మాయా దుప్పటి
ఎంత బిజీ జీవితమైనా, ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడే సమయం లేకున్నా కూడా అంతర్లీనంగా కొన్ని జ్ఞాపకాలు, అనుభూతులు మన వెన్నంటే ఉంటాయి. వాటి గురించి ఆలోచన రాగానే అలౌకికమైన అనుభూతి కమ్మేస్తుంది. ఎన్ని ఏళ్ల తర్వాత గుర్తు చేసుకున్నా, చూసినా అదే అనుభూతి. ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. అదే మాయాదుప్పటి. దైనందిన కార్యక్రమలలో సతమతమవుతూ ఉన్న తరుణాన ఒక్కసారిగా ఆ పనులు, ఆలోచనలు కూడా ఆపేసి ఈ మాయా దుప్పటిని కప్పుకుని మరో లోకానికి వెళ్లిపోవాలనిపిస్తుంది. ఆ మాయా దుప్పటి ఒక వస్తువైనా కావొచ్చు, ఒక జ్ఞాపకమైనా కావొచ్చు, లేదా ఒక పుస్తకమైనా కావొచ్చు. ఆ దుప్పట్లకు, మనకు మాత్రమే అర్ధమయ్యే ముచ్చట్లు ఎన్నో ఉంటాయి. అవి ఒకరికి చెప్పినా అర్ధం కావు. ఎన్ని సార్లు తెరచి చూసుకున్నా తనివి తీరదు. అలాగే మన దగ్గర ఎన్ని పుస్తకాలున్నా కొన్ని మాత్రం ఇలాంటి మాయాదుప్పట్లే. అవి ఎన్ని సార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. అందులోని ప్రతీ సంఘటన, మాట గుర్తుండిపోతుంది. ఐనా ప్రతీసారి కొత్త పుస్తకమల్లే మొదటినుండి చివరిదాకా చదువుతాము. ఆ పుస్తకం అంటే ఎందుకంట అంతఇష్టం?. ఆ పుస్తకంలోని కొన్ని మాటలు మనకు మరపురాని పాఠాలు కావొచ్చు. ఆ మాటలను మన జీవితంలోనే తరచి తరచి చూసుకోవచ్చునేమో. మనసుమూలల్లో దాగిన ఆ ముచ్చట్లు, భావాలు ఈ పుస్తకం చదవడం వల్ల రిఫెష్ అవుతాయేమో. ఏమో?? ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం. అనుభూతి.
అలాంటి రెండు మాయాదుప్పట్ల ముచ్చట్లు మీతో పంచుకోవాలని ఉంది. చిన్నప్పటినుండి చదివింది ఇంగ్లీషు మీడియం ఐనా క్లాసు పుస్తకాలు తప్ప నేను చదివిన పుస్తకాలన్నీ తెలుగులోనే. అప్పుడప్పుడు ఇంగ్లీషు నవలలు చదవాలని ప్రయత్నించినా బుర్రకెక్కలేదు. అర్ధంకాక కాదు. ఆసక్తి లేక. పత్రికలు , పేపర్లు అంటే ఓకే . పుస్తకాలు అందునా తెలుగు పుస్తకాలు చదవాలని అమ్మ చేసిన అలవాటు ఇప్పటికీ నాతోనే ఉంది. వందల పుస్తకాలు కొన్నా, సేకరించినా, దాచుకున్నా కూడా కొన్ని మాత్రం పదే పదే చదువుకునేదాన్ని. నాకు ఎక్కువగా సస్పెన్స్, కుటుంబప్రధానమైన కథలంటే చాలా ఇష్టం. ఒకసారి నా పుస్తకాలన్నీ తీసి పంచేసాను. అలా అల్మైరాలో ఉన్న పుస్తకాలన్నీ తీసి ముందేసుకుని చూస్తుంటే ఈ ఆత్మీయుల్ని వదులుకోవాలా అని బాధ కలిగింది. కాని తప్పదు అని ఇచ్చేసాను. నాకెంతో ఇష్టమైన యండమూరి, కొమ్మనాపల్లి, సూర్యదేవర, యద్ధనపూడి మొదలైన వారి నవలలు ఎన్నో దూరం చేసుకున్నాను. కాని రెండు పుస్తకాలు మాత్రం ఇవ్వలేకపోయాను. ముప్పై ఏళ్ల క్రింద ఇంటర్లో ఉండగా కొన్న పుస్తకాలవి.. కొన్న మొదట్లో వాటి మీద అంత అవగాహన, అనుబందం కలగలేదేమో. కాని పెళ్లైన తర్వాత మాత్రం కనపడినప్పుడల్లా నవల మొత్తం మొదటినుండి చదివేదాన్ని కొత్త నవల లాగే. మిగతా పుస్తకాలకు కాస్త ఎడంగానే ఉంచేదాన్ని వాటిని. ఆ పుస్తకాల వల్ల నాకేమైనా జీవిత పాఠాలు తెలిసాయా?. నీతి సూత్రాలు అర్ధమయ్యాయా?. అంటే... ఏమీ లేదు. అవి సాధారణ మధ్యతరగతి జీవిత గాధలు. నా వ్యక్తిగత జీవితంలో అలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. కాని ఎందుకో అవి చదువుతుంటే ఆ కథలో ఒక పాత్రనై జరిగే సంఘటనలన్నీ కళ్లారా చూస్తునట్టు అనిపించేది. ఇప్పటికీ అంతే. ఈ కథలలో ఫాంటసీ అంటూ ఏమీ లేదు. అంతా వాస్తవమే. తప్పకుండా ఎక్కడో ఒకదగ్గర జరిగి ఉండవచ్చు. ఎవరికో ఒకరికి అనుభవమై ఉండొచ్చు అనిపిస్తుంది. ఈ పుస్తకాలలో పాత్రధారులకు ఆ కాలంలో ఎదురైన సమస్యలకు నేడు ఏదైనా పరిష్కారం ఉందా? అంటే నాకైతే లేదనిపిస్తుంది. మనుష్యులింతే అని అప్పుడు, ఇప్పుడు అనుకుంటాను.
ఇక ఆ పుస్తకాలు అంత పేరు తెచ్చుకున్నవి కూడా కాదేమో. అందుకే వీటి గురించి అందరికీ తెలియదేమో కూడా. మాదిరెడ్డి సులోచన రచించిన ఋతుచక్రం, తరంగాలు ..
ఋతుచక్రం... ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జరిగే కథ ఇది. ముఖ్య పాత్రధారి అంటూ ఎవరో లేరు. అందరూ ముఖ్యమైనవారే. తండ్రి, కొడుకులు, కూతుళ్లు, పిల్లలు... ఒక్కొకరిది ఒక్కో స్వభావం, ఆరోపణలు, ఆవేశాలు, చిన్న చిన్న గొడవలు, సర్దుబాట్లు .. ఇలా ఎన్నో సంఘటనలు కళ్లకు కట్టినట్టుగా ఉంటాయి. ఇందులో ఎవరినీ తప్పుబట్టలేము అనిపిస్తుంది. మనుష్యులన్నాక విభిన్న వ్యక్తిత్వాలు, ఆలోచనలు, ఆచరణలు. ఆశయాలు ఉంటాయి. దండలో దారంలా అందరినీ ఒక చోట కలిపి ఉంచాలని ప్రయత్నిస్తుంది ఆ ఇంటి చిన్నకోడలు అరుంధతి . ఇంటిపని, బాధ్యత అంతా తన మీద వేసుకుని ఇంటివాళ్లైనా, పనివాళ్లైనా అందరినీ ప్రేమగా చూసుకుంటుంది. కాలక్రమేణా గొడవలు మొదలై అందరూ విడిపోతారు. చివరికి ఆ ఇంట్లో పని మనిషి కొడుకు చదువుకుని కలెక్టర్ అయ్యి అరుంధతి కూతురు సుజాతను పెళ్లి చేసుకుంటాడు. ఇది ఒక మామూలు కథ లేదా సినిమా కథలా ఉంది అంటారా? క్లుప్తంగా చెప్తే ఇంతే. కాని ఈ కుటుంబసభ్యుల మధ్య జరిగే సంఘటనలు మనకు ఆ దృశ్యాన్ని కళ్లముందు ఆవిష్కరిస్తాయి. అది రచయిత్రి గొప్పదనం. మాటల పదవిన్యాసం .. ఈ పుస్తకం చాలా సార్లు చదివాను కాబట్టి కథ మొత్తం గుర్తుంది . అయినాసరే మరోసారి పుస్తకం తెరిస్తే మొదటినుండి కొత్త పుస్తకంలా ప్రతీ పేజీ చదువుతాను. ఎందుకో మరి.
తరంగాలు... ఇది కూడా ఒక మహిళ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కొనలేక పడే సంఘర్షణను ప్రతిబింబించే కధ. జ్ఞానప్రసూన నలుగురన్నల ముద్దుల చెల్లి. చురుకైనది. తెలివితేటలు కలది. ముఖ్యంగా అందరిని ప్రేమించే గుణం కల అమ్మాయి. తల్లితండ్రులు, అన్నల ప్రేమాభిమానాలతో కష్టపడి డాక్టరీ చదువుతుంది. పెళ్లయ్యాక భర్త తోడ్పాటు కూడా ఉంటుంది. ఎంత డాక్టరైనా ఇల్లాలు, తల్లి కాబట్టి ఆ విధి కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. ఇంట్లో వంట, పిల్లలు, పనిమనుష్యులు, బంధువులు, ఆసుపత్రిలోని పేషంట్లు .. ఇల్లా ఎన్నో చేసుకోవాల్సి వస్తుంది.ఏదీ తప్పించుకునేట్టు లేదు. ప్రభుత్వోద్యోగిగా నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి కుటుంభానికి సరిపడా డబ్బు మాత్రమే సంపాదించగలుగుతుంది. భార్యాభర్తలు ఇంటి బాధ్యత పంచుకుని సంతోషంగా ఉన్నా అప్పుడప్పుడు వచ్చే చుట్టాలతో సమస్యలు , గొడవలు మొదలవుతాయి. చివరకు భార్యాభర్తలు కూడా గొడవపడతారు. ఈ కథలో ఎవరినీ తప్పు పట్టాలనిపించదు. భార్య తనను ,తనవారిని అర్ధం చేసుకోలేదు అంటాడు భర్త. భర్త తనను అర్ధం చేసుకోలేదు, నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం మానేయమన్నాడని భార్య బాధపడతారు. భర్త ఎంతగా సహకరించినా ఒక్కోసారి బంధువుల మాటలతో రోషం వచ్చి భార్య మీద కేకలేస్తాడు. మధ్యలో పిల్లలు నలిగిపోతారు. ఈ కథ చదువుతుంటే అనిపించింది... బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసే స్త్రీలందరూ ఇంటా, బయటా రాణించడానికి ఎంత సతమతమవుతారో కదా? ...
ఈ పుస్తకాలు చదవండి అని ఎవ్వరికీ చెప్పను. నాకు నచ్చినట్టుగా వేరొకరికి నచ్చాలని లేదుగా. అందుకే ఇదంతా నా సొంత అభిప్రాయమే.. మీకు ఇలాంటి కుటుంబ కథలు చదవాలంటే ఈ పుస్తకాలు దొరుకుతాయేమో ప్రయత్నించండి.
మరి మీ మాయా దుప్పట్లు ఏమైనా ఉన్నాయా?? మళ్లీ మళ్లీ చదివించే , చదివినప్పుడల్లా కొత్తగా కనిపించే పుస్తకాలు...
4 వ్యాఖ్యలు:
good one..
కొన్ని పుస్తకాలు ఎన్నిసార్లు చదివినా,చదివిన ప్రతి సారీ
కొత్తగానే వుంటాయి. చదివే వాళ్ల అభిరుచి కి దగ్గరగా
ఆ రచన ఉండటంకూడా కారణం కావొచ్చు. ఉద్యోగం
చేరిన కొత్తలో ,పాతికేళ్ళ వయసులో చేజ్ నవల్సంటే
తెగ పిచ్చిగా వుండేది.చదివినవే మళ్ళి చదివే వాడిని.
ఆ నవలలు చదువుతుంటే సినిమా చూస్తున్నట్లుగా
ప్రతి దృశ్యం కంటి ఎదుట కనిపించేది.
మీ మాయా దుప్పటి చదివిన తరువత నాకు కూడా నేను చదివిన పుస్తకలు గుర్తుకురావడము జరిగింది.
ఆ రచనలు, రాసిన వాళ్ళు గొప్పతనం కూడా కావచ్చూ.
jyoti gaaru,, ekkadako teesuku vellaarandi...aanaati pustakaalu nijamgaa maayaa duppatlu....manchi peru pettaaru..hats off to u..
Post a Comment