అలక పానుపు
అలక ఎప్పటికైనా అందమే. శృతి మీరితేనే గొడవలైపోతాయి. కొత్తపెళ్ళికొడుకు అలక పానుపు ఎక్కితే పిల్ల నిచ్చిన మామకు గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఏం గొంతెమ్మ కోరికలు కోరతాడో అని. కాని భార్యాభర్తల మధ్య అలకలు వారిని మరింత దగ్గర చేస్తాయి. ప్రేమలో ఉన్నవారు అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరు అలుగుతారు. అలిగినవారిని బుజ్జగించడం. అలక తీర్చడం కూడా సరదానే వీరికి. వీరిని చూసి అలిగినవారు ప్రేమతో , ముద్దుగా మరింత అలక నటిస్తారు. అలాంటి ఒక అలక సీను శ్రీవారి శోభనం సినిమాలో చూస్తాము. నాయికా నాయకుల మధ్య వచ్చిన చిన్న గొడవ వల్ల (సినిమా కథ అంతగా గుర్తులేదు. చూసి చాలా రోజులైంది మరి) హీరో అలుగుతాడు. ఆ కాలంలో అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడ్డం నిషిద్ధం. అసలే పల్లెటూరు. అమాయకపు అమ్మాయి అలిగిన అబ్బాయిని ఎలా బుజ్జగించాలో తెలీదు. గడప దాటి వెళ్ళలేదు. పెద్దవాళ్ళు ఒప్పుకోరు. తప్పనిసరి ఇంట్లో పడుకున్న బామ్మను లేపి ఆరుబయట పడుకోమంటుంది. నిద్రలేపి మరే పడుకోమంటూ జోల పాడుతుంది. ఆ పాటలోనే నాయకుడిని అలకపానుపు దిగమని వేడుకుంటుంది. మనవరాలి పాట్లు బామ్మకు తెలియనివా?? అయినా ఇంతందంగా, అమాయకంగా బుజ్జగిస్తే ఏ మగాడు అలక మానకుండా ఉంటాడు.
అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక అలక చాలింక
శీతాకాలం సాయంకాలం
అటు అలిగి పోయేవేల చలి కొరికి చంపే వేళ
రామ రామ శబరి బామ్మ నిద్దరేపోదు
రాతిరంతా చందమామ నిదరపోనీదు
కంటి కబురా పంపలేను
ఇంటి గడప దాటలేను
ఆ దోరనవ్వు దాచకే నా నేరమింక ఎంచకే
ఆ దోరనవ్వు దాచకే ఈ నవ్వు నవ్వి చంపకే
రాసి ఉన్న నొసటి గీత చెరపనే లేరు
రాయని ఆ నుదుటి రాత రాయనూ లేరు
నచ్చిన మహరాజు నీవు
నచ్చితే మహరాణి నేను
ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా
నులక పానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా అల్లరాపమ్మా
శీతాకాలం సాయంకాలం
నను చంపకే తల్లి జోకొట్టకే గిల్లి
రమేష్ నాయుడు గారి సంగీతంలో వేటూరి గారి పాటను జానకి ముద్దుగా, గోముగా పాడింది. బామ్మగా, మనవరాలిగా కూడా ..
5 వ్యాఖ్యలు:
ఈ పాట నేనెప్పుడు వినలేదండి. చాలా బాగుంది. ధన్యవాదములు. బామ్మగారి పార్ట మరింత బాగుంది.
వేటూరి + జంధ్యాల + రమేష్ నాయుడు కలిసి ఇచ్చిన చక్కనైన పాటలు అనేకం. ఇంత మంచి పాటను గుర్తు చేసి నా మనసుకు ఉల్లాసం కలిగించిన మీకు నెనర్లు :)
మంచి పాట. జానకమ్మ అలా అలా అలల మీద తేల్చి నిద్ర పుచ్చుతోంది ఇంకో సారి. అప్పట్లో నరేష్ ను చూస్తే డోకు వచ్చినట్లుండేది కాని పాపం ఇప్పటి హీరోలను చూసేక ఈ పాట చూస్తుంటే పాపం నరేష్ కూడా మరి ఘోరమేమి కాదు అనిపిస్తోంది.. ఆ పిల్ల పేరు అనితా రెడ్డి కదా. బాబాయ్ అబ్బాయ్ లో కూడా హీరోయిన్ అనుకుంటా. జంధ్యాల గారికి పూర్ణిమ, ఈ అమ్మాయి ఇలా పొట్టి పిల్లలంటే హీరోయిన్ లు గా బాగుంటారనే వూహేమో..
మంచి పాట గుర్తుచేశారు
you've given information about a good song. I've come to know about it only through your blog.
Regards.
Post a Comment