Saturday, 2 June 2012

వియ్యాలవారి వింత నగలు






photos courtesy : Mrs.Lakshmi Raghava


పందిట్లో పెళ్లి జరుగుతోంది.. పురోహితుడి మంత్రాలు, వధూవరుల తడబాటు.. మంగళవాద్యాలు, పట్టుచీరల రెపరెపలు.. కొత్త బంధుత్వంతో పలకరింపులు.. సరదాగా ఆట పట్టింపులు... ప్రతి పెళ్లిలో ఇదంతా సర్వసాధారణమే కదా! కానీ, పెళ్లి అనగానే వధూవరులకు సంబంధించిన కార్యక్రమాలే కాకుండా మరికొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఈ రోజుల్లో పెళ్లిళ్లు హడావుడిగా చేసేస్తున్నారు... కొన్నేళ్ల క్రితం తప్పనిసరిగా ఈ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తప్పనిసరిగా పాటించేవారు. అందులో ముఖ్యమైనది మగ పెళ్లివారికి ఆడపెళ్లివారు ఇచ్చే ప్రత్యేకమైన, విచిత్రమైన నగలు, వాయినాలు. పెళ్లి అంటే బంగారం, వజ్రాల నగలు ఎలాగూ వేసుకుంటారు కానీ ఇంకా ఈ ప్రత్యేకమైన నగలు ఏంటి? అనుకుంటున్నారా?? పెళ్లి తర్వాత మగపెళ్లివారి తరఫున ముఖ్యమైన ఆడవాళ్ళను అంటే వియ్యపురాళ్లు, ఆడపడుచులు, మేనత్తలు మొదలైనవారిని వరుసగా కూర్చోబెట్టి బొట్టుపెట్టి, తాంబూలం ఇచ్చి తాము స్వయంగా తయారుచేసిన ఈ విచిత్రమైన నగలను వాళ్లకు అలంకరించి ఆటపట్టిస్తూ, సరదా పాటలు పాడుతూ మంగళహారతి పట్టేవాళ్లు అమ్మాయి తరఫున ముతె్తైదువలు. ఇక ఆ ప్రత్యేకమైన, విచిత్రమైన నగలు ఏంటో తెలుసుకుందాం...


పెళ్లికి చాలా రోజులముందే బంగారు, వెండి, నీలం రంగుల్లో ఉండే మెరుపు కాగితాలు, అట్టలు, పూసలు, జరీ దారాలు, సన్నని గొలుసులు, మువ్వలు, అద్దాలతో అందమైన నగలు తయారుచేసి పెట్టుకుంటారు. ఇవి ఎలాంటి నగలు అంటే వడ్డాణం, అరవంకీలు, గాజులు, పాపిట గొలుసు, చెవులకు అందమైన లోలాకులు, వాటికి వేలాడే మాటీలు, చెంప స్వరాలు, మెడలోకి కాసుల దండలు, నెక్లెసులు, పొడవాటి గొలుసులు ఇలా ఎన్నో... అట్టముక్కలమీద మెరుపు కాగితం అంటించి గొలుసులు, అద్దాలు, పూసలు, రాళ్లు గమ్‌తో అతికించి, తమ సృజనాత్మకతని ఉపయోగించి సరైన నగలు తయారుచేసేవారు. మగపెళ్లివారు కూడా ఆ నగలను సంతోషంగా స్వీకరించి వారి ఆనందంలో పాలు పంచుకునేవారు. అదంతా ఆ రోజుల్లో.. ఇప్పుడంతా నాజూకు వ్యవహారమాయె..!


ఇక ఈ పెళ్లిళ్లలో మగపెళ్లివారి కోసం ఆడపెళ్లివాళ్లు తయారుచేసే మరో విచిత్రమైన నగల గురించి కూడా తెలుసుకుందాం. అవి అలాంటి లాంటి నగలు కావు.. అవి పప్పు దినుసులు, నవధాన్యాలతో చేసే నగలు. అసలు ఈ పప్పులు, ధాన్యాలు తినడానికి కదా వాడేది. వాటితో నగలు ఎలా చేస్తారని అనుకుంటున్నారా? కాస్తంత ఓపిక, కాస్తంత ఉత్సాహం, మరికొంత సృజనాత్మకత ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇందులో మనకు నవధాన్యాలు, పప్పులు సహజమైన రంగుల్లో దొరకుతాయి కాబట్టి కృత్రిమమైన రంగుల వాడకం ఉండదు. ఖర్చూ తక్కువే. మనం నిత్యం ఆహారంలో వాడే పప్పు దినుసులతోనే ఈ నగలు చేయవచ్చు. ముత్యాల్లా ఉపయోగించడానికి సగ్గుబియ్యం, వడ్లు, పుట్నాలపప్పు, మిరియాలు, నువ్వులు, కర్బూజ విత్తనాలు, ఆనపకాయ విత్తులు. (ఇవి రాయలసీమ, కర్నాటకలో విరివిగా లభించే ఒక రకం బీన్స్. ఇవి నానబెట్టి తొక్క తీస్తే వచ్చిన పప్పు) కాదేది కవితకనర్హం అన్నట్టు.. తయారైన నగలు చూస్తే కాదే ధాన్యమూ, దినుసు అలంకరణకు అనర్హం అని చెప్పవచ్చు. ఒకసారి సూపర్ మార్కెట్‌కు వెళ్తే అన్ని రకాల ధాన్యాలు దొరుకుతాయి. అలాగే- జరీదారం, గమ్, రంగు రంగుల మందపాటి అట్టముక్కలు, వార్నీషు, బ్రష్ కావాలనుకుంటే వెల్వెట్ గుడ్డ కూడా తెచ్చుకుంటే చాలు. ముందుగా మీరు చేయాలనుకున్న నగలు వాటి డిజైన్‌లను నిర్ణయించుకుని ఒక కాగితం మీద గీసి పెట్టుకోండి. దాని ప్రకారం అట్ట ముక్కలు కత్తిరించుకోండి. అట్టముక్కలు మంచి రంగుల్లో మందంగా ఉంటే గింజలను అలాగే అంటించవచ్చు లేదా దానిపైన పలుచటి వెల్వెట్ బట్టను నీటుగా అతికించాలి. ధాన్యపు గింజలు, మిగతా దినుసులను రంగులవారీగా వేరు చేసి పెట్టుకోండి. అట్టముక్క మీద కొద్ది భాగం మీద గమ్ రాసి లేదా గింజకే గమ్ రాసి అతికించవచ్చు. చాలా సన్నటి పటకారుతో లేదా కనుబొమ్మలకోసం వాడే ట్వీజరు వాడి ఈ గింజలను జాగ్రత్తగా రంగులు, సైజులు చూసుకుంటూ డిజైన్‌కు అనుగుణంగా అతికిస్తూపోవాలి. ఇలా నగ మొత్తం తయారయ్యాక కనీసం నాలుగైదు గంటలు ఆరనివ్వాలి. ఒకవేళ మధ్యలో ఏవైనా ఊడిపోతే మళ్లీ అతికించాలి. అవసరమైన చోట గొలుసు కాని, జరీదారం కాని అతికించాలి లేదా తగిలించాలి. ఇదేవిధంగా ఆ గొలుసులకు మాచింగ్‌గా చెవి దిద్దులు కూడా తయారుచేసుకోవాలి. వీలైతే గాజులు లేదా బ్రేస్‌లెట్ కూడా తయారు చేయవచ్చు. మొదట్లో కొంచెం తడబడినా, కష్టంగా అనిపించినా కాస్త అలవాటు కాగానే చేతులు అలా చకచకా కదిలిపోతూ ఉంటాయి. మరో విషయం మాత్రం మరచిపోకండి.. ఇందులో మినప్పప్పు, పుట్నాల పప్పు, వేరుశెనగ గుళ్లు లాంటివి పురుగుపట్టే అవకాశం ఉంది. అందుకే నగలు తయారుచేయగానే పైన సన్నటి బ్రష్‌తో వార్నిష్ పూయడం మాత్రం మరచిపోవద్దు.


ఈ నగలు స్వయంగా చేయడంవల్ల అవి చాలా అందంగా కనిపించకున్నా ఆత్మీయపు అనుబంధాన్ని మాత్రం స్ఫురింపజేస్తాయి. పెళ్లి సందడిలో సరదాగా గడిచిపోయే ఒక ఘట్టాన్ని అందరి మనసుల్లో నిలిపేస్తాయి. ఈ నగలు తయారుచేయడం అంత సులువైన పని కాదు. ఎంతో ఓపిక, శ్రమతో కూడుకున్నది. ఐనా సరే ఆచారాన్ని వదిలేయకుండా, మార్కెట్లో ఏదో ఒకటి కొనకుండా ఇంట్లోనే స్వయంగా చేసి బహూకరిస్తారు. అందులోనే అమితమైన ఆనందం లభిస్తుంది.

5 వ్యాఖ్యలు:

Lakshmi Raghava

chala బాగా రాసారు. ఈ రాతతో నగలకు కూడా అందం వచ్చింది.అభినందనలు
లక్ష్మీ రాఘవ

psm.lakshmi

బాగుంది. ఈ మధ్య హడావిడి పెళ్ళిళ్ళే ఎక్కువైనాయి. సరదాలు తగ్గిపోతున్నాయి.
psmlakshmi

సృజన

భలే బాగున్నాయండి..

మాలా కుమార్

వియ్యాల వారి సరదాల గురించి బాగా రాసారు . ఇవి మీ వియ్యపురాలికి చేయించిన నగలా :)

kannaji e

నిజంగానండోయ్ ...మీరంటే గుర్తొచ్చింది ...మా వైపు ఇలాంటివి లేదూ గాని ఈ మధ్య మా అత్తవారి తరపు పెళ్ళిళ్ళ కెళితే భలే ముచ్చటేసింది ఇలాంటివి చూసి...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008