Monday 19 October 2009

ప్రతి రాత్రి వసంత రాత్రి



ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి


ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి


బ్రతుకంతా ప్రతి నిమిషం పాట లాగా సాగాలి


ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి.


నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి


నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి


లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి


లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి


మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి


మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి.


ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక


ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక


విరిజాజి తీగ సుంత జరిగింది మావి చెంత


విరిజాజి తీగ సుంత జరిగింది మావి చెంత


నను జూచి నిను జూచి వనమంతా వలచింది


నను జూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది



సినిమాలో సందర్భం, పాత్రల స్థితిగతులూ,అప్పటి మనస్థితి, వారి బాష, వ్యావహార్యం అన్నీ తెలుసుకుని అందమైన పదాలలో ఇమిడ్చి పాటలా అందిస్తే ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతాము. ఇలాంటి పాటలు సినిమాలో చూస్తున్నపుడు , విడిగా విన్తున్నప్పుడూ ఒకేవిధమైన అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాము అనడంలో సంశయం లేదు. అలాటి ఒక పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు "ఏకవీర" సినిమాలో లలితమైన శైలితో అందరం మాట్లాడుకునే మాటలతోనే మనకందించిన అద్భుతమైన పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి".


అలనాటి రాజకుమారులు అరివీర భయంకరులే కాదు సంగీత, సాహిత్యాభిమానులు కూడా. సకల విద్యలను అభ్యసించేవారేమో అనిపిస్తుంది ఈ పాట వింటే. కాంతారావు, ఎన్టీఆర్ స్నేహితులు.చాల రోజుల తర్వాత కలిసారు. కుశలప్రశ్నలు, భోజనాలు అయ్యాక అలా చల్లని వాతావరణంలో అలా తమ ప్రేమముచ్చట్లు చెప్పుకున్నారు.ఇంకేముంది. లోకమంతా అందంగా, మనోహరంగా ఉంటుంది. చెలిని తల్చుకుని ఎన్నెన్ని మధురమైన ఊహలో ఇద్దరికీ..

ప్రతి రాత్రి ఒక వసంతరాత్రి కావాలంట. అమ్మో ఎంత ఆశో!! కదా.. ఒక ప్రియుడు తన చెలితో కూడిన వేళ ప్రకృతి, జీవితం ఎలా ఉండాలో అని అందమైన ఆలోచనలు చేస్తున్నాడు. ఈ ఆనంద సమయంలో ప్రతి రాత్రి ఒక వసంత రాత్రిగా, ప్రతీ గాలి పైరగాలిలా తాకి తమ బ్రతుకంతా ఒక పాటలా సాగిపోవాలి. నాలోని పాటతో నీ కాలి అందెలు ఘల్లుమనాలి, నీ మనసులో పూలన్నీ మల్లె పొదలా (ఎన్నిపూవులు కావాలో) విరియాలి. అబ్బా!! ఎంత సువాసన!! అలాగే ప్రతీ నిమిషం మధుమాసమై వెల్లివిరియాలి సుమా... ( ఈ ఊహ కూడా ఎంత అందమైనది .నిజంగా అలా ఉంటే ఎంత బాగుండునో? )


ప్రేమలో పడినవాళ్ళకి ప్రతీది అందంగా కనిపిస్తుంది. కవిత్వం జాలువారుతుంది. చుట్టూ ఉన్నా ప్రకృతిలో కూడా ప్రేమ,ఆనందం కనిపిస్తుంది వాళ్లకు. అందుకే చూడండి... నింగిలో చందమామ కూడా వయ్యారి తారవంక వంగినట్టుగా కనిపిస్తుందంట. మరోవైపు మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ విరజాజి మావి వైపు జరిగిందంట. నిన్ను నను చూచి ఈ వనమంతా ప్రేమలో పడింది అని ఎంత ధీమాగా చెప్తున్నాడు ప్రియుడు.


విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఏకవీర నవలను సుమారు నలభై ఏళ్ల క్రింద సినిమాగా రూపొందించారు సి.ఎస్.రావుగారు. కే.వి.మహాదేవన్ సంగీతంలో అలనాటి మేటి నటులు ఎన్.టి.ఆర్, కాంతారావుల మీద చిత్రీకరించబడిన ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే. గాన గంధర్వులైన గురుశిష్యులు ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడిన పాట ఇది. పాట చూడకున్నా, వింటున్నా సరే చల్లటి సాయంత్రంలో పూలతోటలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. స్వరమాదుర్యం, సంగీతం అలా వీనులవిందుగా ఉంటుంది.

6 వ్యాఖ్యలు:

జాన్‌హైడ్ కనుమూరి

అద్బుతమైన పాటను పరిచయం చేసారు
శుభాకాంక్షలు

SRRao

జ్యోతి గారూ !
ఘంటసాల వారి మధుర గాత్రం బాల సుబ్రహ్మణ్యం గారి లేలేత స్వరం తో కలిసి వింత పోకడలు పోయిన గీతం. ఇది. ఇంత అందమైన గీతాన్ని పరిచయం చేసినందుకు సంతోషం.

Anil Dasari

అద్భుతమైన పాట. వాళ్లిద్దరూ కలసి పాడినవి రెండే పాటలైనా, రెండూ రెండే.

సుజాత వేల్పూరి

ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. బాలూ గొంతులో లేత దనం ప్రతిఫలించిన పాట. అందమైన సాహిత్యం, దానికి జతపడిన మధురమైన సంగీతం! ఇంకేం కావాలి?

జ్యోతి గారు టపాలో ఒక చోట అలాగే ప్రతీ నిమిషం మధుమాసమై వెళ్లివిరియాలి అని రాశారు చూడండి! "వెళ్ళి"(ఎక్కడికి వెళ్ళి వెరియాలనే సందేహం వస్తుంది..:-)_ కాదు అది, వెల్లి విరియాలి అని ఉండాలి. మీ టపాల్లో కూడా భాషా దోషాలంటే అంగీకరించలేకపోతున్నాను.

శివరంజని

hai jyothakka ! nenu kotta baogger ni mimmalni parichayam chesukomdamani & ee song ante naku chala istam

జ్యోతి

సుజాతగారు,
తప్పు చూపినందుకు ధన్యవాదాలు. చూసుకోలేదండి.అమ్మో!!ఈ ళ, ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు , మీటపా గుర్తొచ్చేస్తున్నాయి. బాబ్బాబు.. మీరు కనీసం ఆ ళ ,ల లను పట్టుకొని ఉంఢండి...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008