Saturday, 7 November 2015

మాలిక పత్రిక నవంబర్ 2015 సంచిక విడుదల

Jyothivalaboju
Chief Editor and Content Head


కొత్త కొత్త కథలు, సీరయల్స్, కవితలు, వ్యాసాలతో మీముందుకు వస్తోంది నవంబర్ మాసపు మాలిక పత్రిక. మీ సలహాలు, సూచనలు మాకు సర్వదా ఆమోదమే..
మీ రచనలను పంఫవలసిన చిరునామా: editor@maalika.org

ఈ మాసపు విశేష రచనలు:

01. వెన్నెల పురుషుడు
02. అవును వాళ్లు చేసిన తప్పేంటి?
03. కాలమే దీనిని పరిష్కరించాలి
04. చిగురాకు రెపరెపలు 10
05. మాయానగరం 20
06. జీవితం ఇలా కూడా ఉంటుందా? ! 1
07. Dead People Dont Speak 10
08. Rj వంశీతో అనగా అనగా
09. సహజీవనం
10. ఆరాధన
11. సరస్వతి నామావళి
12. రజాశ్లేషం
13. మన వాగ్గేయకారులు 6
14. మధ్యమావతి రాగం
15. నిరంతరం సమరం
16. దింపుడు గల్లం
17. నువ్వూ - నేనూ
18. ఒకోసారి యింతే
19. దీపావళి కార్టూన్స్

Thursday, 5 November 2015

మారాం చేస్తు‌న్నా‌రా? నవ తెలంగాణ




Thu 05 Nov 04 2015

'బాబూ! ఈ ఒక్క ముద్ద తినరా. లేకుంటే నీరసమొస్తుంది'' 'బుజ్జి! నీకు సాయంత్రం బర్గర్‌ కొనిస్తా, ఇప్పుడు కొంచం పెరుగన్నం తినమ్మా. లేకుంటే క్లాసులో ఎలా చదువుకుంటావ్‌? ఎలా ఆడుకుంటావు' ఇవే కాదు ఇలాంటి మాటలు దాదాపు పిల్లలున్న ప్రతీ ఇంట నిత్యం వినపడుతూనే ఉంటాయి. ఈరోజుల్లో పిల్లలను కడుపునిండా తినేలా చేయాలంటే తల్లితండ్రులు పెద్ద యుద్ధం చేయాల్సిందే. పొద్దున్నే పాలు, వేడి వేడి అన్నంలో ఇంత పప్పు, నెయ్యి వేసుకుని తినమంటే పిల్లలు అదేదో భయంకరమైన పదార్థంలా తప్పించుకుని పారిపోతారు. మధ్యాహ్నం భోజనానికి ఇచ్చిన బాక్స్‌ కూడా సగం అలాగే తిరిగి వస్తుంది. బండెడు పుస్తకాలు, చదువులకు తగ్గట్టు శక్తి పుంజుకోవాలంటే సరైన పోషకాహారం తినాలి. అమ్మ ప్రేమగా ఎంత చేసి పెట్టినా తినరు. వాళ్లు అడిగినవే కావాలంటారు. ఇవ్వకుంటే ఆకలితో అలాగే ఉంటారు కాని పెట్టింది మాత్రం ససేమిరా వద్దంటారు... ఇది చూసి ఏ తల్లి కలవరపడదు.
ఫాస్ట్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ అనగానే పిల్లలకు ప్రాణం లేచొస్తుంది. బర్గర్‌ , పిజ్జా, చిప్స్‌, పప్స్‌ అనగానే ఎక్కడలేని హుషారుతో పరుగెత్తుకు వస్తారు. దానికి తోడు కోక్‌ లాంటి డ్రింకులు. ఊరికే అవే కావాలని అడుగుతుంటే పోనీలే పాపం అలా ఐనా పిల్లల ఆకలి తీరుతుందని తినిపిస్తారు. కాని అదే అలవాటుగా మారితే మాత్రం వారి ఆరోగ్యం పాడైపోతుంది. ఫాస్ట్‌ఫుడ్‌ తరచూ తినడం మంచిది కాదు. అందులో వాడే చీజ్‌, వెన్న వంటివి అధిక క్యాలరీలు కలిగి ఉంటాయి. కొవ్వు కూడా ఎక్కువే. ఇంకా వాటిల్లో వాడే మైదా వంటివి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.


మాయ చేయాలి

మరి ఏం చేయాలి? పిల్లలతో పోషకాంశాలతో కూడిన ఆహారం తినేలా చేయడం అంత సులువు కాదు. ఈ విషయంలో పిల్లలకంటే ముందు తల్లితండ్రులే మారి పిల్లలను మాయ చేయాలి. కాస్త తెలివిగా వ్యవహరిస్తూ వారి ఆహారపు అలవాట్ల అదుపు జాగ్రత్తపడాలి. వాళ్లు తినాలనుకునే ఫాస్ట్‌ ఫుడ్‌ లోనే పోషకాలు ఉన్న తిండి పెట్టాలి. దానికోసం కొత్త కొత్త ప్రయోగాలు చేయక తప్పదు మరి. పిల్లలకు ఏ వయసులో ఎటువంటి ఆహరం ఇస్తే మంచిది అని ముందు తెలుసుకోవాలి.


అసాధ్యం మాత్రం కాదు

ఆహారాన్ని పిల్లల కంటికి ఇంపుగా, లేటెస్టుగా ఉండేలా తయారు చేసి ఇస్తే సరి. అది కొంచెం కష్టమే కాని అసాధ్యం మాత్రం కాదు. ఎలా చేసినా మనకు కావలసింది పిల్లలు వయసుకు తగ్గట్టుగా సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం. ఉదాహరణకు పాలకూర, బీట్‌రూట్‌, క్యారట్‌ రసాలతో రంగు రంగుల పూరీలు, చపాతీలు, పానీపూరీలు చేసివ్వొచ్చు. పానీపూరీలలో పళ్లముక్కలు పెరుగు లేదా కాస్త క్రీమ్‌ కలిపి పెట్టి తినమనండి.. చపాతీలను కత్తెరతో సన్న పట్టీల్లా కత్తిరించి, కాసిన్ని కూరగాయలు కలిపి మామూలు నూడుల్స్‌లా చేసివ్వండి.. సంతోషంగా తింటారు. పుదీనా రసం వేసి కారప్పూస చేసిస్తే ఇంకా బావుంటుంది.. కళ్లకు ఆహ్లాదకరంగా, అందంగా ఉంటేనే పిల్లలు ఉత్సాహంగా తినడానికి ఆసక్తి చూపిస్తారు.


పాలతో స్పేషల్స్‌

చాలామంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. కాని ఎదిగే పిల్లలకు పాలు సంపూర్ణ ఆహారం. వారి ఎముకలు దృఢంగా ఉండేందుకు ఎంతో అవసరం. దాని కోసం బూస్ట్‌, బోర్న్‌విటా లాంటి ఎన్ని కొన్నా కూడా పాలగ్లాసు కనపడగానే పారిపోతారు. అలా వారి వెనకాల పరిగెత్తే బదులు ఆ పాలను వేరేవిధంగా ఎలా ఇవ్వొచ్చో ఆలొచించాలి. ఆ పాలల్లో ఒక్కోసారి ఒక్కో పండు ( మామిడి, స్ట్రాబెర్రీ, లీచీ, ) వేసి గ్రైండ్‌ చేసి మిల్క్‌ షేక్‌ లా ఇవ్వొచ్చు. పాయసం, పరమాన్నం చేసి వేడిగా కాని, చల్లగా కాని ఇవ్వొచ్చు. పాలు చిక్కగా మరిగించి రంగురంగుల్లో నాలుగైదు రకాల పళ్లముక్కలు, పంచదార, కాసిన్ని డ్రైఫ్రూట్స్‌ (బాదాం, జీడిపప్పు, కిస్మిస్‌ ) కలిపి చల్లగా ఇచ్చి చూడండి. రోజూ కావాలంటారు. పాలతో కస్టర్డ్‌ చేసి పళ్ల ముక్కలు కలిపి చల్లగా ఇస్తే నిమిషాల్లో ఖాళీ చేసి మళ్లీ కావాలని అడుగుతారు.పెరుగును తోడుపెట్టి చక్కెర కలిపి ఇవ్వండి. ఏదైనా ఫ్లేవర్‌ వేసి నురగ వచ్చేలా చిలికి బటర్‌ మిల్క్‌ అని అందమైన గ్లాసులో పోసి స్ట్రా పెట్టి ఇవ్వండి. కొంతమంది పిల్లలకు పాలు అస్సలు పడవు. బలవంతంగా ఇస్తే వాంతి చేసుకుంటారు. వాళ్ల శరీరంలో అవసరమైనంత లాక్టోజ్‌ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అప్పుడు వాళ్లకు పాలకు ప్రత్యామ్నాయంగా సోయా ఉత్పత్తులు పెట్టవచ్చు. పాలు తక్కువగా ఇచ్చి పెరుగు, సోయా ఉత్పత్తులు ఎక్కువగా ఇవ్వాలి.


ఆకుకూరలు, కూరగాయలు

పనీర్‌తో కూరలు, వేపుళ్లు, కబాబ్‌, కట్లెట్‌ లాంటి స్నాక్స్‌ చేసి పెట్టొచ్చు. ఇక చాలామంది పిల్లలకు కూరగాయలు, ఆకుకూరలు అస్సలు తినరు. పళ్లు తినమంటే వద్దంటారు. ఇవన్నీ తినకుంటే రోగనిరోధక శక్తి తగ్గి పిల్లలు నీరసపడిపోతారని తల్లితండ్రుల బెంగ. అలాకాకుండా అదే కూరగాయలను పచ్చళ్లుగా చేసి పెట్టొచ్చు. కూరగాయలను కొద్దిగా ఉడికించి కబాబ్‌, కట్లెట్‌ లేదా పకోడీల్లా చేసి సాస్‌తో ఇస్తే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. పాలకూరలో కోడిగుడ్డు కలిపి కూర చేస్తే ఇష్టంతో తింటారు. అప్పుడప్పుడు జ్యూస్‌ చేసి, చాట్‌ మసాలా కలిపి ఇవ్వొచ్చు.


ఇంట్లోనే ఫాస్ట్‌ ఫుడ్స్‌

ఇవన్నీ బానే ఉన్నాయి మరి ఫాస్ట్‌ ఫుడ్‌ సంగతేంటి? మనం ఎన్ని తిప్పలు పడ్డా బర్గర్‌, పిజ్జా, నూడుల్స్‌ అంటారు. వాటిని కూడా కొద్దిపాటి మార్పులతో ఇంట్లోనే చేసి పెట్టాలి. మైక్రోవేవ్‌ ఓవెన్‌ల వాడకం పెరిగిన ఈ రోజుల్లో ఇవి చేసుకోవడం అంత కష్టమేమి కాదు. బయట వాడే చీజ్‌ బదులు తక్కువ కొవ్వుశాతం ఉన్న వెన్నలేదా చీజ్‌ ఉపయోగించాలి. కూరగాయలతో కట్లెట్‌ చేసి బర్గర్లో పెట్టి ఇవ్వాలి. నూడుల్స్‌ కూడా కూరగాయలు, గుడ్లు వేసి వెరైటీగా తయారు చేయొచ్చు. ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ చేసి సాంబార్‌ పోసి సాంబార్‌ నూడుల్స్‌ అని ఇవ్వండి. పిల్లలకు అదో వెరైటీ రుచి. వీలైతే గోధుమపిండితో చేసిన నూడుల్స్‌ కొనిగాని, చేసి కాని ఉపయోగించండి.
మైదాతో చేసిన వస్తువులు ఎక్కువగా తింటే మంచిది కాదు. అలాగే చపాతీలు చేసి మధ్యలో వేయించిన కూరగాయలు, గుడ్డు, చికెన్‌ వంటివి స్టఫింగ్‌ చేసి మడిచి పేపర్‌ నాప్కిన్లో అందంగా చుట్టి 'ఫ్రాంకీ' అనండి. పిల్లలు పరుగెత్తుకుని వచ్చి లాక్కుంటారు. పాస్తా, మాక్రోనీలతో కూరలు , పకోడీలు చేయండి. ఇలా అన్ని చిరుతిళ్లను పోషకాహారం చేస్తే సరి పిల్లలూ, తల్లితండ్రులూ అందరూ ఫుల్‌ హ్యాపీస్‌. పూరీలు, దోశలు, ఇడ్లీలు అంటే బోర్‌ అంటారు పిల్లలు. వాటిల్లో రంగు రంగుల కూరగాయల రసాలు, కాస్త మసాలాలు కలిపి చేయండి.. వీటికి వెరైటీ పేర్లు పెట్టి పిల్లలకు ఇవ్వండి. వద్దంటారేమో చూడండి..


పిల్లలకు తినిపించడంలో చూపించే ఓపికని అదే ఆహారాన్ని పిల్లలకు నచ్చేట్టుగా చేయడానికి ఉపయోగిస్తే పిల్లలు తినట్లేదు అనే మాట చాలావరకు తగ్గిపోతుంది. మరింకెందుకు ఆలస్యం ప్రయత్నించండి..


జ్యోతి వలబోజు

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008