మనసున మల్లెల మాలలూగెనే...
మల్లె తీగ వంటిది మగువ జీవితం..
మంచు కురిసే వేళలో మల్లె విరిసే
నెందుకో...
వెన్నెలలో మల్లియలు, మల్లెలలో ఘుమఘుమలు....
ఇలా మల్లెలు అనగానే మగువలే
గుర్తొస్తారు. ఇది తరతరాలుగా ఉన్న విడదీయరాని అనుబంధం. ఎన్ని రకాల పూలున్నా
మల్లెలకు సాటి వేరే లేదుకదా.. అతివల అలంకారానికి మాత్రమే కాక ఆహ్లాదం, ఆనందం, అనురాగాన్ని కూడా పంచే అద్భుతమైన
పూలివి. మరీ ముఖ్యమైన విషయమేంటంటే ఈ మల్లెపూలు ఆడవాళ్లు ధరించేది తమకోసం మాత్రమే
కాదు, తమను ప్రేమించే ప్రియుడు లేదా భర్త
కోసం కూడా అన్నది జగమెరిగిన సత్యం. కానీ, ఇవి ఏడాదిలో
మూడు, నాలుగు నెలలు మాత్రమే పూస్తాయి. అది
కూడా రాళ్లు పగిలే వేసవి ఎండల్లో.
మధ్యతరగతి ఇల్లాలైనా, మేడల్లో ఉండే మహారాణైనా తమ భర్తలు రోజూ కాసిన్ని మల్లెపూలు
తీసుకొస్తే బాగుండు అని కోరుకుంటారు. అందుకే కొందరు (చాలామంది) ఆడాళ్ళు ఏం మొగుడో!
ఏమో! పెళ్ళానికి మూరెడు మల్లె పూలు తేడు! మణులడిగానా, మాణ్యాలడిగానా? అని కంప్లయింట్ చేస్తుంటారు. తమ
ఇంటిముందు వచ్చే పూలవాడి దగ్గర కొనుక్కోవచ్చు, కాని, మనసైన వాడు ప్రేమతో తెచ్చి ఇస్తే ఆ ఇదే
వేరు... ఇక అలిగిన ఇల్లాలిని మస్కా కొట్టడానికి మల్లెపూలకు మించిన సాధనం
లేదేమో. ఈ కిటుకు ఎంతమంది భర్తలకు
తెలుసు!
కవిత్వం చెప్పించే మల్లియలు
మల్లెలను ఇంగ్లీషులో జాస్మీన్ అంటారు.
ఆలీవ్ కుటుంబానికి చెందిన మల్లెపూవు శాస్త్రీయ నామం జాస్మినం అఫిసినేల్. ఈ పేరు
యాస్మిన్ అనే పర్షియన్ పదం నుండి వచ్చింది. యాస్మిన్ అంటే దేవుని బహుమతి (గిఫ్ట్
ఆఫ్ గాడ్) అని అర్థం. పూర్వం చంద్రావతి అనే భక్తురాలు శివుణ్ణి మల్లికలతో పూజించడం
వల్ల శివునికి ఆ మల్లికల పేరున మల్లికార్జునుడు అనే వచ్చిందట. పోతన కవి తాను
రచించిన భాగవత గ్రంథంలో గోపికలు కష్ణుని కోసం వెతుకుతూ...
నల్లనివాఁడు పద్మనయనంబుల వాఁడు
గపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత
పింఛమువాఁడు న రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధ
నంబుఁ దెచ్చె నో!
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ!
చెప్పరే!
అంటూ అడిగారంట అని మల్లెల ప్రస్తావన
చేశాడు.
పూల బాసలు తెలుసునా ఎంకికి... అని నండూరి వారు ఆనాడే ఆనందించారు..
రవీంద్రులవారు Crescent Moonలో ఈ మల్లెల గురించి ఎంత అద్భుతంగా రాసారో..
Ah, these jasmines, these white jasmines!
I seem to remember the first day when I filled my hands with
these jasmines, these white jasmines.
(ఆహా ఈ మల్లెలు, ఈ తెల్లని మల్లెలు.
నా దోసిలి నిండా తెల్లని మల్లెల్ని
నింపుకొన్న ఆ తొలి రోజు నాకింకా గుర్తుంది.)
ఇక చలం మల్లెపూలకు ఎంతో అందమైన
కవితాత్మక రూపాన్నిచ్చి, అక్షరాలతో అర్చన చేశారు...
మల్లెపూలు, తెల్లని మల్లెపూలు!
విచ్చిన మల్లెపూలు!!
ఆ పరిమళం నాకిచ్చే సందేశం
యే మాటలతో తెలపగలను.!
సాయింత్రాలు స్నేహానికి
చల్లని శాంతినిచ్చే మల్లెపూలు.
అర్ధరాత్రులు విచ్చి
జుట్టు పరిమళంతో కలిసి
నిద్ర లేపి
రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు
వొళ్ళమధ్య చేతులమధ్య
నలిగి నశించిన పిచ్చి మల్లెపూలు
రోషాలూ నలూ
తీవ్రమయిన కోర్కెలతో
తపించి వాడిపోయిన పెద్ద మల్లెపూలు
సన్నని వెన్నెట్లో
ప్రియురాలి నుదిటి కన్న తెల్లగా
యేమి చెయ్యాలో తెలీని ఆనందంతో
గుండెపట్టి చీలికలు చేసే మల్లెపూలు
తెల్లారకట్ట లేచి చూసినా
యింకా కొత్త పరిమళాలతో
రాత్రి జ్ఞాపకాలతో
ప్రశ్నించే మల్లెపూలు
ఒక్క స్వర్గంలో తప్ప
ఇలాంటి వెలుగు తెలుపు
లేదేమో - అనిపించే మల్లెపూలు
అలిసి నిద్రించే రసికత్వానికి
జీవనమిచ్చే ఉదయపు పూలు
రాత్రి సుందర స్వప్నానికి సాక్షులుగా
అవి మాత్రమే మిగిలిన
నా ఆప్తులు!
ప్రేరకాలు ఈ పూవులే
అసలు పూలకు, స్త్రీలకు ఉన్న లంకె చాలా గొప్పది. అందుకేనేమో అందమైన స్త్రీని
విరిబోణి అంటారు.. మగవాైళ్లెనా, ఆడవాైళ్లెనా వారి మెదడుకు సంతోషంతో
కూడిన స్పందనను, జ్ఞాపకాల అనుభూతినీ కలిగించే పూలను
మించిన సహజమైన పాజిటివ్ ప్రేరకాలు వేరే లేవు. అయినా కూడా ఆడ-మగ అన్న భేదం లేకుండా
యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇష్టపడే పువ్వు మత్తెక్కించే మల్లెపువ్వేనని అందరూ
ఒప్పుకుంటారు. శ్వేతవర్ణంలో అమాయకంగా, అందంగా కనిపించే
మల్లెపూలు చేసే మోసాలు ప్ళ్ళైన ఏ మగవాడినడిగినా చెబుతాడు. తమ స్వచ్ఛమైన తెలుపు
రంగుతో, మధురమైన చల్లని సువాసనతో మరులు గొల్పే
మల్లెపూలు మండే ఎండాకాలంలోనే ఎందుకు పూస్తాయి? మండే ఎండలు, ఉక్కపోత, చిరాకు, దాంతో కోపం ఇలాంటి వాతావరణంలో ఇంత మంచి
పూలు పూస్తాయి.
హాయిగా చల్లని, ఆహ్లాదకరమైన శీతాకాలంలో ఎందుకు పూయవు! అప్పుడు పూస్తే, పూల అందచందాలు, సువాసనలు, అందమైన, మురిపించే సాయంకాలాలు
అందరు అనుభవిస్తారు, ఆనందిస్తారు కదా??? అని ఎంతోమంది
అనుకుంటారు. కానీ, ప్రకతి మనకు ఇచ్చే ఎన్నో సౌలభ్యాలలో రుతువులకనుగుణంగా మనకు
సంతోషాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే పూలు కూడా ఒకటి. దినమంతా వేడితో రగిలిన శరీరాన్ని, మనసును తమ
పరిమళాలతో చల్లబరిచేవి మల్లెలు.
మనసుకు, మేనికి ప్రశాంతతను చేకూర్చడంతో పాటు
తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సువాసన కారణంగా మల్లెపూలను మన దేశంలో పూలకే రాణిగా
పరిగణించడంతో పాటు బెల్లె ఆఫ్ ఇండియా లేదా సువాసన రాణి అని కూడా సంబోధిస్తుంటారు.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పుష్పాన్ని విభిన్న రకాల పేర్లతో పిలుస్తుంటారు.
మోగ్రా, మోతియా, చమేలి, మల్లి పూవ్వు, జాటి, మల్లిగే, జూహి, మోగ్రా లేదా పొద జాతి వక్షాల్లో మూన్‌లైట్ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో
రకంగా పిలుస్తారు. మొత్తం మీద మల్లెపూలలో 300 రకాలు ఉన్నట్టు అధికారికంగా నమోదైంది.
మల్లెపువ్వుకి మల్లిక, మగేష్టము, మల్లియ, ప్రయ, శూన్య, ముద్గరము, హసంతి, చంద్రిక, సుభగ వంటి పేర్లెన్నో ఉన్నాయి. మరి ఇంత చరిత్ర, ఇన్ని పేర్లు
ఉన్న మల్లెపూలలో నిత్యమల్లెలు,
బొండు మల్లెలు, దొంతర మల్లెలు, కాగడ మల్లెలు, శంకు మల్లెలు, బొడ్డు మల్లెలు, నాగ మల్లెలు, కొండమల్లెలు, కంచె మల్లెలు, దేశవాళి మల్లెలు
వంటి ఎన్నో రకాలు ఉన్నాయి.
పూల వ్యాపారం
ముఖ్యంగా మల్లెపూల వ్యాపారం మన దేశంలో
ప్రసిద్ధి చెందినంతగా మరే దేశంలోనూ కాలేదు అని చెప్పవచ్చు. మల్లెతోటల పెంపకం, మల్లెల నర్సరీలు, మల్లెల దళారులు, మార్కెట్లో లేదా
ఇంటింటికీ తిరిగి అమ్మేవారు, మల్లెలతో దండలు తయారుచేసేవారు, ఇలా మల్లెల అమ్మకంతో జీవనం సాగిస్తున్న
వారెందరో! అంతేకాక తోటల్లో మల్లెలు కోసేవారు, ఫంక్షన్ హాలు మొదలైనవాటిని మల్లెలతో
వివిధరకాల అలంకరణలు చేసేవారు, తోటల పెంపకంలో అవసరమైన పనులు చేసేవారు - ఇలా చాలామందికి మల్లెపూలు
బతుకుతెరువును అందిస్తున్నాయి. అందుకే మల్లెలసాగు వ్యాపారపరంగా చాలా పెద్దఎత్తున
సాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి,
శోభనానికి మల్లియలే.....
మల్లెలంటే ఇష్టం లేని వారుండరు. ఈ
మల్లెలు ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచి వారి వైవాహిక జీవితాన్ని మరింత
పరిమళభరితంగా చేస్తాయని అందరూ ఒప్పుకుంటారు. పెళ్లిళ్లు, మొదటిరాత్రి
సమయంలో మల్లెలు లేకుండా కార్యక్రమం చేయడాన్ని ఊహించడానికి కూడా ఇష్టపడరు.
పెళ్లిమండపం అలంకరణగాని, వధూవరులకోసం ప్రత్యేకంగా తయారుచేయబడే పూలదండలు కాని, వారి వైవాహిక
జీవితాన్ని ప్రారంభించబోయే తొలిరేయిన మల్లెపూలు తప్పకుండా వినియోగించాల్సిందే.
వేరే పూలు ఎంత ఖరీదైనా, ఎంత వర్ణ మనోహరమైనా ఈ చిన్ని మల్లెలసాటి రావు కదా! మల్లెపూలు
పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా అందరికీ వాటి రూపం, స్వచ్ఛమైన ఆ దవళ వర్ణం, ఆ పూల సువాసన
ఎంతో ప్రీతి! వేసవిలో మల్లెపూలకి కొరతే ఉండదు.
చాలామంది మహిళలకి మల్లెలంటే ఎంతో
మక్కువ. పూలెన్ని రకాలున్నా ఉన్నా,
మల్లెపూలే మనసుకిష్టం. మత్తెక్కించే సువాసనలు
జల్లుతూ రారమ్మని పిలుస్తూ మల్లెలను చూడగానే ఇట్టే కోసి పెట్టుకోవాలనిపించేట్టు
లేదా మాల కనపడగానే కొనేసి తల్లో తురుముకోవాలని అనుకోని ఇంతి ఉంటుందా... కాని, ఇంతలోనే వాటిని
కోసి, గుచ్చి, గొంతుకలు బిగించి కడుదురు కదా దయలేని ఆడవారు అని పుష్పవిలాపం
గుర్తుకొస్తుంది. అయినా కూడా జాలిలేదీ ఆడవాళ్లకు.
గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు
జిల్లాల్లో వివిధరకాల మల్లెలు పండిస్తున్నారు.
కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో ఎక్కువమంది
మల్లెల సాగునే జీవనాధారంగా ఎంచుకున్నారు. గుల్లగా ఉండే భూమిలో ఈ మల్లె పంట బాగా
పండుతుంది. ఎక్కువగా పొదగా పెరిగే మొక్కలనే మల్లెపంటకు ఉపయోగిస్తారు. మన ప్రాంతంలో
ఎక్కువగా గుండు మల్లెలు, అరేబియన్ మల్లెలు,
డబుల్ మల్లె, బొడ్డు మల్లె, సన్నజాజి, విరిజాజి, కాగడాలు
వినియోగిస్తారు. మల్లె తోటల సాగు జాగ్రత్తగా చేయాల్సిన వ్యవహారం. చలికాలంలో ఆకులు
రాలిపోతాయి. నవంబర్ రెండో పక్షంలో గనుక నీళ్లు పెట్టడం పూర్తిగా ఆపేస్తే పూలు బాగా
పూస్తాయి.
జనవరి నెలలో కొమ్మల తలలు తుంచేయడం, ఎండిపోయిన
కొమ్మలు, రెమ్మలను విరిచేయడం చేయాలి. ఇక ఆ సమయానికి నెమ్మది నెమ్మదిగా ఎండ
తీవ్రత పెరుగుతుంటుంది. అప్పుడు మొక్కలకు పెరట్లోని పేడను ఎరువుగా వేసి, కావలసినన్ని
నీళ్ళను సరఫరా చేయాలి. తీగమల్లెలకు జూన్, జూలై నెలల్లో కత్తిరించాలి.
ప్రతీవారికి అందుబాటైన ధరలో ఉండడం వల్ల మల్లెపూల వినియోగం కూడా ఎక్కువగానే
ఉంటుంది. మల్లెచెట్లు మన దేశంలోనే కాక ఇతర దేశాల్లోనూ విరివిగా సాగుబడి
చేస్తున్నారు. యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ మల్లెచెట్లు కనిపిస్తాయి. ఆయా దేశాల్లో
వివిధ రకాల పేర్లతో పిలిచినప్పటికీ వాటికి ఇంగ్లీష్ పేర్లు కలిపి అరేబియన్
జాస్మిన్, స్పానీష్ జాస్మిన్ ఇలా పిలుస్తుంటారు. బ్రెజిల్, ఫ్లోరిడా తదితర
దేశాల్లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఎంతో మక్కువతో మల్లెసాగు చేస్తున్నారు.
రకరకాల మల్లియలు
మల్లె మొక్కల్లో ప్రధానంగా రెండు
రకాలుంటాయి. ఒక రకం ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. రెండోరకం ఆకురాలు కాలంలో
దాదాపు మోళ్ళవుతాయి. కొందరు ఫిబ్రవరి నెలలో మల్లె ఆకులను దూస్తారు. అలాగే తలలు
తుంచేస్తారు. ఇలా చేస్తే మొక్కలు మరింత ఆరోగ్యకరంగా, తేజోవంతంగా ఎదిగి విస్తారంగా పూస్తాయంటారు.
మల్లెమొగ్గలు గుండ్రంగా బొద్దుగా వుండి వికాసదశకు రాగానే పరిమళాలు వెదజల్లుతాయి.
ఒకప్పుడు మల్లెపూలంటే వేసవికే పరిమితం. ఇప్పుడు విజ్ఞానం, సాంకేతికత బాగా
అభివద్ధి చెందిన కారణంగా ఏడాది పొడుగునా పూచే మల్లెజాతులనూ తీసుకురాగలిగారు.
కొద్దినెలలకే పరిమితం కాకుండా సంవత్సరమంతా మల్లెలు పూయడం అందరూ ఆనందించదగ్గ విషయమే
కదా!
మల్లెపూలనగానే తెలుపురంగులోనే
ఉంటాయనుకుంటారు. కాని కొన్ని రకాల మల్లెల్లో తెలుపుతో పాటు పసుపు, కొన్ని పూలల్లో
ఎరుపు వర్ణం కూడా కనిపిస్తుంది.
పాటల్లో మల్లియలు
భావుకత్వానికి ప్రతిరూపాలు కవులు.
వారికి పనికిరాని కవితావస్తువు కలదా.. అలాటి కవులు స్వచ్ఛంగా, తెల్లగా, సువాసనలు
వెదజల్లే ఈ మల్లెలను చూసి చలించి,
స్పందించకుండా ఉంటారా? మాటలకందని
మధురిమలను పంచే ఈ మల్లెల మీద తెలుగు సినీకవులు ఎన్నో పాటలు రాశారు. అవి ఎంతో
జనబాహుళ్యం పొందాయి కూడా. మల్లెలు అనగానే ముందుగా మనసును తట్టేది దేవులపల్లి ఇది
మల్లెల వేళయని. మల్లెలకు, వెన్నెలకు, కోయిలకు ముడిపెట్టాడు కవి ఈ పాటలో. మల్లెపు సొగసును, వర్ణాన్ని
అతిపవిత్రంగా, విశేషంగా భావిస్తూ మరుమల్లియకన్నా తెల్లనిది మకరందంకన్నా తియ్యనిది
మన ప్రణయం అన్నారో సినీ కవి. అలాగే మల్లెకన్న తెల్లన మా సీత సొగసు అని
పాడుకుంటున్నాడో ప్రియుడు.
అలాగే వికసించిన తెల్లని మల్లెపూవును, చిన్నారిపాపను, అందమైన అమ్మాయి
నవ్వుతో పోల్చాడు ఆత్రేయ సిరిమల్లె పువ్వల్లె నవ్వు.. చిన్నారి పాపల్లె నవ్వు..., సిరిమల్లె
పువ్వా సిరిమల్లె పువ్వా అంటూ తనవాడి కోసం కలలు కంటుందో కన్నెపిల్ల, మల్లెపువ్వులూ..
పిల్ల నవ్వులూ.. నీ కోసమే నీ కోసమే అంటూ కవ్విస్తున్నదో చిన్నది... నాగమల్లివో..
తీగమల్లివో నీవే రాజకుమారి...,
మళ్లీ మళ్లీ ఇది రానిరోజు మల్లెజాజి అల్లుకున్న
రోజు..., మల్లీ, మాలతి వస్తారా మాలికలెన్నో తెస్తారా? అంటూ మల్లెలతో వేరే పువ్వులను కూడా
జతకట్టారు సినీ కవులు.
ఇక మల్లెలకు ప్రణయానికి, సరసాలకు, అన్యోన్య
దాంపత్యానికి మరీ ముఖ్యంగా మొదటిరాత్రికి ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే
కదా. మరి ఈ సినీకవులు వీటిని ఎలా అనుసంధానించారో చూద్దాంః తెల్లచీర కట్టుకున్నదెవరికోసమో మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో..., సిరిమల్లె నీవే విరిజల్లు కావే..., మసకమసక చీకటిలో
మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో,
మధుమాస వేళలో మరుమల్లె తోటలో.., ఇదిగో తెల్లచీర, ఇవిగో మల్లెపూలు, ఇలా ఎన్నో
ఎన్నెన్నో... ఇక మల్లెలకు, జాబిల్లికి కూడా విడదీయరాని అనుబంధం ఉంది.. చల్లని వెన్నెలరేయిలో
మధురమైన, మత్తెక్కించే మల్లెలు తోడైతే ఆ జంటకు ఇక పండగే కదా.. మల్లెలు పూచె
వెన్నెల కాచే ఈ రేయి హాయిగా..,
మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా..., జాబిలమ్మ నీకు
అంత కోపమా? జాజిపూల మీద జాలి చూపుమా.., వెన్నెలలో మల్లియలు మల్లెలలో
ఘుమఘుమలు....
సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు.
సిరిమల్లె చెట్టే మొగ్గ విరగబూసింది, మనసున మల్లెల మాలలూగెనే అంటూ మాటల
పూబాణాలు విసిరారు సినీ కవులు. వాటిని అద్భుతమైన స్వరమాధుర్యంతో మనకందించారు గాయనీ
గాయకులు. మల్లెల మీద ఎన్ని మహత్తరమైన పాటలు?! అవి ఎప్పుడు విన్నా మరో ప్రపంచంలోకి
వెళ్ళినట్లుగా ఉంటుంది.
విరహగీతం
శ్రీనివాసుడి కొఱకు వేచి వేసి అలసి
సొలసి, విరహంతో వేగిపోతున్న శ్రీదేవి గురించి రాసిన కీర్తనలో
మతివిరహపు మేన మల్లెలు పూచె
అతనునితలపోత నడవిజాజులు పూచె-
అంటూ ఆ దేవి విరహస్ధితిని మల్లెలు, అడవిజాజులతో
పోల్చాడు అన్నమయ్య. పతికై వేచియున్న ఆ పడతి విరహం మల్లెపూవులా పూచిందట. మల్లెలే
ఎందుకంటే వాటి సువాసన మత్తెక్కిస్తుంది; పడతి విరహస్థితి కూడా అదే కదా? మరింత సమయం
గడిచింది. ఇంకా తనను చేరని దేవదేవుని తలచుకుంటూ ఇంకా రాలేదేమని విచారపడుతూ
నిట్టూరుస్తుంది. ఆ నిట్టూర్పుల తీవ్రత మామూలు జాజుల్లా కాకుండా అడవిజాజులంత
తీవ్రంగా, ఎక్కువగా ఉందట.
రెండోరకం ఆకురాలు కాలంలో దాదాపు
మోళ్ళవుతాయి. కొందరు ఫిబ్రవరి నెలలో మల్లె ఆకులను దూస్తారు. అలాగే తలలు
తుంచేస్తారు. ఇలా చేస్తే మొక్కలు మరింత ఆరోగ్యకరంగా, తేజోవంతంగా ఎదిగి విస్తారంగా
పూస్తాయంటారు. మల్లెమొగ్గలు గుండ్రంగా బొద్దుగా వుండి వికాసదశకు రాగానే పరిమళాలు
వెదజల్లుతాయి. ఒకప్పుడు మల్లెపూలంటే వేసవికే పరిమితం. ఇప్పుడు విజ్ఞానం, సాంకేతికత బాగా
అభివద్ధి చెందిన కారణంగా ఏడాది పొడుగునా పూచే మల్లెజాతులనూ తీసుకురాగలిగారు.
కొద్దినెలలకే పరిమితం కాకుండా సంవత్సరమంతా మల్లెలు పూయడం అందరూ ఆనందించదగ్గ విషయమే
కదా!
మల్లెపూలనగానే తెలుపురంగులోనే
ఉంటాయనుకుంటారు. కాని కొన్ని రకాల మల్లెల్లో తెలుపుతో పాటు పసుపు, కొన్ని పూలల్లో
ఎరుపు వర్ణం కూడా కనిపిస్తుంది. మల్లెలలో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని మల్లెపూలు
ఒక్కో కొమ్మకు మూడు నుండి ఐదు పూల వరకు పూస్తాయి. కొన్ని రకాల మల్లెలు మాత్రం
కొమ్మ చివరన పూస్తాయి. మల్లెపూల్లో ఉన్న రకాలను అనుసరించి కొన్ని పూలకు నాలుగు
లేదా ఐదు పూరెమ్మలుంటాయి. మరికొన్ని రకాల్లో నాలుగు నుండి తొమ్మిది రెమ్మలు
కనిపిస్తాయి. నాలుగు రెమ్మలున్నా,
ముద్దగా ఉన్నా, ఒక్కో మల్లె రకం ఒక్కో సువాసన ఇచ్చినా
అందరూ ఇష్టపడతారు.
అందానికే అందం
మల్లెపూలు కనపడితే కనీసం మూరైనా
కొనుక్కోవాలని ముచ్చటపడే మహిళలు ఎంతోమంది. పరిమళానికి, సోయగానికి, స్వచ్చమైన ధవళ
కాంతులకు మారుపేరైన మల్లెపూలు స్త్రీల సిగలో సహజ ఆభరణాలుగా మాత్రమే ఉంటాయనుకోవడం
పొరపాటు. తలలో ధరించటానికి, దేవుని పటాలను అలంకరించటానికి, పెళ్లి వేదికలను ఆకర్షణీయంగా చేయటంలోనూ
మల్లెలకు సరితూగేవి లేవు మరి. స్త్రీల సౌందర్యాన్ని పెంచడంలో మల్లెది ప్రత్యేక
పాత్రే.. ఈ మల్లెలతో మరువము, దవనము, కనకాంబరాలు, గులాబులు వంటి వాటిని జతకలిపి మాలకడితే దాని వాసన, అందం మాటల్లో
చెప్పగలమా!
అనేక సౌకర్యాలు
రోజంతా శారీరక కష్టంతో అలసిన శరీరాన్ని
సేదతీర్చి, మనసంతా ఆహ్లాదాన్ని
పూల జడ- ఒక మేనేజ్‌మెంట్
ఆడపిల్లలున్న ఇంటిలో వేసవి తీసుకొచ్చే
మల్లెల సంబరాలెన్నో. పరీక్షలు పూర్తిచేసుకుని సెలవుల్లో ఇంటిపట్టున ఉండే
అమ్మాయిలకు నిండుగా మల్లెలతో పూలజడ వేయాలని తల్లికి, పెద్దవాళ్ల ఆకాంక్ష. అది అనుకోగానే
జరిగేపని కాదు. ఎంతో తతంగం ఉంటుంది. తొందరగా ఇంటిపని పూర్తి చేసుకుని మధ్యాహ్నమే
మంచి మల్లె మొగ్గలను తెచ్చుకుని ఇంట్లోవాళ్లు, ఇరుగుపొరుగు కలిసి ఈ పూలజడ
కార్యక్రమానికి నాంది పలుకుతారు. అమ్మాయికి తలంటి సవరం, జడకుచ్చులతో
వాలుజడ వేస్తారు. ఇప్పుడంటే పూలజడలు తయారుగా దొరుకుతున్నాయి.
తెచ్చి పది నిమిషాల్లో జడకు
కుట్టేస్తున్నారు. కాని ఒకప్పుడు అమ్మాయి వాలుజడకే పూలను నేరుగా కుట్టేవారు.
కొబ్బరిపుల్లలను సన్నగా చెక్కి వాటికి మల్లెమొగ్గలను వరుసగా కుచ్చితే వాటిని
పొడుగాటి సూదికి ఎక్కించి జడకు కుడతారు. మధ్యమధ్యలో దవనం, కనకాంబరాలు, గులాబీలతో ఎంతో
కళాత్మకంగా పూలజడను కుడతారు. దీనికి ఎన్నో గంటల సమయం పడుతుంది. కాని, ఫలితం మాత్రం
అందరికి సంతోషాన్ని, సంతప్తిని ఇస్తుంది. అమ్మాయికి పూలజడ కుట్టే ఆ దశ్యం ఎంతో అబ్బురంగా
ఉంటుంది. కుటుంబంలోని సభ్యులు,
స్నేహితులు కలిసి ఎంతో ఇష్టంగా కలిసికట్టుగా
సజనాత్మకంగా జడని తీర్చిదిద్దుతారు! ఏ మేనేజ్‌మెంట్ గురులు నేర్పారు మహిళలకు టీమ్
బిల్డింగ్ గురించి? పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేసే మేనేజ్‌మెంట్ గురువులు కూడా ఆ
దశ్యాలను చూసి, కలసికట్టుగా సాగించే ఆ కషిని చూసి ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోక
మానరు.
ఆ ఆనందం వర్ణనాతీతం! జడ వేయగానే
పనైపోలేదు. ఆ తర్వాత పట్టు పరికిణీ,
జాకెట్, బొట్టు, కాటుక, మెడలో బంగారు గొలుసు, చేతికి గాజులు, వేలికి ఉంగరం
పెట్టి అమ్మాయిలని ముస్తాబు చేసి ఫొటో స్టూడియోకి తీసుకెళ్లి పూలజడ కూడా
కనిపించేలా వెనకాల పెద్ద అద్దం పెట్టించి ఫొటో తీయిస్తారు. అదో ముచ్చట. మరపురాని, మరచిపోలేని
అనుభూతి. ఇది పెద్దవాళ్లకే కాక పెద్దయ్యాక ఆ పిల్లలకు కూడా ఒక మధురమైన జ్ఞాపకంలా
మిగిలిపోతుంది. కాని, ఇవన్నీ తలుకుచుంటే ఆధునికత మోజులో ఇప్పటి చిన్నారులు ఏం
కోల్పోతున్నారో అని మనస్సు చివుక్కుమంటుంది.
నింపేది
ఈ మల్లెల గుబాళింపే. ప్రతి రోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవటం వల్ల
ఆహ్లాదంగా వుండడమే కాదు, కళ్లకూ మేలు జరుగుతుంది. అలసిన కనురెప్పలపై
మల్లెలను కొద్దిసేపు పరిచి వుంచితే చలువ చేస్తాయి. బాగా నిద్రపడుతుంది.
మల్లెలు అనగానే తలలో పెట్టుకోవడానికి, పూజకు మాత్రమే వినియోగిస్తారు
అంటారు. కాని వీటిని సబ్బులు, తలనూనెలు, సౌందర్య సాధనాలు, అగరు బత్తీల
తయారీల్లో కూడా విరివిగా ఉపయోగిస్తారు.. భారతదేశంతో సహా చైనా,
ఈజిప్టు, మెరాకో లాంటి దేశాల్లో మల్లె పూల నుంచి నూనెను తీస్తారు. ఇందుకు
భారీ ఎత్తున మల్లెలను వినియోగించి రసాయన పద్ధతిలో ఆవిరిని తీసి మల్లెల
నుంచి నూనెను వేరు చేస్తారు. కొద్ది పరిమాణంలో నూనె తయారీకి చాలా పూలను
వాడవలసి రావడం వల్ల ఈ మల్లె నూనె ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఆరోగ్యానికీ మల్లెపూలే...
మల్లెలను అలంకారానికి, పూజలకే కాకుండా ఆరోగ్యసమస్యలకు కూడా నివారిణిగా
ఉపయోగిస్తారు. తలలో చుండ్రు సమస్య ఉంటే కాసిన్ని ఎండుమల్లెపూలు, మెంతులు
కలిపి నూరి ఆ ముద్దను తలకు పట్టించి, తర్వాత స్నానం చేస్తే జుట్టు
పట్టుకుచ్చులా అవుతుంది. కొబ్బరినూనెలో మల్లెలు వేసి రాత్రంతా నానబెట్టి
మర్నాడు బాగా కాచి వడగట్టి వాడుకుంటే వెంట్రుకలకు మంచి సువాసనతోపాటు పోషణ
కూడా లభిస్తుంది.. మల్లెపూలలో చర్మానికి ఎంతో అవసరమైన విటమిన్ సి మెండుగా
ఉంటుంది. మల్లెలు, కొద్దిగా పాలు కలిపి ముద్దగా చేసి మొహానికి పేస్ పాక్‌లా
కూడా చేసుకోవచ్చు.
మల్లెపూల రసంలో గులాబీ పూల రసం, గుడ్డులోని
పచ్చసొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే మదువుగా,
కాంతివంతంగా అవుతుంది. మల్లెపూవులు చల్లని నీరు కలిపి మెత్తగా రుబ్బి
కణతలకు రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. వేళ్ల మధ్య పగుళ్లు, కురుపులు,
రసికారడం లాంటివి జరుగుతున్నప్పుడు మల్లెలు ముద్దగా నూరి రాస్తే తగ్గుతాయి.
అలాగే మల్లెచెట్టు ఆకులను శుభ్రంగా కడిగి తుడిచి ఆకులను నమిలి ఆ రసం
నోరంతా తగిలేలా చేస్తే నోటిపూత, పంటినొప్పి తగ్గుతాయి. మల్లెపూలు శరీరంలోని
సూక్ష్మక్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తాయి.
సుఖరోగాలకి,
పచ్చకామెర్లకి, అల్సర్స్‌కి, కాలిన బొబ్బలకి, చర్మరోగాలకి, కంటికి
సంబంధించిన అనేక వ్యాధులకి కూడా ఈ మల్లెలు ఎంతో ఉపయోగపడతాయి. మనం నిత్యం
వాడే ఫేస్‌క్రీంల్లో, షాంపూల్లో, సబ్బుల్లో, అంతే కాక దోమల నివారణ కోసం
తయారుచేసే కాయల్స్, రూమ్ ఫ్రెష్‌నర్స్ తయారీలో వీటిని వాడతారు. ఇలా మల్లెలు
ఎప్పుడూ మనకు అందుబాటులో, చేరువలో ఉండి ఉపయోగపడే ఎంతో విలువైన పుష్పం.
సంప్రదాయంలో సాటి లేని పూలు
నుదుట తిలకం, చేతికి గాజులు, తలలో పూలు - ఇదీ సగటు భారత వనిత ప్రతిరూపం. ఆ
పూలల్లో కూడా మల్లెపూలకే ప్రాధాన్యం. ఇది ఒకప్పుడే కాదు, ఇప్పటికీ
సంప్రదాయబద్ధంగా చీర కట్టుకునే స్త్రీలందరూ పూలు పెట్టుకోడానికి
ఇష్టపడ్తారు. జీన్స్, స్కర్ట్స్, పంజాబీ సూట్స్ వేసుకున్నా పెళ్లిళ్లు,
పార్టీలకు సంప్రదాయకంగా తయారై నగలు, పూలతో అందంగా అలంకరించుకుంటారు
అమ్మాయిలందరూ. ఏ పూలు పెట్టుకున్నా ఇష్టమే కాని మల్లెపూలంటే మాత్రం
ఆడపిల్లలు ప్రాణమే పెడతారు.
గిరాకీ ఎక్కువుండే పూలు
ఇళ్ళలో మల్లెమొక్కల సంగతి అలా వుంచితే మల్లెతోటలను వత్తిగా చేసుకున్నవారికీ
కొదవలేదు. తోటల్లోని మల్లెలను ఎక్కడెక్కడికో ఎగుమతి చేయాలి గనుక సాయంత్రం
విచ్చుకునే పూలను మొగ్గగా ఉన్నప్పుడే ఉదయాన్నే కోసేస్తారు. అయితే
రాత్రివరకూ వాటిని ఎండ సోకని విధంగా చల్లగా వుండేలా చూడాలి. సాయంత్రం
ఆరయ్యేసరికి మల్లెమొగ్గలు వికసించడం ప్రారంభిస్తాయి.
మల్లెలు అటు
కేశాలంకరణకు, దేవాలయాల్లో వినియోగానికి, ఇటు అత్తర్లు మొదలైన కాస్మొటిక్
ఉత్పాదనల్లోనూ ఉపయోగించడంతో వీటికి మార్కెట్ బాగా వుంది. వేసవి సమయంలో మూర
పదిరూపాయలు పైగా పలికినా కొనకుండా ఉండలేరు స్త్రీలు. ఇక పెళ్ళిళ్ళ సమయంలో
అయితే చెప్పనవసరమే లేదు. దండలు, పూలజడలు, ఫంక్షన్ హాలు, పెళ్ళి మండపాల
అలంకరణ - ఇలా కిలోలు, బుట్టలకొద్దీ మల్లెపూల అమ్మకాలు, కొనుగోళ్ళు
జరుగుతాయి. అలాగే పండుగలు, పర్వదినాలు, పూజలు, వ్రతాల సందర్భాల్లో
మల్లెపూలకు విపరీతంగా గిరాకీ వుంటుంది.
వేసవి రాగానే చిన్న చిన్న
బండ్లు, సైకిళ్లమీద ఇంటింటికీ తిరిగి అమ్మేవారు మొదలు పెద్ద మొత్తంలో
అమ్మేవారి వరకూ మల్లెపూల వ్యాపారులు విస్తారంగా ఉన్నారు. తీరిక, ఓపిక
తగ్గడంతో విడిపూలు కొనుక్కుని మాల కట్టుకునేవారి సంఖ్య తగ్గిపోవడంతో అల్లిన
మల్లె మాలలు కూడా విరివిగానే దొరుకుతున్నాయి.
మల్లెమాల-అదొక సౌకుమార్యం
మల్లెలను సూది దారంతో గుచ్చకుండా దారంతో అల్లడం ఒక ప్రత్యేకమైన కళ.
మాట్లాడుతూనే అలవోకగా మల్లెలు, కనకాంబరాలు, మరువం కలిపి అందమైన మాలను
అల్లేస్తూ ఉంటారు. ఈ నైపుణ్యం ఉన్నవారి చేతిలో మల్లెలు అందంగా ఒదిగిపోతాయి.
విడిపూలతోబాటు మల్లెపూలతో దండలు అల్లి అమ్మేవారు పూల మార్కెట్లలోనే
కాకుండా ఆలయాల దగ్గర దుకాణాలు తెరుస్తున్నారు. పల్చగా, ఒత్తుగా దండలు
అల్లడమే కాకుండా వేర్వేరు పూలను కలిపి కదంబమాలలుగా తయారుచేస్తారు.
మధ్యమధ్యలో మరువపు దొంతర్లు, గులాబీల గుత్తులు కనువిందు చేస్తాయి. దేవుడికి
నివేదించడానికి, పెళ్ళిళ్ళల్లో మార్చుకోడానికేగాక, గౌరవసూచకంగా మెడలో వేసే
పూలదండలు వుండనే వుంటాయి. ఆలయంలో మల్లెమాల సమర్పిస్తామని మొక్కుకునే
వారున్నారు. ఇళ్ళలోనూ దేవుడి పటాలను మల్లెమాలతో అలంకరించే సంప్రదాయం వుంది.
తేనీరు కూడా
మల్లెపూలు తల్లో పెట్టుకోవడమే కాదు వాటితో రుచికరమైన, ఆరోగ్యదాయకమైన
తేనీరు కూడా తయారు చేస్తారు. మనకు ఇలాచీ టీ, జింజర్ టీ, లెమన్ టీ, పుదీనా
టీ, మసాలా టీ లాంటివెన్నో ఉన్నాయిని తెలుసు. కానీ, జాస్మీన్ టీని మక్కువగా
తాగే వారెందరో ఉన్నారు. నిజానికి మనం ఇప్పుడు తాగుతున్న తేయాకు చాయ్ కంటే
ముందే క్రీ.శ.960 - 1279 కాలంలో చైనాలో మల్లెలతో ద్రావకం చేసుకుని
తాగేవారంట.. ఇదెలాగ అంటే నీళ్ళలో కొన్ని మల్లెపూలు, కొద్దిగా పంచదార వేసి
బాగా మరిగించి వడకడతారు. చూట్టానికి మామూలు నీళ్ళలాగే ఉన్న ఈ మల్లెల
ద్రావకాన్ని ఎంతో ఇష్టంగా తాగేవారట.
ఇప్పట్లో తేయాకు టీ, కాఫీ.
అప్పట్లో తెలియకపోవడంతో 800 సంవత్సరాల క్రితం వరకూ మల్లెల ద్రావణాన్నే
అతిథి అభ్యాగతులకు కనీస మర్యాదగా అందించేవారు. ఈ మల్లె పూలతో తయారైన టీని
వారి భాషలో పిన్‌యిన్ మొ లి హుఆఛా అంటారు. అదే విధంగా ఒకినావా, జపాన్‌ల్లో
కూడా సన్‌పిన్ ఛా అని అధికంగా వాడతారు. ఫ్రెంచ్ వారు ఈ మల్లె రసాన్ని
సువాసనభరితమైన మలెపూల నించి తీసి ఉత్పత్తి చేస్తూవుంటారు. ఈ మల్లె రసాన్ని
అమెరికాలో బ్రెడ్లు, చాక్లెట్ తయారీలో వినియోగిస్తారు. అసలు మల్లెపూలను
ప్రపంచానికి అందించిన ఘనత కూడా చైనాదే అని ఎందరో విశ్వసిస్తున్నారు.