Mon 22 Jun 01:23:44.677526 2015
ఒక
గృహిణి చేయగల, చేసే పనులేముంటాయి.. ఇల్లు, పిల్లలు, వంట, బంధువులు, పూజలు,
తీరిక దొరికితే టీవీ సీరియళ్లు, సినిమాలు....ఇంతేనా? ఇంకేమీ లేదా
తెలుసుకోవడానికి, చేయడానికి.. అన్నిరంగాలలో పెరుగుతున్న అవసరాలు, ఆధునికత,
అంతకంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఈనాడు మన
నట్టింట్లోకి వచ్చింది. ఈ సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తుంది అంటే
కంఫ్యూటర్ ఇంజనీర్లకు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకే పరిమితమైన కంప్యూటర్
వాడకం, అంతర్జాలం లేదా ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయి ప్రతి ఇంట్లో
తప్పక ఉండవలసిన నిత్యావసరమైపోయింది. కంప్యూటర్ వాడకం ఉద్యోగాలు చేసే
సాంకేతిక నిపుణులకే కాక స్కూలు పిల్లలకు కూడా తప్పనిసరిగా అవసరమైపోతుంది.
అందుకే దాదాపు ప్రతి ఇంట్లో కంప్యూటర్ కొని ఇంటర్నెట్ కనెక్షన్
పెట్టించక తప్పడంలేదు. కాని చదువుకునే పిల్లలు, ఉద్యోగం చేసేవాళ్లకు
మాత్రమే ఈ కంప్యూటర్ ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే. కాసింత ఆసక్తి,
పట్టుదల ఉంటే చాలు ఎక్కువ చదువుకోకున్నా, ఇంగ్లీషు రాకున్నా కూడా
కంప్యూటర్ వాడకం నేర్చుకుని ఇంటర్నెట్టు ద్వారా ప్రపంచమంతా చుట్టి
రావొచ్చు. అది కూడా ఇంట్లో కూర్చునే, ఇంటిపని చేసుకుంటూనే...
ఈనాడు
ఇంటర్నెట్ వాడకం అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది. అసలు ఈ అంతర్జాలం
ఉపయోగాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అది ఉపయోగించుకోవడం కూడా చాలా సులభం.
అంతర్జాలం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోని సమాచారాన్ని చేరవేస్తూ వ్యక్తుల
మధ్య దూరాన్ని తగ్గిస్తోంది. ఇంకా చెప్పాలంటే మన చేతివేళ్ల విన్యాసంతో
క్షణాల్లో కావలసిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు, పంచుకోవచ్చు. వృత్తిరీత్యా,
ఉద్యోగరీత్యా సప్తసముద్రాలకావల ఉన్న మిత్రులు, కుటుంబసభ్యులతో నిమిషాల్లో
ముచ్చట్లాడుకోవచ్చు. అది ఉత్తరమైనా, మాటలైనా..ఎలా ఐనా. అది కూడా చాలా చవకగా
చేసుకోవచ్చు. పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం వల్ల కంప్యూటర్లు, నెట్
ధరలు కూడా ఎక్కువమందికి అందుబాటులోనే ఉంటున్నాయి.
ఉద్యోగాలు చేయని
మహిళలు తీరిక సమయాలలో టీవీ సీరియళ్లు, ఊసుపోక కబుర్లు, షాపింగ్ చేసే బదులు
కంప్యూటర్ ముందు కూర్చుని ఎన్ని పనులు చేయొచ్చొ చూడండి. మీకు కావలసిన
పుస్తకం గురించి కానీ, సినిమా ఐనా, కాలేజీ ఐనా, సినిమాపాటైనా, స్తోత్రమైనా,
పుణ్యక్షేత్రమైనా .. ఏదైనా సెర్చి ఇంజన్ల ద్వారా క్షణాల్లో మనకు కావలసిన
సమాచారం తెలుసుకోవచ్చు. పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఫీజులు వగైరా వివరాలు
కావాలంటే ఎవరు చెప్పాలి?. ఎవరిని అడగాలి అనే మీమాంస చాలామందికి ఉంటుంది.
అప్పుడు కంగారు పడకుండా షషష. స్త్రశీశీస్త్రశ్రీవ.షశీఎ గూగులమ్మని అడిగితే
సరి. అలాగే నెట్ ద్వారా పరిచయమైన మిత్రులతో, విదేశాలలో ఉన్న మిత్రులు
ఎవరితో ఐనా మాట్లాడి మనకు కావలసిన విషయాల గురించి క్షుణ్ణంగా
తెలుసుకోవచ్చు. అంతేకాదు పిల్లల స్కూళ్లు, కాలేజీల వెబ్ సైట్లకు వెళ్లి
అక్కడి కోర్సులు, ఫీజులు , ప్రవేశ పరీక్షల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని
మనకు నచ్చిన కాలేజీలో చేరడానికి ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు. అంతర్జాలం
చదువుకున్న, చదువుకుంటున్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చదువుకు
సంబంధించిన వివరాలు, ఉద్యోగావకాశాలు, ఒక్కోసారి ఉద్యోగానికి సంబంధించిన
ఇంటర్వ్యూలు మొదలైనవెన్నో ఇంట్లోనే ఉండి తెలుసుకోవచ్చు. ఇక తమ ఉద్యోగ
నిర్వహణలో అవసరమయ్యే సమాచారం కోసం ఎక్కువ వెతుకులాడకుండా నిమిషాల్లో నెట్
ద్వారా తెలుసుకోవచ్చు. రిసెర్చి , ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నవారికి ,
ఎక్కువ పుస్తకాలు కొనలేని వారికి కంప్యూటర్, అంతర్జాలం చాలా
ఉపయోగపడుతుంది. నెట్లో ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు, ఆయా ప్రొఫెసర్ల వీడియో
పాఠాలు కూడా లభ్యమవుతాయి..
మీకు సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మిక విషయాలంటే
ఆసక్తి ఉందా? వాటి గురించిన మరింత సమాచారం కావాలనుకుంటున్నారా?
ప్రతీదానికి పుస్తకాలు కొని ఇంటినిండా నింపుకోవడం వీలు కాదు. అలాంటప్పుడు
అంతర్జాలం చాలా ఉపయోగపడుతుంది. కంప్యూటర్నుండే కావలసిన సమాచారం సేవ్
చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. సంగీత, వాయిద్య పాఠాలు కూడా నేర్చుకోవచ్చు.
అలాగే వాటికి సంబంధించిన వీడియోలు కూడా లభిస్తాయి. అవీ.. ఉచితంగా...
మహిళలకు ఇష్టమైన కుట్లు, అల్లికలు, పెయింటింగులు, వంటలు మొదలైన ఎన్నో హాబీల
గురించిన బ్లాగులు, వెబ్ సైట్లు, వీడియోలు అంతర్జాలంలో లభిస్తాయి. అవి
చూసి నేర్చుకోవడం చాలా సులువు ఫీజు కూడా కట్టే పని లేదు. ఇంటినుండి కాలు
బయట పెట్టే పనీ లేదు. నేర్చుకోవడమే కాదు, తమకు వచ్చిన కళలు, కుట్లు,
అల్లికలు, ఎంబ్రాయిడరీలు, రాఖీలు, చాక్లెట్లు మొదలైనవి అంతర్జాలంలో
బ్లాగులు, ఫేస్బుక్ , వెబ్ సైట్ల ద్వారా విస్తృత ప్రచారం చేసుకోవచ్చు.
చాలా సులువుగా తమ ఉత్పత్తులను ప్రదర్శించి అమ్మకాలు పెంచుకోవచ్చు. ఈ
వస్తువులు కావలసినవారు కూడా ఇంటినుండే ఆర్డర్ చేసి తెప్పించుకుంటారు.
హఠాత్తుగా
ఇంట్లో ఒకరికి జబ్బు చేసింది. డాక్టరు దగ్గరకు వెళితే మందులు రాసిచ్చాడు.
కాని తగ్గలేదు. అర్ధరాత్రి హఠాత్తుగా ఆరోగ్యంలో తేడా చేసింది. డాక్టర్
దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. అలా జరగడం మొదటిసారి. ఎందుకలా జరిగిందో
తెలిదు. ఎవరిని అడగాలో తెలీదు. అలాంటప్పుడు కంగారు పడకుండా అంతర్జాలంలో
సెర్చిలో ఆ వ్యాధి లక్షణాల గురించి ప్రస్తావించి వివరాలు అడగొచ్చు.
క్షణాల్లో ఆ వివరాలు వందలకొద్ది సైట్లు మనకు అందిస్తాయి. ఆ వ్యాధి గురించి
కొన్ని వివరాలైనా తెలిస్తే మరోసారి జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కదా.
అలాగని సొంత వైద్యం కూడా చేయరాదు. ఇంకో విషయమేమంటే ఇంట్లో ఉండే మీరు
షాపింగ్ చేయవచ్చు. కొన్ని షాపింగ్ సైట్లలో దాదాపు అన్ని రకాల వస్తువులు
ధరలు, అవి దొరికే షాపుల వివరాలు, చీరలైనా, నగలైనా, నెలవారీ సరుకులు,
చెప్పులు, గాజులు, పూలు, పళ్లు .. ఇలా ఒక గృహిణి తన నిత్యజీవితంలో కావలసిన
విషయాల గురించి తెలుసుకుని షాపింగ్ చేయవచ్చు . ఇది ఆన్లైన్లో చేయొచ్చు.
అంతేకాదు
రచనలు, కథలు, కవితలు రాయాలనుకునే మహిళలకు కూడా అంతర్జాలం మంచి
అవకాశాలనిస్తోంది. బ్లాగులు, వెబ్ పత్రికల ద్వారా తమ రచనలను అందరితో
పంచుకుని తప్పులుంటే దిద్దుకుని , తమను తాము మెరుగుపరచుకోవచ్చు. ఇలా అస్సలు
రాయడమే రాని మహిళలు మెల్లిమెల్లిగా రాస్తూ , మెరుగుపరచుకుంటూ ఇప్పుడు
ప్రింట్ పత్రికలకు కూడా తరచూ కథలు, వ్యాసాలు వంటివి రాస్తున్నారు.
ఫేస్బుక్ ద్వారా కూడా మహిళలు తమదైన శైలిలో అద్భుతంగా రాణిస్తున్నారు.
కథలు, పాటలు, పూజలు, సంప్రదాయాలు, పురాణాలు, సాహిత్యం, సంగీతం, నాట్యం,
వంటలు, డ్రెస్ అండ్ జ్యుయెలరీ డిజైనింగ్, పూలజడలు, చాక్లెట్స్
క్రాఫ్ట్స్, ఫోటోగ్రఫీ మొదలైన అభిరుచులకు వేర్వేరు గ్రూపులు, పేజీలు
ప్రారంభించి తమలాంటివారితో మరిన్ని విషయాలు తెలుసుకుంటూ, తెలియనివారికి
తెలియజేస్తున్నారు. ఇదంతా తమ మాతృభాషలోనే చేయవచ్చు. తెలుగులో రాయడానికి
చాలా సులువైన పద్ధతులు కూడా ఉన్నాయి. అన్నీ ఉచితమే..... తమకు అందుబాటులో
ఉన్న అంతర్జాలం, కంప్యూటర్ ద్వారా మహిళలు ఇంట్లో ఉండే ఎన్నో
నేర్చుకోవచ్చు. తమ సమయాన్ని సద్వినియోగపరుచుకోవచ్చు..
0 వ్యాఖ్యలు:
Post a Comment