శ్రీనాధుని చాటువులు -భోజన ప్రియత్వం
బానెడు జొన్న వంటకము,పంటెడు బాలును, మేటి చారు, యెం
తేనియు బుల్లగూర,కడు దేరిన మజ్జిగ పెద్ద చెంబెడున్
బూనిచి కమ్మ చౌదరులు బొఱ్ఱలు పెంచుక కొండవీటిలొ
గానరు కుంభకర్ణ,గజకర్ణ,హిడింబ, బకాసురాదులన్!!
జొన్నకలి, జొన్నయంబలి
జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పల్నాటిసీమ ప్రజలందఱకున్
పల్నాటి సీమలో పర్యటించేటప్పుడు శ్రీనాధుడు అక్కడి ప్రజల ఆహారపుటలవాట్ల గురించి వివరించాడీ చాటువులో. సర్వం జొన్నమయం పల్నాటిసీమలో.
జొన్నకలి : జొన్నలు రోట్ళో పోసి కొంచెం నీళ్ళు పోసి దంచిన తర్వాత, వాటిని కడిగిన నీటినీకడుగు " అంటారు. దీన్ని పశువులకు పోస్తారు. ముత్యాలవంటి కడిగిన గింజలను అత్తెసరు పెట్టి వండుతారు. ఆ జొన్నన్నం ఉడికేటప్పుడు వచ్చే అన్నంతో కూడిన గంజిని వేరే పాత్రలోకి వంచి చల్లారిన తర్వాత మరికొంచెం అన్నం, తగుమాత్రం నీరు పోసి, ఉప్పు కలిపి రాత్రంతా ఉట్టి మీదనో , ఎత్తైన చోట ఉంచుతారు. మరునాడు అది పులిసి పుల్లగా అవుతుంది. దీన్నే "జొన్నకలి" అంటారు.
జొన్న అంబలి : జొన్నలు విసిరిన తర్వాత సంగటి చేస్తారు. దానిని నీళ్ళలో కలిపి ఉప్పు వేసి తాగడానికి అనువుగా గరిటజారుగా చేసేదే "అంబలి". దీనినుంచే పల్లెసీమల్లో కాలాన్ని కొలిచే నానుడి వచ్చింది. ఉదయం 8.30 నుండి 9.30 వరకు 'అంబళ్ళ పొద్దు ' అని అంటుంటారు పల్లె ప్రజలు.
జొన్నన్నము : దంచి ,పొట్టు పోయేలా కడిగిన తర్వాత వచ్చే ముత్యాల వంటీ జొన్నలను ఉప్పుతో కలిపి వండగా వచ్చేదే "జొన్నన్నము".
జొన్న పిసరు : జొన్నలు సంగటిగా చేసేటప్పుడు ఒకోసారి ముద్ద కంటే గట్టిగానూ, అంబలి కంటే కొంచం ఎక్కువ గట్టిగానూ అవుతుంది.అదే "జొన్న పిసరు". దాన్ని అలాగే తినడానికి వీలు కాదు. ఈ పిసరుకే కొంచెం నీళ్ళు, ఉప్పు కలిపి రాత్రంతా ఊరబెట్టినట్లయితే 'కలి 'గా మారుతుంది.
పల్నాటి సీమలో నీటివనరులు తక్కువగా ఉన్నాయి. అందుకే వర్షాధార పంట అయిన జొన్నలే పల్నాటి ప్రజలకు ముఖ్య ఆహారము అని శ్రీనాధుడు ఈ పద్యంలో వివరించాడు.
పల్నాటిసీమలోని జొన్నన్నములో ఏదో విషేషముందేమో. అందుకే శ్రీనాధుడు ఆ గరళకంఠుడికి ఇలా సవాలు చేసాడంట.
గరళము మ్రింగితి ననుచున్
బురహర! గర్వింపబోకు, పో పో పో, నీ
బిరుదింక గానవచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు దినుమీ!
ఇక కంజీవరం వెళ్ళినప్పుడు అక్కడి తమిళుల విందులో శ్రీనాధుడి తిప్పలు అంతా ఇంతా కావు.
తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు జారు
చెవులలొ బొగవెళ్ళి చిమ్మిరేగ
బలు తెరంగుల తోడ బచ్చళ్ళు చవి గొన్న
బ్రహ్మ రంధ్రము దాక బారు నావ
యవిసాకు వేచిన నార్నెల్లు పసి లేదు
పరిమళ మెంచిన బండ్లు సొగచు
వేపాకు నెండించి వేసిన పొళ్ళను
గంచాన గాంచిన గ్రక్కువచ్చు
నఱవ వారింటి విందెల్ల నాగడంబు
చెప్పవత్తురు తమ తీరు సిగ్గు లేక
చూడవలసిన ద్రావిళ్ళ కీడు మేళ్ళు...
అసలే భోజన ప్రియుడైన శ్రీనాధుడు అలవాటు లేని తమిళుల భోజనముతో ఎలాటి అవస్థలు పడ్డాడో కదా. ఆంధ్రుల భోజనములో పప్పు ప్రధానము. తమిళులకు చారు ముఖ్యం. అలవాటు లేని చారు అదీగాక మిరియపు చారు మొదటనే వడ్డించేసరికి కవి సార్వభౌముడికి చిర్రెత్తింది.
బుడతకీచువారు(పోర్చుగీసువారు) మన దేశానికి రాకముందు మనకు మిరపకాయలు లేవు. కారానికి మిరియాలే వాడేవారు. మనకు పోర్చుగీసు వారివల్లనే మిరపకాయలు లభించాయి. మిరియాలకు బదులుగా కారానికి వాడేవి కాబట్టి వీటిని(మిర్యపుకాయలు) మిరపకాయలు అని పిలుస్తారు.
పద్య సేకరణ
డా.కోడూరు ప్రభాకరరెడ్డిగారి శ్రీనాధుని చాటువులు
6 వ్యాఖ్యలు:
బాగుందండి టపా.. .
శ్రీనాథుడంటే చాలా కష్టంగావుంటాయనే అనుకునేవాడిని...
కానీ ఇలాంటి సుళువైనవీ వుంటాయని ఇప్పుడే తెలిసింది.
కృతజ్ఞతలు..
నాగులేటి నీళ్లు నాప రాళ్ళు ..
ఆ చాటువు వుందా మీదగ్గర..
అలానే గంగని ఇటు పంపమని అడిగేది...
మీ జొన్న అన్నంతో కడుపు నిండింది జ్యోతి గారు
ధన్యవాదాలు...
బాగుందండి టపా.. .
కుల్లాయుంచితి వదిలి పెట్టారే?
thanq very much jyothy garu
i am from palnadu region but i dont know such a great poet hailed from our place
may i know the book which contain all these poems
pls
hatts of to u r work on posting our telugu poems that we forgotten
nijamgaa meeku padabhi vandanam
నరేష్ గారు, మీరు పుస్తకాల షాపుకెళ్లి శ్రీనాధుని చాటువులు అడగండి ఇస్తారు. నా దగ్గర ఉన్నది డా.కోడూరి ప్రభాకరరెడ్డి రాసిన పుస్తకం..
మీకు పద్యాలంటే చాలా ఇష్టంలా ఉంది. ఆముక్తమాల్యద బ్లాగు కూడా చూడండి మరి..
http://amuktamalya.blogspot.in
medum,the information hat u have given about SRINIDHA KAVI''is excellant thanks for giving such information. please give me more and more such information in telugu
Post a Comment