గుత్తివంకాయ కూరోయ్
తెలుగువారందరికీ ప్రియమైన శాకము వంకాయ. లేతగా నవనవలాడే వంకాయలతో రకరకాల వంటకాలు చేయడం మనవారి ప్రత్యేకత. అసలు ఈ వంకాయ తినడానికే కాదు ప్రేమ వ్యక్తపరచడానికి కూడా పనికొస్తుందంటారు.
'గుత్తొంకాయ కూరోయ్ బావా
కోరి వండినానోయ్ బావా
కూర లోపల నా వలపంతా
కూరిపెట్టినానోయ్ బావా!
కోరికతో తినవోయ్ బావా...'' తన ప్రేమనంతా కూరి గుత్తొంకాయ కూర చేసాను అని బావను పిలుస్తుంది ఈ వెర్రిపిల్ల.
అల్లం పచ్చిమిర్చి,కొత్తిమిర వేసి వండినా, మసాలా కూరి గుత్తిగా వండినా, నిప్పులపై కాల్చి పచ్చడి చేసినా అదిరిపోయే రుచి గలది ఈ ముద్దుల వంకాయ.
వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామామణియున్ అని పెద్దలు ఊరకే అన్నారా
|
ఈ సోదంతా ఎందుకంటారా? అదేం లేదండి.. ఇంతకు ముందే గుత్తి వంకాయ కూరా చేసా. ఈ వంకాయ మీద పాటలున్నట్టు గుర్తొచ్చింది. మరి వినుకోండి ఈ గుత్తొంకాయ పాటలు.. ముందుగా ఓ చిన్న తునక.
భలే మంచి కూర పసందైన కూర
మసాలాతో కూరిన వంకాయ కూర .. మసాలా కూరిన గుత్తి వంకాయ కూర
ఇంటిలోని అందరిని రారమ్మని పిలిచే కూర
ఘుమఘుమలతో చుట్టుపక్కల గుభాలించే కూర
చూడగానే నోరూరించే వేడి వంకాయ కూర
మరి ఈ పాట రాసింది, పాడింది ఎవరో చెప్పగలరా??
గుత్తి వంకాయ కూరోయ్ బావా
గుత్తి వంకాయ కూరోయ్ బావా
కోరి వండినానోయ్ బావా ||గుత్తి||
కూర లోపల నా వలపంతా
కూరపెట్టి నానోయ్ బావా
కోరికతో తినవోయ్ బావా ||గుత్తి||
తీయని పాయసమోయ్ బావా
తీరుగ వండానోయ్ బావా
పాయసములో ప్రేమనియేటి
పాలు పోసినానోయ్ బావా
బాగని మెచ్చాలోయ్ బావా ||గుత్తి||
కమ్మని పూరీలోయ్ బావా
కరకర వేచానోయ్ బావా
కరకర వేచిన పూరీల తన
కాంక్ష వేసినానోయ్ బావా
కనికరించి తినవోయ్ బావా ||గుత్తి||
వెన్నెల యిదిగోనోయ్ బావా
కన్నుల కింపౌనోయ్ బావా
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న కలిపినానోయ్ బావా
వేగముగ రావోయ్ బావా ||గుత్తి||
పూవుల సజ్జదిగో
మల్లెపూవుల పరచిందోయ్ బావా
పూవులలో నాయవ్వనమంతా
పొదిపి పెట్టినానోయ్ బావా
పదవోయ్ పవళింతాం బావా
పాటలతో పాటు కొన్ని వంకాయ వంటకాలు. ఇక్కడ...
13 వ్యాఖ్యలు:
పాటల సంగతి తరువాత ముందు రెసిపీ ఇవ్వండి
సౌమ్య వంటకాల లింక్ ఇచ్చా చూడు..
అవన్నీ నాకొద్దు, గుత్తివంకాయ రెసిపీ కావాలి.
ఇలాంటి టెంప్టింగ్ ఫోటోలు పెట్టి బ్రహ్మచారి బ్లాగర్ల మనోభావాలు దెబ్బతీసినందుకు జ్యోతక్క తక్షణం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అఖిలాంధ్ర బ్రహ్మచారుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నా..
ఇక్కడ జ్యోతిగారు గుత్తివంకాయ ఫోటో పెట్టలేదు..నేను దాన్ని చూడలేదు...నోట్లో నీరు అస్సలంటే అస్సలు ఊరలేదు..:)
@కార్తీక్ గారు, క్షమాపణ కాదు గానీ జ్యోతిగారు గుత్తివంకాయ కూర తలా ఒక్కొ బ్రహ్మచారికి హాట్‌బాక్స్‌లో పెట్టి ఇవ్వాలని డిమాండ్ చేద్దాం..ఏమంటారు?
సౌమ్య ఇక్కడ ఉందిగా గుత్తొంకాయ రెసిపి..
http://shadruchulu.com/telugu/?p=313
ఇంకా ఇస్పెషల్ రెసిపి అంటే ఇదిగో
http://jaajipoolu.blogspot.com/2009/11/blog-post.html
కార్తీక్, శేఖర్,,,
హా..హా..హా... బావుంది. ఇదంతా ఎందుకు?ఎలా చేయాలో చెప్పానుగా. నేనైతే ఇవాళ చేసాను. తిన్నాను కూడా. మీరు చేసుకోండి...
భావి భారత భాగ్య విధాతలారా, అఖిలాంధ్ర బ్రహ్మచారులారా! వంటల బొమ్మలు పెట్టి బాధలు పెట్టే ఈ వనితలకి సరైన సమాధానం చెప్పాలంటే ఒకటే మార్గం - వాంట నేర్చేసుకోడమే. మా తాతయ్య చెప్పేవాడు, వాంట నేర్చుకోరా, పెళ్ళాం ప్రేంఇస్తుందీ అని. అది నా స్వానుభవం కూడానూ. సాధనమ్మున పనులు సమకూర్ ధరలోన అన్నారు. అంచేత, నలభీముళ్ళైపోండి. :)
thanks thanks thanks.....
@కార్తీక్, శేఖర్
రెసిపీ ఉంది చక్కగా చేసుకోరాదూ హాయిగా
కొత్తపాళీగారు నేను చెప్పేది అదేనండి. అసలు మగవాళ్లు వంట నేర్చుకోవడంలో ఉన్న లాభాలు చెప్తాను. ఇష్టమున్న వంటలు చేసుకోవచ్చు.చేయడం రాదంటారా? పుస్తకాలు ఉన్నాయి, నా షడ్రుచులు, ఇంకా ఎన్నో బ్లాగులు,సైట్లు ఉన్నాయి. రెండు మూడుసార్లు చెడిపోయినా పర్లేదు అనుభవం వస్తుంది. అదే కూర బ్రహ్మాండంగా వస్తుంది. మెస్సులు, హోటల్లకు డబ్బు తగలేసే పని ఉండదు. పెళ్లయ్యాక కూడా ఆవిడ పుట్టింటికెళ్లినా, మీకు ఇష్టమైనది తినాలనిపించినా ఇంచక్కా వంటింట్లోకి వెల్లి చేసుకుని తినేయడమే. ఐనా వంట చేయడం బ్లహ్మవిద్యా? నలభీములదాకా ఎందుకు? ఈనాటి టిఫిన్ బండి ఐనా, చిన్న,పెద్ద, చుక్కల హోటల్లన్నింటిలో మగవారే కదా ఉండేది. ఆడవాళ్లు మీ ఉద్యోగాలు చేయగాలేంది మీరు ఈ వంట చేయడం ఒ లెక్కా? తలుచుకుంటే ఉఫ్ అని ఊదేయరూ? ఆలస్యమెందుకు? గరిట పట్టుకోండి.
aunakka ninnane memu intlo vandamu nijange guttonkaya koora ruche veru:)neeku telusa akka?nellore vankayala ruche veru:)
ఆయెషా, లేత వంకాయలు కనపడగానే తెచ్చి ఏదో కూర చేయడం తెలుసు కాని ఈ ప్రాంతాల సంగతి తెలీదు. ఈ నెల్లూరు వంకాయ సంగతేంటి??
జ్యోతి గారు,
ఇప్పుడే టేకుమళ్ళ వెంకటప్పయ్యగారు ప్రస్తావిస్తే ఇక్కడకు రావడం జరిగింది. గుత్తి వంకాయ కూరోయ్ బావా ... అన్న పాటను రాసింది బసవరాజు అప్పారావు. దానిని పాడి, రికార్డుగా యిచ్చి ప్రచారం చేసింది: బందా కనకలింగేశ్వరరావు. వేరే వాళ్ళు బయటా, సినిమల్లోను పాడటం జరిగింది. పాటలో కొన్ని మార్పులతో! జిక్కి పాడిన సినిమా వెర్షన్ ఒకటుంది. మీరు ఆడియో కూడా ఇచ్చినట్లుంది, కానీ నేను ఆఫీసులో ఆడియోలు, వీడియోలు చూడ/వినలేను. అందువల్ల మీరెవరు పాడిన పాట పెట్టారో తెలియదు. బందా రికార్డింగు సుసర్ల సాయి గారి సైటులో వుండాలని గుర్తు. లేకుంటే నేను పంపగలను.
భవదీయుడు,
శ్రీనివాస్
Post a Comment