మా సెడ్డ సిక్కొచ్చి పడ్డాది !!
నాకేంటి చిక్కేంటి అనుకుంటున్నారా? నిజమండి. మరీ అంత పెద్ద చిక్కా? టపాయించేటంత పెద్ద చిక్కా అంటారా? అవునండి. కాస్త సాయం చేద్దురూ! ఎంతో ప్రయత్నించినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. కొంత కాలంగా నన్ను తెగ తిప్పలు పెట్టేస్తుంది. ఇంతకీ ఆ చిక్కేంటి అంటే ...
ఆగండాగండి.. రింగులు తిప్పుకుంటూ వెనక్కి వెళ్ళిపోకండి. ఇక్కడే ఉండండి. చెప్తున్నాగా...
చిన్నప్పటినుండి అమ్మ చేస్తుండగా చూసి నేర్చుకున్న వంట నాకు ఇప్పుడు పెద్ద తంటా అయ్యింది. నేను వంట నేర్చుకుంది ఏ సైటులోనో, బ్లాగులోనో కాదు. ఏ స్కూలుకు వెళ్ళలేదు, కొలత ప్రకారం ఏయే దినుసు ఎలా వేయాలో ఎవరూ చెప్పలేదు. కూరగాయలు కోసినా, ఉప్పూ కారాలు (అమ్మో! కారంలో మాత్రం చెంచా వేస్తాను. దాంట్లో చేతులు ఎలా పెడతాను ) , మసాలాలు వేసినా అన్ని చేత్తోనే. దానికి లెక్కా కొలతా లేదు. కంటిముందు కూరను చూసి దాని ప్రకారం అంచనాలు వేసుకుంటూ ఒక్కోటి అలా వేసుకుంటూ పోవడం. ఒకసారి పాడైతే తర్వాతి సారి జాగ్రత్తగా ఉండడం. అపుడు కుదిరితే, అందరూ నోరు మూసుకుని తింటే (బావుంటే నోరు మూసుకునే తింటారు. కొంచం తేడాగా ఉంటేనే కదా అరిచేది) ఓహో మన కొలతలు కరెక్టుగా ఉన్నాయి. అని ఆ కొలతలపై ఫిక్స్ అయిపోవడం. ఇలా నా వంటల ప్రహాసం జరుగుతూ వచ్చింది. హిట్లూ ఫట్లు ఎలాగూ ఉంటాయనుకోండి. సరే ఆంతా బానే ఉంది. మరి ఇప్పుడేంటి చిక్కు అని అడగబోతున్నారా.. వస్తున్నా..
ఇంట్లో అంటే అలా గడిచిపోయింది.. పోతుంది కూడా. ఇపుడు బ్లాగులో, సైటులో , పత్రికలలో , టీవీ షూటింగుల కోసం వంటలు రాసేటపుడు చెప్పేటప్పుడు ఆయా వంటకం కొలత పక్కాగా ఇవ్వాలి. లేకుంటే గొడవలైపోతాయి. వంట బాగా వచ్చినవాళ్లైతే పర్లేదు అడ్జస్ట్ చేసుకుంటారు. నెట్ ఓపన్ చేసి వంటకం ముందు పెట్టుకుని వంట చేసేవాళ్ళు సరిగ్గా అదే కొలతల ప్రకారం చేస్తారు కదా. అది సరిగ్గా కుదిరితే వాళ్ళ గొప్ప. లేకుంటే నన్నే కదా తిట్టుకునేది. హమ్మయ్యా! మరి ఇపుడు అసలు సమస్య దరిదాపుల్లోకి వచ్చాము. నేను చేత్తో అలా ఆలవోకగా (సినిమా వీరోయిన్లా కాదులెండి) వేసే ఉప్పు కారాలు, మసాలాల గురించి కరెక్ట్ బరువు కొలతలు ఎలా ఇచ్చేది. ఓహో ఆ కూర చేసేటప్పుడు నా చేతి వేళ్ళ మధ్య ఉన్న ఉప్పు బరువు ఇంత ఉంటుంది. నేను వేసిన బెల్లం బరువు ఇంత ఉండి ఉండవచ్చు. ( ఎపుడూ నెలకోసారి సరుకులు తెచ్చుకుంటాం. అవసరమైనపుడు అలా తీసి వేసుకుంటాము కదా. ప్రతీ దాని బరువు ఎవరు చూడొచ్చారు. మరీ చోద్యం కాకపోతే ) ఇలా గాల్లో లెక్కలు వేస్తూ రాసుకుంటాను.
లేదా వంట చేసేటప్పుడే కొలత ప్రకారం చేస్తే పోలా ! అంటారా? అలా ఐతే గంటలో అయ్యే వంట నాలుగు గంటలు పడుతుంది. అలా కాదుగాని. ఏదైనా సులువైన ఉపాయం చెప్పండి. కిచన్ వేయింగ్ మెషీన్ కొనమని మాత్రం చెప్పొద్దూ. ఈ చెంచాల గోలేంటో, ఈ గ్రాముల గోలేంటో? మా కాలంలో ఈ లెక్కలు తెలీవమ్మా!!
ఇపుడు నానేటి సేసేది??
10 వ్యాఖ్యలు:
ఓస్ ఇంతేనా? "తగినంత" అని రాయండి చాలు.
ఇంతకాలం అమీరికాలో వున్నా నాకూ ఇప్పటికీ కొలతలు రావండీ. ఇంతయితే అనుకుని వేసేడమే .. ఆతరవాతితంటాలు భగవాన్లకెరుక :)
మలక్ పేట్ రౌడీ గారు అన్నట్లు తగినంత అనేయండి ఒక పనైపోతుంది:)
మీ వంట చిట్కా(రెసిపీ) అందరికీ, మీరుచేసే విధంగా రావాలంటే, వంట చేసేటప్పుడు కొలతలు లేకుండా చేసి తరువాత షుమారు కొలతలతో మీ రుచి వచ్చేదాకా రెండు మూడు సార్లు చేసి అందరికీ కొలతలతో చెప్పండి.
హ హ హ్హా జ్యోతి, నాదీ అంతా ఉజ్జాయింపు బేరమే. ఈ మధ్య ఒక కొలీగ్ కి కొబ్బరి పచ్చడి రెసిపీ ఇస్తుంటే, పోపులోకి ఎన్ని గింజలు ఆవాలు వేయాలీ అని అడిగింది. ఇంతవరకు నేను ఫేస్ చేసిన తగినంత కొలతల కష్టాల్లో ఇదే హై లైట్. కనుక మీరిక ఫీల్ బెటర్ మేడం.
కొబ్బరి పచ్చట్లో ఆవాలు పోపెయ్యరు. ఇడ్లీల్లో నంచుకునే చట్నీలాంటిదైతే సరే. అయినా ఆవిడ అంతలా నోరు చేసుకుని అడిగింది కాబట్టి, ఒక యాభయ్యో వందో వెయ్యమని చెప్పుండాల్సింది. ఆ సాయంత్రమంతా ఆవిడా వాళ్ళాయినా కలిసి ఎంచక్కా ఆవాల్లెక్కబెట్టుకుంటూ "బాండింగ్" సమయం గడిపే వాళ్ళు.
అవునుమరి, మీకు ఇంటో చూసుకున్నట్టూ ఐపోవాలి, మళ్ళీ పత్రికల్లోనూ టీవీలోనూ పేరూ రావాలి అంటే ఎలాక్కుదురుతుంది? బయటి వాళ్ళకి చెప్పేందుకైనా పద్ధతి ప్రకారం రాసేందుకు ఆ మాత్రం కష్టపడొద్దోఓ?
అసలు ఇలా రెసిపీలు రాయడమనేది ఒక కుట్ర. ఆ రెసిపీలు వంటింట్లో కొత్తగా అడుగు పెట్టిన వాళ్ళెవ్వరికీ ఉపయోగించవు. పదిరకాలుగా ఉపయోగపడే వంటల బ్లాగు నేనే ఎప్పుడో మొదలు పెట్టేస్తా.
హ....హ....హ...ఇదేమిటో "అవ్వా కావాలీ....బువ్వా కావాలీ" తంతు లాగా వుందే?
రౌడీగారు,
ఉప్పుకైతే తగినంత అంటాము. అన్నింటికి అంటే అవతలివాడి గతేంటి?
మాలతిగారు,
ఈ భగవాన్లు ఎవరండి? తినేవాళ్లా??
కొత్తపాళీగారు,
ఉష చెప్పింది కొబ్బరి పచ్చడికి పోపులో వేసే ఆవాల సంగతి. కాని మీరు చెప్పిన ఐడియా కూడా బావుంది.
కూసింత సలహా ఇవ్వండి అంటే దెప్పుతారా?
నా బ్లాగు మీద విమర్శకి ధాంక్స్. మెరుగుపరుచుకుంటాలెండి.
కాని... మీరు వంటల బ్లాగు మొదలెట్టడమంటే.. నాకేదో వింతవిషయంలా అనిపిస్తుంది. మీరేంటి వంట చేయడమేంటి?(ఇది నిజమో కాదో మీ అవిడని అడగాలి) సరే మొదలుపెట్టండి. నా కష్టాలు మీకు ఆర్ధమవుతాయి. కొత్తగా వంట నేర్చుకునేవాళ్లకి కూడా ఈ గ్రాములు, చెంచాల గోల అర్ధమవుతుందంటారా? ఇప్పుడు మా పిల్లలకే ఈ కొలతల ప్రకారం చేయండి అంటే తెల్లమొహం వేస్తారు.
జ్యోతీ,
చాలా సింపిల్. పాతరోజుల్లో వీధుల్లో బట్టలు మూటలు కట్టుకొచ్చేవాళ్ళని ఒకసారి రింగులు తిప్పి గుర్తు చేసుకోండి. జాన, మూరా అంటూ కొలిచేవారు కదా. అలాగే మీరు వంటలో దినుసులు కూడా చారెడు, గుప్పెడు, అర గుప్పెడు అంటూ వ్రాసెయ్యండి. ఎవరి చేతి సైజుని బట్టి వాళ్ళు చూసుకుంటారు.. ఎలావుంది అవుడియా? (నాకు మిస్సమ్మ సినిమాలో ఎన్.టి.ఆర్., రేలంగి కలిసి చేసిన వంటల ప్రహసనం గుర్తొచ్చింది)..
దీనికింత ఆలోచించాలా? నేనైతే "మీకు ఇష్టమొచ్చినంత" అనో లేకపోతే "మీకిష్టముంటే వేస్కోండి, లేకపోతే లేదు" అనేసేదాన్ని.
Post a Comment