Tuesday 26 January 2010

యాంటీ పుస్తక JAC


ఎప్పటినుండో ఈ విషయాలు నా మనసులో ఉన్నాయి. ఎదో నా మానాన నేను టైం దొరికినపుడు ఏవో పిచ్చిరాతలు బ్లాగులో రాసుకుంటున్నాను. అలాగే మిగతా బ్లాగులు , సైట్లు చదువుతున్నాను. ఈ మధ్య ఒక విషయంపై మాత్రం నాకు చాలా ఆరోపణలు ఉన్నాయి. అదేంటంటే.. పుస్తకాలు. సరేలే ఈ బాధ నాకొక్కదానికేనేమో. అందరూ హాయిగా ఉన్నారు. ఎన్నెన్ని పుస్తకాలు చదువుతున్నారో? వాళ్ళంతా గొప్పవాళ్ళు. మనకంత సీను లేదూ, సినిమా లేదు. అని ఊరుకున్నా.

పుస్తకాలంటే నాకు చిన్నప్పటినుండి ఇష్టమే. క్లాసు పుస్తకాలతో పాటు చందమామ, బొమ్మరిల్లు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, యువ మొదలైన పుస్తకాలు కూడా చదివేదాన్ని. దాదాపు ముప్పై ఏళ్ల నుండి దాచుకున్న పుస్తకాలు, కటింగ్స్ తో బైండింగ్ చేయించుకున్న సీరియల్లు, నవలలు ఎన్నో మావారి సాధింపులు భరించలేక ఇచ్చేసానా. మరి ఏంటి గొడవ అంటారా? ఈ మధ్య బ్లాగుల్లో ఎక్కడ చూసిన పుస్తకాల కబుర్లే కన్పిస్తున్నాయి. అయినా అతి కష్టం మీద వాటి వైపు వెళ్ళకుండా ఊరుకుంటున్నా. కాని ఇవాళ మాలతి గారి టపా చదివాక ఇక నా ఆవేశం, ఆక్రోశం, అసూయ అన్ని అలా బయటకు వచ్చేసాయి. మాలతిగారి లాగే నాకు ఎన్నో సందేహాలు. అసలు వీళ్ళు ఇన్నేసి పుస్తకాలు ఎలా చదువుతారు ? అంత టైం ఎక్కడుంటుంది అస్సలు. కట్టలు , కట్టలు పుస్తకాలు చదివేసాం అంటారు. వీళ్ళు రిటైరయి ఖాళీగా ఉన్నారా అంటే అదీ లేదు. ఎపుడూ బిజీ ...బిజీ.. నాకు పెద్ద సందేహం. వాళ్లకు కూడా ఇరవైనాలుగు గంటలే ఉంటాయి కదా. ఎలా చదువుతారబ్బా. ఊరికే చదవడం కాదు. ఆ పుస్తకం చేతిలో పట్టుకుని ఆ కథలో దూరిపోయి తర్వాత తీరిగ్గా విశ్లేషిస్తారు. అది పుస్తకం వాళ్ళు అచ్చేస్తారు. అమావాస్యకు పున్నానికి ఒకటి ఐతే పర్లేదు... ఇక ఈ మధ్య ఏడాది మొత్తంలో చదివిన పుస్తకాల గురించి రాయమంటున్నారు. అవిడియా బావుంది. ఎదో లే ఎవరైనా ఏడాదికి నాలుగైదు పుస్తకాలు చదివి ఉంటారు అనుకున్నా. అయ్యా బాబోయ్. జంపాల చౌదరిగారి లిస్టు చూసి కళ్ళు బైర్లు కమ్మాయి. గిర్రున తిరిగినట్టైంది. (సినిమాల్లో కొత్తగా పెళ్ళైన అమ్మాయికి తిరుగుతాయి చూడండి అలా. అందులో ఐతే డాక్టరు కాని ఇంట్లో పెద్దవాళ్ళు కాని అమ్మాయి నాడి పట్టుకుని కంగ్రాట్స్ .. తల్లి కాబోతుంది అంటారు. మరీ సూపర్ కదా).. ఆ లిస్టు లో ఉన్నవన్నీ ఎక్కువగా ఇంగ్లీష్ పుస్తకాలే. అసలు ఆ ఇంగ్లీషు పుస్తకాలంటేనే మనకు పడదు. ఇంతింత లావుగా ఉంటాయి.ఎలా చదువుతారబ్బా??క్లాసు పుస్తకాలకంటే సీరియస్సుగా చదివితేగాని కథ అర్ధం కాదు. అలా అని నేను చదివానని మోసపోకండి. అంత ఓపిక లేదు. నాకు ఇప్పటికీ ఇష్టమైనవి అమర్ చిత్ర కథ, టిన్ టిన్ , ఫాంటమ్, మెండ్రేక్ .. అదే తెలుగు నవల ఐతేనా .. అది పూర్తి చేసేవరకు నిద్ర పట్టదుగా. వంట చేస్తున్నపుడు కూడా పుస్తకం పట్టుకుని పూర్తి చేసిన రోజులున్నాయి. అవన్నీ యద్దనపూడి, మాదిరెడ్డి, కోడూరి కౌసల్య రాజ్యమేలిన రోజులు లెండి.

పుస్తకం వాళ్ళు మాత్రమే కాదు ఇలా పుస్తకాల ???? చాల మంది గురించి (ఎంత కుళ్ళు, అసూయ ఉన్నా వీళ్ళని రాక్షసులు, దుర్మార్గులు అంతే బాగోదు కదండీ. పొద్దున్న లేస్తే మొహాలు చూసుకునే వాళ్ళం) మీరు చదివారా? అంటూ వచ్చిన ఎన్నో ఇంటర్వ్యూలలో .. అమ్మో . ఎన్నెన్ని పుస్తకాలు ? అయినా వేలకొద్ది పుస్తకాలు ఏం చేసుకుంటారో ? ఏమో? ఇలా వేల కొద్ది పుస్తకాలు కొనేవాళ్ళ గురించి నాదో పెద్ద డౌటు? ఈ చుట్టుపక్కల ఆదాయం పన్ను శాఖ వాళ్ళు లేరు కదా? ఉంటే గింటే వాళ్ళని పక్కకి తోలండి.. నేను అనుకునేదేంటంటే... వీళ్ళందరికీ జీతం కంటే గీతం ఎక్కువని. అందుకే అన్ని పుస్తకాలు అలా కూరగాయలు కొన్నంత ఈజీగా కొనేస్తారు. ఈ బ్లాగులో , సైట్లలో వచ్చిన సమీక్షలు చూసి కొన్ని పుస్తకాలు కొందామనుకున్నా. మంచి చీర కొనుక్కుందామని కంది పప్పు (బ్యాంకు లాకర్ కంటే ఇదే సేఫ్, కాస్ట్లీ కదా) డబ్బాలో, బండి మీద కొన్న కూరగాయలను సూపర్ మార్కెట్ ధరలు చెప్పి మిగిల్చిన డబ్బులు, అలా ఇలా పోగేసిన డబ్బంతా పెట్టి పుస్తకాలు కొంటెే చిన్న క్యారీబ్యాగ్లో వచ్చాయి మరి. నేను అలా అనుకోవడంలో తప్పేంటి?

ఇదంతా కాదు కాని.. మాలతిగారు అన్నట్టు చెట్లను సంరక్షించడానికి పుస్తకాలు చదవడం , రాయడం నియంత్రిస్తే మంచిదే.. కాని దీనికి అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఎదోఒకటి చేయాలి తప్పదు. అందుకే ఈ JAC .. ఇపుడు ఎక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తుంది కదా. నేను అలాగే డిసైడ్ ఐపోయా. ఇందులో చేరి ఊరికే మాటలతో కాలయాపన చేయకుండా, తక్షణమే రంగంలోకి దిగాలి. నా అవిడియాలు ఏంటంటే.. ( బోల్డు పుస్తకాలు సేకరించి పెట్టుకున్నవాళ్ళు జాగ్రత్త ) అమాయకంగా మేము అది చదివాం, ఇది చదివాం. నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా అని చెప్తున్తారుగా. వాళ్ళ ఊర్లో ఉన్న సంఘ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇంటిపై దాడి చేసి పావు వంతు పుస్తకాలు వదలేసి మిగతావి ఎత్తుకొచ్చెేయాలి. వాటిని మిగతా సభ్యులకు పోస్ట్ చేయాలి. అలా అవి అందరు చదివాక రూపు రేఖలు బాగుంటే తిరిగిచ్చేస్తే సరి.. వేరే దారి లేదు. అన్ని పుస్తకాలు కొనాలంటే అందరివల్ల అవుతుందా. సమీక్షలు రాసి మిగతావారి బుర్రలు పాడు చేసేవారిని నెలకొకసారి రాసేలా నియంత్రిస్తే ఎలా ఉంటుంది. గుడ్డిలో మెల్ల మేలు కదా ?


అసలైతే ఈ టపాలు చదివి . ఎవరెవరంటారా?? కొత్తపాళీ, నాగరాజు పప్పు, మురళి, కస్తూరి మురళీకృష్ణ,,కల్పన, సుజాత, లలిత,,,, చావా కిరణ్ .. ఇంకా చాలా మంది ఉన్నారు. అలనాడు ప్రవరాఖ్యుడు కాళ్ళకు ఎదో క్రీమ్ పూసుకుని అలా ఎగిరిపోయాడు కదా. అలా వెళ్ళిపోయి నాకు కావలసిన పుస్తకం తెచ్చేసుకుని చదువుకుంటే ఎంత బాగుండు అనుకుంటా? అలా అని నేను పుస్తకాలన్నీ బేవార్సుగా చదవాలనుకుంటాను అనుకోవద్దు. నేను కొంటూనే ఉన్నా. అయినా రోజు ఎదో ఒక పుస్తకం బావుంది అని చెప్తుంటే దురాశ కలగదా?

సరే ఇక ఎవరెవరు JAC లో చేరతారో చెప్పండి....

27 వ్యాఖ్యలు:

మాలా కుమార్

ఏమో మరి , మా లైబ్రేరియన్ , అబ్ మేరేపాస్ కితాబ్ నై హై , ఆప్ ఐసా పూచేతో మేరొకోయీ చాప్నా పడేగా అనేవాడు !!!!!!!!!!!!!
నాకు తెలుసు మీలాంటి పుస్తక దొంగలుంటారని . అందుకే నేను లైబ్రేరీ నుండి తెచ్చుకొని చదూకుంటాగా . కొన్న కాసినీ మీకు కనిపించకుండా దాచుకుంటాగా .

cbrao

"చెట్లను సంరక్షించడానికి పుస్తకాలు చదవడం , రాయడం నియంత్రిస్తే మంచిదే." - అవునక్కా. ముందస్తుగా ఆ పుస్తకం.నెట్ నడిపేదెవరో కనుక్కుని వాళ్ల భరతం పట్టాలి. పుస్తకాలు రాస్తేనే కదా సమీక్షలొస్తాయి. మన JAC మొదట ఈ రాతలు గీతలు బంద్ చెయ్యమని రచయితలకు ఫత్వా జారీ చెయ్యాలి.

Srujana Ramanujan

Hahaha. Hilarious. Though I read books very much, did not write a word on them :-)

మధురవాణి

జ్యోతి గారూ, మీ సంఘంలో నాకూ ఓ సీటిప్పిచ్చమని అప్లికేషను పెట్టుకుంటున్నా :)

మురళి

అన్యాయమండీ జ్యోతి గారూ.. మిగిలిన వాళ్ళు చదివే పుస్తకాల్లో పదో వంతు కూడా ఉండవు నేను చదివేవి..నా పేరు కూడా లిస్టులో రాసేస్తారా.. నేనొప్పుకోనంతే..

జ్యోతి

మాలగారు,,

మీరు చెప్పిన ఆవాహన కొని నెల దాటింది. ఇంతవరకు పుస్తకం విప్పు చూద్దామంటే కూడా తీరడం లేదు.

రావుగారు,

అసలు పుస్తకాలు ప్రచురించేబదులు నెట్ లోనే పెడితే పోలా. రాసినవాళ్లకు డబ్బులు రావు కదా.. కాని పర్యావరణ పరిరక్షణ మాత్రం జరుగుతుంది. చెట్లను రక్షించుకోవచ్చు.
what an idea sir ji? ఈ మధ్య ఐడియా వాడి ఐడియా ఇదే కదా?

మురళిగారు,
ఆ కొన్ని ఐనా మాలాంటివాళ్లకు ఎక్కువేనండి. మీరు సినిమాలు, సమీక్షలు, ముచ్చట్లు అబ్బో ఎన్ని చెప్తారో.. అసలు మీకింత టైమ్ ఎక్కడ దొరుకుతుంది?

శ్రీలలిత

పుస్తకం హస్తభూషణం అన్నట్టు..
పుస్తకం చోరలక్షణం అందామా..
ఎందుకంటే మీరన్నట్టే అన్ని పుస్తకాలూ కొనలేం కదా..
ఐతే వాకే...
నేనూ మీ పార్టీయే..

శరత్ కాలమ్

అది సరేనండి, మీ జాక్ సిద్దాంత కర్త ఎవరు? పోనీ నేనుండేదా?

Naganna

అందుకే Amazon Kindle కొన్నాను. చెట్లు గురించి బాధపడకుండా పుస్తకాలు చదువుకోవచ్చు

kiranmayi

మొన్న నాకు కూడా ఒళ్ళు మండి నేను కూడా చెడా మడా ఒక పోస్ట్ వ్రాసేసా. కాకపోతే మీ అంత బోల్డ్ గా పెద్ద పోస్ట్ వ్రాయలేదు. ఒక లుక్కేసుకోండి. నేను కూడా మీ పార్టీ నే.
http://mymayisblog.blogspot.com/2010/01/frustration.html

Anonymous

బాగుంది. నాలాటివారు ఇంకా వున్నారంటే అదో ఆనందం. పైగా నా టపాకి కూడా మీపాఠకులని పంపుతున్నందుకు మరింత సంతోషం. మీ జాక్ విజయీ భవ.

రవి

కదా! ఇన్నేసి పుస్తకాలు ఎలా చదువుతారో ఏమో? అదీ ఇంగ్లీషు పుస్తకాలు! నాకో సాడిస్ట్ ఆలోచనొస్తూంది. ఈ పుస్తకాలు చదివేసే వాళ్ళను ఎడారి మధ్యలో వదిలేయాలి.

జ్యోతి

శ్రీలలితగారు,
మరి ఎన్ని పుస్తకాలని కొంటామండి. అప్పటికి సమీక్షలు చదివి కోటిలో ఉన్న దుకాణాలు గాలించి కొన్ని పుస్తకాలు కొన్నాను. అవీ తీసి చదవడానికే టైమ్ దొరకట్లేదు. ఇంకా సమీక్షలు వస్తున్నాయి, అందరూ బావున్నాయి అంటున్నారు. కోపం రాదేంటి?

శరత్ గారు,
మీరు మిగతా ఏ జాక్ లో సభ్యులు కాకుంటే మాకేం అభ్యంతరం లేదండి.ఒక వ్యక్తికి ఒకే పదవి అన్నది నా సిద్ధాంతం. సోనియమ్మ అదే చెప్పింది కదా అప్పుడెప్పుడో..


నాగన్నగారు,

మంచిమాట.

మాలతిగారు,
మరి ఎన్నాళ్లని ఊరుకుంటామండి. పుస్తకాలంటే ఇష్టంలేనిదెవ్వరికి.నాలాంటి బద్ధకిస్టులు ఏం కావాలి ఇలా ఊరిస్తుంటే.. మాకూ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కనపడ్డ, తెలిసిన పుస్తకమల్లా కొనేసి చదవాలంటే కుదరొద్దూ??

రవి..
మరీ అంత దారుణమా? వద్దులే.

Ruth

I am not sure about Telugu books, but you can read many english books for which copy rights have expired on the net or by downloading them. I read half my books like that. you can try projectgutenburg.com for downloads.

జ్యోతి

కిరణ్మయిగారు,,

పాపం.. మీరు నాలాగే ..సేమ్ పించ్.. ఏదో ఒక దారి వెతుకుదాం. అందరూ కలిసి.

Anonymous

ఆ లలిత ఈ లలిత ఒకరు కాదు ( హమ్మయ్య ఇంక ప్రమాదం లేదు )

జ్యోతి

ఈ లలిత, ఆ లలిత ఒకరే.. నువ్వేనమ్మా..

తారక

jyothi garu, mee pic lo Maxim Gorky "amma" pusthakam ledu. ade tappaka vundalsinadee

తారక

మరి ఎన్ని పుస్తకాలని కొంటామండి. అప్పటికి సమీక్షలు చదివి కోటిలో ఉన్న దుకాణాలు గాలించి కొన్ని పుస్తకాలు కొన్నాను. అవీ తీసి చదవడానికే టైమ్ దొరకట్లేదు. ఇంకా సమీక్షలు వస్తున్నాయి, అందరూ బావున్నాయి అంటున్నారు. కోపం రాదేంటి?
http://www.amazon.com/gp/pdp/profile/AFVQZQ8PW0L/ref=cm_cr_tr_tbl_1_name

20 velaki paiga psutakaalu chadevi, kshunnam ga review rasadu.

alante vallani adarsam ga tesukovali meeru :-)

జ్యోతి

తారగారు,
మీరు చూసారుగా, ఫోటోలో ఉన్న పుస్తకాలు ఇంకా చదవలేదు కొనాల్సిన లిస్టు కూడా చాంతాడంత ఉంది. మీరు చెప్పిన పుస్తకం నా లిస్టులో చేర్చాను. ఇక నెట్ లో చదివేకంటే హాయిగా పుస్తకం పట్టుకుని, పక్కన పునుకులో, బఠానీలో, పకోడీలో పెట్టుకుని చదువుతుంటే ఆ మజానే వేరండి.:)

Gold Mak 786

Hello Jyothi Garu.. Naa peru Anil, Dubai lo vuntunnaa. Frist time mee Blog choosaa... "Anti Pusthaka JAC" chadivaanu. Meeru cheppinattu, ikkada koodaa JAC ni introduce chesthay, maa Dubai Policulu, Airport ki pattukelli, balavanthaana flight ekkinchi, India pampinchesthaaru. Mari elaa mee proposal ni implement cheyyaala ani alochisthunna. Keep up the Good Work.. Congrats..

తారక

jyothigaru, nenu abbaini.
tara ani enduku kanapadutunnado.

computer lo chadavalemu ekkuva sepu.
meeru annadi chala correctu

Kalpana Rentala

జ్యోతి, అన్యాయం కదూ. మా పుస్తకాలు దొంగతనం చేస్తే ఏ పుస్తకాలు బాగున్నాయో ఎవరమ్మా మీకు చెప్పేది....ప్రవరాఖ్యి లాగా వస్తాననటం బావుంది. వచ్చేయి మరి. ఎదురుచూస్తుంటాను మీ అందరి కోసం.

కనకాంబరం

జ్యోతి ! మీ పుస్తకాయణ పారాయణ చేసాను. అందరికీ ఇరవై నాలుగ్గంటలే. మరి సినాప్సిస్ చదివి ఆ పుస్తకసారమంతా చదివి గ్రహిస్తారేమో. అందుకు కొద్ది సమయం సరిపోతుంది. అలా రోజుకు .... అభినందనలతో.....నూతక్కి

amma odi

జ్యోతి,

నేను మీ పార్టీనే! నాక్కూడా సమయం సరిపోవటం లేదండి! అందరూ ఇన్నేసి పుస్తకాలు ఎడాపెడా ఎలా చదివేస్తున్నారో! :)

cbrao

తక్కువ సమయమున్నవారు, ఎక్కువ పుస్తకాలు చదవాలంటే Ghost readers ను పెట్టుకోవచ్చు. Ghost writers కు ఇది సంభందిత పదంగా భావించగలరు.

taTi maTTa

లెస్స చెప్పితివి బాలా. నా ఆత్మ న్యూనతా భావాన్ని పోగొట్టావు. చదవ లేని వాడవని దిగులు చెందకు... టి యవ్... టి యవ్ .. టి యవ్...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008