Friday, 1 January 2010

పులిహోరోత్సవం - స్వాగతం


పులిహోర అంటే తెలీని పిల్లలు, అమ్మలు ఉండరేమో? స్కూలు కెళ్ళే పిల్లల బాక్సులలో ఎప్పుడో అపుడు పులిహోర తప్పక ఉండాల్సిందే. అలాగే గుడికి వెళ్తే పులిహోర తప్పక తీసుకోవాల్సిందే. అదేంటో గుడిలో ఇచ్చే పులిహోర రుచి ఇంట్లో చేస్తే రాదు. ప్చ్.. ఈ పులిహోర ని పిల్లలు సరదాగా పులి ఆహారము లేదా టైగర్ రైస్ అంటారు. అన్నం పప్పు కలిపి పెడితే మధ్యాహ్నం వరకు అది ఎండిపోతుందని రకరకాల పులిహోరలు చేసి పెట్టడం నా అలవాటు. అందులో కొన్ని నా సొంత సృష్టే ఉండేవి. ఇక పిల్లలు పెద్దయ్యాక పులిహోర అలవాటు తప్పినట్టైంది. ఎప్పుడో పండగలకు తప్ప చేయడం లేదు. కానీ హృదయ స్పందనల చిరుసవ్వడి బ్లాగర్ భాస్కర్ ని అమ్మాయిలు పులిహోర అని ఏడిపించడం చూసి సరే దాని సంగతేంటో చూద్దామని ఈ ఉత్సవానికి నాంది పలికాను. కొద్ది రోజులుగా ఎన్ని రకాల పులిహోరలు ఉన్నాయి అని తెలుసుకుంటూ అప్పుడప్పుడు ఇంట్లో తయారు చేస్తూ ఫోటోలు రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంతలో బ్లాగాడిస్తా రవి పులిహోర టపాతో బ్లాగులలో పులిహోర ఘుమఘుమలు మొదలయ్యాయి. ఎంతో మంది పులిహోర అనుభవాలు బయటకొచ్చాయి. సరే అని నేను రేపటినుండి షడ్రుచులు లో పులిహోర ఉత్సవం మొదలుపెడుతున్నాను. అందరికి ఇదే సాదర ఆహ్వానం.

భాస్కర్ నువ్వు ఇంట్లో ఎటువంటి పులిహోరలు కలుపుతావో నాకు తెలీదు కాని ఈ ఉత్సవం నీకోసమే.

రవి టపాలో భైరవభట్ల కామేశ్వరరావుగారు అడిగిన
చక్రపొంగలి (నేను ఇందులో పెసరపప్పు లేకుండా చేస్తాను మరి)
దద్దోజనం

ఇక మీ అందరిని ఊరించడానికి నేను ఇవ్వబోయే వివిధ రకాల పులిహోరలు ..
నిమ్మకాయ పులిహోర ( ఇది ఎపుడో ఇచ్చేశాను.)

మామిడి తురుము పులిహోర
కంచి పులిహోర
ఆవ పెట్టిన పులిహోర
నారింజ పులిహోర
దబ్బకాయ పులిహోర
సేమ్యా పులిహోర
నువ్వు పెట్టిన పులిహోర
చింతకాయ పులిహోర
ఉసిరికాయ పులిహోర
రవ్వ పులిహోర

10 వ్యాఖ్యలు:

Hima bindu

ఈ పులిహారోస్థవం లో పస్టుపైజు రామిరెడ్డి కే ...హి...హి..హీ.
కలపడమే కాక రుచి చూస్తానికి అందరికి పంచుతారు-:)

Anonymous

జ్యోతి గారు నూతనసంవత్సర శుభాకాంక్షలు
ఇప్పుడన్నిటినీ పులిహోర అనేస్తున్నారు కానీ , పులిహోర అంటే కేవలం అన్నంతో చేసేదే అని నా అభిప్రాయం. పులిహోరకి రకరకాల పొడులు అంటే ...నువ్వులపొడి, వేరుసెనగపొడి, ఆవపొడి పెసర పొడి ఇలా రకరకాల పొడులు కలపటంద్వారా వేరువేరు రుచులు రాబట్టవచ్చు . సేమ్యా తోనూ, రవ్వతోనూ చేసేవాటిని వేరే లిస్ట్ లో చేరిస్తే బావుంటుందేమో . ఇది అచ్చంగా నా అభిప్రాయం మాత్రమే సుమండీ. ఆనక ఎవరిష్టం వాళ్ళదనుకోండి

Kalpana Rentala

లలితా మాటే నాది. అన్నంతో చేసేదే పులిహోర. అయినా కొత్త సంవత్సరం ఇన్ని కొత్త వంటకాలు ఇస్తే ఎలాగండీ. ఇక ఎప్పటికీ మనం బరువులు (ఖచ్చితం గా ప్లూరల్ ) తగ్గేది.

జ్యోతి

లలిత, కల్పన,, పులిహోర అన్నంతోనే చేయాలని రూల్ ఉందా? పిల్లలు ఏది ఇష్టపడితే అలా చేయక తప్పదు కదా. ఐనా రవ్వ, సేమ్యా పులిహోర వాడకంలో ఉన్నవే.

రవి

వామ్మో, ఇన్ని పులిహోరలున్నాయా? రేపటి నుంచీ మంచి విందన్నమాట!

లలిత గారన్నది కరెక్ట్. కామేశ్వర్రావు గారు కూడా, పుళియోగిరము అని వివరించి చెప్పారు.

జ్యోతి

రవి ,,

కామేశ్వరరావుగారు చెప్పింది ఇది
ఆహారము వికృతి ఓగిరము. అది పుళి ఓగిరము, పుళియోగిరము, పులిహోర అయ్యింది. ఎక్కడా అన్నంతో మాత్రమే చేయాలి అని లేదే.

మరువం ఉష

మేము ఇడ్లీ పులిహోర, అటుకుల పొడి పులిహోర కూడా చేస్తాం. అభినందనలు + గుడ్ లక్

వేణూశ్రీకాంత్

మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు జ్యోతి గారు.

ఇన్ని రకాల పులిహోరలున్నాయా.. నాకు తెలిసి నిమ్మకాయ మరియూ చింతపండు పులిహోరమాత్రమే.. మొదలెట్టారు కదా చూద్దాం.

భాస్కర రామిరెడ్డి

కానివ్వండి కానివ్వండి, మీ ఉత్సాహాన్ని నేనెందుకు కాదనాలి. అన్ని రకాల పులిహోరలూ ఆరగించి పెడతాను.

శ్రీలలిత

తినియెడిది పులిహారయట
తినిపించెడివారు జ్యోతిగారట
నే తినగనె భవహర మగునట
తినియెదా వేరొండు కూర కలపగనేలా...
(పోతనగారికి క్షమాపణలతో)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008