Thursday, 27 May 2010

వయసైపోయింది...

నలభై దాటగానే చాలామంది అనే మాట పెద్ద వయసు వచ్చేసింది. అప్పటికి పిల్లలు కాలేజీలలోకి వచ్చేస్తారు లేదా మన అవసరం అంతగా ఉండదు వాళ్లకి. చిన్నగా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. డాక్టర్లు కూడా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక జారీ చేస్తారు. ఒక్కో వయసులో ఒక్కో రకమైన పనులు చేయాలని మనని మనమే నియంత్రించుకుంటాం. అది ఆహారమైనా, దుస్తులైనా, ప్రవర్తన ఐనా ఇప్పుడు ఇలా ఉండాలి అని అందరూ అంటుంటే మనం కూడా ఓహో అలాగే ఉండాలి. లేకుంటే సమాజం వెక్కిరిస్తుంది. చుట్టాలు ఆడిపోసుకుంటారు అనుకుని వయసుతో పాటు మనసుని కూడా మనమే ముసలిదాన్ని చేసేస్తాం. అదే కాక ఈ జీవన ప్రయాణంలో కుటుంబ నిర్వహణ కోసం పని చేయడం అత్యవసరమై మిగిలిన విషయాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వం. ముఖ్యంగా మనకు ఇష్టమైనవి. ఇంటద్దె కట్టాలి.పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి, వాళ్లకు మంచి ఉద్యోగాలు రావాలి, పెళ్లిల్లు చేయాలి అనే కోరికలు ప్రతీ తల్లితండ్రులను పూర్తిగా ఆక్రమించేసుకుంటాయి. దీనికోసమే అహర్నిశలు ఆలోచిస్తూ , పని చేస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు సెటిల్ అయ్యాక ఆలోచించడానికి , చేయడానికి ఓపిక ఉండదు మానసికంగా ఐనా, శారీరకంగా ఐనా. అప్పుడు కూడా పిల్లలు , వాళ్ల పిల్లల గురించే శ్రమ పడతారు.


ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటుంది. మన జీవితం మనదే. పిల్లల జీవితం పిల్లలదే. వాళ్లకు అవసరమైనంతవరకు మన చేయూత నివ్వాలి. తర్వాత వాళ్లని స్వతంత్రులను చేసి వదిలేయాలి. మనం వాళ్ల మీద భారం కాకూడదు. వాళ్ల జీవితంలో అడ్డు కాకూడదు. అలా అని పిల్లలను వదిలేయాల్సిన పని లేదు. బాధ్యతలు తగ్గించుకోవాలి. వయసు అనేది మన శరీరానికే వచ్చింది. కాని మనసుకు కాదు. అది మనం ఎలా ఉండాలని అనుకుంటే అలా ఉంటుంది. అలా మలుచుకోగలం కూడా. శారీరకంగా అలసిపోయి ఇక మనమేం చేయలేము అనుకునేవారు ఎందరో. అలాగే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాములే? ఇప్పుడు కొత్తగా నేర్చుకుని ఏం చేయాలి? అని అంటారు. కాని తీరిగ్గా కూర్చుని మనగురించి ఆలోచిస్తే ఎన్నో చేయగలం. అవి శారీరక శ్రమ కలిగించని పనులు కూడా ఉంటాయి. అందులొ లలితకళలు, చదవడం, రాయడం, సహాయం చేయడం మొదలైనవి. కాలేజీ చదువులు, పోటీ పరీక్షలు, సంసార ప్రయాణంలో మనమే మర్చిపోయిన ఇష్టాలెన్నో.. వాటిని పునరిద్ధరించుకుని మళ్లీ మొదలుపెట్టడంలో తప్పు లేదు. ఇలా చేయడంవల్ల ఎవరో నవ్వుతారు, వెక్కిరిస్తారు అనుకోవడం వృధా. ఏడ్చేవాళ్లు ఎప్పుడూ ఏడుస్తారు. నవ్వేవాళ్ల నాపచేనే పండుతుంది .. తెలుసు కదా. మీకే తెలియని , మీకు ఇష్టమైన పనులు చేయండి. వీటికి ఖర్చు స్వల్పమే కాని దానివలన లభించే ఆనందం,సంతృప్తి అనంతం.


ఇదంతా స్వానుభవంతో చెప్పిన మాటలు .. అర్ధంకాలేదా?? ఐతే క్లుప్తంగా నా కథ చెప్పనా? చదువుకుంటుండగానే పెళ్లి ఐంది. మావారు ఇంకా చదువుకోమన్నారు కాని పిల్లల చదువులు, పెంపకం, వాళ్ల పరీక్షలు, సంసారంలో వేసే మునకలు ఇలా జీవితం గడిచిపోయింది. నేను మావారు మా సర్వశక్తులు పిల్లల చదువులు , ఫీజులు, ఎంట్రెన్సుల మీద పెట్టాం. అదృష్టం కొద్ది పిల్లలు మంచి నడవడికను అలవరుచుకున్నారు. చెడు తిరుగుళ్లు అలవాటు చేసుకోక చదువుల మీద శ్రద్ద పెట్టి మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు మాకు ఎక్కువ శ్రమ లేదు. మావారు తనకిష్టమైన జ్యోతిష్యం చదువుకుందామని కాలేజీలొ చేరారు.తన పనితో పాటు చదువు కూడా కొనసాగించారు. నేను ఇంటిపని, పిల్లల పని తర్వాత కుట్లు అల్లికలు, టీవీ సీరియళ్లు. వేరే వ్యాపకం అంటూ లేదు. ఏం చేయాలో తెలీదు. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా అనాసక్తి. ఈ వయసులొ నేర్చుకోవడం సాధ్యమా? నేర్చుకున్నా ఏంచేస్తాం? ఉద్యోగాలు చేయాలా? అని టీవీ సీరియళ్లు దాదాపు అన్నీ చూసేదాన్ని. అలా టైం వేస్ట్ చేస్తున్న నన్ను చూసి మావారు కంప్యూటర్ భాగాలు వివరించి నెట్ ఎలా వాడాలో, గూగుల్ సెర్చింగ్ ఎలా చేయాలో నేర్పించారు. మా అబ్బాయి మెస్సెంజెర్ అదీ చూపించాడు. అలా మెల్లి మెల్లిగా ఆసక్తి పెరిగింది. ఇంట్లో వాళ్లు, దగ్గరి చుట్టాలు తప్ప ఎక్కువగా పరిచయాలు లేని (చెప్పాలంటే నేనే ఎక్కువ మాట్లాడేదాన్ని కాదన్నమాట) నాకు జాలంలో కొత్త పరిచయాలు ఎన్నో విషయాలు తెలియచేసాయి. పిల్లల కోసం కోర్సులు, కాలేజీలు వెతుకుతూ తెలుగు గురించి శోధించాను. అసలు కంప్యూటర్లో తెలుగు రాయాలని ఎంతో ప్రయత్నించాను. మావారు శ్రీలిపి లాంటి సాఫ్ట్ వేర్ తెచ్చారు కాని అదంతా తికమకగా ఉండేది. బ్లాగు గుంపులో చేరి ఒక్కొటొక్కటిగా నేర్చుకున్నా. కొత్తలో ఏదైనా ఆసక్తిగానే ఉంటుందికదా.పైగా ఇంట్లో కూర్చునే ఎంతోమంది తెలుగువారితో మాట్లాడడం.. ఇలా గడిచిపోతుండగా..


ఒకానొక సమయంలో జీవితం స్తంభించినట్టైంది. నేను చేయాల్సిన పనేమి లేదు. పిల్లలు సెటిల్ ఐపోయారు. వాళ్ల జీవితం వాళ్లది నా అవసరం లేదు. మరి నేను ఏం చేయాలి? ఎందుకు చేయాలి? ఎవరికోసం చేయాలి అనే ఆలోచన తప్ప వేరే లేదు. తెలియని అయోమయం. శూన్యం ఆవరించింది. నా భావనలు ఒక ఫ్రెండ్ తో పంచుకున్నాను. నా పరిస్థితి నాకే అర్ధం కాలేదు కాని అతనికి అర్ధమైంది. ఇల్లలికిన ఈగ కథ చెప్పాడు. ఒక ఈగ ఇల్లు శుబ్రంగా ఉండాలని ఎప్పుడూ ఇల్లంతా అలుకుతూ ఉండేదంట. అలా ఆలుకుతూ అలుకుతూ తన పేరే మరచిపోయింది. అలాంటి ఒక ఇల్లాలి కథను (పి.సత్యవతిగారు రాసింది)ఉదహరించాడు. ఏదో చేయాలనే తపన నాలో ఉంది. కాని వయసైపోయింది అనే కారణంతో దాన్ని అణచిపెడుతున్నాను. నాకంటూ ఒక వ్యాపకం, జీవితం సృష్టించుకోవాలి. అది కుటుంబానికి అతీతంగా వెళ్లడం కాదు. అప్పుడు మొదలైంది నాలో సంఘర్షణ. నిజంగా నాకు కావలసిందేమిటి. నాకంటూ ఇష్టాలు లేవా? కొత్త విషయాలు నేర్చుకోలేనా అని చాలా అలోచించాను. పత్రికలకు రాయడం మొదలుపెట్టాను. వీలైనంత ఎక్కువ చదవడం, రాయడం , సాంకేతిక విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇలా కొత్త కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు లభించే ఆనందం, సంతృప్తి వెలకట్టలేనివి. మాటల్లో చెప్పలేనివి. దానికితోడు మావారు,పిల్లల ,ప్రోత్సాహం, సహకారం కూడా చాలా ఉంది. అలాగే మిత్రుల తోడ్పాటు నన్ను ఈనాడు ఇలా నిలబెట్టింది. అందుకే అంటాను తెలుగు బ్లాగుల వల్ల నాకంటే ఎక్కువగా ఉపయోగపడింది ఎవరూ లేరని. నాకు ఇష్టమైన ఏ విషయాన్నైనా అనుకున్న వెంటనే ఎటువంటి ఆంక్షలు, హద్దులు లేకుండా రాయగలుగుతున్నా. దీనివలన రాత (తలరాత కాదు, చేతిరాత ) మారింది. ఇప్పుడు చెప్పండి వయసైపోయింది శరీరానికా? మనసుకా?


ఇదంతా చెప్పింది నన్ను మెచ్చుకోవడానికి కాదు. సొంత డబ్బా కొట్టుకోవడానికి కాదు. నాలాంటి మహిళలు, పురుషులు ఎంతో మంది ఉన్నారు. మీ ఇంట్లోనే ఉండొచ్చు. వారిని ప్రోత్సహించి వారికిష్టమైనవి నేర్చుకునే అవకాశం కలిపించండి. నాకు అలా కుటుంబ సభ్యుల సహకారం దొరుకుతుంది కాబట్టే ఇన్ని బ్లాగులు రాయగలుగుతున్నా, వివిధ పత్రికలకు వ్యాసాలు ఇవ్వగలుగుతున్నా. అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రాములు కూడా.నాకంటే మావాళ్లే ఎక్కువ సంతోషిస్తారు. అందుకే నేను ఎప్పుడూ నొక్కి వక్కాణిస్తాను.

మావారు బంగారు కొండ
పిల్లలేమో వజ్రాలు

మరి నేనో?? ప్లాటినం.. (ఎందుకో చెప్పుకోండి) అప్పుడప్పుడు ఎవరికి వారు ఇలా డబ్బా కొట్టుకోవాలి. లేకుంటే లైఫ్ బోర్ గా ఉంటుంది. ఔనంటారా?కాదంటారా??

23 వ్యాఖ్యలు:

మానస

చాలా బాగుంది జ్యోతి గారూ.మీరన్నట్లు ఇలాగే ఉండాలి ఫలానా వయసులో అనుకోవడం వల్ల సగం నీరసం వచ్చెస్తుంది పెద్దవాళ్ళకి.

ఏమయినా నేర్చుకోమంటే ఊళ్ళేలాలా ఉద్యోగాలు చేసి అంటారు.ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు,ఆ... పెళ్ళయ్యి పిల్లలున్న నన్ను ఎవరు చూస్తారు అనే ఫీలింగు తెలీకుండానే మన ఆడవాళ్ళలో చొచ్చుకొచ్చి అసలు మనల్ని మనము పట్టించుకోము.రియల్లీ గుడ్ దట్ ఉ రియలైజ్డ్ నౌ.సమాజం ఏమంటుందో అనే భావన చాలా మంది ఆడవాళ్ళ ప్రతిభ ని తొక్కి పెట్టెస్తుంది అని నా అభిప్రాయం.


ఇప్పుడే మధుర వాణి గారి బ్లాగ్ లో ఆవిడ రాసిన కధ చదివా.వ్యాపకం ఏమీ లేకపోవడం వల్లే కధకుడి తల్లి ప్రవర్తన అలా ఉంది అనిపించింది.

durgeswara

ఏమిటి అక్కగారు
బాధ్యతలయిపోయాయి అంటున్నారు .పిల్లలకు పెళ్ళిల్లుకూడాచేసేశారా . మమ్మల్నెవరినీ పిలవనేలేదు.?

gaddeswarup

Vijaya Mulay completed a book recently; she is around 90:
http://gaddeswarup.blogspot.com/2010/05/vijaya-mulays-book.html
and an Australian woman finished her Ph.D. a few years ago when she was 91. With best wishes,
Swarup

డా.ఆచార్య ఫణీంద్ర

Jyothi garu!
Congratulations!!
Being an engineer and while working as a scientist, I have completed my Ph.D. in Telugu at the age of 45.
Will shows the way!

gaddeswarup

Another from our own life. My wife Jhansi statedtaking computer courses at the age of forty (that was twenty years ago); she refused to do any thing outside home except shopping until the youngest was five years old. She used to come back home by 9:30 PM , the youngest would not eat until then, feed him and start working on her courses at 10;30 PM. She passed about 11 of the thirteen courses and meanwhile got a job. She found all the three difficult and discontinued studies but learnt some electronics on the job. After a few years the boss dies , she bought the business and took electronics courses to understand better what she was selling. I still remember her spreading the books around on her bed in the night and studying after all the children were fed. Unfortunately children still refuse to leave her, two are still at home, other two come almost everyday. More to feed now. But she still does business on a small scale, still learning new things. And that makes it possible to contribute a bit to charities. If not for all this house work, I think women will do much better in various professions. Now we try to help a bit with our daughter's children so that she can at least work part time at an earlier age than her mother.

Nrahamthulla

ముసలోళ్ళకు పనికొచ్చే మాటలు మహా బాగా చెప్పారు."నాకంటూ ఇష్టాలు లేవా? కొత్త విషయాలు నేర్చుకోలేనా?ఆలోచిస్తే ఎన్నో చేయగలం.శారీరక శ్రమ కలిగించని పనులు కూడా ఉంటాయి.ఎవరో నవ్వుతారు, వెక్కిరిస్తారు అనుకోవడం వృధా. ఏడ్చేవాళ్లు ఎప్పుడూ ఏడుస్తారు. ఎటువంటి ఆంక్షలు, హద్దులు లేకుండా మనసుకు నచ్చిన మంచిపనులు చెయ్యాలి".డబ్బు ఐపోయినా పరవాలేదుగానీ మనసుకు వయసైపోతే మనమేమీ చేయలేము.

కథా మంజరి

జ్యోతి గారూ, అభినందనలు. ఏదేనా నేర్చు కోడానికి వయసు అడ్డం కాదు. అదొక మిష మాత్రమే. మనకంటూ ఒక జీవితాన్ని కోరుకోవడం కుటుంబం నుండి పారి పోవడం కాదు అనే మీ అవగాహనలో ఎంతో పరిపక్వత కనిపిస్తోంది. స్పష్టత ఉంది. గాదె స్వరూప్ గారు చెప్పిన విషయాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. మీరచనకు వారు చెప్పిన సంగతులు మరింత ఉపబలకంగా ఉన్నాయి. అలాగే, ఆచార్య ఫణీంద్ర గారన్నది కూడా ...

1968 లో అంటే, నేను కథలు రాయడం మొదలెట్టిన తొలినాళ్ళలో, నా 19 వ యేట రాసి ప్రచురించిన ‘‘ ముసలి మనసు’ అనే కథని మీకు మెయిలు చేస్తున్నాను. PDF Formate లో. ఆ కథలో విషయం వేరయినా, వయసు రీత్యా ముసిలయి పోయినా, మానసికంగా ముసిలయి పోకూడదని ఆ రోజుల్లోనే చెప్పగలిగాను.

ముసిలి వయసు కన్నా ముసలి మనసు ప్రమాద కారి అన్నవి ఆ కథలో చివరి వాక్యాలు... ఇది కూడా, నా సొంత డబ్బా కొట్టు కోవడం కోసం కాదు. మీరు మీ రచనలో వెలి బుచ్చిన అభిప్రాయాలను గౌరవిస్తూ, నా ఆలోచన కూడ అలాగే సాగిందని చెప్పడానికి.
మీకూ, మిమ్ములను ప్రోత్సహిస్తున్న మీ కుటుంబ సభ్యులకీ అభినందనలు మరో సారి చెబుతూ ....

చింతా రామ కృష్ణా రావు.

జీవితాన్ని వడబోసి గీతాసారంలా వివరించిన మీ అభిప్రాయం నగ్న సత్యమమ్మా! మనిషి బ్రతికుండగా చేయగలిగిన పనులు చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. సమాజం మిమ్మల్ని ఆదర్శ మహిళగా గ్రహించ గలిగింది కాబట్టే మీ టీవీ ప్రోగ్రాంస్ ను; పత్రికా ప్రచురిత వ్యాసాలను గ్రహించ గలుగుతోందమ్మా!
అభినందనలు తెలియ చేస్తున్నాను మీకు కాదమ్మోయ్. మీ శ్రీవారికీ; మేలిమి బంగరు మెఱికెలైన మీ పిల్లలకు. ఎందుకో తెలుసా? మిమ్ములను పొంద గలిగిన అదృష్టవంతులు కాబట్టి.
మీరు దీర్ఘాయుష్మతియై సామాజికులకు నిత్య నూతనోత్తేజాన్ని కలిగిస్తూ వర్ధిల్ల చేస్తూ ఉండాలని ఆపరమాత్మను దీవించ వలసినదిగా కోరుకొంటున్నాను. శుభమస్తు.

మాలా కుమార్

జ్యోతి గారు ,
నాదీ ఇంచుమించు మీ కథ లాంటిదే ! నేనూ మీ అభిప్రాయం తో ఏకీభవిస్తాను .

మాలతి

అభినందనలు, జ్యోతిగారు. బాగా చెప్పేరు. ఎవరూ అనకముందే మనవాళ్లు, వాళ్లకి వాళ్లే పెద్దవాళ్లం అయిపోయేం అంటూ లేని నీరసాలు కూడా తెచ్చుకుంటారు. మీ ఉత్సాహం ఇలాగే వందేళ్లపాటు ఉండాలని కాంక్షిస్తూ ..
మాలతి

Dr.Tekumalla Venkatappaiah

మంచి అలవాట్లు మీకున్న కొంచెమయిన
ముసలి తనమన్న మాటయె ముక్త మగును
వాన ప్రస్తము చేరండి వాదులాపి
ఆత్మ జీవాత్మ జేరుటె యసలు ముక్తి.

శ్రీలలిత

జ్యోతీ,
ప్రస్తుతం జరుగుతున్న విషయాన్ని చక్కగా చెప్పారు. మీ మాటల వల్ల చాలామంది స్ఫూర్తి పొందుతారు.

శిరీష

Nice post. i will just remember your words and ur experience if i also feel like you in life. people like you are inspirational to many

i wish you 100 years of youthful life.

రాజేశ్వరి నేదునూరి

జ్యొతి గారు మీ వ్యాసం చాలా బాగుంది ఐతె మీరన్నట్టు వయసు శరీరానికె గాని మనసుకు కాదని నా అభిప్రాయం కుడా .ఎందుకంటే " మనసుంటే మార్గముటుంది అన్న సామెత " నూటికి నూరు పాళ్ళు నిజం . మనలొ పట్టుదల ఆశక్తి ఉంటే ఎవ్వరు ఏమి చేయలేరు నాకు ఇంటా బయటా కుడా ఇప్పడికీ ఎవ్వరి ప్రోత్సాహము లేదు సరికద " కధలు రాయడం గొప్పేమి కాదు బూతులెగా ? అనేవారు కొందరు ,రేడియోలకి టివీలకి " నాటకాల ముం ....ల్లాగ అనేవారు కొందరు ఇలా మనసుని చిత్ర వధ చేస్తున్నా ఇప్పుడు కుడా [2008 నుంచి కొద్దిగ మా చిన్నబాబు నేర్పడం ]వల్ల ఈ మాత్రం కంప్యూటర్ నేర్చుకో గలిగాను ఏది నేరిపితె ముందుకెళ్ళి పోతుందో అన్న భయం.అందరికి .అందుకె ఎందులొను పైకి రాలేక పోయాను. అసలు కొంచం సహకరించినా ఇంకొంచం ముందుకు రాకపోదునా అన్న బాధ మిగిలి పోయింది ఇప్పడికీ ఎవరైన అడిగినా నా పేరు చెప్పడానికి ఇంట్లొ ఎవరికి ఇష్టం ఉందదు కాని నాచేతిలొ ఉన్నంత వరకు నేను వదలను మరి దీన్ని మీరేమంటారు ?

శ్రీధర్

జ్యోతీగారూ ! బంగారానికి, వజ్రాలకి, ప్లాటినానికి కాఠిన్యమనే దుర్గుణం ఉంటుందండీ ! ఈ క్రొత్త ప్లాటినం సుతి మెత్తనే కాక స్పందించే గుణం కూడా కలది !!

జ్యోతి

మానసగారు,
అవును మీరు చెప్పింది నిజమే. కాని ఆడవాళ్లు కూడా తమ సమయం వృదా చేయకుండా ఏమి చేస్తాములే అనుకోకుండా ఏమి చేయగలం అని ఆలోచించి ఆచరణలో పెట్టాలి. పట్టుదల ఉంటే అది అసాధ్యం కాదు.. వ్యాపకం ఉంటే వేరే పనికిరాని ఆలోచనలు కూడా ఉండవు.

దుర్గేశ్వర గారు,

ఇంకా లేదండి. పెళ్లి రాసిపెట్టిన టైమ్ కి అదే అవుతుంది. దాని గురించి బెంగ లేదులెండి. ఐనా మీకు చెప్పకుండా ఉంటానా??

జ్యోతి

స్వరూప్ గారు,
మీరు చెప్పిన విషయం ఆనందదాయకం. అలాగే మీ శ్రీమతికి నా అభినందనలు తెలపండి. మరికొందరు స్పూర్తి పొందితే చాలు.

ఆచార్యగారు,

ధన్యవాదాలు. మీకు కూడా అభినందనలు..

జ్యోతి

రహమతుల్లా గారు, రామకృష్ణగారు,జోగారావుగారు మీరు చెప్పింది నిజమేకదా. అసలు తప్పంతా మనలోనే ఉంది. ఎలా ఆలోచిస్తామనేది. ఈ పని చేయాలి అని ముందుగా మనమే అనుకుంటే సాధించలేనిది లేదు కదా...

మాలగారు, వెంకట్ గారు, మాలతిగారు, ధాంక్స్..

శ్రీలలితగారు, అంతకన్నా కావలసినదేముంది? నేను చెప్పదలుచుకున్నది అదే కదా.

జ్యోతి

శిరీష ,,

నా మాటలు నచ్చినందుకు సంతోషం. మీ అమ్మా నాన్నలకు, తాత బామ్మలను ఒక్కసారి పలకరించి వాళ్లు సంసార ప్రయాణంలో మరచిపోయిన తమ ఇష్టాలను తెలుసుకోండి. అది చీరలు,నగలు మాత్రం కాదు. వాళ్లు నేర్చుకోవాలనుకున్నది ఏదైనా, సంగీతమైనా, పుస్తకాలైనా. హాబీలైనా. ఇప్పుడు వయసైపోయింది అని అనుకోకుండా ప్రారంభించమనండి. లేదా ఇంట్లో నెట్ ఉంటే ఎలా వాడాలో నేర్పించండి. ఇప్పుడు జాలంలో తెలుగులో లభించని సమాచారం లేదు కదా. ఆవకాయ నుండి అంతరిక్షం వరకు.. చూడండి ఎంత సంతోషిస్తారో . ఆసక్తిగా నేర్చుకుంటారో.

జ్యోతి

రాజేశ్వరిగారు
జరిగింది మర్చిపోండి. ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టండి. కంప్యూటర్ వాడకం తెలిసిందిగా. మీ రచనలు కొనసాగించండి..

శ్రీధర్ గారు,
అలాగంటారా? నేను చెప్పింది వాటి విలువ అంటే ధరలను బట్టి ..:)))

Anonymous

avunanandii meeru platinum ee.. :)

Blog lo unna aadavallanadru ante naku prathyeka abhimanam...veellu time waste cheyakunda...arugu baita kurchuni pakkinti sangatulu matalada kunda..chakka ga naluguriki panikoche vishayalu ..leka saradaga naluguru navvukune la rastunnaru..

ma amma kuda kavithalu,kathalu baga rasedita...ninne anukunnaaa..ammaku kuda nerpite..inko jyothi garo..inko usha garo..inko nestamlaga no super duper hit blogger avtundi ani.. :)

జ్యోతి

కిరణ్,

మంచిపని. ఆలస్యమెందుకు?అమ్మకు నేర్పించు.ఆమె భావలన్నీ అక్షరాలుగా మార్చడానికి సహాయం చేయి. నీకో సంగతి చెప్పనా. నాలుగేళ్ల క్రింద నెట్ పరిచయం చేసుకున్నప్పుడు, బ్లాగు మొదలెట్టినప్పుడు నాకు టైపింగ్ తప్ప ఏమీ రాదు. ఒక్కొక్కటి నేర్చుకున్నదే. So, Nothing is impossible if u really try it..

భావన

ఏంటో జ్యోతి ఎప్పుడో కామెంటుదామనుకున్నా వెధవది వయసు ఐపోయి మతిమరుపు వచ్చేసిందోయ్... హి హిహి ఏంటా చూపు ఊరికే అన్నా. బాగా చెప్పేవు నిజమే.. కొన్ని వయసు కు తగ్గట్లు వుండాలి కొన్ని ఎప్పటీకి మనసును నిత్య నూతనం గా వుంచుకుని ఆలోచించగలగాలి చెయ్యగలగాలి. బాగా చెప్పేవు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008