Friday, 28 December 2007

నిరంతర విద్యార్థిగా ఉండండి...

విజ్ఞానానికి అంతం ఉండదు. ఏ వ్యక్తీ ఏ రంగంలోనూ నేర్చుకోవడానికి ఇంకేమీ లేనంత నిష్ణాతుడైపోడు. అయినా మనందరం మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో అంతా తెలిసిందే కదా, ఇంకేముంది నేర్చుకోవడానికి అన్నంత అవివేకంతో వ్యవహరిస్తుంటాం. అలాగే మన రంగం గురించి తప్ప ఇతర రంగాల గురించి చర్చ వచ్చినప్పుడు 'మనకెందుకులే' అన్నట్లు నిరాసక్తత ప్రదర్శిస్తుంటాం. ఏదో ఒక అంశంపై నిరంతరం మెదడుకు పదును పెట్టడం వల్ల పరిణతిని సాధించగలం. కొద్దిపాటి పరిజ్ఞానంతో ఇతరుల అభిప్రాయాలను కొట్టిపారేయడం, మనకు తెలిసిందే వేదం అనుకోవడం, కనీసం వాస్తవాలను జీర్ణించుకోలేకపోవడం మన ఆలోచనా పరిధిని మనం పరిమితం చేసుకుంటున్నట్లే! నిరంతర విద్యార్థిగా ఉన్న వ్యక్తులు మాత్రమే సమాజంలో నెగ్గుకురాగలరు. కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని నామోషీగా భావించడం వల్ల భవిష్యత్‌లో ఎప్పుడైనా వాటి అవసరం వచ్చినప్పుడు తెల్లమొఖం వేయవలసి వస్తుంది. సమాజంలో విభిన్న వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీ దృష్టికి వచ్చే అనేక అంశాలపై అప్పటికప్పుడైనా ఓసారి దృష్టి సారించండి. తెలియని విషయాలు ఇతరుల్ని అడిగి తెలుసుకోవడానికి మొహమాటం పడడం మంచిది కాదు. ఎవరూ చెప్పనిదే ఎవరికీ ఏమీ తెలియదు. అడిగి తెలుసుకోవడం, అలా తెలుసుకున్న దాన్ని విశ్లేషించడం, ఓ అభిప్రాయాన్ని మనసులో కల్పించుకోవడం, మరోసారి ఎప్పుడైనా అదే విషయం వేరే వ్యక్తుల వద్ద ప్రస్తావనకు వచ్చినప్పుడు అక్కడ జరిగే చర్చతో మన అభిప్రాయాలను బేరీజు వేసుకోవడం, వాస్తవాలను నిర్ధారించుకోవడం... ఇలా నిరంతరం మైండ్‌ని మెరుగుపరుచుకుంటూ పోవాలి.

నల్లమోతు శ్రీధర్

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008