Friday 16 November 2007

తెలుగు కవుల హృదయాలలో పెల్లుబికిన గోదావరి - 2



చిలకమర్తి లక్ష్మీనరసింహం "గౌతమీ ప్రభావం"పై భావుకత మూర్తిభవించే ఒక పద్యం వ్రాశారు.

కంకణంబులు గ్రాలఘన తరంగములపై
హొయలొప్ప నుయ్యాల లూగియూగి
చలువదుప్పటులట్టి సైతక స్థలులపై అల్హతి దాగు మూతలాడి యాడి
వడగండ్ల బోలెడు వలినీటి వెల్లువ చిరతర క్రీడల జేసిచేసి
బెరకు తీయని నీరు చన్ని దోయిట దీసి
తననోవ బలుమారు త్రావి త్రావి
బాల్యమున నీవలన సుఖపడియైకాక
ఆంధ్రకవితా లలామ నీయంతికమున
శాశ్వతమ్ముగ వసియించే సత్యమింక
భవ్య గౌతమీ నీదు ప్రభావమేమో !"


కవిత్వ స్త్రీ బాల్యంలో కెరటాలపై ఆడుకుంది చల్లని దుప్పట్ల వంటి ఇసుక మేటలపై దాగుడు మూతలాడుకుంది. వడగండ్లను పోలిన నీటివెల్లువలో ఆటలాడుకుంది. ఇలా ఇలా ఆడిపెరిగిన కవితా స్త్రీ గోదావరి చెంతనే శాశ్వతంగా ఉండిపోయిందంట అదీ గౌతమీ ప్రభావం.

రాజమండ్రి వీరేశలింగ గ్రంధాలయములో ’అభినవ భర్తృహరి చిలంబు ఆదినారాయణప్ప నాయుడుగారి పవిత్రమగు చరిత్రము’ అనే ఒక పుస్తకము 1924లో అచ్చయినది ఉంది. అందులో చిలంబుగారు 1896 పుష్కర సంధర్భంగా వ్రాసిన
"శ్రీ గోదావరీ విషయ విశేష సీసమాలిక" అనే రచన పుష్కర కవితలలో ప్రాచీనమైనది. కాశ్మీరం మొదలైన ఎన్నో ప్రాంతాలనుండి ఈ దుర్ముఖి పుష్కరానికి యాత్రికులు వచ్చారని వ్రాశారు "ధూమశకటం ములపయిమిక్కుటం బయి కోటాన కోటులు జనులు గూడి , ఎడనెడ బడిపడి యెతెంచె పొగబండ్లు " అంటూ ఏక‍ఉలం వారు పుష్కర దేవతలలో ఎవరెవరిని కలుసుకుందామనుకుంటున్నారో ఊహించి రాస్తూ.. గౌతమిని చూడడనికి బ్రహ్మదేవుడు వస్తే చూద్దామని బ్రాహ్మణులు, కుబేరుడు దేవతలతో వచ్చినప్పుడు ఇక్కడి బ్రాహ్మణులకు ఏమిస్తాడో చూద్దామని వైశ్యులు, హరిశ్చంద్రుడు వస్తే అతని సత్యవాక్కు గురించి తెలుసుకుందామని శూద్రులు, పరశురాముడు వస్తే అతని బాహుబలం గురించి తెలుసుకుందామని క్షత్రియులు (పుడమిరేడులు). ఈ విధంగా దేవతల ఆగమనం గురించి అన్ని కులాల వారూ ఎదురు చూస్తున్నారని చిలంబుగారి భావన. " ప్రదేశ ద్రవ్యబలసమాజికులు" ఉన్నారని వ్రాశారు. అంటే లోకల్ టాక్స్ కలెక్టర్లు అని అనుకోవాలి.

1915 లో తాడిమెళ్ళ వేంకటకవి నిడదవోలునుండి " గోదావరి పాటను" ప్రకటించారు. గోవింద నామాల వరుసల్లో వ్రాయబడిన ఈ పాట ప్రసిద్ధిలోకి రావల్సిన సారళ్యం, మాహాత్మ్య వివరణలు, సర్వకోణాల ఆవిష్కరణలు ఉండడంవల్ల ఈ ప్రజాకవిత్వం మరింతగా ప్రజలపాలు కావడం అవసరం.

ముక్కంటి శిరమున గోదావరీ
ముద్దులగుల్కేట గోదావరీ !
కోటి యజ్యములైన గోదావరీ
సాన్నకోటి యంశము గాదు గోదావరీ
రామకథలతోటి గోదావరీ
రంజిల్లుతున్నది గోదావరీ
పుడమిలో జనులంత గోదావరీ పుష్కరంబిని ములిగె గోదావరి
అన్ని సమయములందు గోదావరీ పాట
ఆనందవచ్చును గోదావరి.

నిజానికి ఈ గోదారి పాట ఆద్యంతమూ ఆకర్షనీయంగా ఉండి అలరిస్తుంది.

గోదారి ప్రసక్తులు,ప్రశస్తులూ శ్లోకాల్లో ఉన్నట్లే జానపద గేయాల్లోనూ లభిస్తాయి. 1944 అక్టోబరు 25 రెడ్డిరాణి సంచికలో పుట్టింటి భ్రమతో ఒక జానపద మహిళ ఇలా గేయంలో అంటుంది.


కన్నవారి మీద కలలు వచ్చాయి
పాపిష్టి గోదా పాయ్యివమ్మ
దోసకారి గోదారి దోవియ్యవమ్మ
ఆడబిడ్డనగుట అడిగితి మాట
పుణ్యశాలి గోదారి మ్రొక్కెదను నీకు
దగదగ మెరియంగ దండాలునంది
దారియ్యె గోదావరి దయయుంచవమ్మ


దీనిలో నిందాస్తుతి ఉంది.
గోదారి పయిస్తే పుట్టింటికి వెళతాననడం జానపదగాధల్లో మహత్తులకు దగ్గరగా ఉంది.

గురుదేవోపహారం అని 1941లో అచ్చయిన గ్రంధంలో వీరేశలింగ సహచరులైన జయంతి గంగన్న గోదావరి కవిత అందరికీ ఆత్మీయమైన హృదయ సన్నిహితమైన పాట అవుతుంది. పడమటి కొండల నడుమనుండి వచ్చే గోదావరి గురించి ఆయన....


మొన్న మొన్ననే ప్రాక మొదలు పెట్టినయట్టి
చిన్ని బాలిక - తల్లిచేతిలోపల నుండి
తప్పించి కొనివచ్చు చొప్పునను శృంగార
మొన్న పడవంటి కొండనుండి వెడలుదువమ్మ తల్లిగోదావరి.



గోదారి తల్లే ! ఎల్లా తల్లి అని చెప్పవచ్చు? కుమారుడు మంచివాడైనా, చెడ్డవాడైనా తల్లి ప్రేమతో పెంచుతుంది ఆదరిస్తుంది. అదే అంశాన్ని తెలియజేస్తూ..

సాధుమృగమిది, దుష్ట జంతు విదియని కాని
సాధుమానవుడు దుర్జనుడు వీడని కాని
ఇంచుకైనను చూడకిచ్చుదువు జీవనము
ఎంచునా? తన బిడ్డ మంచి చెడ్డలు జనని


ఇలా సాగుతుంది గోదారి...

1953 లో గోదారి అనూహ్యమైన వరదలతో భయపెట్టింది. గట్టు తెగింది.ప్రజకు పుట్టి మునిగింది. పంటల నష్టాలు, ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు అన్నీ అపారం. ద్విశతాదిక గ్రంధకర్త, అస్థాన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి " గోదావరీ మహాప్రళయ తాండవం" అంటూ ద్విపదలో విషాద కవితా గానం చేసారు. అందులో వరదలకు చిక్కుకున్న వారిని మన కళ్ళకు గట్టినట్టు చూపించారు.


పండి నిద్రించెడి వారు లోగిళ్ళ
నిండ వచ్చిననీట నిలువంగ లేక
వెలుపలికిం బోవ వెదకి ద్వారంబు
తెలియంగజాలక తెన్ను మిన్నెరుగ
తెలియంగ జాలక తెన్ను మిన్నెరుగ
లేక యొండెరుగని లేవడులగుచు
అమ్మోయ్ బాబోయ్ యని యర్చుకొనుచు
ముమ్మరంబయి నీరు ముంచిన యంత
కొందరు చచ్చిరి కొందరు ప్రక్కలందుండి చచ్చిరి


శ్రీపాద ముద్రతో రవీంద్ర సారస్వత సమాజానికి చెందిన కవి వంగూరి సుబ్బారావు మూడు జంటల వివాహపు ముచ్చటలో భాగంగా.. ఒక కానుకగా 'గోదావరి పెండ్లి ' అనే గీత పద్యాల చిన్న పుస్తకం ఇచ్చాడు.గోదావరి పుట్టుక, వరాన్వేషణ, వలుపు ,గోత్ర పతి హితవు, గోదావరి ప్రయాణం, తుంగభద్ర కబురు, గోదావరి పొంగు పాణిగ్రహణం శీర్షికలతో శీర్షాతాపజేసేలా కధనవల్లి కవిత చెప్పి ఒప్పించాడు.

సామాజిక స్పృహకు మారుపేరైన శ్రీ అవంత్స సోమసుందర్ 1953 వరదలకు చలించిపోయి, వజ్రాయుధం తర్వాత అంత రసవత్తరంగా వ్రాసిన కవిత అనిపించేలా గోదావరి జలప్రళయం కావ్యాన్ని కరుణ రసభరితంగ వ్రాశారు. గోదావరీ సాహిత్యంలో నిలిచి మన కళ్ళనుండి అశృజలపాతాలు పారేలా చేసే రసగుణం కలది.

ఏమమ్మా, ప్రళయమువలె పొంగి ఓ గౌతమి
ఇకనైనా దయను చూపి శాంతించవదేమి?
ప్రసవించిన పులివై నీ కన్న బిడ్డలను మమ్ముల
కోరలెత్తి మ్రింగుట ఇది ఏమన్యాయమే తల్లీ...

కర్మసాక్షితో దినమంతా పాటుపడుచు
ఇతరుల జోలి సాంటా యెరగుకుండ బ్రతుకుచు
పరువు కొరకు పడి చస్తూ పరుల కొరకు కష్టిస్తూ
గవ్వలవలె తేతలు వలె బ్రతుకుతున్న మానవులను
అయ్యయ్యో బలిగొనవేలనే? ఓ జలప్రళయ గోదావరీ


అంటూ విషాద తరంగాలలో వరదే తన కవిత్యవమైనట్లు గుండెల్ని పిండేస్తారు సోమసుందర్.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008