మాటే మంత్రమో...
"మాట" ఎంతో శక్తివంతమైనది. ఒకే మాట వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు అర్ధాలను
ధ్వనిస్తుంటుంది. మనం మాట్లాడే మాటని ఎదుటివారికి ఇష్టమైన అర్ధంతో ధ్వనింప
చేయలేకపోతే ఆ మాట నిస్సారమైనట్లే లెక్క. స్నేహాలు, శత్రుత్వాలు, నమ్మకాలు,
సందేహాలు, ఇష్టాలు, నిష్టూరాలు, ప్రేమలు, ఏహ్యాలు వంటి భావోధ్వేగాలన్నీ మన
మాటల ద్వారానే సృష్టింపబడుతూ ఊంటాయి. ఏ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలన్నది మన
మనసులో ముందే ప్రోగ్రామ్ చేసుకుని ఉంటాము. అయితే అలా
ప్రవర్తించేటప్పుడు మాటల్లొ హెచ్చుతగ్గులు ఒక్కోసారి విపరీత పరిణామాలకు దారి
తీస్తుంటాయి. వాక్కుపై నియంత్రణ కలిగిన వ్యక్తి ప్రపంచాన్ని జయించినట్లే అంటుంటారు.
అందుకే పరిణతి కలిగినవారెప్పుడు గంభీరంగా, గుంభనంగా ఎంతవరకు అవసరమో
అంతవరకు మాత్రమే ఆచీ తూచి మాట్లాడుతూంటారు.తాము మాట్లాడిన
మాటలు ఎలాంటి ఫలితాలు అందిస్తాయో అంచనా వేయగలుగుతారు.తాము ప్లాన్డ్ గా
మాట్లాడడమే కాకుండా ఎదుటివ్యక్తుల మాటల ఆధారంగా వారి
మనసుల్ని అవలీలగా చదివేయగలుగుతారు. మనం మాట్లాడే మాటకు మొహంలో
కన్పించే భావం జీవాన్ని పోస్తుంది. మాట సున్నితమైనా భావం కఠినంగా గోచరిస్తే
మాత్రం ఫలితం తారుమారవడం ఖాయం. మాటనీ, భావాన్నీ సమన్వయపరచుకుని
ఒకేలా ధ్వనింప చేయగలిగితే అవి ఎదుటి వ్యక్తుల మనసుల్ని హత్తుకు పోతాయి.
మాటలపై నియంత్రణ కోల్పోతే ఎన్నో అనుబంధాలను కోల్పోవలసి వస్తూంది.
అందుకే వీలైనంతవరకూ మన నోటి నుండి వెలువడే ధ్వనిపై
ఓ కన్నేసి ఉంచి నిబద్ధతతో మాట్లాడడం అన్ని విధాలా శ్రేయస్కరం !!...
నల్లమోతు శ్రీధర్.
0 వ్యాఖ్యలు:
Post a Comment