Tuesday, 31 January 2012

తండ్రి లాలన - పిల్లలకు వరం

ప్రేమ అనగానే ఆడవాళ్ళూ, అమ్మలే గుర్తొస్తారు. కాని కూతురు మీద నాన్నకి అమితమైన ప్రేమ ఉంటుంది కాని అది పైకి కనపడనివ్వడు అని గతంలో కూడా చెప్పాను కదా.. మరి కొన్ని భావాలు. నాలో తనని తాను చూసుకుంటూ నా అభివృద్దిని చూసి ఆశ్చర్యపోతూ, ఆనందపడుతూ గర్విస్తున్న మా నాన్నకు, పెళ్ళయ్యాక కూడా కూతురు మీద బెంగ పెట్టుకుని ఎలా ఉందో అని రోజూ గుర్తు చేసుకునే మావారికి ఈ వ్యాసం అంకితం. పది రోజుల్లో ౭౦ ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న మా నాన్నకు ఇంతకంటే మంచి బహుమతి ఇవ్వలేనేమో..

హాపీ బర్త్ డే నాన్న..

నాలోని పట్టుదల,మొండితనం. క్రమశిక్షణ, పాత పాటల మీద అభిమానం అన్నీ నాన్న నుండి వచ్చినవే..




తండ్రి లాలన పిల్లలకు వరం


ప్రేమ
.. ఒక మంత్రం. ఒక అద్భుతం. వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పెంచి దృఢపరిచేదే ప్రేమే. అది లేనివాడు రాక్షసుడు, శూన్యం లాంటివాడు. ప్రేమ అనేది ఒక వ్యక్తి మీద కావొచ్చు, ఒక వస్తువు మీద కావొచ్చు. ఒక పనిమీద కావొచ్చు.. తనను తాను ప్రేమించేవాడు అందరినీ ప్రేమిస్తాడు అని నానుడి. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తీకరించడం కూడా ఒక కళే. తల్లిదండ్రులను, భార్యాభర్తలను, స్నేహితులను ఒక్కటిగా చేసేది, కలిపి ఉంచేది ప్రేమే. వివాహ బంధంతో ఒక్కటైన స్ర్తిపురుషులు ప్రేమతో తమదైన లోకాన్ని సృష్టించుకుంటారు. వారి ప్రేమకు ప్రతిఫలమే పిల్లలు.



పిల్లలను తల్లి మాత్రమే ఎక్కువ ప్రేమిస్తుంది. తండ్రికి ప్రేమించడం తెలీదు అనుకుంటారు.. కాని తండ్రి కూడా తన పిల్లలను అమితంగా ప్రేమిస్తాడు. కాని అతను బయటకు చెప్పలేడు.. పిల్లల మీద తల్లిదండ్రులకు ఒకేవిధమైన ప్రేముంటుంది కాని వ్యక్తీకరణలోనే కాస్త తేడా ఉంటుంది. కుటుంబంలో తండ్రి బాధ్యత బయటకు వెళ్లి సంపాదించి, తన కుటుంబాన్ని పోషిస్తే తల్లి ఇల్లు, పిల్లల బాధ్యత తీసుకుంటుంది. అందుకే పిల్లలకు తల్లి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. తల్లితండ్రులు, పిల్లల గురించి చెప్పుకుంటే.. సాధారణంగా అందరూ అనుకునే మాటే కొడుకు తల్లి పోలిక, కూతురు తండ్రి పోలిక అని. అలాగే తండ్రికి కొడుకు కంటే కూతురి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది అంటారు.. ఇది నిజమే.. కొడుకు అనగానే వాడు చదువుకుని, సంపాదించి కుటుంబాన్ని చూసుకోవాల్సిన వంశోద్ధారకుడు.. మగాడు వాడి గురించి దిగులు పడాల్సిన పనిలేదు అనుకుంటాడు తండ్రి. కాని కూతురు అనగానే ఎన్నో భయాలు, జాగ్రత్తలు. తన కన్నబిడ్డలో తన కన్న తల్లిని, ఆ జగన్మాతను చూసుకుంటాడు. అల్లారుముద్దుగా అడిగినవన్నీ కొనిస్తాడు. ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళే ఆ చిన్నారిని అపురూపంగా పెంచుకుంటాడు. పిల్లలందరినీ సమానంగా ప్రేమించినా తండ్రికి కూతురిమీద ప్రేమ రవ్వంత ఎక్కువే. అల్లారుముద్దుగా పెంచి, పెద్ద చేసి చదువుచెప్పించడంతోపాటు ఆమెకు తగిన వరుడిని వెతికి పెళ్లిచేయడం అనేది తండ్రి బాధ్యతే కదా.



తన కూతురికి దొరికే అబ్బాయి ఎలాంటివాడో, ఆమెకు ఎటువంటి కష్టం కలగకుండా ప్రేమగా చూసుకుంటాడో లేదో, అడిగినవన్నీ ఇస్తాడో లేదో అనే బెంగ నిరంతరమూ వేధిస్తుంది. కూతురు చిన్నగా ఉన్నప్పటికనుండే ఆమె పెళ్ళి గురించి డబ్బులు వెనకేస్తాడు. అత్తవారింట్లో తన కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాని ఈ ఆలోచనలన్నీ అతని మనసులోనే నిక్షిప్తమై ఉంటాయి. బయటకు చెప్పుకోడు, చర్చించడు. అప్పుడప్పుడు భార్యతో మాత్రం తన భావాలను పంచుకుంటాడు. తన కూతురిని ఎప్పటికీ కంటికిరెప్పలా చూసుకోలేడు కాబట్టి తనలా ప్రేమించి, కాపాడుకునే భర్తను ఆమె కోసం వెతికి తీసుకొస్తాడు. ఒకవేళ కూతురు ఎవరినైనా ప్రేమించానని చెప్పినా ఇవే అనుమానాలు. ఆ అనుమానాలు తీర్చుకునేదాకా పెళ్లికి ఒప్పుకోడు.



ప్రతి తండ్రి తన కూతురిని తన కంటే ఎక్కువ హోదాలో ఉండి తన బిడ్డకు ఎటువంటి లోటురాకుండా, ప్రేమగా చూసుకునేవాడు భర్తగా రావాలని కోరుకుంటాడు. ఈనాడు చాలామంది ఆస్తి, అంతస్థులకంటే కుటుంబ మర్యాద, చదువు, ఈడుజోడు ఉంటే చాలు తమ పిల్లనివ్వడానికి సరేనం టున్నారు. దీనికోసం తమ తాహతుకు మించిన కట్నం ఇవ్వడానికి కూడా వెనుకాడడంలేదు.



తండ్రీ కూతుళ్ళమధ్య అనుబంధం చెప్పాలంటే ఆ భావాలు భాషకు అతీతం. ముఖ్యంగా తన కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టి కాపురానికి పంపుతున్నపుడు ఆ బాధ అనిర్వచనీయం. శకుంతలను అత్తవారింటికి పంపిస్తున్నపుడు కణ్వమహర్షి ఒక మాట అంటాడు. 34కేవలం పెంచిన తండ్రిని నాకే అమ్మాయి బయటకు వెళుతోందంటే ఇంత బాధగా వుందే.. మరింక కన్న తండ్రి బాధను ఎవరు చెప్పగలరు?-అని. ఆ అత్తవారిల్లు ఎలాంటిదో తెలుసుకుందుకు ఆ తండ్రి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాడో విక్రమ్‌సేథ్ రాసిన 3‘ద సూటబుల్ బాయ్’2కథ2 చదివితే తెలుస్తుంది. మనవాళ్ళు లోకరీతిలో ఒక మాట చెపుతూంటారు. 34్భర్యాభర్తలిద్దరూ ఒకరిమాట ఒకరు ఎప్పుడైనా వింటారా?2అనడిగితే... ఎందుకు వినరు? ఇల్లు కట్టేటపుడు భార్య మాట భర్త, పిల్లకి పెళ్లిచేసేటపుడు భర్త మాట భార్య వింటుంది2అని. అంటే దీని అర్థమేమిటంటే ఇల్లు ఎలా ఉండాలో ఇల్లాలికి తెలుస్తుంది, రాబోయే అల్లుడు ఎలా ఉండాలో తండ్రికి తెలుస్తుంది.. అని. అందుకని ప్రేమైకమూర్తి అయిన తండ్రికి కూతురి పెళ్లి బాధ్యత నిస్సంకోచంగా అప్పచెప్పెయ్యవచ్చు. ఎంత అభివృద్ధి చెందినా అత్తవారింట జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలు మాత్రం తగ్గలేదు. ఇంకా కట్నం చావులు ఆగలేదు. అందుకే తన శక్తికి మించినదైనా అడిగినంత కట్నం ఇచ్చి పెళ్ళిచేయాలని ప్రతీ తండ్రీ కోరుకుంటున్నాడు. తర్వాత తను ఎన్ని కష్టాలు పడ్డా తన బిడ్డ సుఖంగా ఉంటే చాలనుకుంటాడు. కానీ కొందరు తండ్రులు మాత్రమే తమ కూతుళ్ళను సున్నిత మనస్కులుగా కాకుండా ధైర్యంగా, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేలా ఉండాలని, ఎప్పుడుకూడా బేల కాకూడని చెబుతుంటారు.
కాలంతో పాటు ఈనాడు తండ్రులు కూడా మారుతున్నారు అని చెప్పవచ్చు. కుటుంబ నిర్వహణకు తనకు తోడుగా భార్య కూడా సాయపడుతున్నపుడు తానెందుకు ఆమెకు సాయపడకూడదు అని పిల్లల బాధ్యత, పెంపకం గురించి చిన్నప్పటినుంచే తండ్రి తెలుసుకుంటున్నాడు. వాళ్ళకు తినిపించడం నుండి చదివించడం, ఆడించడం అన్నీ చేస్తున్నాడు. పిల్లల పొరపాట్లను సరిదిద్దటంలో కూడా తల్లి గారాబం, మెతకతనం చూపిస్తుంది. అదే, తండ్రి విషయానికి వస్తేవారి మాటలు, చర్యలు దృఢంగా ఉంటాయి. తండ్రి మాటలు, చేతలలో స్థిరత్వం, మందలింపులో కఠినత్వంతోపాటు అనురాగం కూడా ఉంటాయి. తండ్రి పిల్లలకు మమతతో పాటు, క్రమశిక్షణనూ నేర్పిస్తాడు. పిల్లలు స్కూలుకు వెళ్లకుండా ఎగ్గొట్టటానికి అనేక కారణాలు చెప్తున్నపుడు తల్లి మెత్తబడవచ్చు కానీ, తండ్రి నిర్ణయంలో మార్పు రాదు. తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లల బాగుకోరేవారే అయినప్పటికీ తండ్రి పిల్లలతో వ్యవహరించే తీరు, తల్లి పెంపకానికి భిన్నంగా ఉంటుంది. పిల్లల విషయంలో తండ్రి మెత్తపడడు, రాజీ ధోరణిని అవలంభించడు. అందుకే చాలామంది పిల్లలు తండ్రితో మాట్లాడటానికి జంకుతారు. అమ్మకు చెప్పి అడిగిస్తారు. ఇది భయంతో కూడిన గౌరవం. తండ్రి గారాబం చేసినా, తప్పు చేస్తే మన్నించడని పిల్లలు జాగ్రత్త వహిస్తారు. తండ్రితో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ, తండ్రి మాటలకు ప్రభావితులై తమ ప్రవర్తనను తామే సరిదిద్దుకోగలుగుతారు.



పూర్వకాలంలో ఆడపిల్లకు చాకలి పద్దులు రాసేంత చదువు వస్తే చాలు, ఎంత చదివినా ఆడపిల్ల వంటింట్లోనే మగ్గిపోవాల్సిందే కదా అని పెద్ద చదువులు చదివించలేదు. కాని నేడు కూతురు, కొడుకు అనే తేడా లేకుండా చదివిస్తున్నారు. తన కూతురు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగస్థురాలు కావాలి, అందరిలో పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నారు తల్లితండ్రులు. కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేయడం కంటే అదే డబ్బుతో ఆమెను పెద్ద చదువులు చదివించి ప్రయోజకురాలిని చేసి ఉన్నత స్థానంలో ఉండేలా చేయాలనుకుంటున్నాడు తండ్రి. అమ్మాయిలు కూడా ఎందులోనూ తక్కువ కారు. ఎవరి మీదా ఆధారపడకూడదు, తన కాళ్ళమీద తాను నిలబడి ఒక మంచి పదవిలో ఉండాలని కోరుకుంటున్నాడు తండ్రి. కొడుకు ప్రయోజకుడై తమను ఆదుకుంటాడు అని అనుకోవడంతోపాటు కూతురు ప్రయోజకురాలై తనను, తన కుటుంబాన్ని చూసుకుంటుంది అని అనుకుంటున్నారు. ప్రతి తండ్రికి తన కొడుకులు, కూతుళ్లు ఇద్దరిపై సమానమైన ప్రేమ ఉంటుంది. కాని కూతురిమీద మమకారం ఎక్కువే.



తన ఆడబిడ్డ తన ఇంటి మహాలక్ష్మి నా తల్లి అని చెప్పుకుంటాడు తండ్రి. బంగారం, అమ్మ... అనే చెప్పుకుంటాడు. అనుక్షణం ఆమెకు తోడుగా ఉండాలని కోరుకుంటాడు. ఈ మధ్యే విజయవాడలో నాగవైష్ణవి అనే చిన్నారి దారుణంగా హత్యకు గురైనపుడు అంతులేని విషాదానికి లోనై ఆమె తండ్రి ప్రభాకర్ గుండె పగిలి కూతురితో పాటు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఇక, పెళ్ళై మరో ఇంటికి వెళ్లిపోయినా కూతురిమీద బెంగగానే ఉంటుంది తండ్రికి. ఎలా ఉందో, అత్తవారింట ఆమె అడిగినవన్నీ ఇస్తున్నారో లేదో, ఆమెను ఏ కష్టమూ రాకుండా చూసుకుంటారో లేదో అన్న బెంగ అతడ్ని సతాయిస్తూనే ఉంటుంది. అంతా బావుంటే ఫర్లేదు కానీ అత్తారింట కష్టాలు పడుతున్న కూతురి గురించి తెలిస్తే ఆ తండ్రి గుండె పగిలిపోతుంది. ఎటువంటి బాధలైనా మహిళ బయటకు చెప్పుకుని బిగ్గరగా ఏడ్చి తన భారాన్ని దింపుకుంటుంది కాని మగవాడు ఏడ్వకూడదు అంటారు కదా. ఆ మనోవేదన తన గుండెల్లో రగులుతుండగా దుఃఖాన్ని దాచుకుని కుమిలిపోతాడు తండ్రి.. అలా అని తండ్రులందరూ మంచివారే అనలేము. కుమార్తెల పట్ల అసహజంగా ప్రవర్తించే తండ్రులూ అక్కడక్కడ ఉన్నారు. వేరే కులంవాడిని ప్రేమించిందని సొంత కూతురిని అంతం చేసిన తండ్రులూ ఉన్నారు. కట్నం ఇవ్వాలి, ఖర్చుపెట్టాలి గనుక ఆడపిల్లల్నే వద్దనుకునేవారు ఇంకా మన సమాజంలో ఉన్నారు. వంశోద్ధారకుడిని చదివించి తన కష్టార్జితాన్ని రాసిచ్చినా జీవితపు చరమాంకంలో వృద్ధాశ్రమంలో పడేసి, లేదా ఇంటినుండి తన్ని తగలేసే కొడుకులు కోకొల్లలు మన దేశంలో. అత్తారింట తనకు అధికారం లేకున్నా తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉండేది కూతురే కదా. అందుకే అన్నారు కంటే కూతుర్నే కను అని.



కవులు కూడా తమ రచనలను కన్నకూతురిలా భావించి, కాసులకు ఆశించి మహరాజులకు అంకితమీయకుండా సాక్షాత్తూ ఆ దేవదేవుడికే అంకితమిచ్చారు. పోతన తన భాగవత మహాకావ్యాన్ని శ్రీ మహావిష్ణువుకు అంకితమిస్తూ ఇలా అన్నాడు.



ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుః గొన్ని పుచ్చుకుని చొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరాజొకఃడు భాగవతంబు జగద్దితంబుగన్



అధములైన రాజులకు అంకితమిచ్చి వారిచే పురములు, వాహనములు, సొమ్ములు పుచ్చుకుని తదనంతరం కష్టాలు పడడం ఇష్టంలేక నా భాగవతాన్ని మనస్ఫూర్తిగా ఆ శ్రీహరికే అంకితమిస్తున్నాను. అంతకంటే గొప్పవాడైన కృతికర్త ఉండునా? - అని పోతన తన భావాన్ని తెలిపాడు.



10 వ్యాఖ్యలు:

Unknown

తండ్రి ప్రేమ చాలా చక్కగా రాశారు. ఒకరకంగా పాత కాలం లోకన్నా, ఈ రోజుల్లో పిల్లలు తండ్రి ప్రేమను ఎక్కువగా పొందగలుగుతున్నారేమో, తల్లి ప్రేమ ఎలాగూ ఉండనే ఉంటుంది ఎప్పుడూ...

రాజ్యలక్ష్మి.N

తండ్రి ప్రేమ గురించి,పిల్లల మంచి జీవితం కోసం
తండ్రి పడే ఆరాటం గురించి చాలా బాగా చెప్పారండీ..
వ్యాసం బాగుంది.

mirchbajji

జ్యోతి గారికి కామెంట్ రాయబోతే నాకో పోస్ట్ లా అయింది... సరే అని పోస్ట్ లా ఉంచేసా...
http://mirchbajji.blogspot.in/2012/01/blog-post_31.html

rajachandra

చాల బాగా రాశారు.

శశి కళ

జ్యొతి గారు,తండ్రి ప్రెమ గూర్చి యెంత చెప్పగలము..ఈ నా కవిత ఆ ప్రెమకె.."ముచ్చటైన పాపను చూసి
మురుసుకుంటూ
కాలి పట్టీల గల గలలు
అరికాళ్ళలో పెదాల స్పర్శ నుంచి
మీసాల గిలిగింతకు
పాప నవ్వితే ....ముత్యాలు ఏరుకునే
తండ్రి నడగండి.....కూతురు ఎవరని....



లంగా,ఓణి లో మురిసిపోతూ
పాపటి బిళ్ళ కావాలి నాన్నఅని అడిగితె

వెచ్చని ఊపిరిని ముచ్చటగా పాపటిలో
అద్ది పొంగిపోయే తండ్రిని అడగండి ....
కూతురు ఎవరని....

పతి పక్కన పత్ని గా మారి
కాటుక కంటిలో కన్నీళ్లు నింపిన
కన్నకూతురిని చూసి
ప్రేమతో మనసు చెదిరిన
తండ్రి నడగండి....కూతురు ఎవరని....

చింతా రామ కృష్ణా రావు.

అమ్మా! నమస్తే.
ఈ క్రింది లింక్ తెరచి చదివి, ఔత్సాహికులైన మీ బ్లాగ్ పాఠకులకు ఈ అవధాన విషయం తెలియడం కోసం మీ బ్లాగులో వ్రాయ మనవి.
http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_06.html

ప్రియ

తల్లిని మించిన దైవము లేదు ..తండ్రిని మించిన స్నేహము లేదు

machlipatnam

చాల బాగుంది ఈ వ్యాసం.......

హనుమంత రావు

మీ వ్యాసం ఈ రోజు దాకా చదవలేదు.. మీ వ్యాసం చదివాక ఒక విషయం మళ్ళీ ఋజువైంది.. తండ్రికి ఆడపిల్ల మీద ప్రేమ సంగతేమోకాని, తన తండ్రిమీద కొడుక్కన్నా కూతురుకే ఎక్కువ ప్రేమ ఉంటుంది అని మరోసారి చెప్పారు... తండ్రి పిల్లలపట్ల ప్రేమను తల్లి ప్రకటించినంత స్వేచ్చగా ప్రకటించలేడన్నది నిజం..
ఈ విషయం ప్రక్కనపెట్తే... మీరు సూచించినట్టు తనని తాను ప్రేమించగలవాడే అందర్నీ ప్రేమించగలడు... ఆ ప్రేమ --షరతుల్లేని ప్రేమ కావాలి.. వారి బలహీనతలతో సహా ప్రేమించగలగాలి.. అదే నిజమైన ప్రేమ....

Anonymous

*వంశోద్ధారకుడిని చదివించి తన కష్టార్జితాన్ని రాసిచ్చినా జీవితపు చరమాంకంలో వృద్ధాశ్రమంలో పడేసి, లేదా ఇంటినుండి తన్ని తగలేసే కొడుకులు కోకొల్లలు .*

మరి కోడళ్ళు మామా గారికి సేవ చేస్తామన్నా కొడుకులు తండృలను బయటకు పంపుతరా? మా గేటేడ్ కమ్యునిటిలో మామా గారు రాత్రి నిద్ర పోయేటప్పుడు గురక పేడుతున్నాడని వృద్దాశ్రమనికి పంపిన వారు ఎందరో ఉన్నారు. ఈ సంఖ్య ఈ మధ్య బాగా పెరిగింది. విచారిస్తే మధ్యాహ్నం వీటికి కిట్టి పార్టిలు కారణం అనితెలిసింది. ఒకరు మొదలుపేడితే, వారి ద్వారా కిట్టి పార్టిలలో వివరాలు తెలుసుకొన్న మిగతావారు కూడ వారి మామా గార్లను సాగనంపటం మొదలుపెట్టడం బాగా ఎక్కువైంది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008