అష్టవిధ నాయికల జడపద్యాలు:
బ్నింగారు జడ మీద పద్యాలు రాయమని అలా అన్నారో లేదో సునామీలా పద్యాలు అందునా కందాలు వెల్లువెత్తాయి. అన్నీ జడ మీదేనండోయ్.. పుస్తకానికి కావలసినవి తలా ఐదు పద్యాలైనా ఆ తర్వాత కూడా అద్భుతమైన పద్యాలు రాసారు ఎందరో కవిమిత్రులు. ఇంకా రాస్తూనే ఉన్నారు. పూలదండలోని పూల వాసన దారానికి తగలదా అన్నట్టు నాదో చిన్న ప్రయత్నం. కాని ఇంతోటి దానికి నన్ను శతకకర్తను చేసి సన్మానించారు.. ఏంటో!!!
అష్టవిధ నాయికల జడపద్యాలు:
భరత ముని రచించిన నాట్య శాస్త్రంలో అష్టవిధ నాయికలుగా ఎనిమిది రకాల నాయికలను తెలిపారు. ఈ ఎనిమిది రకాల నాయికలు ప్రేమ, వలపు మొదలైన ఎనిమిది వివిధములైన మానసిక అవస్థలను తెలియజేస్తారు. వీనిని భారతీయ చిత్రకళలోను, సాహిత్యం, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్యాలలో ప్రామాణికంగా పేర్కొన్నారు. వాటిపై పద్యాలు రాస్తే బాగుంటుందని భావిస్తూ.. జడలకు అన్వయిస్తూ...
1. అభిసారిక
కం. జడి వానకు వడగళ్ళకు
జడియక బ్రేమికుని గల్వ జర జర సాగన్,
జడలున్ గాలిలొ యాడగ
జడలే ఫణులుగ గనపడె జనులకు యాహా!
2.ఖండిత
కం. జడలున్న తనను గాదని
గడపెను ప్రియుడామె యింట గత రాత్రంతా!
మెడబట్టుకు నెట్ట వలె, మొ
గుడిని మరగిన జడలేని కులుకుల గత్తెన్!
3. విప్రలబ్ద
కం. కన్నుల్ గాయలు గాచెను
తన్నున్ మరచెన? మగనికి తగిలిర గాంతల్?
వెన్నున్ వంగెను జడలచె
తన్నులె నీకిక మిగిలెను తప్పవు మామా!
4.కలహాంతరిత
కం. పోపో! రాకుము నాకడ
పాపల మరిగెను పతియని పరిపరి యేడ్చెన్!
ఆ పతి జడలను నిమరగ
వాపోయెన్ దా తదుపరి వలపుల తఫనన్!
5. వాసకసజ్జిక:
కం. పడకన జల్లెను పూలను
జడకున్ యల్లెను విరిసిన జాజుల తీవన్!
గడియకు వాకిలి జూచుచు
యెడదన్ మిక్కిలి వగచుచు యేడీ రాడే!
6. ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక:
కం. దూరపు దేశము లేగగ
కారాగారమె దలచుచు కడు దు:ఖమునన్
బారెడు జడలకు పూలను
గోరక జెలులతొ గడపెను ఘోరము గాదే!
7. విరహోత్కంఠిత:
కం. విరహపు వేదన తాపము
పరులకు జెప్పరు పడతులు పడియెడు బాధన్!
విరులను విప్పుచు జడలను
విరబోసికొనుచు విసుగున విలపించునహో!
8. స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక :
కం. పారాణి కాళ్ళ కద్దును
ఔరా! పతికేమిసిగ్గు యసలే లేదే!
లేరీ పురమున జడలకు
బారెడు పూలను దురిమెడు భర్తలు నిస్సీ!