సృజనకు స్ఫూర్తి... అంతుబట్టని అపురూప చిత్రం ఈ ప్రకృతి!
కొండలు, కోనలు... గట్టులు, గుట్టలు... చెంగున దుమికే లేళ్ళు, సెలయేళ్ళు...
పచ్చని వర్ణంతో పరిసరాలను చైతన్య పరచే చెట్లు, చేమలు... కలకూజితాలతో
గాలికి రంగులద్దే పిట్టలు... ఉభయ సంధ్యల్లో రాగరంజితమయ్యే సువిశాల ఆకాశం...
ఆ ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటపడే తెలినురగల కెరటం...
వీటిని చూసి గంతులు వేయని హృదయముంటుందా? ఏ భావుకత లేని అతిసాధారణ హృదయమే ఈ అందాల్ని చూసి పులకిస్తుంది. ఇక కళ
అయితే, కుంచెల అవసరం లేకుండా చిత్రించేందుకు, వారి చిత్రణ విధానానికో
నవ్యతను కూర్చుకునేందుకు ఎన్నెన్నో ప్రయోగాలు చేసే అపురూపమైన చిత్రకారులు
కొందరుంటుంటారు. వారిలో ప్రఖ్యాత అమెరికా నైరూప్య అభివ్యక్తి చిత్రకారుడు
జాన్సన్ పొల్లాక్... మరో అమెరికా విద్యావేత్త చిత్రకళావిద్యలో చేతివేళ్ళ
చిత్రీకరణని ఒక మాధ్యమంగా ప్రవేశపెట్టిన రూథ్ పయ్‌జన్ షా, ఆమెకు
అనుయాయులుగా జాన్ థామస్ పైన్, కారీలు... టెయిలర్ రమ్సే, నిక్
బెంజామిన్, జిమ్మీ లీ సుదాత్ మొదలైనవారు ఉన్నారు.
నిజానికి,
చిత్రకారులందరూ చిత్రాలను గీస్తూ చేతివేళ్ళను ఏదో ఒక సందర్భంలో
ఉపయోగిస్తారు. కుంచెను పట్టుకుందుకు చేతి వేళ్ళే ఆధారమౌతాయి. కానీ...
వేళ్ళతో కుంచెను పట్టకుండా, ఆ వేళ్ళనే కుంచెగా ఉపయోగించి గొప్ప చిత్రాలను
సృజించగల వినూత్న చిత్రకారులు కొందరే. ఈ ‘వేళ్ళకుంచెల’ చిత్రకారులు
వేళ్ళమీద లెక్కించ గలిగినంతమంది మాత్రమే మనకు తారసపడతారు. అలాంటి కొద్ది
మంది చిత్రకారుల్లో వేలెత్తి సగర్వంగా చూపించగలిగే సత్తా ఉన్న మన తెలుగు
చిత్రకారుడూ ఒకరున్నారు.
తన చేతివేళ్లనే కుంచెగా ఎన్నోచిత్రాలను ఆవిష్కరించిన ఒక చిత్రకారుడి గురించి మాలిక మే నెల సంచికలో తెలుసుకుందాంః..