Saturday, February 5, 2011

మహాన్ (మహమ్మద్) రఫీ


శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః

ఎంతటి క్రూరహృదయం ఉన్నవాడినైనా స్పందన కలగచేసి, మనసును చల్లబరిచి ఆహ్లాదాన్నిచ్చే గొప్ప శక్తి సంగీతానికి ఉంది. అది ఒక అద్భుతమైన మంత్రం. అల్లకల్లోలమైన మనసును తన సమ్మోహన శక్తితో శాంతింపచేసి ఉపశమనం కలిగిస్తుంది. అలాంటి సంగీతం అంటే అది ఆ పాటల సాహిత్యమా?, సంగీతమా?, గాయకుల స్వరమాధుర్యమా? ఏది మనను ఆకట్టుకుని తన మాయాజాలంలో బంధించేది అంటే నా మట్టుకైతే అది సాహిత్యంతో పాటు గాయకుడి స్వరమహిమ కూడా ముఖ్యమే అనిపిస్తుంది. కొన్నేళ్ళుగా మనతోనే ఉంటూ, మన సంతోషంలో కూనిరాగాలు తీస్తూ, అలసిన వేళ తన గానంతో మనలను మురిపించే మహాగాయకుడు మొహమ్మద్ రఫీ. నాటికి, నేటికి రఫీని మించినవాడులేడు. భవిష్యత్తులో రఫీనే పునర్జన్మ ఎత్తి తన గానాన్ని మళ్లీ వినిపిస్తాడేమో.

పంజాబ్ లోని కోట్ల సుల్తాన్ పూర్(ఇప్పుడు ఇది పాకిస్తాన్‌లో ఉంది) లో జన్మించాడు. తండ్రి హాజి అలి. మహమ్మద్. రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్, పండిత్ జీవన్ లాల్ మట్టూ మరియు ఫిరోజ్ నిజామిల వద్ద నేర్చుకున్నాడు. పదమూడేళ్ల వయసులో అనుకోకుండా ఒక కార్యక్రమంలొ సైగల్ బదులు రఫీ స్టేజీ ఎక్కి మైకు లేకుండా ఎన్నో పాటలు పాడి అందరిని మెప్పించాడు. 1944లో పంజాబి చిత్రం గుల్ బలోచ్ కోసం జీనత్ బేగంతో కలిసి "సోనీ మేరీ.. హారీ మేరీ" అంటూ సినీ రంగ ప్రవేశం చేశాడు రఫీ. అలా తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నౌషాద్, మదన్ మోహన్, ఎస్.డి.బర్మన్, హేమంత్ కుమార్, వసంత్ దేశాయ్, శంకర్ జైకిషన్ లాంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పని చేశాడు. అతని పాట ఎల్లెడలా వ్యాపించి అందరి హృదయాలను ఆకట్టుకుంది. హిందీ సినిమా గాన జగత్తులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ మరియు లతా మంగేష్కర్ ల గాయక జోడీ హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్రకుమార్ మరియు షమ్మీ కపూర్ రఫీ పాటలతోనే హిట్టయ్యారు అని అందరూ ఒప్పుకునే మాట. ఓపీ నయ్యర్ సంగీతంలో రఫీ గొంతు వెల్లువలా పొంగింది. అందుకే ఆయన సంగీతంలో రఫీ పాడిన 197 పాటలు మరపురానివి అయ్యాయి. దాదాపు అందరు సంగీత దర్శకులతో పనిచేసి ఎన్నో అద్భుతమైన, మధురమైన పాటలుమనకందించాడు రఫీ. 1944 - 1980 మధ్యకాలంలో రఫీ సుమారు 11 భారతీయ భాషల్లో 28,000 వేల పాటలు పాడాడు.రఫీ కొన్ని తెలుగు సినిమాలలొ కూడా పాడాడు. ఎక్కువగా ఎన్.టి.ఆర్ సినిమాలే అని చెప్పవచ్చు. . ఎన్.టి.రామారావు సొంత సినిమాల్లో, అందునా రామారావు కుటుంబ సభ్యలతో (ఎన్.టి.ఆర్, బాలకృష్ణ, హరికృష్ణ) రఫీ ఎక్కువ పాడాడు .(భలే తమ్ముడు, తల్లా? పెళ్ళామా?, రామ్ రహీమ్, ఆరాధన, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అక్బర్ సలీం అనార్కలి.) . భక్త రామదాసు(నాగయ్య) చిత్రంలో కబీరు (గుమ్మడి?) పాత్రకు కూడా నేపధ్యగానం చేశాడురఫీ గురించి చెప్పాలంటే ఎంతొ ఉంది కాని అతని గురించి చెప్పడానికి మాటల కంటే అతని పాటలు వింటూ మైమరచిపోవడం తప్ప ఏమీ చేయలేము.. మరోసారి ఆనాటి (ఎప్పటికీ మేటి) రఫీ పాటలను గుర్తు చేసుకుందాం.. యె దునియా యె మెహ్‌ఫిల్ మెరె కాం కి నహి అంటూ జులై 31, 1980, లొ మనకు దూరమైనా అతని పాటలతో ఎప్పుడు మన చుట్టే తిరుగుతూ ఉంటాడు తుమ్ ముఝే భులా నా పావోగే అంటూ.

మరిన్ని విశేషాలు..

15 వ్యాఖ్యలు:

Unknown

జ్యోతిగారు చాలా బావుంది!తెలుగులో చాలా రోజుల తరువాత మహమ్మద్ రఫీ గారి గురించి మంచి విషయాత్మక వ్యాసం చదివాను. సంగీతాభిమానులందరి తరపున కృతజ్ఞతలు.

Ennela

జ్యోతి గారు, టపా భాగుందండీ.
నాకు కూడా రఫీ గారి పాటలు ఇష్టం. నా మది నిన్ను పిలిచింది గానమై పాట భలే బాగుంటుంది కదూ?

Anonymous

/నాటికి, నేటికి రఫీని మించినవాడులేడు. /
ఆహాఁ ..ఎందులోనండి? నత్తి నత్తిగా 'నా మద్ది న్నిన్ను ప్పిలిచింధి గ్గానమ్మై .. " లాంటి పాటలు పాడటంలోనా? :))
కిశోర్ కుమార్ పోటీతో అవకాశాలు తగ్గబట్టే ఆయన తెలుగుపాటలు వినే అదృష్టం మనకు దక్కిందని అంటారు. :D

Anonymous

^ పై అభిప్రాయం ఏదో ఒక విమర్ష చేయాలని ఉన్నట్లుంది :(
రఫీ పాట అలా వినిపిస్తోందా మీకు -
ఏదైనా వైద్యం అవసరమున్నదేమో !!

ఊకదంపుడు

Snkr గారూ, వేసుకోండి వీరతాడు.
జ్యోతి గారు, వీరిది రామాజనేయయుద్ధంలో కూడా ఓ తెలుగు పాట ఉన్నట్టు ఉందికదండి.

Anonymous

/ఏదైనా వైద్యం అవసరమున్నదేమో !!/

వైద్యమా! చేయించుకోండి, చందా కావాలా?
రఫీ గొప్ప గాయకుడే, సందేహంలేదు. ఆ వాక్యం మరీ అతిశయోక్తిగా .. ఘంటసాల కన్నానా అనిపించి, చేయాలనిపించింది. కిశోర్-రఫీ అని గూగుల్ చేసి చూడండి.
అందులోనూ రఫీవి ఎన్నో మంచి పాటలు వుంటే, ఆ నత్తి పాటే నచ్చాలా!! యా అల్లహ్! వాహ్ ఖుదా!
\\\\\\\\\\\\
ఊక, దంచారుగా! :)) .. మహా ప్రసాదం!

జ్యోతి

ఊకదంపుడుగారు, Snkr గారు, నాకు రఫీ పాడిన తెలుగుపాటలు అస్సలు నచ్చలేదు.వాటిని ప్రస్తావించానేగాని మెచ్చుకున్నానా?? ఐనా అతనిదేం తప్పుంధి. తెలుగుపాటను హిందీలో రాసిచ్చి ఎలా పాడమంటే అలా పాడాడుగాని. ఆ సినిమా దర్శకులు,సంగీత దర్శకులకు బుద్ధిలేదా ఆ పాట ఎలా ఉంది అని?? హిందీలో రఫీ, తెలుగులో ఘంటసాలను మించినవారు లేరండి నాకైతే. మిగతా బాషల సంగతి మనకు తెలీదు. వాళ్ల తర్వాతే కిషోర్, బాలు..

మరి ఇప్పుడైతే తెలుగువాళ్లకంటే తెలుగురానివాళ్లే తెలుగు సినిమాపాటలు ఎక్కువగా పాడుతున్నారు. ఎలా భరిస్తున్నారో ఏమో??

Anonymous

" వైద్యమా! చేయించుకోండి, చందా కావాలా? "
_________________________________

కావాలి ! పంపించండి మరి !!

Anonymous

బాగా చెప్పారు.
సంగీత దర్శకులు ఎంతో కష్టపడితేనే, రఫీ గారితో ఆమాత్రం పాడించగలిగారేమో. :) అచ్చులు చివర వుంచేసి, వత్తిపలికిస్తే చాలు, తెలుగు పెద్ద కష్టం కాదని ఏ శంకర్ జైకిషనో, మహమూదో, మరెవరో ఎదో సందర్భంలో అన్నదాన్ని మరీ తు.చ. తప్పకుండా ఫాలో అయిపోయుంటారు.
అమరగాయకుణ్ణి మీరు మరవలేదు, సంతోషం. వూక గారు, మీరు స్వయంగా దంచి వూకతో చేసిన ఆరోగ్యకరమైన వూకవీరదండ ఒకటి జ్యోతిగారికి ఇచ్చుకోండి. :)

జ్యోతి

నాకు ఈ వూకదంపుడుగారు,Snkr గారి మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. పొగుడుతున్నట్టే తెగుడుతున్నారల్లే ఉంది:)

శంకర్ గారు, మీకు ఘంటసాలగారంటే అభిమానమనుకుంటా. నేను రోజు వినే ఈ రేడియో చూడండి. మీకు తెలిస్తే వాకే..

http://www.chimatamusic.com/teluguSongs/radio/radio_60.html

Anonymous

నాకు ఘంటసాల, రఫీలే కాదు, సైగల్, నుండి సోను నిగం దాకా, పిబి శ్రీనివాస్, బాలు,.. దాకా నచ్చుతారు. గాత్రమే కాదు, సాహిత్యం, సన్నివేశం, మ్యూజిక్, రాగం అన్నీ బాగా కుదిరితేనే పాట గుర్తుండిపోతుంది. కొన్ని కొన్ని రఫీ, ఘంటసాలవి కూడా నచ్చవు.:) మీ బ్లాగ్ బాగుంది.

తేడా ఏమీ లేదండి, ఇక్కడే పలుకరించిన వూకదంపుడు గారి ప్రొఫయిల్ పేరు, బ్లాగ్ కూడా నచ్చాయి, అందుకే అతనితో కొంచెం సరదాగా..
Thanks for the links.

Malakpet Rowdy

You should hear him Sing. He voice resembles Ghantasala's.

SNKR, I still have your songs with me, Can I send them to her?

pravasarajyam

మహమ్మద్ రఫీ గారిని మరొక మారు [నేటి తరానికి] పరిచయం చేసిన మీకు అభినందనలు.

Ponnada Murty

ఈ వ్యాసం చాలా బాగుంది. మహమ్మద్ రఫీ మన మధ్య లేరన్న భావాన్న నా హృదయాన్ని అప్పటికీ ఇప్పటికీ కలచివేస్తూ వుంటుంది. మహమ్మద్ రఫీ అంటే నాకు ప్రాణం. ఆయన పాట వినందే నాకు రోజు గడవదు. నా అభిమాన సంగీతకారుడు ఓ పి నయ్యర్ సంగీత దర్శకత్వంలో వారు పాడిన పాటలు ఇంచుమించు రోజూ వింటూవుంటాను. మహమ్మద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు ఆయనే సాటి.

Ponnada Murty

మహమ్మద్ రఫీ గారంటే నాకు వల్లమాలిన అభిమానం. వారి పాట వినకుండా నాకు రోజు గడవదు. ఆ అమరగాయకుని గురించి ఎంత చెప్పినా తక్కువే. 'వీర అభిమాని' అని అంటుంటారు చూసారూ. మహమ్మద్ రఫీ సంబంధించినంత వరకూ నేను అలాంటి వాడినే. ఒకటా రెండా ..కొన్ని వేల పాటలు. అన్నీ రస గుళికలే. చక్కటి వ్యాసం అందించిన జ్యోతి గారికి ధన్యవాదాలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008