మానవత్వపు విలువల 'దీపతోరణం'
నవతెలంగాణ Jyothi Valaboju
దీపతోరణం సమీక్ష (దర్వాజా సాహితీ పేజి)
Mon 20 Jul 2015
సమాజంలో మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు సాహిత్యానికి పునాది వేస్తాయి. రచయితలు తమదైన భావవ్యక్తీకరణ శైలిలో ఈ సంఘటనలు, అంశాలు, వ్యక్తుల గురించి అందమైన కథలుగా మలుస్తారు. అందుకే చాలా కథలు చదివినప్పుడు అవి మనకు తెలిసినట్టుగా, చూసినట్టుగానే అనిపిస్తాయి. రచనలు చేయడం మాత్రమే కాదు ఒక సంఘసేవికగా, సమాజం పట్ల ఒక బాధ్యతగల వ్యక్తిగా ఇటువంటి సున్నితమైన అంశాలతో రాసిన కథలను 'దీపతోరణం'గా గుచ్చి తన మూడవ పుస్తకంగా ఆవిష్కరించారు శ్రీమతి కన్నెగంటి అనసూయ. మొత్తం పదిహేను కథలతో అందించిన ఈ తోరణంలోని ప్రతీ కథ పాఠకులను చదివించి, కదిలించి, ఆలోచింపజేస్తుంది. ఆసక్తికరమైన కథనం, చక్కని కథాంశాలతో రాసిన ఈ కథలలో అవసరమైన చోట అందమైన పలుకుబడులతో పుస్తకం ఆసాంతం చదివిస్తాయి. 'పితృదేవోభవ' కథలో తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే కొడుకు తండ్రి భుజాలమీద ఎక్కాలనే చిన్న ఆనందం, చెరకుగడలు నాన్నే ముక్కలు చేసి ఇవ్వాలి అనే కోరికలు తీరక తండ్రి మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు.
''ఆ చల్లని నీడలో'' కథలో స్కూలుపిల్లలకు వానాకాలంలో రక్షణకు గొడుగులు ఇవ్వాలనుకుంటే వాన వస్తే స్కూలు ఎగ్గొట్టచ్చనే కోరికతో పిల్లలు వాటిని తిరస్కరిస్తారు. ఆ స్కూలులో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనపు పథకం విషయంలో పొదుపుగా ఖర్చుపెట్టి మిగిలిన డబ్బుతో పిల్లలకు ఇంకో కూర చేయించి పెట్టాలనే హెడ్ మాస్టర్ గారి అంకితభావాన్ని చూపించారు రచయిత్రి.
మరో కథ 'జీవితాన్ని శాసించేవి' కథలో సమాజంలో నిత్యం ఎదురయ్యే సమస్య ఇంటి / కుటుంబ సమస్య. చిన్న ఇంటిని వదలి పెద్ద ఇంట్లో మనిషికో గది పేరిట కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయానురాగాలు కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఇల్లు విశాలమైనా కూడా మనసులు ఇరుకున పడిపోయే ప్రమాదం ఎదురైనవేళ వాళ్ళు తీసుకున్న నిర్ణయం కథకు ముగింపునిస్తుంది.
వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కలిగిస్తుంది 'ఆ మాత్రం చాలు' కథ. 'ఏదైనా అంతే' కథలో ప్రతీ గృహిణి ఎదుర్కొనే నీటి సమస్యను, నీటి పొదుపు గురించి రాసిన ప్రతీ వాక్యం అభినందనీయం.. చిన్నప్పుడు దీపావళి పండగ సమయంలో సిసింద్రీలు తయారు చేస్తూ కంటి చూపు కోల్పోయిన స్నేహితుడి కోసం దీపావళి పండగ జరుపుకోవడమే మానేసిన రామారావు కథే 'దీపతోరణం'. కన్నెగంటి అనసూయ పుట్టిన గ్రామ పరిసరాలు, ఆత్మీయతానురాగాలు, పల్లె వాతావరణం, ఇవన్నీ ఆమె కథలలో తొంగి చూస్తాయి. ఆమె సేవాభావం కూడా ఈ కథలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది...
- జ్యోతి వలబోజు,
0 వ్యాఖ్యలు:
Post a Comment