Sunday, 7 November 2010

మాటల మతాబులు - చతురోక్తుల చిచ్చుబుడ్లు..

దీపావళి అయిపోయాక ఈ మతాబులేంటి? చిచ్చుబుడ్లేంటి అనుకుంటున్నారా?? ఆగండాగండి . చెప్తాగా!.. కొద్ది కాలంగా... అంటే చాలా కాలంగానే ప్రమదావనంలో అనుకుంటున్నాం ఊరికే ఎవరి బ్లాగుల్లో వాళ్లు రాసుకోవడమేనా? ఒకసారి అందరం కలుద్దాం అని. ఆ మాట అనుకునే దగ్గరే ఉండిపోయింది. ఇలా కాదుగాని ఈసారి ఎలాగైనా హైదరాబాదులో ఉన్న మహిళా బ్లాగర్లం కలవాల్సిందే అని డిసైడ్ అయ్యాం. జ్ఞానప్రసూనగారు మా ఇంటికి రండర్రా! అందరికీ బూరెలు చేసి పెడతా అన్నారు. ఇక ఎవరెవరు ఏమేం తీసుకురావాలి అని మాట్లాడుకున్నాం. డ్రింక్స్ నుండి డెజర్ట్ వరకు అన్నీ పంచేసుకున్నాం. దీపావళి మరునాడు ఐతే కాస్త ఖాళీగా ఉంటుంది. ఆ రోజు కలుద్దాం అని మా సన్నాహాలు మొదలెట్టేసాం. ఎలాగైతేనేమి పండగ ఐపోయింది. మేము చేయాల్సిన వంటకాలు రెడీ చేసుకుని ఒక్కరొక్కరుగా ప్రసూనగారింటికి చేరుకున్నాం. ఈ రోజు మా ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వ్యక్తికి బ్లాగులకు అస్సలు సంబంధం లేదు, అసలు కంప్యూటర్ వాడకం కూడా తెలిదు. కాని ఆవిడను ఎందుకు పిలిచామో చివర్లో చెప్తాను . (ఎందుకంటే అవిడ చివర్లో వచ్చారు కాబట్టి)..





మరి ముందు ఈ రోజు మెనూ చెప్పుకుందామా..


నాలుగైదు కాదు గాని ఆరు రకాల పచ్చళ్లు


బూరెలు, రవ్వ లడ్డూలు, జంతికలు


చనా మసాలా, నాన్, రుమాలి రోటి


బగారా బైగన్, గోంగూర పులిహోర, కాకరకాయ పకోడీలు


సాంభార్, పెరుగు, అన్నం.


చివర్లో ఐస్క్రీం + గులాబ్ జామున్


వెళ్లేటప్పుడు చాయ్..


(బాగా కుళ్లుకున్నారా??)



నేను వెళ్లేసరికి మాల, లక్ష్మి, శ్రీలలిత వచ్చేసి ఉన్నారు. అలాగే ప్రసూనగారి ఫ్రెండ్ భవాని. లక్ష్మిగారేమో గుమ్మంలోనే అందరిని పట్టుకుని పేరు చెప్పి రావాలి అంటూ ర్యాగింగ్ చేసేస్తున్నారు. ఎవరి పేరు అని చెప్పలేదు. స్వాతి మాత్రం అడిగింది. నా పేరా? మావారి పేరా? “అని... మనం అంత వీజీగా చెప్పేస్తామేంటి? వెళ్లేటప్పుడు చెప్తాలే అని లోపలికి వెళ్లిపోయా. అందరం దీపావళి విషెస్ చెప్పేసుకుని ముచ్చట్లలో పడ్డాం. డాక్టర్ ని చూస్తే ఏదో ఒక ఆరోగ్య సమస్య, ఇంజనీర్ ని చూస్తే ఏదో టెక్నికల్ సందేహం వచ్చినట్టు, నన్ను చూస్తే అందరికి బ్లాగు సందేహాలు వచ్చేసాయి. అవి చెప్తూ ఉంటే స్వాతి, సి. ఉమాదేవి వచ్చేసారు. బ్లాగు రాతల్లో , కామెంట్లలో పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి ఎదురుగా కనపడేసరికి ఎంత ఆనందమో!. ఇదే విషయమై చర్చ జరిగింది. రాతలను బట్టి ఒక మనిషి రూపురేఖలు నిర్ణయించుకోగలమా? రాతల్లో, రూపంలో అందంగా ఉన్న వ్యక్తి అసలు స్వరూపం నీచమైనది అని తర్వాత తెలిస్తే ఎలా ఉంటుంది. రాతలకు , రూపానికి సంబంధం ఉంటుందా? ఉండాలా? అని నేనడిగా.. కాదు అన్నారు అందరూ. అసలు ఇదంతా ఎందుకంటే.. ఇన్నాళ్ళూ మనం కంప్యూటర్ ద్వారా మాట్లాడుకోవడమే కాని ఒకరినొకరం చూసుకోలేదుకదా.. అందుకని.. ఎవరెవరో తెలుసుకుందుకు అలా చేసారన్నమాట.. కాని ఒకనిజం మటుకు ఒప్పుకు తీరాలి. అక్కడ కలవగానే అందరికీ కూడా అస్సలు కొత్తవాళ్ళతో మాట్లాడుతున్నామనే ఆలోచనే రాలేదు. పుట్టింటికి అక్కచెల్లెళ్ళందరూ వెళ్ళినప్పుడు .. అప్పటికి సంవత్సరాల తరబడి కలుసుకోకపోయినా సరే ఎంత ఆప్యాయంగా, ఆనందంగా వాళ్ళందరూ కలిసిపోతారో అలా పెద్దక్కలావున్న ఙ్ఞానప్రసూనగారింట్లో అందరం కలిసిపోయాం.
ముప్పాళ రంగనాయకమ్మ, యద్దనపూడీ సులోచనారాణి, కొమ్మూరి వేణూగోపాలరావు దగ్గర మొదలుపెట్టిన కబుర్లు అలా సాగిపోతూనే ఉన్నాయి.

అలా వంటల ప్రయోగాలు అందులో సాధించిన జయాపజయాలు, మధ్య మధ్యలో శ్రీలలిత పేల్చే జోకుల తూటాలతో (చేతుల్లో డ్రింక్ గ్లాసులతో.. ఏ డ్రింక్ అని అడగకండి.. సీక్రెట్) సమయం ఎలా గడిచిపోయింది తెలీలేదు. ఇలా కలుస్తున్నామన్న ఆనందంతో ఎవరికీ ఆకలి గుర్తు రాలేదు. కాని తెచ్చిన వంటకాలు మాకేసి విచారంగా చూస్తున్నాయి. అన్ని ఐటెంస్ ఉన్నాయి కదా అని పెళ్లిళ్లలో లాగా ప్లేట్లు పట్టుకుని లైన్లో నిలబడకుండా తీరిగ్గా ఒక్కో వంటకం ఆస్వాదిస్తూ, కామెంట్లు వేసుకుంటూ గడిపేసాం. మా ముచ్చట్లతోనే సగం కడుపు నిండిపోతే ఇంకా ఏం తినగలం? వెంటనే “ఐస్క్రీం తిందామా?” అని మాలగారు అడిగితే ముఖ్య అతిథి వస్తున్నారు. కాసేపు ఆగుదాం అని చెప్పాను. అలాగే ప్రసూనగారి హస్తకళానైపుణ్యం చూసాము. పెయింటింగులు, వులెన్, క్రోషియా, పూసలు, దేవతా విగ్రహాలకు కుట్టిన దుస్తులు ఇలా ఎన్నో ఎన్నెన్నో.. అవి చూసి మాకే సిగ్గేసింది. ఎదో రెండు మూడు పనులు చేసేసరికి అలసిపోయాం అని పడుకుంటాం. ఈవిడ ఎంత ఆసక్తిగా,ఓపికగా నేర్చుకుని తయారు చేస్తున్నారు అని? ఇక్కడో ముఖ్యవిషయం చెప్పాలి. ఎప్పుడైనా స్వాతి, చక్రవర్తి ఇంటికి వెళితే బజ్జీలు మాత్రం అడక్కండి ముఖ్యంగా బంగాళదుంప బజ్జీలు. ఎందుకో వాళ్లిద్దరిలో ఒకరు వచ్చి చెప్పాలి..

ఇంతకీ ఆ ముఖ్య అతిథి ఎవరంటారా? డా. వి. సీతాలక్ష్మి గారు. అమెరికానుండి కొద్ది రోజుల క్రింద వైజాగ్ వచ్చారు. త్యాగరాయ గానసభలో ఒక సంగీత కార్యక్రమం కోసం నిన్నే హైదరాబాదు వచ్చారు. ఆవిడ వచ్చినపుడు మా గెట్ టుగెధర్ పెట్టుకోవడం , మేము కలిసినప్పుడు ఆవిడ రావడం అదృష్టం. ఇంతకూ సీతాలక్ష్మిగారు ఎవరో మీకందరికీ తెలిసే ఉంటుంది. తెలీనివారికోసం ఈ సమాచారం. బ్లాగ్లోకంలో మలక్పెట్ రౌడీ తెలీనివారుండరు కదా. అతని తల్లిగారు.

ఎలాగు వచ్చారు కదా అని మాల గారు ఆవిడను ఇంటర్వ్యూ చేసారు.


దానికంటె ముందు స్వాతి అందరికీ ఐస్క్రీం , గులాబ్ జామున్ పెట్టి ఇచ్చింది. అది తింటూ ఈ ఇంటర్వ్యూ చేసాం.


మాల : రౌడీ అమ్మగారూ! సారీ! రౌడీ గారి అమ్మగారు నమస్కారం. మీ అబ్బాయి గురించి కొన్ని మాటలు చెప్పండి?



సీతాలక్ష్మి : మా పాపాయి అదేనండి భరద్వాజ్ చాలా మంచివాడండి. ఎక్కువ మాట్లాడడు. అందరికీ హెల్ప్ చేస్తాడు. పెద్దవాళ్లని గౌరవిస్తాడు. చిన్నవాళ్లని ప్రేమగా చూస్తాడు.



ఈ మాటతో అందరికీ పొలమారింది. మాలగారి ఐస్క్రీం కప్పు చేతిలోనుండి జారిపోయింది. :)



మాల : ఏంటి పాపాయా? తక్కువ మాట్లాడతాడా? నా వయసు తెలిసినా కూడా ఎన్నో సార్లు నన్ను సతాయించాడు. ఒకసారైతే నేను రిప్లై ఇచ్చి భయంతో మా ఏరియాలో ఉన్న రౌడీల గురించి కూడా కనుక్కున్నా. ఒకవేళ నా మీదకు దాడికి వస్తే కాచుకుందామని. మీరేంటి ఇలా అంటున్నారు?



శ్రీలలిత : అవునండి.. మా రాతలేవో మేము రాసుకుంటుంటే వచ్చి కామెంట్ పెట్టి పారిపోతాడు. ఇక్కడ జనాలు తిట్టుకుంటే, కొట్టుకుంటే చూడ్డం అతనికి చాలా ఇష్టం.



సీతాలక్ష్మి : అవునా? జ్యోతిగారూ! మీరైనా చెప్పండి మావాడు అలా చేస్తాడా? ఐనా వాడికి ఏ పేరు దొరకలేదా? మలక్పేట్ రౌడీ అని పెట్టుకున్నాడు. మేమందరం పాపాయి అనే పిలుస్తాం.



నేను: అవునండి! చాలా రకాలుగా సతాయిస్తాడు. నేను ప్రమదావనం అని మహిళా బ్లాగర్ల గ్రూపును మొదలెడితే నాకు వ్యతిరేకంగా ప్రమాదవనం అని పెట్టి, ఒక గ్యాంగును వెంటేసుకుని కెలుకుడు అంటూ తిక్క తిక్క పోస్టులు పెడతాడు. నా మీద కూడా ఎన్నో సార్లు రాసాడు.



సీతాలక్ష్మి : అయ్యో రామా! తెలుగు బ్లాగుల గురించి ఎవరికైనా చెప్పాలంటే సిగ్గేస్తుంది. నా గురించి చెప్తే మీరు మలక్పేట్ రౌడీ అమ్మగారా? అంటే తల తీసేసినట్టు ఉంటుంది. ఇంత చరిత్ర ఉందా మావాడికి. అందుకేనా ఇండియాకి రమ్మంటే రావట్లేదు ?



నేను : అయ్యుండొచ్చు. మీ చుట్టాలందరూ ఇక్కడే ఉన్నా కూడా హైదరాబాదుకైతే అస్సలు రాడు చూడండి.



ఇంటర్వ్యూ ఐపోయింది.


*************************************************



మా అందరి గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు ఆవిడ. అలాగే మా బ్లాగు లింకులు. (రౌడీ.. మీ అమ్మగారు బ్లాగులోకానికి వస్తున్నారు.. జాగ్రత్త. ) హమ్మయ్యా! పుల్ల పెట్టేసాను. నా అంచనా ప్రకారం ఈపాటికే ఓ కోటింగ్ పడి ఉండాలి.. :))))



కాని తర్వాత ఆవిడకు అనుకోని, అస్సలు ఊహించని విషయం ఒకటి తెలిసింది. మాకు ఆతిధ్యం ఇచ్చిన జ్ఞానప్రసూనగారు అలనాటి ఆణిముత్యం చక్రపాణి సినిమా సంభాషణల రచయిత రావూరు సత్యనారాయణ గారి అమ్మాయి అని తెలిసి ఎంత సంతోషించారో.. అనుకోకుండా వచ్చినా రావూరుగారి అమ్మాయిని, మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు. చివర్లో టీ తాగేసి, మిగిలిన వంటకాలు పంచుకుని, కొన్ని మార్చుకుని అందరం ఇంటి దారి పట్టాం.


నాకు తెలిసిన హైదరాబాదులో ఉన్నవారిని ఆహ్వానించాను. ఇంకా హైదరాబాదులో ఉన్న మహిళా బ్లాగర్లు ఉంటే నాకు మెయిల్ పెట్టండి. తర్వాతి సమావేశానికి తప్పకుండా కలుద్దాం. మర్చిపోయా. ఎలాగూ కార్తీక మాసం కదా అని ప్రసూన గారి ఉసిరికాయ కొంచం రుచి చూసేసాం. మాల, లక్ష్మి, శ్రీలలిత కార్తీక వనభోజనాలకు ఎక్కడికైనా వెళదాం అని ప్లానింగ్ కూడా చేసేసారు. దీనికి ఎవరైనా రెడీనా??

24 వ్యాఖ్యలు:

మాలా కుమార్

రౌడీ అమ్మగారి తో నా ఇంటర్వ్యూ రాశారా ???
నా భయం తెలిసి కూడా ((( ఇదన్యాయం జ్యొతి , ,,,
వా (((( . . . . .

మాలా కుమార్

అయ్యయ్యో రౌడీ అమ్మగారు కాదు , రౌడీ గారి అమ్మగారు . . . .
మాట్ల్లూ తడబడుతున్నాయ్ !!!!!!

సి.ఉమాదేవి

మీరు అక్షరబద్ధం చేసిన అనుభూతులు జ్ఞాపకాలలో భద్రపరచుకోదగ్గవి.చక్కగా రాసారు.

Lakshmi Raghava

meerandarinI chusi chala santoshinchanu..mee vanTakaalu norUrichayi..yeppuduu mee city vaarikenaa get togetherlu maa gurinchi aalochincarOO???
lakshmi raaghava

swapna@kalalaprapancham

chala baga rasaru. bale unnaye vantakalu naku ippudu avanni thinalanipistundi em cheyali :((

ika malakpet roudi gari peru ippati nunchi malakpet paapayi :)
so manam andaramu paapayi amma garu vachharu ani aneddamu malakpet roudi amma garu anakunda, emantaaru ;)

voleti

images of food items are tempting..parcel them to me

పంతుల విజయ లక్ష్మి

challa bagundi

Malakpet Rowdy

GRRRRRRRRRRRRR again

జయ

జ్యోతి గారు వంటకాలు బాగున్నాయి. దిస్ఠి తీసేసుకోండి మరి:) ఇంకొన్ని వివరాలు రాయొచ్చుకదా. అన్ని విషయాలు తెలుసుకొనే వాళ్ళం.

యమ్వీ అప్పారావు (సురేఖ)

అతివలందరు కలిసి చెప్పుకొన్న కబుర్లు బ్లాగున్నాయి!

Sahithi

Jyothi garu,

Can you give the link to Pramadaavanam. I am so curious about it. By the way the dishes looks vey yummy.

-Sahithi

lakshmi

ఫొటో లో మృణాళిని గారు కూడా ఉన్నట్లున్నారు? ఫొటో లో ఎవరెవరున్నారో కూడా కింద రాస్తే బాగుండేదండీ. ఇప్పుడేం పోయిందని,ఇప్పుడయినా రాయండి.


మాలగారూ,

నొచ్చుకోనంటే ఒక చిన్న మనవి. మీ హుందాతనానికి ఆ బెదురు బాగాలేదండీ. మొన్న మీ బ్లాగు లోనే చెప్దామనుకున్నా,ఒక్క సారే కదా ఇలా రాసారు అని చెప్పలేదు. మీ హుందాతనానికి ఆ బెదురు ఎబ్బెట్టుగా అనిపించి చెప్పాను. నొచ్చుకుంటే క్షమించండి.

Admin

jyothi garu very nice
meru chala baaga enjoy chesaru.

ఆ.సౌమ్య

బావుందండీ, మీరంతా బాగా ఎంజాయ్ చేసారన్నమాట. ఎప్పుడూ ఇలగే సంబరాలు జరుపుకుంటూ ఉండండి, మాకు కబుర్లు చెబుతూ ఉండండి మేము విని ఆనందిస్తాం. కానీ మీరు రౌడీ గురించి చాలా తక్కువ చెప్పారు. నన్నడిగితే నేనో వ్యాసం రాసి వాళ్ళ అమ్మగారికి ఇచ్చేద్దును కదా. ఈసారి మాత్రం ఆవిడని మళ్ళీ కలిస్తే నాకు తప్పకుండా చెప్పండేం, ఓ రెండు ఠావుల వ్యాసం తయారుచేసి ఇస్తాను వాళ్ళ పాపాయిగారి ఆగడాల గురించి. :D

జ్యోతి

అందరికి ధన్యవాదాలు. ఎప్పుడూ బ్లాగుల్లో రాసుకుని, కామెంట్లేసుకుని మాట్లాడుకోవడమేంటి అని ఇలా కలిసామన్నమాట.

లక్ష్మి రాఘవగారు,
అలా ఐతే మీరు హైదరాబాదు వచ్చినప్పుడు ఇలా కలవొచ్చు.లేదా మీ ఊర్లో ఉన్న మహిళాబ్లాగర్ల గురించి కనుక్కుని మీరే ఒక మీటింగ్ పెట్టండి.

జయగారు, మీరెందుకు రాలేదండి. మిమ్మల్ని, పార్వతిగారిని కూడా తీసుకురమ్మని మాలగారికి చెప్పాను. ఇంకా వివరాలంటే మాలగారు చెప్తారు.

జ్యోతి

కృష్ణ,, వచ్చింది అంతమందే. ఫోటో తీసిన అమ్మాయి వేరులే..

లక్ష్మిగారు, లేదండి మృణాలిని గారు రాలేదు. అలా పేర్లు చెప్పకుంటేనే కదా కాస్త ఆసక్తిగా ఉంటుంది.

సాహితి, ప్రొఫైల్ లో నా మెయిల్ ఐడి ఉంది. ఉత్తరం రాయండి..

సౌమ్య.. ఇప్పుడావిడ వైజాగ్ లో ఉంటున్నారు. ఆవిడతో మాట్లాడితే మేలుకదా. లేదా వైజాగ్ వెళ్లినప్పుడు పర్సనల్ గా కలిసి ఇంకా వివరంగా చెప్పొచ్చుగా.. ఏమంటావ్??

Malakpet Rowdy

ఈసారి మాత్రం ఆవిడని మళ్ళీ కలిస్తే నాకు తప్పకుండా చెప్పండేం, ఓ రెండు ఠావుల వ్యాసం తయారుచేసి ఇస్తాను వాళ్ళ పాపాయిగారి ఆగడాల గురించి. :D


&&&&

సౌమ్య.. ఇప్పుడావిడ వైజాగ్ లో ఉంటున్నారు. ఆవిడతో మాట్లాడితే మేలుకదా. లేదా వైజాగ్ వెళ్లినప్పుడు పర్సనల్ గా కలిసి ఇంకా వివరంగా చెప్పొచ్చుగా.. ఏమంటావ్??

___________________________________


ఇంత కుట్రా?


However

ముహహహహహహహహహహహహా!

http://varudhini.blogspot.com/

ఇక్కడ నాకు సపోర్ట్ ఉంది. మీకు కాగడాలో కౌంటర్ కూడ పడిందిగా .. హే జజ్జినక .. హే జజ్జినక

Vinay Datta

Jyothi garu,
Your meeting was interesting, food more interesting. Pls give a post on the preparation of mouth watering 'gongura pulihora'.

జ్యోతి

భరద్వాజ్.. ఆ టపా రాసింది ఎవరో నాకు తెలుసులెండి.. కోపం రాలేదు. జాలి కలిగింది వాళ్ల కుళ్లుమోతు స్వభావానికి. నవ్వుకున్నాను.. :)))

మాధురి..

గోంగూర పులిహోర రెసిపి నా షడ్రుచలు బ్లాగులో పులిహోర విభాగంలో ఉంది చూడండి..

జ్యోతి

విజయలక్ష్మిగారు, నా బ్లాగుకు స్వాగతం.. మీరు రాయడంలేదేంటి మరి.

ఆ.సౌమ్య

@రౌడీ
ఆ ఈ కుట్రలదేముంది చెప్పండి, మీరు ఇంటిదగ్గర తిన్నారుగా కాజాలు, అవి చాలు మా ఆనందానికి. :D

పరిమళం

(హు ...ప్చ్ ...హ్మమ్.... :( :( లోపల ) పైకి.... ఫోటోలు బావున్నాయి కబుర్లు బావున్నాయి :) :)just kidding jyotigaru!

Sujata M

వాహ్ ! వెల్ డున్ లేడీస్ ! నాకు వంటల్రావు. కానీ భోజనానికి రెడీ ! నా వంతుగా ఏమి తెచ్చి వుందును ?

నాకు జ్ఞాన ప్రసూన గారిని కలుసుకోవాలని వుంది. స్వాతి అదృష్టవంతురాలు. Chakravarthy గారు చక్కగా అన్ని సమావేశాలకీ తనని పంపిస్తారు & (బహుశా) డ్రాప్ కూడా చేస్తారు.

D. Subrahmanyam

బాగుంది. జరిగినవి చక్కగా కళ్ళకు కట్టినట్టు వ్రాసారు :)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008