మీ శ్రేయోభిలాషి
నటీనటులు:
డా.రాజేంద్ర ప్రసాద్,నరేష్,బ్రహ్మానందం,కృష్ణ భగవాన్, రఘు బాబు,ఆలీ మొదలైనవారు.
దర్శకుడు :
ఈశ్వర్ రెడ్డి.
మనకోసం కాకుండా ఇతరులకోసం జీవించేదే నిజమైన జీవితం అనే మంచి సందేశాన్ని ఇచ్చే సినిమా "మీ శ్రేయోభిలాషి" చిత్ర కథానాయకుడైన రాజాజి (రాజేంద్రప్రసాద్) అలాంటి వ్యక్తి. ఎప్పుడూ తన చుట్టు ఉన్నవారి కష్టసుఖాలు తెలుసుకుని వాళ్ళకు సహాయపడేవాడు. ఇది ఒక సందేశాత్మక సినిమా ఐనా అందరూ తప్పక చూడవలసిన సినిమా.ఈ విషయంలో చిత్ర నిర్మాత, దర్శకులు కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు.
రాజాజి ఒక ప్రొఫెసర్. పెళ్ళైన రెండేళ్ళకే భార్యను కోల్పోతాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా తన కూతురిని అల్లారు ముద్దుగా పెంచుతాడు. కాని దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకుంటుంది.దానితో అతను మిగిలిన తన జీవితాన్ని ఇతరుల కోసమే అంకితం చేస్తాడు. జీవితాన్ని ఎలా జీవించాలి, ఏది సరైనది ఏది కాదు అని అందరికీ చెప్తుంటాడు. అలా ఓ పదిమంది వ్యక్తులను కలుసుకుంటాడు. వాళ్ళందరూ తమ జీవితంలోని రకరకాల సమస్యలతో (అప్పులు,గుండె జబ్బులు,అవమానాలు)విసిగిపోయి చావాలని నిర్ణయించుకున్నవాళ్ళే. వాళ్ళను మాటలతో మార్చాలని శతవిధాలా ప్రయత్నించి నిరాశ చెందిన రాజాజి వాళ్ళకొక గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకుని వాళ్ళ చావుకు వాళ్ళే పథకం వేసుకునేలా చేస్తాడు. అందరూ ఒక బస్సులో వెళ్ళి కొండపైనుండి పడిపోయేలా చేసి యాక్సిడెంట్ లా చేయాలని అందరూ నిర్ణయించుకుంటారు. ఆ బస్సు ప్రయాణంలో జరిగే సంఘటనలే ఈ చిత్ర కథలోని ముఖ్య సన్నివేశాలు. ఈ చిత్రంలో సస్పెన్స్ కూడా బాగానే పండించారు. రాజేంద్ర ప్రసాద్ కూడ చాలా బాగా నటించాడు.మిగతా నటీనటులు కూడ తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారు.కుటుంబ కథాచిత్రమని చెప్పవచ్చు.కుర్రకారుకు నచ్చకపోవచ్చేమో మరి.
0 వ్యాఖ్యలు:
Post a Comment