మరో ముందడుగు .. రుచి
రుచి...
ఈ బ్లాగులు రాసి బోర్ కొట్టింది కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటున్న సమయంలో ఆంధ్రభూమిలో అవకాశం వచ్చింది. మీ వ్యాసాలు పంపండి చూద్దాం అన్నారు. ఎలాగు అవకాశం వచ్చింది కదా అని నేను చేసే మరో పని కూడా ఉంది. వంటలు గట్రా చేసి, షడ్రుచులులో రాస్తుంటాను. మీరు వేసుకుంటారా. ఆ వంటకాలు ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించవు ఎందుకంటే అవి చేసి ముందు మావారికే కదా పెట్టేది. ఆయన బాగుంటే నేను బాగున్నట్టే కదా. నేను బాగున్నా కనుకే ఇలా వచ్చి అడుగుతున్నాను అని హామీ ఇచ్చాను. అలా కాదుగాని ఇంకో మాట చెప్పండి . కొత్తగా ఏం చేయగలరు? అప్పుడోటి.. ఇప్పుడోటి అని కాకుండా వారం వారం ఒక ఫుల్ పేజి చేయగలరా? అన్నారు. ముందు షాక్ కొట్టింది. కళ్ల ముందు సూర్యచంద్రులతో సహా తారామండలం మొత్తం గిర్రున తిరిగింది. కాని పైకి ధైర్యంగా మొహం పెట్టి "ఓ! చేయొచ్చు. అదేమంత కష్టం" అన్నా. సరే ఐతే అన్ని పత్రికలకంటే విభిన్నంగా ఎలా చేస్తారో చేయండి అని పేజి నిర్వహణ బాధ్యత పెట్టారు. దాని ఫలితమే ఈ రుచి...
ప్రతి ఆదివారం వచ్చే ఈ రుచి ని ఆస్వాదించండి. తొంభై శాతం శాకాహారమే. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వంటకాలు పరిచయం చేయాలనుకుంటున్నాము. ఎలా అంటే ఒక Full Thali లేదా Buffet లా. మీకు నచ్చింది తీసుకోండి. ఉపయోగించుకోండి. మీరూ ఈ పేజికి మీ వంటకాలు పంపాలనుకుంటే పంపొచ్చు. ఇది ఆడవాళ్లకే కాదండోయ్.. ఆధునిక నలభీములకు కూడా .. కాని ఫోటో పంపాలి సుమా.
రుచి పేజీ, ఆంధ్రభూమి దినపత్రిక
36,సరోజిని దేవీరోడ్, సికిందరాబాద్ -3
మరో విషయం... ఈ శుభవార్త చెప్పినందుకు ఎవ్వరు కూడా నన్ను పార్టీ అడగొద్దు. ఎప్పుడు ఏ శుభవార్త చెప్పినా, ఏ చిన్న విజయమైనా విష్ చేసేసి పార్టీ ఇమ్మంటారు. కాని... చెమటోడ్చి ( మా ఇంట్లో ఏ.సి లేదు మరి) , కష్టపడి సాధిస్తానా? అయ్యో అని నాకే స్వీటో, గిఫ్టో ఇచ్చేది పొయి , ఎదురు నాకే పని పెడతామంటారు. అక్కడే నాకు మండుద్ది. ఒకోసారి అలా అడిగినవాళ్లను తిట్టాను కూడ. సో నా వర్క్ కి బోల్డు డబ్బులొచ్చి నా బ్యాంకు అకౌంట్ తిరుమల వెంకన్నలా కాకున్నా కొద్దిగా ఐనా గలగలమంటే నేనే ఇస్తాగా.. అదన్నమాట సంగతి..