విజయ విలాసము - కొత్త బ్లాగు
నరనారాయణులలో ఒకడైన అర్జునుడు మహావీరుడు. శ్రీకృష్ణుడి సహాయంతో ఎన్నో విజయాలు సాధించాడు. అందుకే విజయుడైనాడు. అర్జునుడు గెలుచుకున్నా, తల్లి ఆదేశం ప్రకారం ద్రౌపదిని వివాహమాడిన పాండవులు తమలో తాము ఒక నియమాన్ని ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ద్రౌపతి ఒక్కొక్కరి వద్ద ఒక్కో సంవత్సరం ఉండేటట్టుగానూ. ఆ సమయంలో మిగిలినవారు వారి ఏకాంతతకు భంగం కలిగించరాదని, ఒకవేళ అలా భంగం కలిగించితే వారు ఒక సంవత్సరకాలం దేశాటన చేయ్యాలని నియమం. ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుని గోసంరక్షణార్ధం అర్జునుడు ఆ నియమాన్ని ఉల్లంఘించి అన్నగారైన ధర్మరాజు మందిరంలో ఉన్న తన శస్త్రాస్త్రాలను తెచ్చుకోవడానికి వెళ్ళక తప్పలేదు. నియమ భంగం చేస్తాడు. నియమోల్లంఘన జరిగింది కాబట్టి అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరతాడు. ఆ క్రమంలో ముగ్గురు కన్యలను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. .. ఈ విజయుడు విలాసాలను అందంగా మలిచిన కావ్యం "విజయ విలాసం" ఈ శృంగార ప్రబంధాన్ని రచించినవాడు రఘునాధ మహారాజు ఆస్థానంలోని చేమకూర వేంకట కవి. ఇది ఒక చమత్కారమైన గ్రంధం. ఇందులో ఉన్న సొగసును చూసిన ఒక రసికుడు చేమకూర మంచి పాకాన పడింది అన్నాడంట. ఇంటిపేరు నసగా ఉన్నా కవిత్వం పసగా ఉందని కొందరన్నారు.
1600 నుండి 1630 వరకు తంజావూరును పాలించిన పండితకవి రఘునాధనాయకుడు. శ్రీకృష్ణదేవరాయలు తర్వాత అంతటివాడేకాక అంతకు మించినవాడు, ఆంధ్రభోజుడని పేరుపొందాడు. శత్రువులను నిర్మూలించడంలోనూ, జనరంజకంగా రాజ్యాన్ని పాలించడంలోనూ, రసహృదయులు మెచ్చునట్టుగా సంస్కృతం, తెలుగు రెండింటిలో భావకవిత్వం చెప్పగల ప్రతిభాశాలి. అంతే కాకుండా కొత్త కొత్త రాగాలను, తాళాలను కనిపెట్టి వాటిని వీణ మేళవింపుతో సంస్కరించగల సంగీతశాస్త్ర నిపుణుడు. బహుముఖ ప్రజ్ఞానిధి. సూర్యవరప్రసాధియైన చేమకూర వేంకటకవి ఈ రఘునాధమహారాజు కొలువులో ఉండేవాడు. ఆ రాజు సాంగత్యం వల్ల కావ్య రచన చేయాలన్న తలంపుతో విజయవిలాసం, సారంగధర చరిత్రము రచించాడు.
విజయవిలాసం ప్రబంధం శృంగార ప్రధానమైన కావ్యం అని చెప్పవచ్చు. విజయుడి విలాసాలను అందమైన చమత్కారాలతో వర్ణించాడు కవి. ఉలూచి, చింత్రాంగద, సుభద్ర లను వలచి, వలపించుకుని వివాహం చేసుకున్నాడు విజయుడు. ఈ మూడు వివాహాలను కొందరు స్వర్గ, మర్త్య, పాతాళలోకాల కన్యల వివాహాలుగా భావించారు. ఉలూచి పాతాళకన్య, చిత్రాంగద మర్త్య కన్య. సుభద్ర అవతారపురుషులైన కృష్ణ, బలరాముల సోదరి కాబట్టి దేవకన్య అనవచ్చు. భారత కథలోని ఈ అంశాన్ని అందంగా మలచిన కావ్యమే విజయవిలాసం.. అద్భుతమైన వర్ణనలు, యమకములు, అలంకారములు ఈ రచనలో కోకొల్లలు..
ఈ విజయవిలాసాన్ని బ్లాగీకరించాలని చేసిన చిన్న ప్రయత్నమే ఈ విజయవిలాసం బ్లాగు. సులువైన బాషతో, వీనులవిందు చేసే శ్రవ్యకాలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చింది. ఈ మహత్తర ప్రయత్నానికి కలిసి పని చేస్తున్నవారు .. రాఘవ, గిరిధర్, సనత్ శ్రీపతి, నారాయణస్వామి (కొత్తపాళి). జ్యోతి.. మరి వెళదామా విజయ విలాసాన్ని ఆస్వాదించడానికి..
విజయ విలాసము : http://vijayavilaasam.blogspot.in/
0 వ్యాఖ్యలు:
Post a Comment