తెలుసుకొనవె చెల్లి (యువతి )
కొత్తగా పెళ్ళైనవాళ్ళు. చిరాకులు , పరాకులు, అలకలు సాధారణమే. ఆ సరస సల్లాపాలలో ఒకరి మీద ఒకరి ఆరోపణలు, చిరు కోపాలు. సీన్ అర్ధం కాలేదు కదా. అలనాటి ఆణిముత్యం మిస్సమ్మ లో ఎన్.టి.ఆర్ , సావిత్రి ఇద్దరూ జమునని మధ్యవర్తిగా చేసుకుని ఒకరి మీద ఒకరు ఆరోపణలు అంటే డైరెక్టుగా కాకుండా ఆడవాళ్ళు, మగవాళ్ళ మీద నెపం పెట్టి నీతులు చెప్తుంటారు. ఒకే పాట హీరో, హీరోయిన్ మీద చిత్రీకరించబడింది. సావిత్రి ఏమో మగవాళ్ళతో ఎలా మెలగాలో తెలుసుకో చెల్లి అని నీతులు చెప్తుంటే ఎన్టీవోడు ఆడవాళ్ళు ఎలా ఉండాలో తెలుసుకో యువతి అని చెప్తుంటారు.
జమున అమాయకపు మాటలు, అచ్చమైన తెలుగు వేషధారణ ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. మగవాళ్ళ గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని హీరోని చూస్తూ ఈ పాట పాడుతుంది సావిత్రి. మగవారికి దూరంగా ఉండాలి, ఎంత పని ఉన్నా మనకు మనమే వారి కడకు వెళ్ళరాదు అలుసైపోతాం, పది మాటలకు ఒక మాట బదులు చెప్పొద్దు .లేని పోని అర్ధాలు మన వెనక చాటుతారు జాగ్రత్త అని సావిత్రి చెప్పే ఒక్కో మాట వింటూ గతుక్కుమన్నా ఆనందిస్తూ ఉంటాడు ఎన్.టి.ఆర్. కాని నేను కూడా కొన్ని నీతులు చెప్పనా అంటాడు.
యువకులను సాధించుటకే యువతులు అవతరించారు, మూతి విరుపులు, అలకలు, బెదిరింపులు, సాధింపులు ఇక సాగవు , చిరునవ్వుతో మగవారిని సాధించుకో యువతి అని నవ్వుతూ ఎదురుదాడి చేస్తాడు ఎన్.టి.ఆర్. అసలే కోపంతో ఉన్న సావిత్రి ఇంకా ఉగ్రరూపం దాలుస్తుంది. అంతే కదా మరి.. ఉన్న మాటంటే ఉలుకే..
ఈ పాటలో నటీనటులు ఎంత సహజంగా నటించారు, వారి వస్త్రధారణ మాటలు... పింగళి వారి మాట, ఏ.ఏం.రాజా, లీల ల గాత్రం,ఎస్.రాజేశ్వరరావుగారి సంగీతం .. వెరసి ఒక అందమైన అనుభూతి..
1 వ్యాఖ్యలు:
ఆ సన్నివేశంలో సావిత్రిగారు కోపంగా అలిగి ఇంకా ముద్దొస్తారు.మంచి పాటని గుర్తుచేసారండి.
Post a Comment