బావున్నారా?
అక్కడ గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఇంటి ముందు కార్లు, స్కూటర్లు ఆగి ఉన్నాయి. ఒక్కొక్కరు లోపలికి వస్తున్నారు. మామిడి తోరణాలు, పూల అలంకరణలు, అందమైన వాతావరణము.
"రండి .. రండి.. బావున్నారా?"
"బావున్నారా వదినగారు?"
"బావున్నారా చిన్నమ్మా?"
"నమస్తే పెద్దమ్మా!"
"హాయ్ అత్తా!"
"ఏమ్మా! బావున్నావా? ఆరోగ్యం కులాసా?"
"ఏంటొదినా . ఈ మధ్య అస్సలు కనపట్టంలేదు.మమ్మల్ని మర్చిపోయావా?"
" ఏమే కోడలా ! బాగున్నావా? మా కొడుకు, పిల్లలు వచ్చారా?"
"బాగున్నావే! ఇంత లేటా? నువ్వు కూడా చుట్టాలతో పాటు వస్తావా? కొంచం తొందరగా రావొద్దా?"
"నమస్తే భాయిసాబ్!
నమస్తె బావగారు . రండి"
****
ఒకవైపు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది.
******
"పద్మా! బాగున్నావే. ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నువ్వన్నా అప్పుడప్పుడు ఈ ముసలిదాన్ని చూడడానికి రావొద్దా?"
"బాగున్నాను పెద్దమ్మా!. ఏది ఈ పిల్లలతో అస్సలు తీరదు. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది.?"
" నీ బిడ్డకు సంబంధాలు చూస్తున్నారా? ఎంత వరకు ఇవ్వడానికి ఉన్నారేంటి?"
"ఏది పెద్దమ్మా! కొన్ని సంబంధాలు వచ్చాయి కాని అమ్మాయేమో అమెరికా సంబంధం చస్తే చేసుకోను అంటుంది. అందరిని విడిచిపెట్టి నేను వెళ్ళను అని మొండికేసింది. చూడాలి ఎలా రాసిపెట్టి ఉందో?"
********
"కొత్త పెళ్ళికూతురా. ఎలా ఉన్నావు? అత్తగారింట్లో అందరూ బాగా చూసుకుంటున్నారా? మీ అత్త ఎలాంటిది? ఆడబిడ్డలు పని చేస్తారా? మీ ఆయన ఎలాంటోడు?"
" అందరూ మంచోళ్ళే పిన్నీ. ఆయన కూడా!"
"అవునులే! కొత్తలొ అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు. మొగుణ్ణి ఇప్పటినుండే నీ కంట్రోల్‌లో పెట్టుకో"
*********
" లత ! ఎలా ఉన్నావు. ఏం చెస్తున్నావు. కొత్త చీరలేమన్నా కొన్నావా?"
"లేదక్కా! లాస్ట్ మంత్ కొన్న రెండు చీరలకే వర్క్ చేయించా? ఇంకా కొత్త చీరలంటే మా ఆయన ఊరుకుంటాడా? నీ ముత్యాల హారం బావుంది. కొన్నావా. చేయించావా? ఎంతైంది?"
" కొంటే బంగారం మంచిది ఉండదని మాకు తెలిసిన వారిదగ్గర చేయించాము. ఇరవై వేలు పైనే అయ్యింది " వచ్చే నెలలో దీనికి మ్యాచింగ్ గాజులు, కమ్మలు చేయించాలి."
*********
"వదినా! మీ కోడలి పిన్ని కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాను అంటుందంట కదా. ఏమైంది?"
" అవునొదినా! పెద్ద పెద్ద చదువులు, మాయదారి పోకడలు. అందుకే ఆడపిల్లలకు ఎక్కువ చదువులు చెప్పించొద్దు అనేది. డిగ్రీ కాగానే పెళ్ళి చేసేయాలి. పిల్లలకు చదువు చెప్పేంటంత చదువు వస్తే చాలు ఆడదానికి. ఎంత చదివినా వంట చేయక, పిల్లలలను చూసుకోక తప్పుతుందా. ఇప్పుడిలా ప్రేమలు, దోమలు అంటూ పరువు మర్యాదలు గంగ పాలు చేస్తారు. "
********
"అక్కా! మీ తోటికోడలి కూతురుకి పెల్లి కుదిరిందా. చూస్తున్నారా? మా చిన్నత్త కొడుకు ఉన్నాడు . చెప్పమంటావా?
" ఏమోనమ్మా ! మా తోటికోడలు అదో రకం. నాకున్నది ఒకే కూతురు. పెద్ద సంసారం ఉన్న ఇంటికి ఇవ్వను అంటుంది. పైగా కట్నం, బంగారం అవీ బాగానే జమ చెసి పెట్టింది. బడాయి పోతుందిలే. మీ చిన్నత్త వాళ్ళేమో మరీ నిదానస్తులు. ఎలా వేగుతారో . జాగ్రత్త. నన్ను ఇరికించొద్దు మధ్యలో"
******
" హాయ్ శ్వేత! కాలేజ్ ఎలా ఉంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా? నీ పెర్సంటేజ్ ఎలా ఉంది? ప్లేస్‌మెంట్స్ లోనే జాబ్ వచ్చేటట్టు చూసుకో. లేకుంటే మళ్ళీ తిప్పలు జాబ్ కోసం."
'హాయ్ మీనా! ఐ యాం ఫైన్. బానే చదువుతున్నా. ప్లేస్‌మెంట్స్ కోసం కూడా గట్టిగా ప్రిపేర్ అవుతున్నా. ఒకవేళ జాబ్ రాకపోతే పి.జి కోసం ట్రై చేస్తా. చూద్దాం ఎలా జరుగుతుందో. నీ జాబ్ ఎలా ఉంది? ఎంజాయ్ చెస్తున్నావా?"
"జాబ్ ఓకె. కొత్తకదా. నేర్చుకుంటున్నా.!"
*********
ఇక మగవాళ్ల వైపు వస్తే.
"నమస్తే భాయిసాబ్! ఎలా ఉన్నారు?"
"నమస్తే ! బావున్నాను. మీరెలా ఉన్నారు. బిజినెస్ ఎలా నడుస్తుంది. సేవింగ్స్ చేస్తున్నారా? సిటీకి కొంచం దూరంలో ప్లాట్లు చవకలో దొరుకుతున్నాయంట. కొంటారా? పడి ఉంటాయి. అవసరమనుకుంటె కట్టుకోవచ్చు. లేదా లాభమొస్తే అమ్మేయొచ్చు. డబ్బులు చేతిలో ఉంటే ఏదో ఒకదానికి ఖర్చైపోతాయి "
"సరేనండి. ఆదివారం వెళ్ళి ప్లాట్లు చూద్ద్దామా?"
********
"హలో బావగారు! నమస్కారం. అంతా కుశలమేనా? ఏంటి సంగతులు చెప్పండి?
" ఏముంటాయిలెండి!. జాబ్ రొటేఎన్. సినిమాలు చూద్దామంటే చెత్త. ఈసారి ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారంటారు?
" ఏమోనండి. రోజుకో పార్టీ పుట్టుకొస్తుంది. ఉన్నవాటికి ఠికానా లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలీదు. అందరూ మనకు గుండు గీకేవాళ్ళే. ఒకడు బాలేడని. వేరేవాడికి ఓటేసి గెలిపిస్తే నేనేమన్నా తక్కువ తిన్నానా అన్నట్టు తయారవుతాడు."
"అవునండి. తిన్నదరక్క మనమే డబ్బులిచ్చి కొట్టించుకున్నట్టు. వోటేసి మరీ మమ్మల్ని దోచుకొని మీరు దున్నపోతుల్లా బలిసిపోండి అంటున్నాము."
"మరే! కాని ఇప్పుడు మన ఓట్లన్నీ చెల్లా చెదురైపోయాయి కదా? అందరికి చిల్లర పంచినట్టు - ఇన్ని పార్టీల మధ్య ఎవ్వరికీ మెజారిటీ రాదనుకుంటాను నేనైతే."
"నిజమే మీరన్నది కూడా"
********
" రమేష్! ఎలా ఉంది నీ ఉద్యోగం. అమెరికా వెళ్ళే ప్లాన్ ఉందా?"
"ఏమోరా! ఆ ప్రాజెక్ట్ పెండింగ్‌లో ఉంది. ఇంకా ఏంటి విశేషాలు?"
"అవునూ! కొత్త బైక్ కొన్నావా? ఏ మోడల్? మైలేజ్ ఎంతిస్తుంది. ధర ఎంత పడింది?"
" బజాజ్ పల్సర్ కొన్నాను. 180 c.c. నలబై పైనే ఇస్తుంది. 70,000 వెలు పడింది. ఈ సిటీ ట్రాఫిక్ కి బైక్ ఐతేనే మేలు."
*********
ఒక ఇంటిలొ జరిగే శుభకార్యక్రమంలో జరిగే సంభాషణలు భలే విచిత్రంగా ఉంటాయి . రోజు ఏవరికి వారు తమ తమ వృత్తి , ఉద్యోగ నిర్వహణలో తీరిక లేకుండా ఉన్నవారు. అప్పుడప్పుడు తప్పనిసరై ఇలా తమ చుట్టాలను కలుసుకుని మనసారా ముచ్చట్లాడుకుంటారు. ఈ కొద్ది సమయంలోనే దాదాపు అన్ని విషయాలు కవర్ చేస్తారు.ముఖ్యంగా ఆడవాళ్ళు. ముచ్చట్లాడుతూనే పక్కవారి చీరలు, నగలు, పెళ్ళిల్లు, చదువులు, అబ్బో. ఎన్ని విషయాలు తెలుసుకుంటారో. ఒక మిని ప్రపంచ సదస్సు అనుకోవచ్చు. ? కాని మగవాళ్ళకు మాత్రం గుర్తుకొచ్చేవి ఉద్యోగం, రాజకీయాలు, తమ వాహనాలు.
ఎప్పుడూ తమ ఉద్యోగం, ఇల్లు అంటూ ఉండకుండా అప్పుడప్పుడైనా, లేదా వీలైన ప్రతిసారీ బంధువులను కలుస్తూ ఉండాలి. మంచి టైంపాస్.
6 వ్యాఖ్యలు:
ఎవరి ప్రపంచంవారిది.ఇలా కలిసినప్పుడు ఈ ప్రపంచాలు మీరు చెప్పినంత సరదాగానూ ఉండొచ్చు..ఒక్కోసారి ప్రళయాలూ జరుగుతాయి. అలాంటి ప్రళయాలనికూడా వీలైతే రాయండి. ఇంకా బాగుంటుంది.
చాలా బాగుంది. ఇవే వినిపిస్తుంటాయి రెగ్యులర్ గా.....నిజమే
సరిగ్గా నిన్న అనగా 4 వతేదీ మేమూ మా బంధువుల వాళ్ళింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కెళ్ళాము same ఇదే scene కాకపోతే సంభాషణల్లో , వ్యక్తుల్లో మార్పు,అసలు వచ్చిన పనిని వదలి పూజపై దృష్టి వదలి మన మాటలు మనవే.
గురుపూజోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.
hi jyothi garu
i am jyothi boyina
i saw ur blog in koodali and i read it
i liked it very much
mee concept chaala bagundi. meeru annattu eddanna function lo kalisinappudu illate conversationse vasthayi.
meeru annattu appudappudu relatives andharini kalavali chala baaguntundi.
very amusing capture.
నిజమే! ఇలాంటి సంభాషణలే ఎక్కువగా జరుగుతాయి :-)
ఇంకా క్రికెట్టు, స్టాక్స్, స్పోర్ట్స్...
Post a Comment