Thursday 7 October 2010

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ...

ఈ రోజు మహాలయ అమావాస్య. ఈ రోజునుండి తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండగ మొదలువుతుంది. ఇక రేపటి నుండి దేవీనవరాత్రులు. ఈ సందర్భంలో ఈనెల చిత్ర మాసపత్రికలో ప్రచురించబడిన వ్యాసం..



మన పండగలు అనగానే కొత్త బట్టలు, పూజలు, పిండివంటలు మాత్రమే కాదు. ప్రతి పండగకు ప్రత్యేకమైన అర్ధం ,పరమార్ధం ఉంటుంది. ఈ పండగలను ఎంతో సంతోషంగా, నియమ నిష్టలతో జరుపుకుంటారు. కొన్ని పండగలు విశేషంగా ప్రకృతికి సంబంధించినవి అనవచ్చు.. అలాంటి వాటిలో ముఖ్యమైనది బతుకమ్మ పండుగ. తెలంగాణా ప్రాంత సంస్కృతీ, సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టుగా ప్రతిబింబించే ఈ బతుకమ్మ పండగ అంటే ఆడపిల్లలకు చాలా ఇష్టం. కొత్త పెళ్లికూతుర్లు పుట్టింటికి వచ్చి ఎంతోమురిపెంగా ఈ పండగ జరుపుకుంటారు. ఈ పండగలో పేద ధనిక అనే తేడాలు లేకుండా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ పాల్గొంటారు. బతుకు అమ్మా అని ఆ మహాశక్తిని కీర్తిస్తూ జరుపుకునే పండగ బతుకమ్మ పండగ. బతుకమ్మ అంటేనే పూలపండగ. ఈ పండగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికి వర్షాల వాళ్ళ వాగులు,చెరువులు నిండిపోతాయి. రంగు రంగుల పూలు విరబూసి నవ్వుతుంటాయి. ప్రకృతి అంతా పచ్చగా, ఎన్నో రంగులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కాలంలో గునుగుపూలు,తంగేడు, బంతి , చామంతి, గోరింట మొదలైన పూలు విరగ కాస్తాయి. అదే విధంగా సీతాఫలాలు కూడా చేతికంది వస్తాయి. జొన్న పంట నేను మాత్రం తక్కువ తిన్నానా అంటూ కోతకు సిద్ధమై వయ్యారంగా తలలూపుతూ ఉంటుంది. ఇలా తమ చుట్టూ ఉన్న పూలను సేకరించి వాటికి అందమైన రూపమిచ్చి ప్రకృతి మాత ఒడిలో ఆడి పాడతారు.


బతుకమ్మ ఆడడం అనేది వినాయక చవితి తర్వాత మహాలయ పక్షం మొదలైన నాటినుండి మొదలవుతుంది. ప్రతి రోజు సాయంత్రం ఇంటిముందు కల్లాపు జల్లి , ముగ్గులు పెడతారు . తరవాత పేడతో గొబ్బెమ్మలు చేసి వాటికి పసుపు, కుంకుమ,పూలు పెట్టి వాకిట్లో ముగ్గు మధ్యలో పెట్టి చుట్టుపక్కల ఉన్న పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళందరూ కలిసి చప్పట్లు కొడుతూ ,పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతారు. అందరికీ ఇదో ఆటవిడుపుగా ఉండేది. అలా అయినా అందరు ఒకదగ్గర చేరి మాట్లాడుకునేవారు. తర్వాత అటుకులు, పుట్నాలు,బెల్లం కలిపి ప్రసాదం పంచుతారు. చివరిలో ఈ గొబ్బెమ్మలను గోడకు పిడకలుగా కొడతారు. మహాలయ అమావాస్య నాడు చిన్న బతుకమ్మ అని పూలతో బతుకమ్మలను చేసి ఆడతారు. ఇలా రోజూ ఆడుతూ తొమ్మిదవ రోజైన దుర్గాష్టమి నాడు పెద్ద బతుకమ్మ లేక సద్దుల

బతుకమ్మ అని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు మగవాళ్ళు చుట్టూ పక్కల తోటలన్నీ తిరిగి లేకుంటే కొని , గునుగు,తంగేడు, బంతి,చామంతి, మొదలైన పూలు తీసుకొస్తారు. గునుగు పూలను వివిధ రంగుల్లో అద్ది ఆరబెడతారు. ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళెం తీసుకుని దాని మీద వెడల్పాటి ఆకులను పరుస్తారు. దానిమీద వివిధ రకాల పూలతో వరుసగా, తీరైన బతుకమ్మను పేరుస్తారు. మధ్య మధ్య వాటిని విడిపోకుండా గట్టిగా అదిమి పెడతారు ఇలా రంగురంగుల బతుకమ్మ పేర్చిన తర్వాత పైన తమలపాకు పెట్టి దాని మీద పసుపుతో చేసిన గౌరమ్మను పెడతారు. బతుకమ్మను సంబరంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ పండగ ఈ దుర్గాష్టమి నాడు జరుపుకుంటారు. సద్దులు అంటే చద్దులు. ఈ రోజు మాత్రం తప్పకుండా అన్న ప్రసాదాలు చేయాల్సిందే. పులిహోర, దద్ధోజనం, మలీద అని రొట్టెలు,బెల్లం కలిపి చేసే ఉండలు చేస్తారు. అందంగా తయారుచేసిన బతుకమ్మను దేవుడి ముందు పెట్టి పూజచేసి తర్వాత కొత్త బట్టలు ధరించి,అలంకరించుకుని , ఇంటిముందు కల్లాపు జల్లి ముగ్గు పెట్టి ఆ ముగ్గు మధ్యలో ఈ బతుకమని పెడతారు. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు కూడా తమ బతుకమ్మలను తీసుకొచ్చి , అందరు కలిసి లయబద్ధమైన అడుగులు వేస్తూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ దానిచుట్టూ తిరుగుతారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా అందరూ ఒక్కటై ఐక్యత, సోదరభావము, ప్రేమను కలిపి రంగరిస్తూ అడుగులో అడుగు కలుపుతూ వలయాకారంగా తిరుగుతారు. ఒకరు పాట పాడుతుంటే మిగిలినవారు గొంతు కలుపుతారు. కాస్త నడవలేని ముసలమ్మలు కూడా పక్కన కూర్చుని " ఏం పిల్లలో ఏమో? పాటలు రావంటారు. మా కాలంలో ఐతేనా? అంటూ ఒకదాని తర్వాత ఒకటి అలా రాగయుక్తంగా పడుతుంటారు. ఇవి అలాంటిలాంటి పాటలు కావు నీతి కథలు, జానపద కథలు, కొత్త పెల్లికూతురుకు చెప్పాల్సిన విషయాలు, కిటుకులు, ఆడవారి కష్టాలు ఇలా ఎన్నో ఉంటాయి.

ఇద్దరక్క చెల్లెళ్ళను ఉయ్యాలో ఊక్కూరికిస్తే ఉయ్యాలోఒక్కడే మాయన్న ఉయ్యాలో ఒచ్చైనా పోడు ఉయ్యాలో అంటూ అన్న చెల్లెల్ల అనుబంధంగురించి

ఏమమ్మ గోపమ్మ ఉయ్యాలో యశోద నందనా ఉయ్యాలో

మీవాడు గోపమ్మ ఉయ్యాలో యెంత కొంటెవాడు ఉయ్యాలో

అంటూ యశోద కృష్ణుల గురించిన అపురూపమైన పాటలు జాలువారేవి. ఇలా ప్రతి ఇంటి ముందు తమ బతుకమ్మలను పెట్టి కొద్ది సేపైనా పాటలు పాడుతూ ఆడతారు.

సామూహికంగా బతుకమ్మ ఆడేవాళ్ళు ఒకరికొకరు పరిచయం, స్నేహం ఉండాల్సిన పనిలేదు. అందరూ ఒకటే అన్నట్టుగా ఉంటారు. చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను చేత బట్టుకుని లేదా తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఊరిలో ఉన్న పెద్ద చెరువు కాని ,బావి కాని ఉంటె అక్కడికి వెళతారు. అందంగా అలంకరించుకున్న ఆడవాళ్ళు చేతిలో రంగు రంగుల బతుకమ్మలతో వెళ్ళే దృశ్యం అత్యంత రమణీయంగా , మనోహరంగా ఉంటుంది. వారి పాటలు,నవ్వులతో వీధులు కళకళ లాడుతుంటాయి. చెరువు దగ్గరకు రాగానే మళ్ళీ అందరి బతుకమ్మలను ఒక చోట పెట్టి బతుకమ్మ ఆడతారు. పండగ శోభ, హడావిడి అంతా ఇక్కడే ఉందా? అనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఆటపాటలలో అలిసి , చీకటి పడిందని తెలిసి ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చుకుని ప్రసాదాలు పంచుకుంటారు. తర్వాత కూతురిని అత్తవారింటికి పంపినట్టుగా బతుకమ్మను నెమ్మదిగా నీటిలో వదులుతారు. అది అలా కదిలిపోతుంటే చూసి భారంగా వెనుదిరుగుతారు.

ఈ పండగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మని లేదా గౌరమ్మని కీర్తిస్తూ జరుపుకునే పండగ. ఏ పండగైనా, పబ్బమైనా కుటుంబం చల్లగా ఉండాలనే కోరుకుంటారు కదా. అందుకే బతుకమ్మ పండగ ప్రకృతిని ఆరాధించే పండగ. పూలు బాగా వికసించే కాలంలో, చెరువులు, వాగులు నీటితో కళకళలాడే సమయంలో వచ్చే ఈ బతుకమ్మ పండగ భూమి, జలంతో గల మానవ అనుబంధాన్ని ఒక సంబరంగా ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పండగ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందునా తెలంగాణా ప్రాంతం వారు ఎంతో ఉల్లాసంగా ఆయా ప్రాంతాల్లో తమకు లభించే పూలతోనే బతుకమ్మ పండగ జరుపుకుంటారు.


కొన్ని బతుకమ్మ పాటలు ..

11 వ్యాఖ్యలు:

Unknown

chaala baaga raasarandi, maa urilo, mari mukyanga maa intlo bathukamma chalachala pedda pandaga. ee pandagaki ekkadunaa, ela chesukunna, memevvaram eppudu kuda miss avani pandaga bathakamma okkate. modati roju, chivari roju pedda pedda bathakammalani cheyadam, migilina rojulanni, chinna chinna bathukammalani cheyadam, roju ko rakam kotta dress vesukoni, chivari rojyna saddulaki matram, chiralu, langa vonilu vesukoni velladam. anni anni gurthukocheesayi.

మైత్రేయి

బాగుందండీ.వివరంగా రాసారు.
సంక్రాంతి కి కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో పెట్టే గొబ్బెమ్మలకు దగ్గరగా ఉన్నది. గొబ్బెమ్మలు కూడా ముగ్గులో పూలతో అలంకరిస్తారు. అప్పుడు గుమ్మడి పూలు, బంతి పూలూ ఎక్కువగా దొరుకుతాయి. బతకమ్మ ఆడినట్లే గొబ్బి తడతారు.
కోస్తా ప్రాంతాల్లో పెద్ద పండుగ రోజుల్లో సంకురమయ లేదా సంక్రాంతి పురుషుడు రూపంలో దేవుణ్ణి మట్టి బొమ్మలుగా చేసి పూజించి నీళ్ళల్లో వాల్లాడిస్తారు. అయితే రాయలసీమ లో మేము ఉన్న కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని పూజించటం కనుమ వెళ్ళిన మర్నాడు ఉయ్యాల ఊగించి అచ్చంగా బతుకమ్మను వాల్లాడించినట్లే వాల్లాడించటం ఉన్నది. ఎవరైనా రాయలసీవ వాళ్ళు వివరంగా రాయగలుగుతారేమో దీన్ని గూర్చి.
బొమ్మలకొలువు అలవాటు తెలంగాణాలో ఉన్నదాండీ?

జ్యోతి

స్పూర్తిగారు, సంతోషం. మీరు తెలుగులో రాయడానికి లేఖిని ఉపయోగించండి.

మైత్రేయిగారు, మేము దీపావళికి బొమ్మలకొలువు పెడతామండి.

Srujana Ramanujan

Nice one, and congrats

మాలా కుమార్

బతుకమ్మ గురించి బాగా వివరించారు .
అభినందనలు .

సి.ఉమాదేవి

పండుగ అనగానే ఆటవిడుపుగా భావించి ఏ సినిమాకో,షికారుకో ప్రణాళిక వేసుకునేవారు పెరుగుతున్న నేపథ్యంలో బతుకమ్మ పండుగ గురించి వివరించడం సందర్భోచితం. చక్కటి వ్యాసం రాసినందుకు అభినందనలు.

lahari.com

ఆంటి బతుకమ్మ పండగ గురించి చాలా బాగావివరించారు.మీకు ధన్యవాధములు.

డా.ఆచార్య ఫణీంద్ర

జ్యోతి గారు!
"ఇద్దరక్క చెల్లెళ్ళను ఉయ్యాలో... " పాటలో "ఊక్కూరికిస్తే ఉయ్యాలో" కాదు. "ఒక్కూరి కిచ్చిరి ఉయ్యాలో" అని ఉండాలి. ( ఇద్దరక్క చెల్లెళ్ళను ఒకే ఊరికి ఇచ్చి పెళ్ళి చేసారని అర్థం )
మీ వ్యాసం ’చిత్ర’లో ముందే చదివాను. బాగుంది. అభినందనలు!

Kalpana Rentala

జ్యోతి,

ఎంతో వివరం గా రాశారు. ఇంతవరకూ కోస్తా లో వుందటం వల్ల బతకమ్మ ను గురించి చదవడమే తప్ప వెళ్ళి చూడలేదు ఎప్పుడూ.నేను గత సంవత్సరం ఇక్కడ డాలస్ లో బతుకమ్మ పండుగ జరుగుతుంటే వెళ్ళి చూసాను. చాలా నచ్చింది.

జ్యోతి

వ్యాసం నచ్చినందుకు అందరికి ధన్యవాదాలు.

ఆచార్యగారు నిజమేనండి అది అప్పుతచ్చే. నేనే చేసినట్టున్నాను. అందుకే అలాగే అచ్చయ్యింది.

himajwala.blogspot.com

చాలా బాగా రాసిన్రు జ్యోతి గారూ!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008