Showing posts with label జాతీయాలు-వివరణ. Show all posts
Showing posts with label జాతీయాలు-వివరణ. Show all posts

Sunday, 24 August 2008

కలగూర గంప , చేట భారతం

కలగూర గంప 

కలవేసిన అంటే రకరకాల కూరగాయల గంపను కలగూరగంప అంటారు. కొందరు ఒకే కూరాకునో, ఒకే రకం కాయలనో, పళ్ళనో అమ్ముతారు.మరికొందరు రకరకాల ఆకులూ, కూరలూ, కాయలూ, పళ్ళూ అమ్ముతారు. భిన్న జాతులకు చెందిన కాయగూరలున్న గంప కలగూరగంప. గంప లేకపోయినా కాయకూరల్లేకపోయినా, రకరకాల వస్తువులుంటే కలగూరగంప అనే అంటారు. పదబంధంలో మొదట ఉన్న కల అనేది కలిసేట్లు, కలగాపులగంగా ఉన్న అనే అర్ధం గల విశేషణ పదం ఇది. కలనేత చీరెలో ఒకటికి మించిన రంగుల దారాలు కలిసి ఉంటాయి. కలగాపులగంలో తెల్ల, పచ్చ ఖాద్య, ద్రవ్యాలు కలిసి ఉంటాయి. అలాగే కలగూరగంపలో భిన్నభావాలు, వస్తువులు ఏవైనా కలిసి ఉండవచ్చు. కాయలూ గంపా మాత్రం ఖండితంగా ఉండనక్కరలేదు. 

చేట భారతం

ఈ మాటకు చాటు భారతమనే రూపాంతరం ఉందంటారు కొందరు. కానీ ఆ రెంటికి అర్ధాలు వేరు . చేట తెలుగు మాట. చాటు సంస్కృత పదం. అప్పటికప్పుడు చెప్పిన, నోటిమాటగా చెప్పిన అనే అర్ధాలున్న మాట చాటు(వు).  చెరగటానికి వాడే చేట తెలుగు వస్తువు. గ్రంధ ప్రమాణాల వంటివి చూపకుండా భారత కథను చెప్తే అది చాటు భారతం.నిజానికది జాతీయమే కాదు. చేట భారతం వేరు.నాలుగు మాటల్లో సరిపొయ్యే విషయాన్ని తెగ సాగదీసి విపులంగా చెపినా, రాసినా దాన్ని చేట భారతమనే అంటారు. అయితే ఈ మాట ఇటీవల పుట్టిందనటానికి నిదర్శనం ఉంది. దాదాపు డెబ్భై ఎనభై సంవత్సరాల కిందట, అచ్చు యంత్రాలు అందుబాటులోకి వచ్చిన కాలంలో ఇప్పటి దినపత్రికల కన్నా కొంచెం చిన్నవైన కాగితాల్లో భారతం ముద్రించారు. అంటే చేటంత పెద్ద కాగితాల మీద అచ్చు వేసారన్నమాట. ఆ గ్రంధాలు ఇప్పటికీ కొన్ని పాతకాలపు గ్రంధాలయాల్లో భద్రంగా ఉన్నాయి. సీస పద్యాన్ని అయిదు పంక్తుల్లో, వృత్తాలను రెండు పంక్తుల్లో, కందం, తేటగీతి, ఆటవెలది వంటి పదాలను ఒకే ఒక పంక్తిలో ముద్రించేవాళ్ళు. ఆ గ్రంధాలను కూర్చుని చదవాల్సిందే. అందువల్ల వాటిని చాలా పెద్దవి అనే అర్ధంలో చేట భారతమన్నారు. విస్తరించి చెప్తే చేట భారతం చెప్పినట్టు అవుతుంది

రచన : బూదరాజు రాధాకృష్ణ

Sunday, 13 April 2008

అతలాకుతలం - ఇనుపగజ్జెల తల్లి

అతలాకుతలం

దీనికి అతలకుతలమనే రూపాంతరముంది. మొత్తం మీద ఈ మాటకు తలకిందులు అనే అర్ధముంది. అతలాకుతలం అవటమంటే విసిగి వేసారటం అలసట పడటం, తలకిందులు కావటం వగైరా అర్ధాలున్నాయని కొన్ని నిఘంటువులు పేర్కొన్నాయి. కుతలం అంటే భూమి. భూమికింద ఏడు లోకాలున్నాయని మన పురాణాలు ఘోషిస్తాయి. వాటిని సప్త అదోలోకాలంటారు. అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అనే ఏడు భూమికింద ఉన్న లోకాలని విశ్వాసం, కొందరు సుతలానికి బదులు కుతలమనే శబ్దాన్నే వాడుతుంటారు. అడుగున ఉన్న అతలం పైనున్న కుతలమయినా, కొందరి భావన ప్రకారం దానికి రెండు మెట్లు కింద ఉన్నకుతలమయినా దెబ్బ తిన్నట్టే, పతనమైనట్లే. "పాపం, ఆయన వ్యవహారం/వ్యాపారం అతలాకుతలంగా ఉంది " అనే మాట వినపడుతుంది. అంటే అతడి వ్యాపారమో , వ్యవహారమో చెడిందని అతడు దెబ్బతిని ఉన్నాడని, తలకిందులై పోతున్నాడని అర్ధం. అదోలోకాలున్నాయన్న విశ్వాసంతో ఇది పుట్టింది.


ఇనప గజ్జెల తల్లి :

సంపదలిచ్చే లక్ష్మీదేవి బంగారు గజ్జెల తల్లి అయితె, దరిద్రమిచ్చే ఆమె అక్కగారు ఇనుప గజ్జెల తల్లి. పరమ దరిద్రురాలన్న అర్ధంలో ఈ మాట వాడుతుంటారు. సాధారణంగా స్త్రీలను నిందించడానికేఈ సమాసం ప్రయోగిస్తారు గాని దరిద్రులైన పురుషులకు ఈమె తల్లి కానట్లుంది - లింగ భేదం వల్ల ఈ ప్రస్తావన చేయరు. ఇనుము - ఆ మాటకు వస్తె - నల్లని వస్తువులన్నీ - దారిద్ర్యానికి చిహ్నాలు. తెల్ల గోడ్డుకున్న గౌరవం , నల్ల గొడ్డు ఎంత ఎక్కువ చాకిరి చేసిన మెచ్చుకోలేరు. దరిద్రుల ఇంట్లో ఈ పెద్దమ్మ ఇనుప గజ్జెలు ఘల్లుమంటుండగా నాట్యం చేస్తుంటుందని కవులు వర్ణిస్తుంటారు.

Thursday, 28 February 2008

వంటింటి కుందేలు


"తప్పించుకోలేనిది " అనే అర్ధంలో ఈ మాట వాడతారు. కుందేలు పిరికిజంతువే కాని దాన్ని ఉచ్చు వేసి పట్టాల్సిందే. చాలా వేగంగా ఎగురుతూ గెంతుతూ దూకుతూ పరిగెత్తుతుంది. దొరికిన కుందేళును చెవులు పట్టుకుని లేవదీస్తారు . పొట్ట నొక్కితే చచ్చిపోతుంది. ఆ భాగం పరమసుకుమారమయింది. కుందేలుని పట్టుకున్న వేటగాడు దాన్నినేలమీద పెట్టు చుట్టూ అరంగుళమెత్తున మట్టికుప్ప వేసినా సరే ఆ "కోటగోడ"ను దాటి అది పారిపోదు ! చిన్న పుల్లతో ఆ మట్టికుప్పలో కాస్త దారిపెడితే చాలు, చెంగున ఎగిరి దూకిపారిపోతుంది. అది దాని స్వభావం , బలహీనత కూడ. దొరికిన తర్వాత ఏ కాస్త అడ్డున్నాసరే అది పారిపోదు -పోలేదు. కుందేలును వంటింట్లో బంధిస్తే అది తప్పించుకోవటమనే ప్రశ్నే లేదు. అందువల్ల మనకు దొరికిపోయి తప్పించుకోలేని ఏ వ్యక్తిని గురించయినా ’వంటింటి కుందేలు’ అని వ్యవహరిస్తారు. భారతీయ కుటుంబములోని స్త్రీని గురించి కూడా ఇలాగే వ్యవహరించేవాళ్ళు. ఉద్యోగం, సంపాదన, విడాకులను గురించిన ఆలోచనవంటివేమి లేకుండా కేవలం వంటమనిషిగా మాత్రమే బతికే ఆడవాళ్ళను కూడా "వంటింటి కుందేళ్ల"తో పోలుస్తారు.

Saturday, 12 January 2008

కోడిగుడ్డు తంటసం


తంటసం అంటే చిమ్మట. వెంట్రుకలను లాగటానికి వాడేది. నున్నగా ఉండే కోడిగుడ్డుపై లాగటానికేమీ లేదు. మనకు కనిపించకపోయినా, ఏమో ఉండకపోతుందా అన్న అనుమానంతో ప్రయత్నించే ప్రబుద్ధులూ లేకపోలేరు. ఏమీ లేని చోట ఏదో ఒకటి చేసి సంపాదిద్దామనే వాళ్ళు ఎంతోమంది. కోడిగుడ్డు వెంట్రుకలు లాగి దానితో కుచ్చుల జడ వేసేవాళ్ళున్నారంటారు. సాధారణంగా ఈ బాపతు అనుమానంతో బతికే రకం. ఎవరినీ నమ్మరు, దేన్నీ నమ్మరు.. ఫలితం ఉండ దని చెప్పినా వినరు. ప్రయత్నం మానరు. వృధా శ్రమ అని దీనర్ధం.

గొంతెమ్మ కోరిక

తీరని, అసాధ్యమైన కోరికలను గొంతెమ్మ కోరిక లంటారు కుంతీదేవికి తెలుగు పేరు గొంతి.
అమ్మ శబ్దం చేర్చి గొంతెమ్మ అన్నారు. అటు పాండవులు ఇటు కర్ణుడూ అంతా బతికి
వుండాలని ఆమె కోరుకున్నది . పాండవుల్లో ముఖ్యంగా అర్జునుడు భారత యుద్ధంలో
గెలవాలనుకోవటం బాగుంది. కాని తానే తన కొడుకని ఆఖరి క్షణం వరకు చెప్పక దాచి,
కర్ణార్జునుల్లో ఎవరో ఒకరు మాత్రం బ్రతుకుతారనే నిర్ణయానికి వారిద్దరూ వచ్చిన తర్వాత
ఇద్దరూ బ్రతకాలని కోరుకోవటం సాధ్యమయ్యే పని కాదు. అలా వీలుకాని, ఎన్నటికీ తీరని
కోరికలను గొంతెమ్మ కోరికలంటారు.

Thursday, 27 December 2007

అయితంపూడి ఉద్యోగం

ఒక మహానుభావుడు ఉద్యోగం కోసం ఇలా గాలిలో మేడలు కట్టాడూ.ఈ ఉద్యోగం వస్తుందనీ కాదు, వచ్చేదీ కాదు, చెస్తున్నదీ కాదు, చేసిందీ కాదు కాని వస్తుందని ఊహించిన ఉద్యోగం వస్తే మటుకు దరిద్రం తీరుస్తుందన్న కోరికతో విశ్వాసముతో ఇలా ఆలోచించాడు. ఊహించిన ఉద్యోగం వస్తే బోలెడు పాడీపంటా ఏర్పడతాయి. కనీసం ఆరు గేదెల పాడి. అన్ని పాలు పెరుగు దాచడానికి కనీసం నాలుగు కుండలు అవసరం. ఒకటేమో పాలకోసం, ఒకటి పెరుగుకోసం, మూడోది చల్ల కోసం, మరి బంధువులు గట్రా వస్తే ఇవ్వడానికి మజ్జిగ కోసం ఇంకో కుండ.ఇలా ఊహాగానాలు చేసాడు ఆ వ్యక్తి. ఉద్యోగం వచ్చి, ఆరు గేదెల పాడి సమకూరినప్పుడు చేయవలసిన పని గురించి ఇప్పుడే ఆలోచించాడు. కాని ఆ ఊహలలో మజ్జిగ, చల్ల ఒకటే అని అతనికి గుర్తుకురాలేదు. అంటే వస్తుందన్న నమ్మకముతో అలా ఆలోచించాడు అమాయకంగా.ఇలా ఊహలలో జీవించేవాళ్ళు కోకొల్లలు. అసలు అయితంపూడిలో ఉద్యోగం ఉందా లేదా అన్న ప్రశ్నతోగాని, ఉన్నా అది తనకు అందుబాటులో ఉందోలేదొ సరిచూసుకోకుండా ఊహాప్రపంచంలో ఇన్నిన్ని ఆలోచనలు చేశాడు ఆ అభాగ్యుడు. పునాదుల్లేకుండా భవనం కట్టాలని తాపత్రయపడేవాళ్ళనూ, ఆధారం లేకుండా అరిచేతిలో స్వర్గముందని ఊహించేవాళ్ళనూ ప్రస్తావించేటప్పుడు "ఆయన అయితంపూడి ఉద్యోగం చేస్తున్నాడు లెండీ!" అని అంటారు. ఉద్యోగం ఇచ్చినవాళ్ళు, పుచ్చుకున్నవాళ్ళూ లేరూ. కానీ ఉద్యోగం వేరొకటి దొరికిందన్నమాట. ఊహాజీవులు చేసేది అయితంపూడి ఉద్యోగం అన్నమాట.

Monday, 10 December 2007

అంబాజీపేట ఆముదం

మనం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జాతీయం వింటుంటాం. కాని చాలా వాటికి సమాధానం తెలీదు. అందుకే నాకు కలిగిన ఎన్నో సందేహాలు దా.బూదరాజు రాధాకృష్ణగారి పుస్తకం చదివి తీరిపోయాయి. నాలాటి వారు ఇంకొందరు ఉండొచ్చు అని కొన్ని ఇక్కడ వివరిస్తున్నాను. రచయితకు ధన్యవాదములతో...



తెలుగుదేశంలోని ఆముదం పంటల్లో అంబాజీపేటలో పెరిగిన మొక్కలు సర్వశ్రేష్ట్రం అంటారు. దొంగతనానికి బయలుదేరినవాళ్ళు ఒంటికి ఆముదం పట్టించుకుని వెళ్ళేవారు పట్టుకున్నా పట్టుజారి తప్పించుకోవడానికి.అందుకే ఎవరికీ దొరకని, ఏవిధంగానూ చిక్కని వ్యక్తి శ్రేష్టమైన అంబాజీపేట ఆముదం పూసుకున్నాడనటం వింటుంటాము.కొందరు వ్యక్తులు తమ పనులు నెరవేరేదాకా వెంటపడి వేధిస్తారు జిడ్డులాగా పట్టుకుని, తిట్టినా, కొట్టినా అస్సలు వదలరు.అలాటి వ్యక్తులను కూడా "అంబాజీపేట ఆముదం" లా జిడ్డులా పట్టుకున్నాడని తిట్టుకుంటాము.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008