Sunday, February 21, 2010

బ్లాగు - పత్రిక
బ్లాగు అంటే ఈరోజు చాలా మందికి తెలుసు. ప్రముఖులెందరో బ్లాగులు రాస్తున్నారు. తెలుగు బ్లాగులు కూడ విస్తృత ప్రచారం పొందాయి. ఇంతకాలం అంతర్జాలం అంటే ఇంగ్లీషు మాత్రమే చదవడం, రాయడానికి మాత్రమే పనికి వస్తుంది అనే అభిప్రాయంతో ఉండేవారు. కాని ఎంతోమంది ఔత్సాహికుల అవిశ్రాంత కృషి ఫలితంగా నేడు తెలుగు కూడా ఇంగ్లీషంత ఈజీగా టైపొచ్చు (రాసుకోవచ్చు). దీనికి ఎటువంటి ఖర్చూ ఉండదు. అదేకాక అంతర్జాల వినియోగం కూడా గణనీయంగా పెరగడంతో జాల ధరలు, కంప్యూటర్ల ధరలు కూడా అదే వేగంతో తగ్గుతూ వస్తున్నాయి. ఇంతకు ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, పెద్ద ఉద్యోగాలు చేసేవారే కంప్యూటర్ వాడేవారు. వారికి తప్పనిసరిగా అవసరముండేది. కాని నేడు కాలేజీ చదువులనుండే కాక స్కూలు పిల్లలకు కూడా కంప్యూటర్ పాఠాలు, పరీక్షలు మొదలయ్యాయి. దీనివలన దాదాపు ప్రతీ ఇంట కాకున్నా చాలా మందికి నేడు అంతర్జాలం తప్పనిసరిగా అవసరమై పోయింది.

అంతర్జాల వాడకం వల్ల లాభం ఉంది, నష్టం కూడా ఉంది. కాని దాన్ని సద్వినియోగపరుచుకోవడం మన చేతిలో ఉంది. మన ముందు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతవరకు మనకు అనువుగా మార్చుకుని , ఉపయోగించుకుని, ఎక్కువ లాభాలు పొందగలమో మనమే నిర్ణయించుకుని ఆ దిశలో పయనించాలి. నేడు జాలం ఒక్క చదువుకునే , ఉద్యోగం చేసుకునేవారికే కాక రిటైరైన వారికి, ఇంట్లో ఉండే వారికి కూడా ఉపయోగపడే ఎన్నో విషయాలు లభ్యమవుతున్నాయి. అది కూడా ఉచితంగానే. బస్ టికెట్లు , సినిమా టికెట్లు, టెలిఫోన్, కరెంట్ బిల్లులు కట్టడం, బ్యాంకు పనులు చేసుకోవడం దగ్గరనుండి విదేశాల్లో ఉన్నవారితో సులువుగా అనుకున్న వెంటనే ముచ్చటించుకునే వీలు ఉంది. ఈ అంతర్జాలం మూలంగా వేళ మైళ్ల దూరం కూడా మన చేతికందే దూరంలోకి వచ్చింది. కాదంటారా??

బ్లాగులు అనేది భావవ్యక్తీకరణకు ఒక వేదికవంటిది అని బ్లాగర్లందరూ ఒప్పుకుంటారుగా. కాని మనకు లభించిన ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము. బ్లాగు అంటే మనకు తోచిన విషయాలు రాసుకోవడం, ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలు, చూస్తున్న సంఘటనలు మనదైన రీతిలో స్పందించి రాసుకుంటున్నాము. ఇంతకంటే ఎక్కువగా బ్లాగును ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచించారా? ఎంతమంది తమ బ్లాగును తాము అనుకున్న రీతిలో మలుచుకున్నారు? ఎంతవరకు తాము అనుకున్న ఫలితాలు పొందారు? ఇంతకంటె ఎక్కువగా ఉపయోగపడగలదా మన బ్లాగు. మన బ్లాగులో రాసే విషయాలు మనకే ఉపయోగపడుతున్నాయా? వేరేవారికి కూడా ఉపయోగపడే సమాచారం మన బ్లాగు ద్వారా ఇవ్వగలమా ? ఇప్పుడు ఉన్న వికీ కాని, జాల పత్రికలు , తెలుగు వెబ్ సైట్లు కాక మన బ్లాగును కూడా మరింత ఉపయుక్తంగా మార్చుకోగలమా అని ఒక్కసారి ఆలోచించండి.

మన బ్లాగును ఇంకా మెరుగు పరుచుకోగలము. దాన్ని ఒక పత్రికలా వాడుకోవచ్చు. మన రాతలు పంపిస్తే పత్రికలు వేసుకుంటాయన్న నమ్మకం లేదు. కాని అదే వ్యాసాన్ని మన బ్లాగులో పెట్టుకుని చర్చిస్తే ఎలా ఉంటుంది? .. దీనివలన మన రాత శైలి, పరిశీలనాసక్తి పెరుగుతుంది. మనకు ఎదురైన సంఘటన గురించి మనలో చెలరేగే ఆలొచనలు నిస్సంకోచంగా బ్లాగులో పెట్టుకోవచ్చు. అది మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు దినపత్రికలు, న్యూస్ చానెల్స్ లాగానే తెలుగు బ్లాగులు కూడా శరవేగంగా సమాచారాన్ని అందచేస్తున్నాయి. సంచలనాత్మక సంఘటనలు జరిగినప్పుడు బ్లాగర్లు విశేష రీతిలో స్పందిస్తున్నారు. చర్చిస్తున్నారు. ఇది ఎందవరకు నిజమో మీరు చూస్తూనే ఉన్నారు.

మన బ్లాగులను వ్యక్తిగత ద్వేషాలు, అసూయలకు నిలయాలుగా మారనివ్వకుండా చూసుకోవడం మన బాధ్యత. బ్లాగులో ఏం రాయాలి? ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఏం రాయగలం? ఏది రాస్తే ఏం గొడవవుతుందో? అని చాలా మంది అనుకుంటారు. కాని తలుచుకోవాలే కాని బ్లాగుల ద్వారా కూడా ఇంకా ఎంతో సమాచారాన్ని అందించగలం. అది సాంకేతికమైనా, సాహిత్యమైనా, క్రీడలైనా, పుస్తకాలైనా, పద్యాలైనా ...... ఇప్పటికే కొన్ని బ్లాగులు ఇటువంటి అమూల్యమైన సంపదని మనకు అందిస్తున్నాయి. మీరు చూసిన సినిమాల గురించి రాయండి. అవి మీకు ఎందుకు చ్చాయి, నచ్చలేదు రాయండి. మీరు చదివిన పుస్తకాల గురించి రాయండి. వాటిని ప్రచురించడానికి నవతరంగం, పుస్తకం లాంటి వెబ్ సైట్ల అవసరం లేదు. మీ బ్లాగులోనే ప్రచురించండి. తప్పులుంటే చదువరులు ఎత్తి చూపిస్తారు. ఆ తప్పులను దిద్దుకుని , సందేహాలను తీర్చుకుని , తర్వాతి రాతల్లో మెరుగుపరుచుకోండి. బ్లాగింగును సీరియస్సుగా కూడా చేయొచ్చు. గూగులమ్మ ప్రకటనలు బ్లాగుల్లో కూడా ప్రయత్నించండి. ఇప్పుడు తెలుగు బ్లాగులు ఒక విశేషమైన స్థానాన్ని , గుర్తింపును సంపాదించుకున్నాయి. రాసేవారు, చదివేవారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నారు కాబట్టి ముందు ముందు బ్లాగుల ద్వారా ఆదాయం కూడా రావొచ్చు.

బ్లాగును కూడా ఒక పత్రికలా నిర్వహించవచ్చు. ప్రయత్నించి చూడండి. అది మీరు ఇచ్చే సమాచారం, మీ రాతల వల్ల తప్పకుండా సాధ్యం అవుతుంది.

3 వ్యాఖ్యలు:

తారక

nenu ade anukuntunnanu, mellaga modaledatanu..

prastutam soumya garu ichina shock nunchi inka terukoledu.

Unknown

చాలా ఉపయొగకరమైన పోస్టు. naa wordpress account gireesam.wordpress.com

Unknown

ur posts are good.
http://sriluarts.blogspot.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008