Tuesday, 14 May 2013

గృహిణి ప్రతిభ ఎందులో తక్కువ???









ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలైనా కూడా మగవాళ్లు పనికెళ్తే మహిళలు కుటుంబ నిర్వహణ మొత్తం తీసుకునేవారు. ఇలా ఒక సంసారం సమతుల్యంతో చిన్న చిన్న ఒడిదుడుకులతో గడిచిపోయేది. కాని ఈనాడు కుటుంబం చిన్నదైనా, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినా పెరుగుతున్న ధరలు, ఖర్చులతో ఇధ్దరూ పని చేయక తప్పడం లేదు. ఈనాడు భార్యా, భర్తా ఇద్దరూ ఉద్యోగాలో, వ్యాపారమో చేయకుంటే ఇల్లు గడవడం. పిల్లల చదువులు , ఇంటికి కావలసిన సౌకర్యాల అమర్చుకోవడం అసాధ్యం కాకున్నా చాలా కష్టం.    కొందరు ఆడవాళ్లు  ఉన్నతవిద్య లేకున్నా,  ఉద్యోగం చేయలేకున్నా, తమ చేతనైన వృత్తులు, ప్రవృత్తులతో ఇంటినుండే పని చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నారు లేదా ఉన్నదాంట్లో గుట్టుగా సంసారం నడిపిస్తున్నారు.  ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండే మహిళలకు ఎక్కువ విలువ లేదంటూ  ప్రముఖ రచయిత చేతన్ భగత్ ఒక సంచలన ప్రకటన చేసారు



 చేతన్ భగత్ అంటారు.. మా అమ్మ నలభై ఏళ్లు పని చేసింది. నా భార్య ఒక అంతర్జాతీయబాంకులో చాలా పెద్ద హోదాలో ఉంది. తను నా కోసం పుల్కాలు చేయదు. ఆ  పనిని డబ్బులిచ్చి బయటవాళ్లతో   ఔట్ సోర్సింగ్ చేయిస్తాం. ఐనా నాకు అదేమంత ముఖ్యమైన విషయం కాదు. కాని నా భార్య తన జీవితాన్ని వంటింట్లో గడిపితేనే నాకు నచ్చదు. ఒక స్త్రీ  కెరీర్ ఉమన్ ఐతే తన భర్తతో  తమ ఇద్దరి కెరీర్ గురించి, ఉద్యోగ, వ్యాపార సంబంధిత   విషయాలగురించి చర్చించగలదు. ఒక మామూలు గృహిణికంటే ఎక్కువ సమర్ధతతో కంపెనీలలో సమస్యలగురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలదు. ఆపీసుల్లోని రాజకీయాలను అర్ధం చేసుకుని అవసరమైనప్పుడు సరైన సలహా ఇవ్వగలదు. ఆర్ధికంగా కూడా ఖర్చులు, రాబడి, సేవింగ్స్ వగైరా విషయాలలో సరైన నిర్ణయం తీసుకుని అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు, ఇన్సెస్ట్ మెంట్స్,  సెలవుల సద్వినియోగం.  విహారయాత్రలు వగైరా స్వంతంగా నిర్వహించగలిగే  సామర్ధ్యం కలిగి ఉంటుంది. అలాగే  ఇంట్లో ఉండే ఆడవాళ్లలా కాకుంఢా ఉద్యోగం , వ్యాపారం మొదలైనవి చేసే మహిళ ప్రపంచానికి ఎక్కువగా చూస్తుంది. తన కుటుంబానికి  ఉపయోగపడే మరింత విజ్ఞానాన్ని, సమాచారాన్ని తీసుకురాగలదు. పనిచేసే మహిళల  పిల్లలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు. అమ్మ పెంపకంలో గారాబంగా పెరిగిన పిల్లలకంటే ఎన్నో విషయాలలో స్వతంత్రులై ఉంటారు. ఉద్యోగాలు చేసే మహిళలు తమ ఉద్యోగాలు, వృత్తులలో విజయవంతంగా ముందుకెళుతూ ఉంటారు. ప్రతీ విషయంలో మగాడి  మీద ఆధారపడనందుకు సంతృప్తిగా ఉంటారు. దీనివలన భార్యాభర్తలలో సామరస్యం ఉంటుంది. ఇలా విజయవంతంగా అన్ని రంగాలలో  మహిళలు మన దేశాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకెళ్తున్నారు. దీనివలన మనకు వేడివేడి పుల్కాలు దొరక్కపోవచ్చు. అంతే..

ఈ విషయంలో చేతన్ భగత్ ఇంట్లో ఉండే గృహిణులను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.. ఒక కుటుంబం యొక్క సమర్ధవంతమైన నిర్వహణ  భార్యాభర్తలిద్దరూ సంపాదించడమే కాదు.  పిల్లలను , తమ తిండిని కూడా పట్టించుకోకుండా సంపాదనే ముఖ్యమనుకునే స్ధాయికి దిగిపోయామా?  ఈరోజుల్లో ఇద్దరూ సంపాదిస్తే కాని ఇల్లు గడవదు. పిల్లలకు మంచి చదువులు, సొంత ఇల్లు, కారు, అధునాతన వస్తువులు, వగైరా వీలు కాదు. నిజమే. స్త్రీలకు కుటుంబ నిర్వహణకోసమే కాక ఆర్ధిక స్వావలంబన ఉండడం మంచిదే.  కాని సంపాదన లేని గృహిణులను పుల్కాలు మాత్రమే చేయగలిగేవారిగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసం??

దాదాపు ప్రతీ ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులు, చదువుకునే తమ్ముళ్లు, పెళ్లిళ్లు చేయాల్సిన చెల్లెల్లు, పిల్లలు ఉంటారు. వారిని చూసుకోవడానికి మగవాడికి తన భార్య సహకారం ఎంతైనా అవసరముంటుంది. ఒకవేళ పిల్లలు మాత్రమే ఉన్నా వాళ్లకు ఒక వయసు వరకు తల్లి అండదండలు, ఆలంబన  ఉండాలి.. పెళ్లయ్యాక  భార్య పని చేయాలా వద్దా అనేది వారిద్దరూ చర్చించుకుని నిర్ణయించుకునే విషయం. బయటకెళ్లి పనిచేసి సంపాదించకుండా ఇంటి పనులు, బాధ్యతలకే ప్రాధాన్యం ఇచ్చే మహిళలకు ఎటువంటి విలువ లేదని చేతన్ భగత్ స్పష్టంగా చెప్తున్నారు.  వాళ్లు పుల్కాలు మాత్రమే చేయగలరని అతని ప్రగాఢ విశ్వాసం. ఎవరు ఎంత కష్టపడ్డా, సంపాదించినా,  కడుపునిండా తినడానికి, కుటుంబ సభ్యులు, పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనే కదా. మరి ఇల్లాలును పుల్కాలు చేసే  మనిషిగా మాత్రమే గుర్తించడం భావ్యమా??

ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టున ఉండే ఇల్లాళ్లకు కూడా ఎన్నో బాధ్యతలు,సమస్యలు ఉంటాయి..  ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా  తన భార్య ఇంట్లో అన్నీ సమర్ధవంతంగా చూసుకుంటేనే పురుషుడు తన ఉధ్యోగ, వ్యాపార బాధ్యతలను విజయవంతంగా నిర్వహించగలుగుతాడు. ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటేనే, మగవాడు పొద్దంతా కష్టపడ్డా ఇంటికి రాగానే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపగలుగుతాడు.  ఒక వ్యాపారంలో, పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండే ఒడిదుడుకులు కుటుంబ నిర్వహణలో కూడా ఉంటాయి. ఉద్యోగం నచ్చకుంటే అది వదిలేసి వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కాని కుటుంబం అలా కాదు. ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిందే. అది ఒక తెలివైన ఇల్లాల్లి వల్లే సాధ్యమవుతుంది. నేటి ఇల్లాలు రుచిగా వంట చేయడం, ఇంటిని నీట్ గా ఉంచడం, పిల్లలను చదివించడం మాత్రమే కాదు వాళ్లను ఒక సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన  మంచి పౌరులుగా తయారుచేస్తుంది. బయటకెళ్లి ఉద్యోగం చేయకున్నా భర్తకు, ఇంటికి సంబంధించిన ఎటువంటి పనులైనా , చిన్న చిన్న సమస్యలైనా తనే చూసుకుంటుంది. అతనికి భారాన్ని తగ్గించాలని చూస్తుంది. పిల్లలకు చదివించిన అన్ని విషయాలు, వాళ్లు నేర్చుకోవాలనుకునే ఆటలు, కోర్సులకు తానే వెంట ఉండి తీసుకెళ్తుంది. బిల్లులు కట్టడం. బాంకు పనులు, ఆరోగ్య సమస్యలు మొదలైనవెన్నో ఉంటాయి. పిల్లలకు కావలసినవి అమర్చి వాళ్ల ప్రవర్తన, స్నేహితులు , ఆటపాటలు అన్నీ పర్యవేక్షించడం వల్ల వాళ్లు చెడు దారి పట్టి తమ జీవితాలను  పాడు చేసుకోకుంఢా ఉంటారు. పిల్లలను కని వాళ్లకు అవసరమైనవన్నీ డబ్బులతో కొనివ్వడమే తల్లిదండ్రుల ప్రేమ, కర్తవ్యం కాదు. దానికోసమే ఇద్దరూ పనిచేయాల్సిన అవసరం అస్సలు లేదు. అలా సంపాదన, కెరీర్ మాత్రమే ముఖ్యమనుకునేవాళ్లు , కుటుంబానికి అంత ప్రాముఖ్యం ఇవ్వనివాళ్లు తమను కన్నవారిని చూసే సమయం, తీరిక లేక వాళ్లను వృద్ధాశ్రమంలో, తాము కన్నవారిని కూడా ఆయాలకు అప్పగిస్తారు.

ఇంట్లో ఉండే గృహిణికి  ప్రపంచంతో ఎక్కువ పరిచయం లేకపోవడంతో ఆమెకుండేది మిడిమిడి జ్ఞానమే అనుకుంటే పొరపాటు. ఉన్నత విద్య లేని మహిళలు ఆధునిక, సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించి అన్నీ కాకున్నా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. ఇంటినుండే చిన్న చిన్న వ్యాపారాలు మొదలెడుతున్నారు. కుటుంబ నిర్వహణలో, భర్తకు తోడుగా ఎంతో కొంత సంపాదిస్తున్నారు.  దీనికి వాళ్లు తమ కుటుంబాన్ని, పిల్లలను, వారి బాగోగులను పణంగా పెట్టడానికి ఇష్టపడడం లేదు. అంతే కాదు. పెళ్లి తర్వాత  పిల్లలను, అత్తామామలను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను కూడా వదిలేసి గృహిణిలుగా మారిన మహిళలు ఎంతోమంది ఉన్నారు.  ఉద్యోగాలు చేసే  మహిళలకు  నిర్ణీత సమయంలో చేయాల్సిన టార్గెట్ ఒకటే ఉంటుంది. ఆపీసు పనివేళల ప్రకారం దానిని పూర్తి చేయాల్సి ఉంటుంది. కాని గృహిణి/housewife/ home maker నిత్యం పూర్తి చేయాల్సిన టార్గెట్లు ఎన్నో ఉంటాయి. లేకుంటే కొత్త పని వెతుక్కుని మరీ చేస్తుంది. అలాగే కుటుంబాన్ని, తమ ఉద్యోగాలను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మహిళలు నేడు కోకొల్లలుగా ఉన్నారు. ఒకదాని కోసం ఇంకొకటి ఎన్నటికీ త్యాగం చేయలేరు, చేయాలనే ఆలోచన కూడా రానివ్వరు అంతే కాని ప్రేమతో చేయాల్సిన పనులను కూడా ఔట్ సోర్సింగ్ చేద్దామనే ఆలోచన కుటుంబాన్ని ప్రేమించే ఏ  మహిళా ఒప్పుకోదు. ఇంటిపనులను ఆఖరుకు తినే తింఢిని కూడా డబ్బులిచ్చి బయటవాళ్లతో చేయించుకునే స్తోమత, ఆలోచన అందరికీ ఉండదు.  ఆచరణ యోగ్యం కాదు కూడా. ఐనా ఎంత సంపాదించినా ఈ జానెడు పొట్ట నింఫడానికే కదా.. మగవాడికి తన కుటుంబం, తన ఉద్యోగం రెండూ కూడా ఎంతో ముఖ్యమైనవి.  కాని భార్య తన కుటుంబ బాద్యతలను నెత్తినేసుకుని సగం బరువును తగ్గిస్తుంది. అతను తన కింద పనిచేసేవారిని అధికారంతో  కంట్రోల్ చేయగలడు. భయంతో పని చేయించగలడు. కాని భార్య పరిస్ధితి అలా కాదు. కుటుంబ సభ్యులు, పిల్లలను భయంతో, అధికారంతోకాకుండా ప్రేమతో, గౌరవంతో నెరవేర్చాలి. సమస్యలను తీవ్రం కాకుండా, భర్తకు అదనపు సమస్య కాకుండా చూసుకుంటుది. ఇలా ఉద్యోగాలు, వ్యాపారాలు చేయని మహిళలు చేసే పనికి వెల, విలువ కట్టడం అసాధ్యం. అసలు ఇల్లాలుకు ఆమె చేసే పనులకు ఎంత ఇవ్వాలి అని లెక్కలేస్తే ఎన్ని లక్షలు, కోట్లు అవుతాయో మరి. ఆవి చెల్లించడం సాధ్యమా??  మరి చేతన్ గారు తనకు మాత్రమే లాభం కలిగించి బోలెడు సంపాదించే భార్య మాత్రమే ముఖ్యమంటున్నారు.


















Wednesday, 1 May 2013

మాలిక పత్రిక చైత్ర మాస సంచిక విడుదల


మాలిక పత్రిక చైత్రమాస సంచిక విడుదలైంది. అన్నివర్గాల పాఠకులకు నచ్చే అంశాలతో సరికొత్తగా రూపొందింది ఈ సంచిక.  ఈసారినుండి మాలికపత్రిక నుండి ప్రత్యేకమైన అంశాలతో మూడు సీరియళ్లు ప్రారంభమవుతున్నాయి. అడగగానే తమ రచనలను మాలికకు అందించిన యండమూరి వీరేంద్రనాధ్ గారికి, సూర్యదేవర రామ్మోహన్ గారికి, అడగకుండానే పారశీక ఛందస్సు గురించి సిరీస్ ఇస్తున్న J.K.Mohan Raoగారికి  , ఆలస్యమైనా మరచిపోకుండా తన రచనను పంపిన బ్నిం మూర్తిగారికి, మిగతా రచయితలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
ఈ సంచికనుండి ప్రఖ్యాత టెక్నాలజీ ఔత్సాహికులు, కంప్యూటర్ ఎరా పత్రిక ఎడిటర్ అయిన నల్లమోతు శ్రీధర్ గారి వీడియో చానెల్ ఒకటి మొదలు పెడుతున్నాం. ఈ శీర్షిక క్రింద ఆయన అందించే ఉపయోగకరమైన వీడియోలు మీరు వీక్షించవచ్చు.

http://magazine.maalika.org


మీ రచనలు  పంపవలసిన చిరునామా: editor@maalika.org


మరో ముఖ్య విషయం.  ప్రముఖ రచయిత్రి శ్రీమతి సువర్చల చింతలచెరువుగారు మాలిక టీమ్ లో చేరుతున్నారు. ఆవిడకు సాదర ఆహ్వానం పలుకుతూ ఈ సంచికలోని రచనలు:

0. సంపాదకీయం : మారుతున్న ఆప్యాయతలు, విలువలు..ఉమాభారతి
1.  కవి మానాపురం రాజా చంద్రశేఖర్ తో ముఖాముఖీ - బులుసు సరోజినిదేవి
2.  సంస్కృత సాహిత్యంలో ప్రముఖ కవయిత్రులు - విశ్వనాధశర్మ కొరిడె
3. నిత్యజీవితంలో హస్యం - డా.అనిల్ మాడుగుల
4. పారశీక ఛందస్సు - 1 - జె.కె.మోహన్ రావు
5. అతడే ఆమె సైన్యం - యండమూరి
6. సంభవం - సూర్యదేవర
7. బుల్లి ' తెర  ' పెన్నుతో బ్నిం - బ్నిం  మూర్తి
8. ఏమి హాయిలే హలా! - నండూరి సుందరి నాగమణి
9. పద్మప్ప - మంధా భానుమతి
10. ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం - మధురవాణి
11.  మాలిక పదచంద్రిక - 9  - సత్యసాయి కొవ్వలి
12. ' కవిసంగమం ' సమీక్ష - శైలజ మిత్రా
13. 'రాముడుండాడు. రాజ్జిముండాది' సమీక్ష - చక్రధర్ రావు
14. నల్లమోతు శ్రీధర్ చానెల్: ఆన్లైన్ డిస్కౌంట్లని ఉపయోగించుకోవటం ఎలా?



Monday, 22 April 2013

మాలిక పత్రికలో అతడే ఆమె సైన్యం ( యండమూరి )







అతడొక ఫేమస్ తెలుగు సినిమా హీరో. ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా జరిగిన యాక్సిడెంట్‌లో స్పృహ తప్పింది. స్పృహ వచ్చేసరికి అతను ఒక ఆసుపత్రిలో ఉన్నాడు. కాని అక్కడి డాక్టర్లు, నర్సులు  అతడిని ఒక హీరోగా కాకుండా సెక్రెటేరియట్‌లో పని చేసే ఒక గుమస్తా సుబ్బారావు అని అంటున్నారు. దానికి సాక్ష్యంగా పోలీసులు  అతడి భార్య, కొడుకును, అవసరమైన సర్టిఫికెట్లను చూపిస్తున్నారు. కాని తను ఒక   సినిమా యాక్టర్‌ని అతను ఎన్ని విధాల చెప్పినా ఎవ్వరూ నమ్మట్లేదు.   అక్కడినుండి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నించాడు. కాని వీలు కాలేదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎందుకు ఒక హీరోని మామూలు గుమస్తాగా నిరూపించాలని చేయాలని చూస్తున్నారు? దానివల్ల ఎవరికి ఏం లాభం??  ఆ వ్యక్తి సినిమా యాక్టర్ చైతన్యనా? గుమస్తా సుబ్బారావా?? చివరికి ఆ వ్యక్తి ఒక స్త్రీకి సైన్యంగా మారిన వైనం ఏమిటి??


అణువణువునా సస్పెన్స్‌తో, ఆద్యంతమూ ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి చేసే సస్పెన్స్ థ్రిల్లర్, మొదటి పేజీ నుండి చివరి పేజీవరకు పాఠకులను ఉత్కంఠతతో చదివించే తెలుగువారి అభిమాన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల "అతడే ఆమె సైన్యం" మీకోసం మాలిక పత్రికలో మే సంచిక నుండి సీరియల్‌గా రాబోతుంది. మరో వారం రోజులు వేచి ఉండాల్సిందే మరి..

Sunday, 14 April 2013

అహో...భోజా... ( మన శంకర్ )



అహో.. భోజా..

మన జీవన ప్రయాణంలో రక్తసంబంధీకులు, బందువులు, స్నేహితులేకాక ఎంతోమంది పరిచయమవుతారు. అందులో కొందరు ఆత్మీయులుగా మారతారు. వారితో అనుబంధం ఎప్పటికి మరువలేకుండా ఉంటాం. అలాటి అనుబంధాలు మన తెలుగు బ్లాగ్ లోకంలో, ప్లస్సులో ఉన్నాయి. ముఖ్యంగా బజ్జ,  ప్లస్సులో ఐతే ఒక కుటుంబంలా రోజూ మాట్లాడుకోవడం తప్పనిసరి. తమవారికి దూరంగా ఉన్నవాళ్లు కూడా ప్లస్సు మూలంగా ఆ వెలితిని కొంతవరకైనా పోగొట్టుకుంటారు. ఎవరైనా కొద్దిరోజులు కనపడకుండే వారికోసం గాలింపు మొదలవుతుంది. సరదాగా ఆటలు, మాటలు, పండగలు, పుట్టినరోజులు అలవాటైపోయాయి . ఈ స్నేహానికి ప్రత్యక్షంగా పరిచయముండాలి అనే రూల్ లేదు. అవసరం అనిపింఛలేదు. అలాటి ఒక ఆత్మీయ మిత్రుడు శంకర్. సరదాగా మాట్లాడుతూ అందరిని కలుపుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా రెండు రోజులు కనపడకుంఢా అందరూ మిస్ అయ్యేవారు. ఎక్కడ?? ఎక్కడ?? అని  గుర్తు చేసుకునేంత..అంతగా అలవాటైపోయాడు. ...

కాని అతను శాశ్వతంగా కనపడకుండా మాయమై జీవితాంతం మిస్ అయ్యాడు. గత సంవత్సరం జూన్ లో ప్రమాదవశాత్తు మరణించిన శంకర్ భౌతికంగా దూరమైనా అతని సన్నిహితులకు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాడు. ముఖ్యంగా అతను వాయినంగా పంచిన మిధునం పుస్తకాల  ద్వారా అతను వాళ్లకెప్పుడూ కనిపిస్తూనే ఉంటాడని నా భావన..

ఈరోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో శంకర్ బ్లాగులోని సరదా టపా ప్రచురించబడిన సంధర్భంగా మరోసారి అతన్ని తలుచుకుంటూ...

We Miss You Sankar.


Saturday, 13 April 2013

మాలిక పత్రికలో సంభవం (సూర్యదేవర రామ్మోహన్ రావు)

మాలిక పత్రిక మెల్లిమెల్లిగా తన ప్రమాణాలను మెరుగు పరుచుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తుంది.. అందులో భాగమే అంతర్జాల అవధానాలు.. మరో విశేషం .. మే నెలనుండి మాలిక పత్రికలో ప్రముఖ అనేకంటే సంచలన రచయిత సూర్యదేవర రామ్మోహన్ రావుగారు రచించిన  సంచలనాత్మక నవల " సంభవం"  సీరియల్ గా రాబోతుంది..  ఈ సందర్భంగా రచయిత సూర్యదేవర రామ్మోహన్ గారితో చిన్న మాటామంతి ఏర్పాటు చేయడమైంది. మీరు కూడా ఆయనను ఏమైనా అడగాలనుకుంటున్నారా. వ్యాఖ్యల ద్వారా మీ ప్రశ్నలను పంపించగలరు. మీ తరఫున నేను అడుగుతాను. ..








మనిషి చనిపోగానే క్రయోనికల్గా అతని శవాన్ని సస్పెండ్ చేసి, అత్యంత జాగ్రత్తగా భద్రపరిచి, తిరిగి అతడ్ని బ్రతికించేందుకు చేస్తున్న అధ్బుత శాస్త్ర పరిశోధనలపై వెలుపడిన మొట్టమొధటి నవల-

సంభవం

మృత్యువుని జయించటానికి ప్రపంచవ్యాప్తంగా, అతి రహస్యంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనలపై వెలుపడిన తొలి నవల-
సంభవం

చనిపోయిన మనిషి శరీరాన్ని భద్రపరిచి ప్రాణం పోయగలిగే అవకాశం సైన్స్కి లభించినప్పుడు ప్రాణిలోకి పూర్వపు ఆత్మే ప్రవేశిస్తుందా? లేక కొత్త ఆత్మ ప్రవేశిస్తుందా?
ట్రిలియన్ డాలర్ల ప్రశ్న...


జాతస్యహి ధృవో మరణం...
పుట్టినవాడు గిట్టక మానడు
ధృవో జననం మృతస్యచ...
గిట్టినవాడు తిరిగి పుట్టక మానడు
అని చెప్పిన శ్రీ కృష్ణభగవానుడి గీతోపదేశానికి సైన్స్ విసురుతున్న సవాల్ ఎలాంటిది...? అది సవాలా? లేక సైన్స్ చేసే ప్రేలాపనా?
అద్యంతం ఉత్కంఠతో చదివించే అద్భుతమైన నవల-


సంభవం
మీ అభిమాన రచయిత
సూర్యదేవర రామ్మొహనరావు మరో సంచలనాత్మక నవల-   సంభవం
 


THERE IS NO DEATH: THE STARS GO DOWN
TO RISE UPON SOME OTHER  SHORE.
AND BRIGHT IN HEAVEN’S JEWELED CROWN,
THEY SHINE FOR EVER MORE.

-JOHN L.Mc Creery.




Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008