రామరాజ - రామలింగ సంవాదం
ఖంగారు పడకండి. నేను చెప్పబోయేది సత్యం సోదరుల గురించి కాదు. అలనాడు రాయలవారి ఆస్ధానంలో కొలువుదీరిన అష్టదిగ్గజాలలో ఒకరైన రామరాజభూషణుడు, తెనాలి రామలింగడికి ఒకసారి చిన్న చిచ్చు రగిలింది.దాని వివరాలలోకి వెళితే....
శ్రీకృష్ణదేవరాయలవారికి (అదేంటో రాయలవారు అనగానే ఎన్.టి.ఆర్ మాత్రమే కనిపిస్తాడు)తెనాలి రామలింగడి మీద అవ్యాజమైన ప్రేమాతిశయమున్నదని భట్టుమూర్తిగా పిలవబడే రామరాజభూషణుడికి ఆసూయ కలిగింది. ఎలాగైనా అతడిని పరిహసించాలని నిశ్చయించుకున్నాడు.ఒకరోజు సభలో భట్టుమూర్తి "కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ " అనే పద్యం చివరిపాదం ఇచ్చి భటుడి ద్వారా రామలింగడిని మొదటి మూడు పాదములు పూరించమన్నాడు. తనను అవమానించడానికే ఇలా అడిగాడని గ్రహించిన వికటకవి ఊరుకుంటాడా? ఆ సమస్యను ఈ విధంగా పూర్తి చేసాడు.
గంజాయి త్రాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా?
లంజలకొడకా యెక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్.
గంజాయి త్రాగి, తక్కువజాతి వాళ్లలో కలిసి కల్లు త్రాగి ఉన్నావా? లంజలకొడకా! ఎక్కడ ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరింది అంటూ భటుడిని తిట్టినట్టు పద్యం పూరించాడు.
ఎంతైనా రామలింగడికి చాలా ధైర్యం. తనను అవమానించదలచిన భట్టుమూర్తిని తిట్టినా తిట్టనట్టు వాతలు పెట్టాడు కదా. తరవాత రాయలవారు ఈ గొడవేదో శ్రుతిమించుతున్నట్టుగా ఉందని గ్రహించి ఆ చివరి పాదాన్ని నేనే ఇచ్చాననుకుని పూరించమన్నాడు రామలింగ కవిని. అప్పుడు ఆ పద్యం ఎత్తుగడ, ఇతివృత్తం అన్నీ మారిపోయి అందంగా అవతరించింది
రంజనచెడి పాండవు లరి
భంజనులై విరటుగొల్వఁ బాల్పడి రకటా
సంజయ! విధి నేమందును
కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్.
మహావీరులైన పాండవులు నిస్సహాయులై విరాటరాజు కొలువులో ఊడిగం చేసిన ఇతివృత్తం ఏనుగుల సమూహం దోమ గొంతులో చొరబడినట్టుగా అగుపిస్తుంది అని రామకృష్ణుడు చక్కగా చెప్పాడు.
కవులు ఎంతకైనా సమర్ధులే కదా!!!
9 వ్యాఖ్యలు:
ఈ సంఘటన అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నప్పుడు మా తెలుగు ఉపవాచకంలో ఉండేది. ఇప్పటికి గుర్తుంది నాకు.
జ్యోతి గారూ,
మీరన్నట్టు సరస్వతీ పుత్రుల బుద్ధికి రెండువైపులా పదునే. అయితే నాదో చిన్న సందేహం...ఈ పద్యం (గంజాయి తాగి) భట్టుమూర్తి కాక టాటా చార్యుల వారి ప్రోద్భలంతో అక్కడ ఉండే ఒక భటుడు అడిగినట్టు తెనాలి రామలింగడు సినిమాలో ఉంది. నాక్కూడా అది నిజమే అనిపిస్తోంది...ఎందుకంటే సాటి దిగ్గజాన్ని "లంజల కొడకా" అని నిండు సభలో తిట్టేంత పని రామలింగడు చేసి ఉండదని నాకనిపిస్తోంది. మీకు వీలయితే నా బ్లాగ్ లో గత నెలలో పోస్ట్ చేసిన "తెనాలి రామలింగడి ఆమరణ దీక్ష..... థాంక్స్ టు ఘంటసాల" అనే పోస్ట్ చదవండి. అందులో ఈ పద్యాల ఆడియో లింక్స్ కూడా ఇచ్చాను. సందర్భం తో కలిపి ఉన్నందున మరింత రక్తి కట్టాయి అవి. పోస్ట్ లింక్ కింద ఇస్తున్నాను.
http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_5015.html
ఎప్పుడో చదివినట్లు గుర్తు..
చిన్న సంశయం మూడవ పాదం
సంజయ! విదినేమందును అనుకుంటా!
SHANKY గారు,
సినిమాలో అలాగే ఉంది కాని నా దగ్గర ఉన్న రామలింగని కధలో అలా లేదు,. భట్టుమూర్తి ఇచ్చిన సమస్య అన్నారు, చూద్దాం మరికొందరు పెద్దలేమంటారో.
శ్రీనివాస్ గారు.
సరిచేసానండి.
ఈ సమస్యని తాతాచార్యుల వారి పనుపున వేరే ఎవరో యిచ్చినట్టుగానే నేను చదివాను. అలా ఉంటే, అది భువన విజయం సభా ఔచిత్యానికి భంగకరం కాబోదు కదా?
మంచి పూరణలు మరో మారు గుర్తుకు తెచ్చారు.
శ్రీరాం గారి పూరణ ఇక్కడ
ఊకదంపుడుగారు,
మీరు ఇచ్చిన లింకు నిన్నే చూసాను. అసలు రామలింగ కవి అలా అన్నాడా? లేదా సినిమా మాయా? అని పలువిధాలుగా శోధిస్తూనే ఉన్నా. ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అసలు తెనాలి రామలింగడు రాయల కాలం వాడు కాదని. అష్టదిగ్గజకవుల విషయం ఆరుద్రగారు సవివరంగా సమగ్రాంధ్ర సాహిత్యంలో వివరించి సోదాహరణంగా వారి కాలాలను గూర్చి తెలియఁజేసారు. ఇప్పుడేం చేయాలంటారు? ఏది సరియైనది??
రాయల వారి కొలువులో అష్ట దిగ్గజ కవుల పేర్లనుగురించి కొన్ని భిన్నాభిప్రాయాలు పండిత లోకంలో లేక పోలేదు. అయితే, కందుకూరి వీరేశలింగం పంతులు గారి నుండి, నిడుదవోలు వేంకట రావు గారి వరకూ కవుల చరిత్రలు రాసిన పెద్దలందరూ రామలింగ కవిని అస్ట దిగ్గజ కవులలో ఒకనిగానే గుర్తించారు. పెద్దన, తిమ్మన, ధూర్జటి కవులతో పాటు దాదాపు అందరూ రామలింగ కవిని అష్ట దిగ్గజ కవిగానే పేర్ొనడం జరిగింది. ఆరుద్ర గారు మాత్రం ఈ విషయంలో కొంత సంశయించారు. అయినా, ఆరుద్ర గారు తెనాలి కవిని రాయల కాలం వాడు కాదని పూర్తిగా తోసి పుచ్చినట్టు తోచదు. ‘‘ అష్ట దిగ్గజ కవులలో ఒకడుగా రాయల వారి భువన విజయంలో తెనాలి రామలింగడు ఎన్నాళ్ళు ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో తెలియదు ...’’ అని శ్రీ ఆరుద్రగారు నబాబుల యుగం భాగంలో రామలింగని గురించి రాస్తూ అనడం గమనించాలి.
ఇక, ఆరుద్ర గారే, రామలింగనికి తాతాచార్యుల వారితో కోపతాపాలుండే అవకాశాన్ని వివరించారు. తాతాచార్యులు గారిది వడహల అనే తమిళ సాంప్రదాయం. కాగా రామలింగనిది తెంగల సాంప్రదాయం. ఈ ఇరు సాంప్రదాయాల వారికీ ఉండే సహజ స్పర్ధలు వీరిరువురిలోనూ కనిపించి ఉండొచ్చు. అందుచేత ఈ సమస్యని తాతా చార్యుల వారి పురమాయింపుతో వారి అనుయాయులెవరో యిచ్చి ఉండొచ్చునన్న ఊహ నామట్టుకి యుక్తియుకతంగా తోచింది,
అదీ కాక, రామలింగని పేరిట ప్రచారంలో ఉన్న కథలన్నీ అయనికి చెందినవి కవనీ , చాల మట్టుకు కల్పితాలనీ , అతని పేరుకి అంటగట్టబడినవనీ పెద్దలు చెబుతూ ఉంటారు.
.
నాకు జ్ఞాపకం ఉన్నంతలో
భంజనులై విరటు కొల్వు పాలైరి కటా
సంజయ ! విధి నేమందును
అని ఉండాలనుకుంటున్నాను.
Post a Comment