Monday, March 1, 2010

ఎవరికోసం..? మార్చి 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్

మన నోటి నుండి ప్రవాహంలా జాలువారే మాటలు ఎన్నో హృదయాల్లో మనం కోరుకున్న భావాలను ప్రతిష్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటాయి. మన ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ, అనుభవాల్నీ, భావోద్వేగాల్నీ ఉన్న ఫళాన ఓ మనిషితో, మనసుతో పంచుకుంటే తప్ప స్థిమితం లభించదు. ఉవ్వెత్తున ఉబికే ఆనందమైనా, విచారమైనా మన అంతరంగంలో ఎంతటి అలజడి సృష్టిస్తోందో అదే స్థాయి తీవ్రతని బయటకు వ్యక్తపరచడానికి మాటల ఆసరా దొరక్కా, రాతలకు భావం అందిరాకా మనసు పడే ప్రసవవేదన అందరికీ స్వీయానుభవమే. మనల్ని మనం ఉన్నది ఉన్నట్లు ప్రకటింపజేసుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతుంటాం. ఈ ప్రయాస ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాల వ్యక్తీకరణతో సరిపెట్టుకోబడదు. సమాజమనే ఓ సమూహంలో మన ఉనికిని బలోపేతం చేసుకోవడానికీ ప్రయత్నాలు చేస్తుంటాం. మన సామాజిక గౌరవాలూ, మందీమార్భాలాల హంగులూ, ఆర్థిక సొబగులూ, మాటల స్వోత్కర్షలూ ఏవీ సమాజానికి పట్టవు. మనల్ని ప్రత్యేకవ్యక్తులుగా నిలబెట్టుకోవడానికి దివారాత్రాలు శ్రమించి పడిన కష్టమూ సమాజానికి పట్టనే పట్టదు. మన కోసం సమాజం లేదు. మనం సమాజంలో ఓ మూలన మిణుగురు పురుగుల్లా ప్రకాశించడానికి మన శక్తియుక్తులన్నింటినీ ధారపోస్తున్నాం. జీవితంలో ఈ సత్యాన్ని ఎంత త్వరగా గ్రహించగలిగితే అంత పరిపక్వతని పొందగలుగుతాం. మన లక్ష్యం సమాజం కాదు.. మనల్ని మనం సంతృప్తిపరుచుకోవడమే అని గ్రహించగలిగినప్పుడు బయటి నుండి ఏమీ ఆశించము, ఎక్కడా అసంతృప్తి, నిరుత్సాహమూ ఎదురుకాదు. మాటలూ అంతే..!!


ఓ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం ద్వారా మనం ఎదుటి వ్యక్తి నుండి ఏ ప్రయోజనాన్నయితే ఆశిస్తున్నామో అది లభించకపోతే నిరుత్సాహమే మిగులుతుంది. ఓ బాధని పంచుకోవడం ద్వారా ఎటువంటి ఊరడింపునైతే పొందాలనుకుంటున్నామో అది లేశమాత్రమైనా దక్కకపోతే మనసు చివుక్కుమంటుంది. రాతలతో ఎదుటివారిని ప్రభావితం చేయగలమనుకునే రచయితల ఊహలూ నీటిమీద రాతలే! స్వతహాగా పరివర్తన లభిస్తే తప్ప ఎవరూ ఎవరిచే ప్రభావితం చెయ్యబడలేరు. మన మాటలు గానీ, చేతలు గానీ, రాతలు గానీ మన అంతరంగంలో ఉబికే ఉద్వేగాలను చల్లార్చుకోవడానికే తప్ప వాటికి ఏదో సామాజిక ప్రయోజనం ముడిపెట్టడం, లేదా సమూహం నుండి గుర్తింపుని ఆశించడం, ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయాలనుకోవడం వ్యర్థప్రయత్నాలే! మచ్చుకు ఈ సంపాదకీయాన్నే తీసుకుంటే నాలో రగిలే ఆలోచనలను వ్యక్తపరుచుకునే ప్రయత్నమే తప్ప దీని ద్వారా పాఠకుల్లో ఏదో మార్పుని ఆశిస్తే భంగపడక తప్పదు. మన వ్యక్తీకరణల గాఢతని మనమే ఒడిసి పట్టుకోలేం.. అలాంటిది ఎదుటి వ్యక్తులకు ఆ గాఢతను ఎంతవరకూ మాటలతో, చేతలతో, రాతలతో బదిలీ చెయ్యగలం? వారెంత వరకూ మనల్ని ఉన్నది ఉన్నట్లు గ్రహించి మనల్ని సంతుష్టులను చెయ్యగలరు?

- నల్లమోతు శ్రీధర్

4 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

so true.
well said, Sreedhar

Unknown

కొత్తపాళీ గారు, ధన్యవాదాలండీ.

శ్రీలలిత

శ్రీధర్ గారూ,
సరిగ్గా చెప్పారు. "బలహీనుడి ఆయుధం కలం" అని పెద్దవాళ్ళు చెప్పగా విన్నాను.

జ్యోతి

Well said Sridhar,, ఇది నాకు అనుభవమవుతుందిలే..:)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008