Wednesday, 24 February 2010

మౌనం




మనిషి పుట్టినప్పటినుండి కన్నుమూసేవరకు తన చుట్టూ సందడి కోరుకుంటాడు. నిశ్శబ్ధంగా ఉంటే భరించలేదు. తన మాట వినడానికి, తనతో మాట్లాడటానికి ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటాడు. తల్లి గర్భం నుండి బాహ్య ప్రపంచంలోకి వస్తూనే తన శక్తినంతా కూడగట్టుకుని కేరుమనే ఏడుపుతో జీవితాన్ని మొదలుపెట్టి చివరకు తాను శాశ్వతంగా మూగపోయి అందరిని ఏడిపిస్తాడు. సంతోషమైనా, బాధైనా ఏటువంటి విషయమైనా అందరితో పంచుకోవాలనే ఆరాటం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మరి ఈ మౌనం ఎందుకు?



మాటకు భాష , యాస ఉంది. కాని మౌనానికి ??అసలు మౌనంగా ఉండవలసిన అవసరమేంటి? దానివలన సమస్యలు పరిష్కారమవుతాయా? ఎక్కువవుతాయా? మాటాడకుండా ఉంటే ఆ వ్యక్తి అంతరంగం ఎలా తెలుస్తుంది? ఇలా ఎంతో మంది భావిస్తారు. కాని మౌనానికి కూడా భాష ఉంటుంది. భావన ఉంటుంది. అది అందరికి అర్ధం కాదు. అర్ధం చేసుకోలేరు. ఒక్కోసారి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మౌనానికి మించిన ఆయుధం లేదు. అందుకేనేమో " Silence is the great art of conversation" అన్నారు మహానుభావులు.



ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో సమస్యను ఎదుర్కొనక తప్పదు. కొన్ని సమస్యలు ఇతరులకు చెప్పినా అర్ధం కాదు. అవి ఆ వ్యక్తిని బాధపెడతాయి. ఆ బాధ అతనిలో ఒక అలజడిని సృష్టిస్తుంది. అల్లకల్లోలంగా ఉన్న మనసు ఆలోచనాశక్తిని కోల్పోతుంది. కోపం, బాధ, అవమానం, ఆక్రోశం ఇలా విభిన్న భావాలు అతడిని చుట్టుముడతాయి. ఈ ఆందోళన అతనిని కృంగదీస్తుంది. తనని తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. అటువంటి సమయంలో మౌనమే శరణ్యం అనక తప్పదు. ఒక్కసారిగా తన మనస్సుకు, ఆలోచనకు అడ్డుకట్ట వేసి మౌనంగా ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మౌనం మనని శాంతపరుస్తుంది. మనని మనం వెనుతిరిగి విశ్లేషించుకునేలా చేస్తుంది. సమస్యకు గల కారణాలు, దాని ఫలితాలను కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మనసుకు కలిగిన గాయాలన్నీ మౌనంలో రోదిస్తాయి. మెల్లిగా మాయమవుతాయి. ఈ ఏకాంత భావన ఒక్కోసారి మనస్సులో ఆనంద తరంగాలు రేపవచ్చు. మరికొన్నిసార్లు మరింత బాధలోకి ప్రయాణించవచ్చు.




మౌనం మన బాధను, కోపాన్ని, నిరసనను,ఆవేదనను చల్లపరుస్తుంది లేదా మరింత ప్రజ్వలింప చేస్తుంది. అందుకే ఎక్కువ కాలం మౌనం కూడా మంచిది కాదు. అది మనిషిని మరింత కృంగదీస్తుంది. బాధలో ఉన్నప్పుడు మౌనం చల్లని మంచులా ఆవరించి మనసును మెల్లి మెల్లిగా జోకొడుతుంది. ప్రశాంతంగా తిరిగి దైనందినీ జీవితంలో పయనించేలా తయారు చేస్తుంది. సునామీలా ఎగసిపడే భావాలు, ఆలోచనలు, బాధలను మౌనంతో అణచిపెట్టడం కష్టమే సుమా.. కాని అసాధ్యం మాత్రం కాదు.

5 వ్యాఖ్యలు:

Hima bindu

సాగరసంగమం లో "మౌనమేలనోయి " చెప్పలేనంత ఇష్టం .తరుచు వినే పాట. చాల సమస్యలకి పరిష్కారం 'మౌనం'

Hima bindu

గుప్పెడు మనసు తో 'మౌనమే నీ బాష ఓ మూగ మనసా ' ఫ్యాన్ ని అయిపోయాను .

కొత్త పాళీ

మౌనాన్ని ఒక కమ్యూనికేషన్ టూల్ గా ఉపయోగించడం ఒక కళ.

మాలా కుమార్

అరిచి , గోడవపడే , కోపం కన్నా , మౌనం గా వుండి చూపించే కోపం బ్రహ్మాస్త్రంలా లా పని చేస్తుంది . " ఊరకున్నంత ఉత్తమం ఇంకోటి లేదు " అని సామెత .

జ్యోతి

చిన్నిగారు,

మౌనం మనలోని ఉద్రేకాన్ని, కోపాన్ని చాలావరకు తగ్గిస్తుంది.

మాలగారారు,

కోపాన్ని తెలియచెప్పడం కోసమైనా, మనలోని కోపాన్ని తగ్గించుకోవడానికైనా మౌనం సమర్ధవంతంగా పనిచేస్తుంది..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008