ఓ శుభవార్త తెలియగానే ఆనందం, ఆలోచనలు భవిష్యత్ వైపు సాగినప్పుడు తెలీని దిగులూ, మనసు గాయపడిన క్షణం ఆక్రోషం.. ఇలా ప్రతీ భావోద్వేగమూ మనసులోనే సిద్ధంగా ఉంటుంది. తటస్థించే అనుభవానికి తగ్గ భావోద్వేగం మనలో వెన్వెంటనే పెల్లుబుకుతూ కొంతసేపు ఉక్కిరిబిక్కిరి చేసి గమ్మున సర్దుకుంటుంది. మంచిదైనా, చెడ్డదైనా ఓ సంఘటన జరిగిన వెంటనే మదిలొ వేగంగా జరిగే సంఘర్షణ తాలూకు వ్యక్తీకరణలే మన భావోద్వేగాలు. ప్రతీ భావోద్వేగమూ దాని తీవ్రత కొనసాగినంత సేపూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పనిలో పనిగా మనసులో ఏ మూలనో ఆ సంఘటన తాలూకు గాఢతని మరువలేని జ్ఞాపకంగా నమోదు చేసి.. తీవ్రత తగ్గిన వెంటనే దూదిపింజెలా ఎగిరిపోతుంది. భావోద్వేగాల మర్మాన్ని గ్రహిస్తే అవి మనపై స్వారీ చేసే ముందే వాటి తీవ్రతని కట్టడి చేసుకోగల విజ్ఞత అలవడుతుంది. ఏ ఆనందానికైనా, ఆవేశానికైనా, విచారానికైనా కల్లోలితం అయ్యే ఆలొచనా ప్రవాహమే మూలం. వాటిని వీలైనంత వేగంగా స్థిరత్వం వైపు మళ్లిస్తే ఆ భావోద్వేగపు గాఢత క్షీణించిపోతుంది. మిన్ను విరిగి మీదపడ్డా మౌన ప్రేక్షకుల్లా చూస్తుండిపోయే నైపుణ్యత అలవడుతుంది. మన ఆలోచనలు నిరంతరం జరిగిపోయిన జీవితాన్నీ, ముందు భవిష్యత్తునీ, వర్తమానపు అనుభవాలనూ, బలంగా నాటుకుపోయిన జ్ఞాపకాలనూ మనసు పొరల్లోంచి వెలికి తీసి వాటిని చిక్కుముళ్ల్లుగా పెనవేసి కుదురుగా ఉన్న మనసుని కూడా ఆందోళనపరుస్తుంటాయి.
ప్రతీ భావోద్వేగమూ తాత్కాలికమే. అవసరం అయిన దానికన్నా దాన్ని మరింత విశ్లేషించి, సంఘటనలు, ఆలోచనల్ని క్లిష్టతరం చేసుకుని ఆ ఉద్వేగాన్ని సులభంగా వదిలిపెట్టకుండా మనసుని కుళ్లబెట్టుకుంటూ ఉంటాం. ఈ క్షణం మన మానసిక స్థితి అస్థిరంగా ఉంటే దాన్ని స్థిరపరుచుకోవడం మన చేతుల్లో ఉన్న పని. కానీ ఆ కిటుకుని గ్రహించలేక పాటించలేకపోతున్నాం. సమస్యల్లో ఉన్న స్థితిలో మనమూ సమస్యలో కూరుకుపోయి బయటపడే మార్గాన్ని ఆలోచించడం మనేసి సమస్యని పెద్దది చేసుకుంటూ ఉంటాం. అలాగే ఆవేశం కట్టలు తెంచుకుంటే దానికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించి, మరోసారి ఆ పరిస్థితి తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తల వైపు దృష్టిని నిమగ్నం చేయకుండా వీలైనంత ఆవేశాన్ని వెళ్లగక్కుతుంటాం. ఇలా భావోద్వేగం యొక్క మూలాల్ని గుర్తించి వాటిని సరిచేసుకునే మార్గం ఒకటుంటే.. ఏకంగా భావోద్వేగం మనపై స్వారీ చేస్తున్నప్పుడు దాని నుండి బయటపడడానికి మరెన్నో మార్గాలున్నాయి.
ఒక భావోద్వేగాన్ని పరిసరాలపై వెదజల్లడం మన ఉనికిని, మనం ఆశిస్తున్న గమనింపుని పొందడానికి సులువైన మార్గం అనే దురభిప్రాయం బాల్యం నుండి మనకు ఉగ్గుపాలతో అలవర్చబడింది. ఉదా. కు.. మనం ప్రదర్శించిన ఆవేశానికి ఆశించిన స్థాయి స్పందన దాన్ని ఎవరిపై ప్రదర్శించామో వారి నుండి లభిస్తే మన అహం సంతృప్తిపడుతుంది. ఎంత ఆవేశపడినా దాన్ని పట్టించుకునేవారు లేనప్పుడు కాసేపు మనసు రగిలిపోతుంది. మెల్లగా నిస్సహాయత ఆవరిస్తుంది. దిగులు మొదలవుతుంది. చివరకు బేలగా మారిపోతాం. ఇది ఒక ఆవేశమనే భావోద్వేగపు పరిణామక్రమమే. ఇలా ప్రతీ భావోద్వేగానికీ కొన్ని బలమైన కారణాలు, అంచనాలూ, పర్యవసనాలూ ఉంటాయి. వాటన్నింటినీ విశ్లేషించి మన చిత్తం చేసే చిత్రాల్లో ఎంత విచిత్రం దాగుందో అర్ధం చేసుకోగలిగితే ఆ మాయ నుండి అవలీలగా బయటపడగలం !
నలభై దాటగానే చాలామంది అనే మాట పెద్ద వయసు వచ్చేసింది. అప్పటికి పిల్లలు కాలేజీలలోకి వచ్చేస్తారు లేదా మన అవసరం అంతగా ఉండదు వాళ్లకి. చిన్నగా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. డాక్టర్లు కూడా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక జారీ చేస్తారు. ఒక్కో వయసులో ఒక్కో రకమైన పనులు చేయాలని మనని మనమే నియంత్రించుకుంటాం. అది ఆహారమైనా, దుస్తులైనా, ప్రవర్తన ఐనా ఇప్పుడు ఇలా ఉండాలి అని అందరూ అంటుంటే మనం కూడా ఓహో అలాగే ఉండాలి. లేకుంటే సమాజం వెక్కిరిస్తుంది. చుట్టాలు ఆడిపోసుకుంటారు అనుకుని వయసుతో పాటు మనసుని కూడా మనమే ముసలిదాన్ని చేసేస్తాం. అదే కాక ఈ జీవన ప్రయాణంలో కుటుంబ నిర్వహణ కోసం పని చేయడం అత్యవసరమై మిగిలిన విషయాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వం. ముఖ్యంగా మనకు ఇష్టమైనవి. ఇంటద్దె కట్టాలి.పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి, వాళ్లకు మంచి ఉద్యోగాలు రావాలి, పెళ్లిల్లు చేయాలి అనే కోరికలు ప్రతీ తల్లితండ్రులను పూర్తిగా ఆక్రమించేసుకుంటాయి. దీనికోసమే అహర్నిశలు ఆలోచిస్తూ , పని చేస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు సెటిల్ అయ్యాక ఆలోచించడానికి , చేయడానికి ఓపిక ఉండదు మానసికంగా ఐనా, శారీరకంగా ఐనా. అప్పుడు కూడా పిల్లలు , వాళ్ల పిల్లల గురించే శ్రమ పడతారు.
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటుంది. మన జీవితం మనదే. పిల్లల జీవితం పిల్లలదే. వాళ్లకు అవసరమైనంతవరకు మన చేయూత నివ్వాలి. తర్వాత వాళ్లని స్వతంత్రులను చేసి వదిలేయాలి. మనం వాళ్ల మీద భారం కాకూడదు. వాళ్ల జీవితంలో అడ్డు కాకూడదు. అలా అని పిల్లలను వదిలేయాల్సిన పని లేదు. బాధ్యతలు తగ్గించుకోవాలి. వయసు అనేది మన శరీరానికే వచ్చింది. కాని మనసుకు కాదు. అది మనం ఎలా ఉండాలని అనుకుంటే అలా ఉంటుంది. అలా మలుచుకోగలం కూడా. శారీరకంగా అలసిపోయి ఇక మనమేం చేయలేము అనుకునేవారు ఎందరో. అలాగే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాములే? ఇప్పుడు కొత్తగా నేర్చుకుని ఏం చేయాలి? అని అంటారు. కాని తీరిగ్గా కూర్చుని మనగురించి ఆలోచిస్తే ఎన్నో చేయగలం. అవి శారీరక శ్రమ కలిగించని పనులు కూడా ఉంటాయి. అందులొ లలితకళలు, చదవడం, రాయడం, సహాయం చేయడం మొదలైనవి. కాలేజీ చదువులు, పోటీ పరీక్షలు, సంసార ప్రయాణంలో మనమే మర్చిపోయిన ఇష్టాలెన్నో.. వాటిని పునరిద్ధరించుకుని మళ్లీ మొదలుపెట్టడంలో తప్పు లేదు. ఇలా చేయడంవల్ల ఎవరో నవ్వుతారు, వెక్కిరిస్తారు అనుకోవడం వృధా. ఏడ్చేవాళ్లు ఎప్పుడూ ఏడుస్తారు. నవ్వేవాళ్ల నాపచేనే పండుతుంది .. తెలుసు కదా. మీకే తెలియని , మీకు ఇష్టమైన పనులు చేయండి. వీటికి ఖర్చు స్వల్పమే కాని దానివలన లభించే ఆనందం,సంతృప్తి అనంతం.
ఇదంతా స్వానుభవంతో చెప్పిన మాటలు .. అర్ధంకాలేదా?? ఐతే క్లుప్తంగా నా కథ చెప్పనా? చదువుకుంటుండగానే పెళ్లి ఐంది. మావారు ఇంకా చదువుకోమన్నారు కాని పిల్లల చదువులు, పెంపకం, వాళ్ల పరీక్షలు, సంసారంలో వేసే మునకలు ఇలా జీవితం గడిచిపోయింది. నేను మావారు మా సర్వశక్తులు పిల్లల చదువులు , ఫీజులు, ఎంట్రెన్సుల మీద పెట్టాం. అదృష్టం కొద్ది పిల్లలు మంచి నడవడికను అలవరుచుకున్నారు. చెడు తిరుగుళ్లు అలవాటు చేసుకోక చదువుల మీద శ్రద్ద పెట్టి మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు మాకు ఎక్కువ శ్రమ లేదు. మావారు తనకిష్టమైన జ్యోతిష్యం చదువుకుందామని కాలేజీలొ చేరారు.తన పనితో పాటు చదువు కూడా కొనసాగించారు. నేను ఇంటిపని, పిల్లల పని తర్వాత కుట్లు అల్లికలు, టీవీ సీరియళ్లు. వేరే వ్యాపకం అంటూ లేదు. ఏం చేయాలో తెలీదు. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా అనాసక్తి. ఈ వయసులొ నేర్చుకోవడం సాధ్యమా? నేర్చుకున్నా ఏంచేస్తాం? ఉద్యోగాలు చేయాలా? అని టీవీ సీరియళ్లు దాదాపు అన్నీ చూసేదాన్ని. అలా టైం వేస్ట్ చేస్తున్న నన్ను చూసి మావారు కంప్యూటర్ భాగాలు వివరించి నెట్ ఎలా వాడాలో, గూగుల్ సెర్చింగ్ ఎలా చేయాలో నేర్పించారు. మా అబ్బాయి మెస్సెంజెర్ అదీ చూపించాడు. అలా మెల్లి మెల్లిగా ఆసక్తి పెరిగింది. ఇంట్లో వాళ్లు, దగ్గరి చుట్టాలు తప్ప ఎక్కువగా పరిచయాలు లేని (చెప్పాలంటే నేనే ఎక్కువ మాట్లాడేదాన్ని కాదన్నమాట) నాకు జాలంలో కొత్త పరిచయాలు ఎన్నో విషయాలు తెలియచేసాయి. పిల్లల కోసం కోర్సులు, కాలేజీలు వెతుకుతూ తెలుగు గురించి శోధించాను. అసలు కంప్యూటర్లో తెలుగు రాయాలని ఎంతో ప్రయత్నించాను. మావారు శ్రీలిపి లాంటి సాఫ్ట్ వేర్ తెచ్చారు కాని అదంతా తికమకగా ఉండేది. బ్లాగు గుంపులో చేరి ఒక్కొటొక్కటిగా నేర్చుకున్నా. కొత్తలో ఏదైనా ఆసక్తిగానే ఉంటుందికదా.పైగా ఇంట్లో కూర్చునే ఎంతోమంది తెలుగువారితో మాట్లాడడం.. ఇలా గడిచిపోతుండగా..
ఒకానొక సమయంలో జీవితం స్తంభించినట్టైంది. నేను చేయాల్సిన పనేమి లేదు. పిల్లలు సెటిల్ ఐపోయారు. వాళ్ల జీవితం వాళ్లది నా అవసరం లేదు. మరి నేను ఏం చేయాలి? ఎందుకు చేయాలి? ఎవరికోసం చేయాలి అనే ఆలోచన తప్ప వేరే లేదు. తెలియని అయోమయం. శూన్యం ఆవరించింది. నా భావనలు ఒక ఫ్రెండ్ తో పంచుకున్నాను. నా పరిస్థితి నాకే అర్ధం కాలేదు కాని అతనికి అర్ధమైంది. ఇల్లలికిన ఈగ కథ చెప్పాడు. ఒక ఈగ ఇల్లు శుబ్రంగా ఉండాలని ఎప్పుడూ ఇల్లంతా అలుకుతూ ఉండేదంట. అలా ఆలుకుతూ అలుకుతూ తన పేరే మరచిపోయింది. అలాంటి ఒక ఇల్లాలి కథను (పి.సత్యవతిగారు రాసింది)ఉదహరించాడు. ఏదో చేయాలనే తపన నాలో ఉంది. కాని వయసైపోయింది అనే కారణంతో దాన్ని అణచిపెడుతున్నాను. నాకంటూ ఒక వ్యాపకం, జీవితం సృష్టించుకోవాలి. అది కుటుంబానికి అతీతంగా వెళ్లడం కాదు. అప్పుడు మొదలైంది నాలో సంఘర్షణ. నిజంగా నాకు కావలసిందేమిటి. నాకంటూ ఇష్టాలు లేవా? కొత్త విషయాలు నేర్చుకోలేనా అని చాలా అలోచించాను. పత్రికలకు రాయడం మొదలుపెట్టాను. వీలైనంత ఎక్కువ చదవడం, రాయడం , సాంకేతిక విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇలా కొత్త కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు లభించే ఆనందం, సంతృప్తి వెలకట్టలేనివి. మాటల్లో చెప్పలేనివి. దానికితోడు మావారు,పిల్లల ,ప్రోత్సాహం, సహకారం కూడా చాలా ఉంది. అలాగే మిత్రుల తోడ్పాటు నన్ను ఈనాడు ఇలా నిలబెట్టింది. అందుకే అంటాను తెలుగు బ్లాగుల వల్ల నాకంటే ఎక్కువగా ఉపయోగపడింది ఎవరూ లేరని. నాకు ఇష్టమైన ఏ విషయాన్నైనా అనుకున్న వెంటనే ఎటువంటి ఆంక్షలు, హద్దులు లేకుండా రాయగలుగుతున్నా. దీనివలన రాత (తలరాత కాదు, చేతిరాత ) మారింది. ఇప్పుడు చెప్పండి వయసైపోయింది శరీరానికా? మనసుకా?
ఇదంతా చెప్పింది నన్ను మెచ్చుకోవడానికి కాదు. సొంత డబ్బా కొట్టుకోవడానికి కాదు. నాలాంటి మహిళలు, పురుషులు ఎంతో మంది ఉన్నారు. మీ ఇంట్లోనే ఉండొచ్చు. వారిని ప్రోత్సహించి వారికిష్టమైనవి నేర్చుకునే అవకాశం కలిపించండి. నాకు అలా కుటుంబ సభ్యుల సహకారం దొరుకుతుంది కాబట్టే ఇన్ని బ్లాగులు రాయగలుగుతున్నా, వివిధ పత్రికలకు వ్యాసాలు ఇవ్వగలుగుతున్నా. అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రాములు కూడా.నాకంటే మావాళ్లే ఎక్కువ సంతోషిస్తారు. అందుకే నేను ఎప్పుడూ నొక్కి వక్కాణిస్తాను.
మావారు బంగారు కొండ పిల్లలేమో వజ్రాలు
మరి నేనో?? ప్లాటినం.. (ఎందుకో చెప్పుకోండి) అప్పుడప్పుడు ఎవరికి వారు ఇలా డబ్బా కొట్టుకోవాలి. లేకుంటే లైఫ్ బోర్ గా ఉంటుంది. ఔనంటారా?కాదంటారా??
వేసవి అనగానే గుర్తొచ్చేది అమ్మమ్మ, నాన్నమ్మ, కథలు, బోలెడు ఆటలు, నో చదువులు . మా చిన్నప్పుడు టీవీలు , కంప్యూటర్లు , వీడియో గేమ్స్ లేకున్నా వేసవి సెలవులను మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. సెలవులు మొదలు కాగానే మా పెదనాన్నగారి దగ్గర ఉండే నాన్నమ్మ వచ్చేది. అమ్మమ్మ వచ్చి ఉండడం తక్కువ. కూతురింట్లో ఉండకూడదంట. నాన్నమ్మ వచ్చిందంటే పిల్లలకు పండగే. ఆమెకు సినిమాలంటే చాలా ఇష్టం. రోజూ చూడమన్నా చూసేది. ఒక్కడాన్ని పంపలేక నన్ను తోడుగా పంపేది అమ్మ. ఇంటికి దగ్గరే థియేటర్. అలా తనతో కలిసి ఎన్నో జానపద, భక్తి సినిమాలు చూసాను. టికెట్ ఎంతని యాభై పైసలే. పొద్దంతా మా ఆటలు, బొమ్మలపెళ్లిల్లు అయ్యాక రాత్రి నాన్నమ్మ వెంటపడేవాళ్లం కథ చెప్పమని. అడిగిన వెంటనే చెప్పేది కాదు. రాత్రికి తొందరగా తినేసాక చెప్తాను అనేది. కథ కోసం మేమూ తొందరగా తినేసి, నాన్నమ్మను కూడా తొందరగా తినమని సతాయించేవాళ్లం. ఇక పక్కలు పరుచుకుని అందులో కూర్చుని కథలు వినేవాళ్లం. నిజంగా అమ్మమ్మలు, నాన్నమ్మలు కథలు ఎంతా బాగా చెప్పేవారో? వాళ్లు చెప్తుంటే ఆసక్తిగా వినడమే తప్ప పిల్లలు మధ్యలో ఒక్క ప్రశ్న కూడా అడిగేవారు కాదు. అంతగా లీనమయ్యేవారు. అమాయకమైన, కల్మషం లేని బాల్యం. ఏది చెప్పినా నమ్మేస్తుంది కదా. పన్ను ఊడిపోయి నొప్పితో ఏడుస్తుంటే ఆ బాధ మరిపించడానికి మట్టిలో ఊడిపోయిన పన్ను పాతిపెడితే డబ్బులచెట్టు మొలుస్తుందని అమ్మ చెప్తే నిజమని నమ్మి ఏడుపు ఆపి ఆ పన్ను తీసికెళ్ళి మట్టిలొ పాతిపెట్టడం. చెట్టు మొలిచిందా లేదా అని రోజూ చూడడం... పదిరోజులు అలా చూసి మర్చిపోవడం. పుస్తకాలలో నెమలి ఈక పెడితే అది పిల్లలు పెడుతుంది. ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది , బోలెడు డబ్బులు ఇస్తుంది అంటే కష్టపడి. స్నేహితులకు లంచాలు ఇచ్చి నెమలిఈక సంపాదించి పుస్తకంలో పెట్టుకుని అదో అదృష్టరాయిలా అపూర్వంగా చూసుకోవడం. జానపద సినిమాలు చూసి, అమ్మమ్మ చెప్పిన కథల్లోని రాజకుమారులను తలుచుకుని టవల్ తీసుకుని భుజాల మీదుగా కట్టుక్కుని చీపురు పుల్లలతో కత్తి యుద్ధం చేయడం... ఎప్పటికీ మరచిపోలేని మధురమైన జ్ఞాపకాలు కదా.
ఈ సోదంతా ఎందుకు గుర్తొచ్చింది అంటే కల్పనఅమ్మచెప్పినకథలు రాయండర్రా అంటే ఒక్కసారి బాల్యంలోకి వెళ్లిపోయా. ఎన్నో కథలు చెప్పించుకున్నాకాని ఒక్క కథ మాత్రం మొత్తం గుర్తుంది. నాన్నమ్మ లేనప్పుడు అమ్మని కథలు చెప్పమంటే ఇంటిపనికే తీరడంలేదు అని పుస్తకాలు కొనిచ్చేది. చదవమని ప్రోత్సహించేది. పుస్తకాలు అంటే అస్సలు వెనుకాడేది కాదు అమ్మ. నాన్నమ్మ చెప్పిన చిక్కుడు కథ గుర్తొస్తే నవ్వొస్తుంది. అప్పుడు ఏ కథ విన్నా, చదివినా, సినిమా చూసినా అన్నీ నిజంగానే జరిగాయి అని పూర్తిగా నమ్మేదాన్ని. అందరూ అంతేనేమో. ఈ కాలం పిల్లలే హైటెక్ ఐపోయారు. అంత సులువుగా ఏదీ నమ్మరు. నాన్నమ్మ చదువుకోలేదు. కాని ఆమె చెప్పిన కథ పాతికేళ్ల తర్వాత మా పిల్లలకు కథల పుస్తకాలు కొంటుంటే అదే కథను ఇంగ్లీషులో చూసాను.
అప్పటి కథలేమో కాని ఎలా చెప్పేవారంటే పిల్లలు అల్లరి చేసినా, అన్నం తినకున్నా, చెప్పింది వినకున్నా అన్నీ ఆ కథలో చేర్చేసి అలా చేస్తె ఇలా అవుతుంది అని నీతి చెప్పేవారు. భలే ఉంది కదా.. ఇక కథలోకి వస్తే... అనగనగా ఒక అల్లరి పిల్లవాడు. అమ్మ ఉంది కాని నాన్న లేడు. చదువుకోమంటే ఎప్పుడూ ఆడుతూ ఉండేవాడు. ఒకసారి స్కూలుకెళ్లకుండా గోళీలాడుతున్నాడని వాడిని తల్లి బాగా కొడుతుంది. అప్పుడు వాడు కోపంతో వాళ్లింట్లో ఉన్న చిక్కుడు తీగ ఎక్కి పైకి వెళ్లిపోయాడు. ఎంత పైకి పోయాడు అంటే పైన మరో లోకం దగ్గరకు. అక్కడ పెద్ద పెద్ద ఇల్లు, పూల తోటలు, చెట్లు, కొలనులు ఉన్నాయి. ఆ పిల్లాడి పేరేంటి? అంటే శంకర్ అనుకోండి. శంకర్ అలా పైకి వెళ్లి అటు ఇటూ తిరుగుతుండగా ఒక పెద్ద కోట కనిపిస్తుంది. అందులోనుండి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. వాడు లోపలికి వెళ్లి చూస్తే ఒక అమ్మాయి చినిగిన బట్టలు వేసుకుని , బక్కచిక్కిపోయి (సరిగ్గా అన్నం తినకుంటే అలా అవుతారన్నమాట) పని చేస్తూ ఉంటుంది (చదువుకోకపోతే ఇలాగే వేరేవాళ్ల ఇంట్లో పని చేయాల్సి వస్తుంది).. శంకర్ ఆ అమ్మాయిని "ఎవరు నువ్వు? ఎందుకు నువ్వు పని చేస్తున్నావు? నీకు ఎవరూ లేరా? " అని అడుగుతాడు. ఒక రాక్షసుడు తనను ఎత్తుకొని వచ్చి ఇక్కడ బంధించాడు. మొత్తం పని చేయించుకుంటాడు అని చెప్తుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. రోజు శంకర్ మధ్యహ్నం సమయంలో పైకి వెళ్లి ఆ అమ్మాయితో ఆడుకుని ఆ అమ్మాయి రాక్షసుని గదినుండి తీసుకువచ్చి ఇచ్చిన పళ్లు, కొత్త బట్టలు తీసుకుని కిందకు వస్తాడు. తల్లి ఇవన్నీ ఎక్కడివి అని అడిగితే జరిగింది చెప్తాడు. ఇలా కొంత కాలం జరుగుతుంటుంది. ఆ అమ్మాయి కూడా సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఆమెను కిందకు తీసుకు వచ్చి తల్లికి చూపిస్తాడు. ఆమె ప్రేమగా మాట్లాడి భోజనం పెడుతుంది. పైన రాక్షసుడి తిరిగి వచ్చి అమ్మాయి లేకపోవడం చూసి కోపంతో అరుస్తాడు. ఎక్కడికి పోయింది అని వెతుకుతూ చిక్కుడు తీగను చూస్తాడు. అతని అరుపులు కింద ఉన్నవాళ్లకు వినిపిస్తాయి. రాక్షసుడు గట్టిగా అరుస్తూ చిక్కుడు తీగను పట్టుకుని కిందకు దిగుతుంటాడు. అది చూసి భయపడుతున్న శంకర్ ని చూసి అతని తల్లి గొడ్డలి ఇచ్చి ఆ చిక్కుడు తీగను కొట్టేయమంటుంది. అతను అలాగే చేస్తాడు. ఆ రాక్షసుడు అంత పైనుండి పడి తల పగిలి చనిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయిని వాళ్ల తల్లితండ్రుల దగ్గరకు చేరుస్తాడు శంకర్.. ఇది కథ.
ఈ కథ చెప్తుంటే నేను, మా తమ్ముళ్లు సీరియస్సుగా వినేవాళ్లం. అందులో ఒక్క సందేహం వచ్చేది కాదు. అసలు చిక్కుడు తీగ ఎలా ఉంటుందో తెలిస్తే కదా. దాన్ని పట్టుకుని ఎక్కవచ్చో లేదో తెలిసేది. ఒహో ఆ చెట్టు చాలా పెద్దగా ఉంటుందేమో అని అనుకునేవాళ్లం. మన ఇంట్లో కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది. హాయిగా పైకి వెళ్లేవాళ్లం. అని అనుకునేవాళ్లం. తర్వాతెప్పుడో అమ్మ ఇంట్లో చిక్కుడు పాదు వేసింది. దానికి పందిరి కూడా కట్టింది. చిక్కుడుకాయలు పెద్దగా బానే వచ్చేవి కాని మాకు ఒకటే సందేహం ఈ తీగ ఇంత సన్నగా ఉంది దాన్ని పట్టుకుని పైకి ఎలా వెళతారబ్బా? అని. పాతికేళ్ల తర్వాత అనుకుంటా మా పిల్లలకోసం ఒక పుస్తక ప్రదర్శనలో కథల పుస్తకాలు చూస్తుంటే ఇంగ్లీషులో ఇదే కథ కనిపించింది. ఆశ్చర్యమేసింది.. నేను చిన్నప్పుడు విన్న కథ కదా అని.
అదో అందమైన బాల్యం. తిరిగిరాదు. మరపురాదు..
ఎందుకో గూగులమ్మని ఈ కథ గురించి అడిగితే ఇది ఇచ్చింది.. మీరు ఓ లుక్కేయండి..
పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు. రెండు కుటుంబాలు, రెండు వంశాల శాశ్వత కలయిక. ఎక్కడో పుట్టి , ఎక్కడో పెరిగిన అమ్మాయి, అబ్బాయి పవిత్రమైన వివాహబంధంలో ఒక్కటవుతారు. అటువంటప్పుడు కోడలు, అల్లుడు గురించి ఎన్నో సర్దుబాట్లు, సమస్యలు. ఆరోపణలు తప్పవు కదా. కోడలంటే అత్తవారు చెప్పినట్టు చేయాలి కాబట్టి ఆరోపణలు ఉన్నా తక్కువే అని చెప్పవచ్చు. కాని అల్లుడు విషయంలో మాత్రం అలా కాదు. ఇప్పుడు అల్లుడు ఎందుకు గుర్తొచ్చాడు అనుకుంటున్నారా? అబ్బే!! నాకు అల్లుడు రావడానికి టైముంది కాని అప్పుడెప్పుడో అల్లుళ్లైనవాళ్లు, మొన్న మొన్న అల్లుళ్లైనవాళ్లు, ఇపుడు కాబోయే అల్లుళ్లు, కొన్నేళ్ల తర్వాత కాబోయే అల్లుళ్లు. అందరికీ ముందుగా అభినందనలు. ఇక అసలు విషయానికొద్దాం. కోడలు మా ఇంటి మహాలక్ష్మి, గృహలక్ష్మి అది ఇదీ అంటారు. కాని అల్లుడంటే అంత మంచి అభిప్రాయం లేదు చాలామందికి. ఎప్పుడూ కట్టుకున్న ఇల్లాలిని, అత్తవారిని పీక్కుతింటాడు అనుకుంటారు. ఇప్పుడే కాదు పురాణకాలం నుండి అల్లుడిని ఆడిపోసుకునేవాళ్లే... కవులైనా , సామన్యులైనా.. పాపం అల్లుడిని దశమగ్రహం అని కూడా అంటారు. మనకు ఉన్నవి నవగ్రహాలే. కాని ఈ అల్లుడు పదో గ్రహమెందుకయ్యాడు?
అల్లుణ్ని దశమ గ్రహమంటూ ఒక కవి ఇలా అన్నాడు.
సదా వక్రః సదా క్రూరః సదా పూజా మపేక్షతే కన్యా రాశి స్థితో నిత్యం జామాతా దశమో గ్రహః 11
సూర్యుడు తప్ప మిగతా గ్రహాలన్నీ ఎప్పుడూ శుభమే కలుగచేస్తూ అప్పుడప్పుడు మాత్రమే వక్రిస్తాయి. కాని జామాత అంటే అల్లుడు మాత్రం ఎప్పుడూ వక్రంగానే ఉంటాడు. గ్రహాలన్నింటిలోకి శనిగ్రహమంటే చాలా మందికి భయం. ఎందుకంటే అతను ఒక్కోసారి క్రూరంగానూ, ఒక్కోసారి శుభకరంగానూ ఉంటాడు. ఈ అల్లుడున్నాడే ఎపుడూ క్రూరంగానే ఉంటాడు. అతనికి అత్తవారంటే అస్సలు మర్యాద, జాలి , దయ ఉండదు. అంతేనా!! నవగ్రహాలకి నిర్ణీతమైన సమయాల్లో పూజలు చేయాల్సి ఉంటే అల్లుడికి మాత్రం నిత్యమూ పూజ జరగాల్సిందే. మర్యాదలు చేయాల్సిందే అతడికి అల్లుడొచ్చినా సరే. గ్రహాలన్నీ తమ సంచారంలో రాశులు మారుతూ ఉంటాయి. కాని అల్లుడెప్పుడూ కన్యారాశి( కూతురు) లోనే ఉంటాడు. అత్తవారింటిలోని వారందరిని చులకన చేస్తుంటాడు. అందుకే అల్లుడు నవగ్రహాలకంటే భిన్నమైన దశమగ్రహం అయ్యాడన్నమాట. ఈ మాట అనేవారికి అల్లుడి మూలంగా ఎన్ని అవస్ధలు పడితే ఇంత మాట అంటారు.
అంతే కాదు అల్లుడు మరింత అభాసుపాలయ్యాడు. ఎంతవరకు అంటే పద్యకవి బ్రహ్మం తన సరస్వతీ శతకంలో అల్లుణ్ని నల్లి(మత్కుణం) అంటూ తన కసిని వెళ్లగక్కారు.
వరకట్నము కోసం పిల్లనిచ్చిన మామను పీక్కుతిని, నెత్తురు త్రాగే పిశాచమువంటి అల్లుడు దశమగ్రహమనడం సమంజసమే. అసలైతే మనుష్యుల రక్తాన్ని పీల్చే నల్లి (మత్కుణము) మానవాకారంలో అల్లుడై మమ్మల్ని దోచుకుంటున్నాడు అని ఆ కవి తన ఆక్రోశాన్ని ఇలా వెళ్లగక్కాడు. ఇలా పెళ్లిలో ఇచ్చిన కట్నం సరిపోలేదని అది కావాలి ఇది కావాలి అని అస్తమానం అత్తమామలను సతాయించేవాళ్లు ఎందరో ఉన్నారు .. ఇలా అనడం సబబే మరి. ఐనా వాళ్లు మాత్రం ఏం చేస్తారు?? కూతురి కోసం భరించక తప్పదు.
కాళ్లకూరి నారాయణరావుగారి "వర విక్రయం"నాటకంలో అల్లుడు అనేవాడు ఎలాంటివాడో చెప్పారు. ఎలాగంటే...
మగవాళ్లకు మగవాళ్లు పుస్తెలు కట్టడమేంటి? విడ్డూరంగా ఉందే! మొగుళ్లంటే బాధలుపెట్టేవాడు, విసిగించేవాడు అన్నమాట. అప్పు ఇచ్చినవాడు, అల్లుడు, అద్దె యింటి ఓనరు, పన్నులేసేవాడు, కుల వినోది .. వీళ్లందరూ మగాళ్లకే తాళికట్టని మొగుళ్లు. అలా ఉంటాయి మరి వాళ్లు పెట్టే బాధలు. అనుభవించివాడికే తెలుస్తుంది.
అంతే కాదండోయ్.. నా కూతురిని పెళ్లి చేసుకోమని అడిగిన తండ్రికి ఆ అల్లుడి కోరికలు ఇలా ఉంటాయి. ఇవి పెళ్లితో ఆగవు. తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటాయి. అల్లుడి కోరికలు తీర్చడమే అత్తవారి కర్తవ్యం , బాధ్యత అన్నట్టు.
ప్రస్తుతం పెళ్ళిళ్ల వ్యాపారంలో ఇవన్నీ తప్పనిసరి ఇవ్వవలసిందే. చదువును బట్టి ఒక్కో రేటు. లేటెస్టు మోటారు సైకిలు, రిస్టు వాచీ, బంగారు ఉంగరం, రెండువేలకు తగ్గని బూట్లు, పెళ్లి తర్వాత అతని చదువుకయ్యే ఖర్చు, లేదా విడేశాలకు భార్యతో పాటు వెళ్లడానికి కూడా మామ పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఆడపిల్లను కని పెళ్లి చేయాలంటే ఈ ఖర్చు పెట్టడం అమ్మాయి తండ్రికి తప్పదు అని వారి భావన. వీళ్లను కూళ (క్రూరుడు), శుంఠ, దరిద్రుడు, చవట, అజ్ఞాని.. ఏ పేరు పెట్టి పిలవాలో అర్ధం కాదు.
అప్పిచ్చినవాడికంటే ఎక్కువగా వేధిస్తున్న అల్లుళ్లను చూసి భయపడి శివకేశవులే కూతుళ్లను కనడం మానుకున్నారంట. ఇక సామాన్యమానవుల బాధలు చెప్పతరమా? ఈ బాధలకేనేమో ఆడపిల్లలు వద్దు అని పురిట్లోనే మృత్యువు ఒడికి చేరుస్తున్నారు. పుట్టకముందే చంపేస్తున్నారు
ఇంకా ఈ అల్లుడి గురించి బద్దెన కవి సుమతీ శతకంలో ఏమన్నాడయ్యా అంటే..
అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ పొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!!
గొల్లవాడి పాండిత్య జ్ఞానము, ఆడదాని యందు నిజము, పొల్లులో దంచిన బియ్యము. తెల్లని కాకులు ఎలా ఉండవో అదే విధంగా అల్లునిలో మంచితనము కూడా ఉండదు అని నొక్కి వక్కాణించారు. నిజమేనంటారా? ఆ బాధ తెలిసినవాళ్లు ఔననే అంటారు. ఇంకేం చేస్తారు?
ఇక అత్తవారింట్లోనే తిష్ట వేసిన అల్లుడి పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే?
అల్లుడనే కాదు ఎవరింటికైనా వెళ్లి రోజుల తరబడి కదలకుండా అక్కడే ఉండి ఇంటివారిని ఇబ్బంది పెడితే వారు మాత్రం ఏం చేస్తారు. తన్ని తగలేయకముందే మనమే బయటపడాలి. ఇక అల్లుడి సంగతికొస్తే మామగారిల్లు స్వర్గం లాంటిదైనా సరే ఇంటికొచ్చిన అల్లుడు ఐదారు రోజులకంటే ఎక్కువ ఉంటే పరిస్థితులు , ఆదరణ , కుటుంబ సభ్యుల ప్రవర్తన మారుతూ ఉంటాయి. మొదట్లో పంచభక్ష్యాలతో భోజనం పెట్టినా క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. పాలు, పెరుగు,నెయ్యి , స్వీట్లు..నెమ్మదిగా ఒక్కోటి మాయమవుతూ ఉంటాయి. అది తెలుసుకుని ఇంకా కదలకుంటే చెప్పుదెబ్బలు కూడా తప్పవంట. ఆ మామకు ముక్కు మీద కోపముంటే ఈ మర్యాద కూడా తప్పక జరుపుతాడు.
అల్లుడు బహుమానస్తుడు అల్లునకొక పనియు చెప్పనైనం గానీ చెల్లును మూడు పనులకై ఇల్లలుకను, పేడచేయు, నెంగిళ్లెత్తన్!!
అత్తింట్లో తిష్ట వేసిన అల్లుడిని తమకనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చంటాడు ఒక కవి. ఐనా ఎంత అల్లుడైతే మాత్రం ఎన్ని రోజులు కూర్చోబెట్టి మేపుతారు. అల్లుడికి అస్సలు పని చేప్పము కాని. మామకు ఎంత ఒళ్లు మండితే ఇంటల్లుడిని ఇల్లు అలకడానికి, పేడ చేసి, ఎంగిళ్లు ఎత్తడానికి.. ఇలా మూడు పనులకు వాడుకోవచ్చు అని చెప్తాడు. ఆ అల్లుడి స్వయంకృతాపరాధమే కదా.
ఒకసారి అవధానాల్లో కూడా ఈ అల్లుడి ప్రసక్తి వచ్చిందంట. మహావధానులు శ్రీ మిన్నికంటి గురునాధ్ శర్మగారు ఒక సభలో తన కిచ్చిన "అల్లుడయ్యెదన్ మగడనయ్యెద నే మనుమడనయ్యెదన్ " అనే సమస్యని అత్యంత మనోహరంగా పూరించారు. ఒకే వ్యక్తి అల్లుడు, మగడు , మనుమడు ఎలా అయ్యాడు అనుకుంటే...
రామావతారంలో విష్ణువు భూమిపుత్రిక సీతకు "భర్త " కాబట్టి భూమికి అల్లుడైనాడు. వరాహవతారంలో హిరణ్యాక్షుని చంపి సముద్రజలాలనుండి భూమిని తన కోరలతో పట్టి ఉద్ధరించాడు కాబట్టి ఆ భూమికి మగడు అయ్యాడు . ఆ విధంగా విష్ణువు పాదాల నుండి ఉద్భవించిన గంగ భూమికి కూడా కూతురయ్యింది. ఈ బంధం ఇంకా ఉంది... గంగ సముద్రునికి భార్య ఐనందున సముద్రుడి నుండి పుట్టిన లక్ష్మీదేవికి తల్లి కాబట్టి భూమికి మనవరాలు అయ్యింది కదా. మనవరాలి భర్త కాబట్టి విష్ణువు భూమికి మనవడు అయ్యాడు. తికమకగా ఉందా? అంటే శ్రీమహావిష్ణువు భూమికి --- భూమిని చేపట్టి మగడు, భూపుత్రికను పెళ్లాడి అల్లుడు, లక్ష్మిని మనువాడి మనవడు అయ్యాడు. భలే ఉంది కద. మరి అవధానమంటే ఇలాగే ఉంటుంది. అందునా అల్లుడు..
ఇదంతా చదువుతుంటే మగవాళ్లందరికీ కోపమొస్తుంది కదా.. ఆగండాగండి.. అందరు అల్లుళ్లు ఇలా ఉండరు. అత్తామామలను తమ తల్లితండ్రులుగా భావించి, గౌరవించేవాళ్లు ఉన్నారు. కాని చాలా మంది అల్లుడు అనగానే భార్యవైపు వారిని చులకన చేయడము, తమ కావలసిన వస్తువులను ఇవ్వడం అత్తామామల కర్తవ్యం అన్నట్టు ప్రవర్తిస్తారు. తాను చెప్పినట్టు భార్య, ఆమె పుట్టింటివారు వినాలి అంటారు. దానికి అతడి తల్లి తండ్రులు, తోడబుట్టినవారు కూడా ఆజ్యం పోస్తున్నారు. దీనివలన ఆ కుటుంబం అప్పులపాలైనా సరే అడిగినవి ఇవ్వాల్సి వస్తుంది. ఈ ధనదాహానికి ఎంతోమంది అమ్మాయిలు బలయ్యారు. అవుతున్నారు. ఈ వరకట్న సమస్య ఎంత దారుణంగా, నీచంగా మారిందంటే అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను ఆ అగ్నికే ఆహుతి చేస్తున్నారు. భార్య తన అత్తామామలను తన తల్లితండ్రులుగా భావించి, సేవించాలని అనుకునే మగవాడు . తన అత్తామామలను కూడా తన తల్లితండ్రులలాగే భావించాలని అనుకోడు. నేటి యువత మాత్రం మెల్లిగా మారుతున్నారనుకోండి. అసలు ఇలా భార్యలను వేధించే కొడుకును అతని తల్లితండ్రులు కూడా కట్టడి చేసి అదుపులో పెట్టాలి. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ఒక ఇంటికి ఇల్లాలిగా పంపించి, అల్లుడి చేతిలో బాధలు పడే దురదృష్టవంతులైన తల్లితండ్రులెందరో ఈ రోజుల్లో?
అందుకే అల్లుళ్లూ కాస్త ఆలోచించండి.
ఈ టపా కోసం తన విద్యార్థులు మనోజ్ఞ, నవ్య లతో ఆడియో చేయించి ఇచ్చిన భారతి ప్రకాష్ గారికి , రాఘవ గారికి ధన్యవాదాలు..