మణుల పంచెలని భ్రమపడి భంగపడ్డారు ఆ భటులు..

Tuesday, 30 March 2010

ఆముక్తమాల్యద ... అలంకారాలతో ఆరంభం






మనం చూసిన ఏ సంఘటన ఐనా, సన్నివేశం ఐనా అది ఇతరులతో పంచుకోవాలి అంటే దాన్ని సవివరంగా చెప్పాలి. ఆ దృశ్యాన్ని చూసి మనం పొందిన అనుభూతి ఆ వర్ణన విన్నవాళ్లు కూడా పొందాలి. అంటే మన మాట కాని, రచన కాని, పాట కాని, పద్యం కానీ ఒక చిత్రాన్ని విన్నవారి కళ్లముందు సాక్షాత్కరింప చేసినప్పుడే ఆ రచనలోని అసలు సారం అవతలివారికి అందుతుంది. మామూలుగా చెప్తే అనుకున్న ఫలితం దక్కదేమో అందుకే రచనలకు కొన్ని అలంకారాలు చేయాలి మరి.. ఇదే విధంగా పద్యాలకు వివిధ అలంకారాలతో మరిన్ని సొబగులద్ది అందించిన అద్భుతమైన కావ్యకన్నియ "ఆముక్త మాల్యద"

రాయలవారి పద్యాలలో ప్రస్ఫుటంగా కనిపించేవి ఉత్ప్రేక్షలు. (ఉత్ప్రేక్ష అంటే ఊహ. ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చడం ) రాయలు తన ప్రబంధంలో మొట్టమొదటి పద్యం శ్రీవేంకటేశ్వర స్వామి మీద చెప్పాడు. ఆంధ్రుల ఇలవేల్పైన వేంకటేశ్వరుని స్తుతితో మొదలుపెట్టబడిన మొట్టమొదటి తెలుగు కావ్యం.. ఆముక్తమాల్యద..

శ్రీ కమనీయ హారమణిఁ జెన్నుగఁ దానును, గౌస్తుభంబునం
దాకమలావధూటియు ను దారతఁ దోఁపఁ, బరస్పరాత్మలం
దాకలితంబు లైన తమ యాకృతు లచ్చతఁ బైకిఁ దోఁప, న
స్తోకత నందుఁ దోఁచె నన, శోభిలు వేంకటభర్తఁ గొల్చెదన్ ...


భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి ఉన్న అత్యంత ప్రేమను, అనురాగాన్ని ఈ పద్యంలో చాలా అందంగా చెప్పారు రాయలవారు. లక్ష్మీదేవి ధరించిన అందమైన హారములోని మణియందు శ్రీనివాసుడు, ఆతని కౌస్తుభమునందు లక్ష్మీదేవి చక్కగా ప్రతిబింభిస్తున్నారు. ఒకరి మనస్సులో ఒకరు నిండి యున్న కారణంగా వాళ్ళ మనసుల స్వచ్ఛత వలన (అవి transparent అయి) ఆ లోపలున్న రూపాలు వారు ధరించిన హారములలోని మణులలో స్పష్టంగా బయటకి కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి అని భావం. ఈ విధముగా విలసిల్లుతున్న వేకటేశ్వరుని సేవిస్తాను అని ఉత్పలమాల(కలువపూలమాల) తో ఆముక్తమాల్యద (ధరించిన పూలమాలను సమర్పించినది) కావ్యాన్ని మొదలుపెట్టాడు కృష్ణదేవరాయలు. పైగా తిరుమల వేంకటేశ్వరుడు రాయవారి ఇష్టదైవం.. ఈ ప్రబంధాన్ని కూడా ఆ శ్రీనివాసుడికే అంకితం చేసాడు.




సీ. ఖ నట త్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు,
ధృత కులాయార్ధ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమ త్తరువరములు.
ఘన గుహా ఘటిత ఝూంకరణ లోకైక ద్వి దుందుభీకృత మేరు మందరములు
చటుల ఝుంపా తర స్స్వ నగరీ విపరీత పాతితాశాకోణ పరిబృఢములు,

తే. ప్రబల తర బాడబీక్రుతేరమ్మదములు,
భాస్వరేరమ్మదీకృత బాడబములు
పతగ సమ్రాత్పతత్త్ర ప్రభంజనములు
వృజిన తూలౌఘములఁ దూల విసరుఁ గాత.



ఆరంభం చేసాము కదా... ఆముక్తమాల్యద పీఠికలోని గరుత్మంతున్ని స్తుతించే పద్యం గురించి తెలుసుకుందాం. ఇది నారీకేళ పాకం లాంటిది, ఒక్కోసారి మరీ అతిశయం అనిపించవచ్చు. ముందుగా పద్యం చదువుతుంటే కఠినంగా , అర్ధం కాకుండా ఉంటాయి .. కాని లోతుగా అర్ధం తెలుసుకుంటూ వెళితే ఒక్కో పాదంలో ఉన్న వివిధ అలంకారాలు , వర్ణనలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి నారికేళపాకంలాంటిదే ఈ పద్యం.. గరుత్మంతుని రెక్కలయొక్క గాలివలన కలిగిన మార్పులు గురించి చెప్తున్నాడు కవి.. అసలు పద్యంలో మటుకు గరుత్మంతుడి రెక్కల గాలులు పాపాలనే దూదిపింజలను చెదరగొట్టుగాక అని స్తుతించబడింది.


ఖ నటత్ పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు

గరుత్మంతుడి రెక్కల గాలుల వల్ల సముద్రంలోని నీళ్లన్నీ ఆకాశానికి ఎగిసిపోయి పాతాళలోకం బట్టబయలై కనపడింది. అంత వేగంగా ఉన్నాయంట మరి. అప్పుడు పాతాళంలోనున్న పాములు తమ ఆజన్మశత్రువైన గరుత్మంతుని చూసి భయంతో గజగజ వణకుతూ ఒకదానికొకటి పట్టుకుని ముద్దలుగా కనిపిస్తున్నాయి.



ధృత కులాయార్ధ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమత్ తరువరములు
గరుత్మంతుడి రెక్కలగాలి ఎంత వేగంగా తీవ్రంగా ఉందంటే పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటివేళ్లతో సహా లేచిపోయి ఆతని కాళ్లకు తట్టుకున్నాయి. ఆతడు పక్షియగుట చేత.. తన గూటి కోసం కట్టెపుల్లలను తన కాలిగోళ్లతో తీసికెల్తున్నట్టుగా తోస్తున్నది.



ఘన గుహా ఘటిత ఝూంకరణ లోకైక ద్వి దుందుభీకృత మేరు మందరములు
ఆతని రెక్కల గాలులు పర్వతగుహలలో ప్రవేశించినప్పుడు ఎలా ఉంది అంటే .. మేరుపర్వతం, మంధరపర్వతం .. రెండూ ఏకమై భేరీ, దుందుభులుగా శబ్దం చేస్తున్నట్టుగా లోకాలన్నీ దద్దరిల్లుతున్నాయి ...




చటుల ఝుంపా తర స్స్వనగరీ విపరీత పాతితాశాకోణ పరిబృఢములు
గరుడుని రెక్కల గాలులు మిక్కిలి తీవ్రంగా ఉండుటచేత దిక్కులు,మూలలయందు ఉన్న పాలకులు (అష్టదిక్పాలకులు) నిలబడలేక వేఱు వేఱు దిక్కులకు విసిరివేయబడ్డారు.



ప్రబల తర బాడబీక్రుతేరమ్మదములు
భాస్వరేరమ్మదీకృత బాడబములు
పతగ సమ్రాట్పతత్త్ర ప్రభంజనములు
వృజిన తూలౌఘముల దూల విసరుగాత.


గరుత్మంతుడి రెక్కలగాలి వేగానికి ఆకాశంలోని మేఘములతోడి మెరుపులు సముద్రంలో పడి బడబాగ్నులు సృష్టిస్తున్నాయి. ఆ గాలి ఉధృతానికి బడబాగ్నులు మింటికెగసి మెరుపులుగా మారాయి. అట్టి ప్రచండమైన పక్షిరాజు రెక్కల గాలి పాపములనెడి దూదిపింజెల్లాటి మేఘములను చెదిరిపోయేలా చేయాలి అని గ్రంధకర్త ప్రార్ధన చేస్తున్నాడు.


గరికపాటివారి ఆముక్తమాల్యద వివరణ చదివి ఈ కావ్యమందు ఆసక్తి కలిగి వావిళ్ల రామశాస్త్రివారి పుస్తకం చదవడం మొదలుపెట్టాను. దానితో పాటు స్కూలులో చదివిన చందస్సుకూడ మళ్లీ తిరగేయక తప్పలేదు. తప్పులున్న మన్నించి సరిచేయగలరు. ముందు ముందు మరింత వివరంగా రాయడానికి ప్రయత్నిస్తాను.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008